జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-11 

   -కల్లూరి భాస్కరం

          మనిషిని సామాజిక జీవి అంటారు; అంతే రాజకీయ జీవి కూడా. సమాజం ఎంత అవసరమో రాజకీయం కూడా అంతే అవసరం. అయితే, సమాజాన్ని ఒక పద్ధతిగా ఉంచడంలో, నడపడంలో రాజకీయానిది ముఖ్యపాత్రే కానీ, ఏకైకపాత్ర కాదు. రాజకీయా నికి సమాంతరంగా సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం సహా ఆయా జ్ఞానరంగాలు కూడా అంతే ముఖ్యపాత్ర నిర్వహిస్తుంటాయి. ఏదీ ఇంకొక దానిని మింగివేయకుండా ప్రతీదీ కొన్ని హద్దులను, తూకాన్ని పాటించినప్పుడే అది ఆరోగ్యవంతమైన సమాజంఅవుతుంది.

          ఇందుకు భిన్నంగా ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతీ, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞానరంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని; రాజకీయాన్నీ వాటినీ కలగాపులగం చేసేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించే అంకుశం అంతిమంగా జనం చేతిలోనే ఉంటుంది, అది వేరే విషయం. 

          రాజకీయం ఎంత అవసరమో చెబుతూనే, దానిని అంటి పెట్టుకుని ఉండే కొంత చెడును కూడా ఎత్తిచూపడమే ఈ వ్యాసభాగాన్ని ఇలా ప్రారంభించడంలో ఉద్దేశ్యం. ప్రతి సాహిత్యకారుడూ, ఇతర మేధోరంగాలకు చెందిన ప్రతి రచయితా తన ఆలోచనాసరళి వైపు జనాన్ని ఆకర్షించుకునే వ్యూహంతోనే రచన చేస్తాడు. వ్యూహం ఎక్కడైతే ఉందో అక్కడే రాజకీయం కూడా ఉంటుంది. రాజకీయజీవి కూడా అదే చేస్తూనే అదనంగా అధికారం కోసం మరికొన్ని కూడా చేస్తాడు. అవి జనం సెంటిమెంట్లను వాడుకోవడం, అందుకోసం అబద్ధాలను ఆశ్రయించడం, లేదా సత్యాన్ని కప్పి పుచ్చడం మొదలైన రూపాల్లో ఉంటాయి.

          రాజకీయానికి సమాంతరంగా జ్ఞానరంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని, దాని స్వేచ్చా స్వాతంత్య్రలను గుర్తించి, దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడమే-రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.

                                                  ***

          రాజకీయపు రాబందు రెక్క జ్ఞానరంగం పై ఎలా పరచుకుందో గ్రహించడానికి చక్కని ఉదాహరణ, భారతదేశానికి ఆర్యులు లేదా ఇండో-యూరోపియన్ జనాల రాక గురించిన వివాదం. దాదాపు ఒకటిన్నర శతాబ్దాలుగా ఉన్న ఈ వివాదం, ఈ మధ్యలో రక రకాల మలుపులూ తిరిగింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర తిలక్ 1903లో తను రాసిన ‘ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్’ అనే పుస్తకంలో ఆర్యులు ఉత్తర ధ్రువప్రాంతం నుంచి భారత్ కు వలస వచ్చారని నిరూపించే ప్రయత్నం చేశాడు. బైబిల్ ప్రాచీనతను తోసిపుచ్చుతూ, వేదాలు అంతకంటే చాలా ఎక్కువ ప్రాచీనత కలిగినవని చెప్పడం కూడా ఆయన ఉద్దేశ్యం; సరే, అది మనందరికీ తెలిసిన వాస్తవమే కూడా.

          ఆ పైన, ఆర్యులు, లేదా ఇండో-యూరోపియన్ జనాల ఉనికిని గుర్తిస్తూనే; వారు భారత్ నుంచే యూరప్ తదితర ప్రాంతాలకు వెళ్లారు కానీ, వేరే చోట్ల నుంచి భారత్ కు రాలేదని నిరూపించడానికి కొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆర్యులతోనూ, వేదాలతోనూ, సంస్కృత భాషతోనూ బ్రాహ్మణులను ముడిపెట్టి, వారి ఆధిక్యాన్ని నొక్కి చెప్పడం ద్వారా వర్ణ వ్యవస్థను సహజమైనదిగా చిత్రించినవారూ ఉన్నారు. 1936లో తను వెలువరించిన ‘వేదభూమి’ అనే పుస్తకంలో అచ్యుతుని వెంకటా చలపతిరావు అనే ఆయన అలాంటి ప్రయత్నం చేశారు.

          ఆ తర్వాత, అసలు ఆర్య-ద్రావిడ విభజనే తప్పనీ, ఈ దేశంలో ఇప్పుడున్న జనాల పూర్వీకులు మొదటి నుంచీ ఇక్కడే ఉన్నారనీ, బయటి నుంచి ఎవరూ ఇక్కడికి రాలేదనే సిద్ధాంతం ముందుకొచ్చి ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఆర్యు లనబడేవారు ఉంటేగింటే భారత్ నుంచే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారంటే ఒప్పుకుం టాము కానీ, బయటి నుంచి వారు భారత్ కు వచ్చారంటే ససేమిరా ఒప్పుకునేది లేదని ఈ సిద్ధాంతవాదులు అంటారు. ఈ మొత్తం మలుపులన్నింటి వెనుకా జనం సెంటిమెంటూ, దానిని వాడుకునే రాజకీయమూ స్పష్టంగా కనిపిస్తాయి.

          అయితే, గత దశాబ్దకాలానికి పైగా, ప్రాచీన DNA ఆధారంగా జరుగుతున్న జన్యు పరిశోధనలు మానవ వలసచరిత్రను సంపూర్ణంగా బట్టబయలు చేస్తూ, ఇతర అంశాలతో పాటు భారత్ కు ఆర్య/ఇండో-యూరోపియన్ జనాల వలసను కూడా ధ్రువీకరిస్తున్నాయి. అలా ధ్రువీకరించడంలో గత ఒకటిన్నర శతాబ్దాల కాలంలో ఆర్యులు, లేదా ఇండో-యూరోపియన్ జనాల వలసను ప్రతిపాదిస్తూ వచ్చిన అనేక మంది భాషా శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు, పురావస్తు నిపుణులు, పురాచరిత్రకారుల రాతలకు కూడా విశ్వస నీయత కల్పిస్తున్నాయి. ఈ వలసలతో ముడిపడిన కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రాచీన DNA ఇంకా లభ్యం కాని సంగతిని జన్యుశాస్త్రవేత్తలు నిజాయితీగా ఒప్పుకుంటూనే, లభ్యమైన మేరకు ఆర్య/ఇండో-యూరోపియన్ జనాల వలసను నిస్సందేహంగా స్థాపిస్తు న్నట్టు చెబుతున్నారు. మన విశ్వాసాలు, ఇష్టాయిష్టాలు, రాజకీయ అవసరాలది కాకుండా శాస్త్రపరిశోధనల్లో జ్ఞానానిది పై చేయి అయినంత వరకూ; ఆ పరిశోధనా క్రమంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా వాటిని తెరచిన బుద్ధితో ఆహ్వానించడమే మనం చేయ గలిగినదీ, చేయవలసినదీ.

          ఒక్క మన దేశానికి మాత్రమే పరిమితమై చెప్పుకుంటే, జన్యుపరిశోధనలు భారత్ లోకి ఆర్య/ఇండో-యూరోపియన్ జనాల వలసను స్పష్టీకరించిన దరిమిలా జనం సెంటిమెంటును వాడుకునే రాజకీయానికీ, జ్ఞానరంగానికీ మధ్య ఒక అసమ యుద్ధం ముమ్మరమవుతూ వచ్చింది. ధర్మపోరాటంలో తాను ఓడిపోతున్న పరిస్థితిలో రాజకీయం తనకు కలసి వచ్చే మేధావులు, మీడియా సాయంతో అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణ లు ఆయుధాలుగా అధర్మపోరాటానికి దిగింది. అంతకన్నా కూడా అసలా చర్చమీదే తెర కప్పేసి వ్యూహాత్మక మౌనం పాటించడమే మంచిదని కూడా క్రమంగా భావించినట్టు కనిపిస్తోంది. ఈ విధంగా తాము రాజకీయం వైపు ఉంటారో, జ్ఞాన రంగంవైపు ఉంటారో ఎవరికివారు తేల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 

***

          ఇండో-యూరోపియన్ లేదా ఆర్యుల (భారత్ లోనూ, నేటి ఇరాన్ లోనూ స్థిరపడిన ఇండో-యూరోపియన్ జనాలను మాత్రమే ఆర్యులు అనాలని ఆంథోనీ డేవిడ్ వంటి పురావస్తు, భాషావేత్తలు అన్న దృష్ట్యా ఇక్కడ ఈ రెండు మాటలనూ విడివిడిగా వాడు తున్నాను) వలస/ఆక్రమణ ఒక్క మనదేశంలోనే తప్ప మరెక్కడా ఇంతగా జనం సెంటిమెంటుతోనూ, దానిని వాడుకునే రాజకీయంతోనూ ముడిపడి వివాదాస్పదం కాలేదు. ఇది గమనించినవలసిన విషయం.

          నిజానికి ఇండో-యూరోపియన్ జనాల వలస/ఆక్రమణ ఇటు తూర్పున దక్షిణాసియాలోనే కాదు; అటు పశ్చిమాన యూరప్ లోనూ జరిగింది. అక్కడ కూడా స్థానిక సంస్కృతుల పైనా, భాషల పైనా, మతవిశ్వాసాల పైనా వారి విధ్వంసక ప్రభావం పడింది. యూరప్ లోని ప్రాచీన వ్యవసాయజనాల వృత్తులనే కాక, వారి సరళ జీవన విధానాలను, అమ్మవారి ఆరాధనతో ముడిపడిన వారి మతవిశ్వాసాలను; వేట-ఆహార సేకరణజనంలో ఉన్న వారి మూలాలను తుడిచి పెట్టి తమ ఆధిపత్య సంస్కృతిని, ఇతరేతర వారసత్వాలను ఇండో-యూరోపియన్ జనాలు స్థాపించడం కనిపిస్తుంది.

          అయినా సరే, యూరోపియన్లు దీనిని అంత భావోద్వేగ విషయంగా చూడడం లేదని; చివరికి భారత ఉపఖండంలో భాగమైన పాకిస్తాన్ కూడా  తమ గతం గురించి పెద్దగా పట్టించుకోదని డేవిడ్ రైక్ మూడేళ్ళ క్రితం స్క్రోల్.ఇన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అంటాడు.

          2008లో భారత్ లో, అందులోనూ మన హైదరాబాద్ లో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన Who We Are and How We Got Here అనే పుస్తకంలో వివరించాడు. తమ పరిశోధనా ఫలితాల పై అక్కడ వ్యక్తమైన వ్యతిరేకతను గమనించి ఒకరోజు రోజంతా తీవ్ర ఆందోళనకు గురయ్యాననీ, ఒక శాస్త్రవేత్తగా తన మొత్తం జీవితం లోనే తనకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదనీ ఆయన చెప్పుకున్నాడు. దాని నేపథ్యం ఇదీ:

          ‘భారతజనాభా చరిత్రను పునర్నిర్మించడం (Reconstructing Indian Population History)’ అనే పేరుతో 2009లోనూ; ‘భారత్ లో ఇటీవలి జనాభా మిశ్రమం గురించి జన్యు సాక్ష్యం ( Genetic Evidence for Recent Population Mixture in India)’ అనే పేరుతో 2013లోనూ రెండు అధ్యయన పత్రాలు విడుదలయ్యాయి. ఇవి నేటి భారత్ లోని ఆయా జనాభా గ్రూపులకు సంబంధించిన విస్తారమైన మచ్చులు ఆధారంగా మొత్తం జెనోమ్ సీక్వెన్సులను ఉపయోగిస్తూ ఈ దేశ జనాభా చరిత్రను నిర్మించి చూపించాయి. ఈ రెండు పత్రాల సహ రచయితలలో డేవిడ్ రైక్, నిక్ పేటర్సన్, హైదరాబాద్ లోని సి.సి.ఎం.బి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలెక్యులర్ బయాలజీ)కి చెందిన కె. తంగరాజ్, లాల్జీ సింగ్ లతో పాటు మరికొందరు ఉన్నారు.

          టోనీ జోసెఫ్ తన Early Indians లో వివరించిన ప్రకారం, ఈ రెండు పత్రాలూ ఒక విషయాన్ని నొక్కి చెప్పాయి: నేటి భారత్ లోని ప్రతి ఒక్కరూ కనీసంగా రెండు గ్రూపులకు చెందిన జనాల మిశ్రమమే, కాకపోతే పాళ్లలో తేడా ఉంటుంది. మొదటి గ్రూపు, తొలి భారతీయులు (First Indians); రెండవ గ్రూపు, పశ్చిమ యూరేసియన్లు (west Eurasians). తొలి భారతీయులంటే, 65వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి భారత్ కు వలస వచ్చినవారు. (ఔట్ ఆఫ్ ఆఫ్రికా. మైగ్రెంట్స్). పశ్చిమ యూరేసియన్లంటే; సిరియా, లెబనాన్, పాలస్తీనా, జోర్డాన్ , ఇజ్రాయిల్, ఉత్తర ఈజిప్టు, ఇరాన్, మధ్యాసియా, కాకసస్, యూరప్ లకు చెందినవారు. 

          నేటి భారత్ లోని అన్ని జనాభా బృందాలలోనూ వేర్వేరు పాళ్లలో- అంటే కొందరిలో 20 శాతం నుంచి, కొందరిలో 80 శాతం వరకూ- పశ్చిమ యూరేసియా జన్యువారసత్వం ఉన్నట్టు పై అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, ఇక్కడ ఒకటి గమనించాల్సి ఉంటుంది. ఈ మొత్తం జెనోమ్ సీక్వెన్సుకు చెందిన సమాచారం, వివిధ జనాభా బృందా ల మధ్య ఉన్న జన్యుసంబంధం గురించిన సాధారణ చిత్రాన్ని ఇస్తుంది కానీ, ఆ సంబంధం ఎలా ఏర్పడిందో; ఎవరు ఎక్కడి నుంచి వలస వచ్చారో, లేదా వలస వెళ్లారో చెప్పదు. 

          తీరా ఈ అధ్యయన ఫలితాలను కాగితం మీద పెట్టబోయే సరికి సెంటిమెంటూ, దానితో పాటే రాజకీయమూ అడుగుపెట్టాయి. నేటి భారతీయులలో చెప్పుకోదగిన పరిమాణంలో పశ్చిమ యూరేసియా జన్యువారసత్వం ఉందన్నది ప్రత్యేకించి హిందుత్వ భావజాలానికి దగ్గరగా ఉండే వారికి సహజంగానే రుచించే విషయం కాదు. ఆర్య/ద్రావిడ విభజన అసలు లేనేలేదనీ; సంస్కృతమూ, వేదాలూ ఈ గడ్డ మీద పుట్టినవారు అవతరింపజేసినవే తప్ప బయటి నుంచి వచ్చినవారు సృష్టించినవి కావని చెప్పడమే వారికి ఇష్టం. పశ్చిమ యూరేసియా జన్యురూపంలో ఇండో-యూరోపియన్ల వలసను అంగీకరించవలసి వస్తే, పూర్తిగా దేశీయమైనదిగా చెప్పుకునే ఇంతటి మత సాంస్కృతిక నిర్మాణమూ, దాని తాలూకు భావజాలమూ పునాదులతో సహా కదిలిపోతాయి.

          డేవిడ్ రైక్ ఎదుర్కొన్న అనుభవానికి మళ్ళీ వెడదాం. పై ఫలితాల గురించి సి.సి.ఎం.బి కి చెందిన లాల్జీ సింగ్, తంగరాజ్ లతో చర్చించడానికి డేవిడ్ రైక్, ఆయన సహశాస్త్రవేత్త నిక్ పేటర్సన్ 2008, అక్టోబర్ లో హైదరాబాద్ వచ్చారు. ఆ సమావేశానికి ముందే తమ అధ్యయన సారాంశాన్ని వారు లాల్జీ సింగ్, తంగరాజ్ ల దృష్టికి తీసుకెళ్లారు. పైన చెప్పుకున్నట్టు, నేటి భారతీయులు పశ్చిమ యూరేసియన్లు, తొలి భారతీయుల మిశ్రమమని అది స్పష్టం చేస్తోంది. తీరా సమావేశంలో లాల్జీ సింగ్, తంగరాజ్ ల వైఖరి చూస్తే, మొత్తం అధ్యయనాన్నే తోసిపుచ్చేలా కనిపించారు. డేవిడ్ రైక్ ను, ఒక శాస్త్రవేత్తగా తన మొత్తం కెరీర్ లోనే ఎరుగని ఆందోళనకు గురిచేసింది అదే. నేటి భారతీయుల్లో పశ్చిమ యూరేసియా జన్యువారసత్వం ఉందని చెప్పడమంటే, వారిక్కడికి పెద్ద ఎత్తున వలస వచ్చిన సంగతిని అంగీకరించడమే అవుతుంది కనుక, తాము ససేమిరా ఈ ప్రతిపాదనకు ఒప్పుకోబోమని వారు తెగేసి చెప్పారు. పైగా, భారత్ నుంచే పశ్చిమాసియా, యూరప్ లకు ఎందుకు వలస వెళ్ళి ఉండకూడదని కూడా వాదించారు.

          కాకపోతే, వారి వాదనలో ఒకటి మాత్రం నిజమని డేవిడ్ రైక్ కూడా ఒప్పుకుంటాడు. అదేమిటంటే, పశ్చిమ యూరేసియా జనం బయట నుంచి భారత్ లోకి వలస వచ్చినట్టు చెప్పే ప్రత్యక్షసాక్ష్యాన్ని దేనినీ తమ అధ్యయనంలో పొందుపరచలేదు.

          ఇలా విషయం పీటముడి పడిన దశలో చివరికి ఉభయులూ ఒక రాజీ సూత్రాన్నిఆమోదించారు. దాని పర్యవసానంగానే ‘ఉత్తరభారత పూర్వీకులు (ఏన్ సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్-ANI)’, దక్షిణభారత పూర్వీకులు (ఏన్ సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్-ASI) అనే మాటలు తెరమీదికి వచ్చాయి. నేటి భారతీయులు ఈ ANI-ASI ల మిశ్రమమని చెప్పడానికి ఉభయుల మధ్యా ఏకీభావం కుదిరింది. విచిత్రమేమిటంటే, రాజీకి ఇంత కసరత్తు చేసినా యూరోపియన్లను, మధ్య ఆసియన్లను, పశ్చిమాసియన్లను, కాకసస్ జనాన్ని పక్కన పెట్టడం సాధ్యం కాలేదు. ఉత్తరభారత పూర్వీకు (ANI) లకు ఈ జనాలతో జన్యుసంబంధం ఉందన్నారు. కాకపోతే ANI ల స్వస్థలం ఫలానా అని కానీ, వలసల గురించి కానీ తాము ఎలాంటి ప్రస్తావనా చేయలేదని డేవిడ్ రైక్ అంటాడు.

          ఈ విధంగా ఈ మొత్తం ఉదంతంలో జ్ఞానం మీద సెంటిమెంటుదీ, దానితో ముడిపడిన రాజకీయానిదీ పై చేయి కావడమే కనిపిస్తుంది. అయినా సత్యం పచ్చిక లాంటిది, ఎంత కోసినా తిరిగి మొలుస్తూనే ఉంటుంది. మరో పద్ధతిలో జరిగిన అధ్యయనంలో అదే జరిగింది. దాని గురించి తర్వాత….

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.