కొత్త కథ 2022 

పుస్తకాలమ్’ – 20

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

 కొన్ని సమకాలిక జీవన శకలాల కథలు

          ఇరవై సంవత్సరాలుగా ఏడాదికోసారి కథా రచయితలు, విమర్శకులు, పాఠకులు ఒక్కదగ్గర చేరి కథా ప్రక్రియ గురించి మాట్లాడుకునే వేదికగా ఉన్న రైటర్స్ మీట్ ఆ క్రమంలో వికసించిన కథలను కూడ సంకలనాలుగా తెస్తున్నది. ఆ సిరీస్ లో భాగంగానే ‘కొత్త కథ 2022’ వెలువడింది.

          మామూలుగా సమాజంలో యథాస్థితి కొనసాగింపు, యథాస్థితి నుంచి మార్పు అనే రెండు ప్రక్రియలూ సాగుతుంటాయి. ఆ రెండు ప్రక్రియలూ అన్ని సామాజిక చైతన్య రూపాలలో, సాహిత్యంలో, కథా ప్రక్రియలో కూడ ప్రతిఫలిస్తుంటాయి. మరి కొత్త కథ అన్నప్పుడు అది యథాస్థితి కొనసాగింపునే కొత్త కోణంలో, కొత్త పద్ధతిలో చెప్పే కథనా లేక యథాస్థితి నుంచి మార్పు అవసరాన్ని చెప్పే, జరుగుతున్న మార్పు సూచనలను ప్రతిఫలించే కథనా? లేక కేవలం వయసు రీత్యా కొత్త తరం చెప్పేది కొత్త కథ అవుతుందా?

          మరో మాటల్లో చెప్పాలంటే, కొత్త కథ అనే పదబంధంలో కథ అనే మాట గురించి మనందరికీ తెలుసు. కాని కొత్త అనే మాటను నిజంగా పూర్తిగా తెలుసుకున్నామా? కొత్త అనేది కాల సూచికనా, వస్తు సూచికనా, రూప సూచికనా, ఈ మూడూ కాక మరేవైనా కారకా లు కూడ ఆ కొత్తదనానికి వీలు కల్పిస్తాయా? కొత్త అనేది కేవలం కాల సూచిక కాజాలదని, సమకాలీనంగా వచ్చినదల్లా కొత్తది కానక్కరలేదని మన కళ్ళ ముందర కనబడుతున్నది. పాతనే, ఆ మాటకొస్తే శతాబ్దాల కింద అస్తమించి, ధరాగర్భమున గడ్డకట్టిన మృతదేహా లనే లేపి కొత్త దుస్తులు తొడిగి, అత్తరు చల్లి, అభివృద్ధి మాయజలతారు కప్పి “కొత్త”గా ప్రదర్శిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం.

          మరి నిత్య చలనశీలమైన ప్రపంచంలో ఏ వస్తువు కొత్తది అవుతుంది? ఎంత కాలం ఆ కొత్తదనం ఉంటుంది? ఏ వస్తువును ఎందుకు పాతబడిందంటాం? నిత్య ప్రయోగ శీలమైన సృజనాత్మక కృషిలో ఏ రూపం కొత్తది అవుతుంది? ఇదే ప్రయోగం ఇంకెవరో, ఇంకెక్కడో చేసి ఉండవచ్చు గదా, మన కొత్త ఎట్లా నిరూపితమవుతుంది? ఇటు వంటి ప్రశ్నలు వేసుకుంటూ పోతే బహుశా కొత్త కథ అనేదేమీ లేదేమో అనే అనిపిస్తుంది.

          నిజానికి సమాజంలో ఇంకా పాత కథలే నడుస్తున్నప్పుడు, కొత్త కథ వెలువడే అవకాశం ఉందా? మానవ వేదన, సంఘానికీ వ్యక్తికీ ఐక్యత –ఘర్షణ, సమూహం మధ్య మనిషి ఒంటరి తనం, దోపిడీ, పీడన, అణచివేత, అసమానత, వివక్ష వంటి అన్ని సామాజిక దృగ్గోచరాంశాలు పాత కాలం నుంచి కొత్త కాలం దాకా పునరుక్తమవుతున్న ప్పుడు ‘కొత్త కథ’ అంటే ఏమిటి? ‘పాత కొత్తల మేలు కలయిక’ ఏదో ఆవిర్భవించి ‘క్రొమ్మె రుంగులు చిమ్ముతుంద’ని వంద సంవత్సరాల కింద మన సమాజం కలలు కన్నది గాని, ఇప్పటికీ ఆ కలలు నిజాలైతే కాలేదు. పాతకొత్తల కీడు కలయిక విశ్వరూపాన్నే సమాజం లో, వ్యక్తిలో, పాలనలో, విద్యలో, సమస్త రంగాలలో చూస్తున్నాం.

          అయినా మనుషులు కొత్త గురించి కలలు కనడం మానరు. కొత్త కోసం తపన పడడం మానరు. కొత్తను సాధించడం కోసం తమ శక్తి సామర్థ్యాల మేరకు పోరాడడం మానరు. ఆ తన్లాట సాహిత్యంలో, కళలో తప్పనిసరిగా ప్రతిఫలిస్తుంది. అందువల్ల అది కొత్త కథ అవుతుంది.

          ఈ సంకలనంలో ఉన్న 27 కథలకు ‘వస్తుబలం, ఔట్ డేటెడ్ కాని సామాజిక సందర్భం, శిల్ప ప్రయత్నం, పఠనీయత, కనీసం పది మంది కథకులు 25-35 ఏళ్ల వాళ్లు కావడం’ అనే విశిష్టతలున్నాయని సంపాదకులు అన్నారు. స్త్రీల మానసిక, శారీరక, సామాజిక సమస్యల కథలే మొత్తంలో మూడో వంతు ఉన్నాయి. కరోనా కథలు లేదా కరోనా ప్రస్తావన కథలున్నాయి, ప్రేమ కథలున్నాయి, వైద్య శాస్త్ర ప్రస్తావనలున్న కథలున్నాయి, గ్రామీణ జీవితపు కథలున్నాయి, దళిత, ముస్లిం జీవితాల కథలున్నాయి. సంస్కృతీ చిత్రణల కథలున్నాయి.

          వి. సాయి వంశీ రాసిన ‘పుస్తకాల రుతువు’ నిజంగా ఒక కొత్త కథ. పాత సమస్యే గాని ఒక కొత్త సందర్భంలో బైటపడింది. పెళ్లికి ముందు చదువరి అయిన, సాహిత్య ఆసక్తులు ఉన్న స్త్రీ పెళ్లి తర్వాత భర్త సేవ, పిల్లల పెంపకం, కుటుంబ పోషణ, ఇంటి పనుల్లో పడి తన చదువును మరిచిపోతుంది. ఇది సహజమైన విషయంగా మారిపోయిన అసహజం, అమానుషం, క్రూరం. హఠాత్తుగా కరోనా వచ్చి, మరెవరితో కలవకుండా ఒంటరిగా ఉండ వలసి వచ్చినప్పుడు ఆ తల్లికి మళ్లీ చదువు మీద ఆసక్తి కలుగుతుంది. “భర్త, ఇద్దరు కొడుకులు ఇవ్వలేని సుఖమూ, తీరికా కరోనా ఇచ్చింది అమ్మకి. తింటుంది. పడు కుంటుంది. నచ్చినవి చదువు కుంటుంది.”

          ఉమా నూతక్కి రాసిన ‘చూపు’ మరొక కరోనా సందర్భపు కథ. ముక్కోటి (ఏకాదశి) కి ప్రసాదాలు పంచే ఆనవాయితీని తీసుకుని మధ్యతరగతి మనస్తత్వాలను చిత్రించి, తాత్విక అవగాహన ఇచ్చిన కథ. ‘మనం చేస్తే లౌక్యం, ఇతర్లు చేస్తే మోసం’ అనుకునే మధ్యతరగతి తన స్వార్థమేమో న్యాయమైనదనీ, మరొకరి ఆకలి కూడా అనుమానించ వలసినదనీ తీర్మానిస్తుంది. ఇతరుల పట్ల, ముఖ్యంగా నిస్సహాయుల పట్ల చిన్నచూపు దాని సహజ లక్షణం. ఊరందరికీ ఉచితంగా చక్కెర పొంగలీ, పులిహోరా పెట్టే దాతలు, తమ వారి ఇళ్ళకూ ఆఫీసులకూ పోలీసులకూ కూడ చేతికి ఎముక లేకుండా పంపించే ఉదారులు, “రెండు నేత్రములూ లేని వాళ్ళం బాబయ్యా” అని అడుక్కోవడానికి వచ్చిన నిస్సహాయుల మీద మాత్రం విరుచుకుపడతారు, పోలీసులను ఉసిగొల్పుతారు. ఇంతకీ “రెండు నేత్రములూ లేని వాళ్లు” ఎవరు? చూపు లేనిది ఎవరికి?

          స్త్రీ స్వేచ్ఛ గురించి ఎంత చెప్పుకున్నా, స్త్రీవాద ఉద్యమం నాలుగు దశాబ్దాలుగా తెలుగు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నా, ఇప్పటికీ స్త్రీ ప్రయాణాన్ని (మానసిక, భౌతిక ప్రయాణాలు రెంటినీ) ఎవరు నిర్ణయిస్తున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరి కనుసన్నల్లో జరగవలసి ఉంది? అసలు ఎవరికి వారే చేయవలసిన ప్రయాణం స్త్రీ విషయంలో మాత్రం మరొకరి నిర్ణయం ఎందుకయింది? స్త్రీ స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవించే స్థితి ఎప్పుడొస్తుంది? ఈ సున్నితమైన సమస్యను, ఇంకా సున్నితమైన భర్తను కోల్పోయి, ఆయన చితా భస్మాన్ని కలపడానికి గంగా నదికి వెళ్లే స్త్రీ ప్రయాణ నేపథ్యంలో చిత్రించారు ‘ప్రయాణం’ కథలో సుజాత వేల్పూరి.

          శరీరం పెరుగుదల సహజమైనది, వ్యక్తిగతమైనది. ఆరోగ్య కారణాలకు తప్ప శరీరం పెరుగుదల గురించి ప్రశంసగానో, విమర్శగానో మరొకరు వ్యాఖ్యానించడం అనుచితం. కాని మరీ ముఖ్యంగా స్త్రీల శరీర పరిమాణం కుటుంబాలలో, స్నేహబృందాలలో, కార్యాలయాలలో, వీథుల్లో చర్చకూ, వెటకారాలకూ, వ్యంగ్య విసుర్లకూ కారణమవుతున్న అసహజ, అమానుష స్థితి రాజ్యమేలుతున్నది. అలా శరీరం గురించి మాట్లాడడం అనుచితమూ, అనవసరమూ,  అమానుషమూ అనే అత్యవసరమైన ఎరుకను కలిగిస్తుంది శ్రీ ఊహ రాసిన ‘డబుల్ ఎక్సెల్’.

          స్త్రీ శరీరానికే సంబంధించిన మరొక కథ వల్లూరిపల్లి శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’. క్రోమోజోములు తగ్గడం వల్ల, అండాశయం ఎదుగుదలలో సమస్య వల్ల అమ్మాయిలు వయసు పెరిగినా రజస్వల కాకుండా ఉండిపోతారు. అది ఒక నిజమైన, వైద్య, ఆరోగ్యపరమైన నైసర్గిక సమస్య. కాని గొడ్రాలితనం, వంధ్యత్వం అనే సమాజ కల్పిత భావజాలం వల్ల అది లోపంగా, అవమానంగా మారిపోయింది. ఈ నిజమైన సమస్యను సున్నితమైన కథనంతో, అందులోనూ ఈ “మాతృత్వ అవకాశం” లేని యువతి, తల్లిని మించిన శ్రద్ధాసక్తులతో, ప్రేమతో పిల్లలకు సేవ చేస్తున్న సందర్భాన్ని సృష్టించి ఆర్ద్రమైన కథ రాశారు. “కాయలు పండ్లతో, విత్తనాలతో వ్యాపించలేనేమో గాని నీడని, ఆవాసాన్ని ఇవ్వగలను” అనే గుండెను పిండేసే మాట అనిపించారు.

          స్త్రీ శరీరానికే సంబంధించిన మరొక కథ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రాసిన ‘చిదుగు’. మామూలుగా చిదుగు అంటే యజ్ఞానికి వాడే చిన్న ఎండు కర్రపుల్ల. ఇక్కడ యజ్ఞానికి స్త్రీ శరీరమే ఒక చిదుగు. స్త్రీ శరీర వ్యాపారం తెలుగు కథా ప్రక్రియలో రావిశాస్త్రి ద్వారా ఎక్కువగానే చిత్రణ పొందింది. ఒక అభివృద్ధి నమూనాను యజ్ఞంతో పోలుస్తూ, ఆ యజ్ఞంలో అప్పల్రాముళ్లూ, సీతారాముళ్లూ, సీతారాముడి కొడుకులూ ఎట్లా బలి పశువులవుతారో కారా రాశారు. ఇక్కడ ‘చిదుగు’లో యజ్ఞం శాంతి భద్రతల యజ్ఞం. నిజంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నదెవరో, శాంతి భద్రతల నిర్వహణ యంత్రాంగానికి తెలియదు, లేదా ఆ విధ్వంసకుల ఆదేశాలనే పాటించే స్థితిలో ఉంటారు. శాంతి భద్రతల యజ్ఞాన్ని సజావుగా సాగిస్తున్నట్టు కనబడడానికి చిదుగులను హోమంలో వేస్తూనే ఉంటారు. ఒక వేశ్య చెప్పుకుంటున్న కథగా, ఒక ఎస్ పి స్థాయి మహిళా అధికారి మరొక పాత్రగా ఆలోచించవలసిన ఎన్నో విషయాలను ఈ కథలో స్పృశించారు.

          “ఆపన్నులకి, అభాగ్యులకి ఆసరాగా గొర్రెలు, చేపలు ఎరవేస్తూ… బంధుత్వం పేరిట ఓట్లు ఒలిచి నోట్లు చేసుకుంటూ… దారులూ, బారులూ, మహాస్పత్రులూ, రియలెస్టేట్లు అస్మదీయులకి కట్టబెట్టి కులవ్యవస్థని పరమ పటిష్టపరుస్తూ, కడు బీడు భూముల్లో కూడ కోట్ల నూర్పిడి చేయగల మనకి పునరావాసం కాని, ఓట్లూ నోట్లూ కూడా తక్కువే అయిన ఈమెలాంటి వారికేమిటి? మన చెత్తలో పుట్టి, మన చెత్తతో పెరిగి, ఆ చెత్తలోనే కలలేరుకోడానికి ఆశపడుతున్న ఈమెకి తనతో బిజినెస్ చేయిస్తున్నది మనమేనని ఎలా చెప్పడం…”లాంటి లోతైన వాక్యాలను ఒక మహిళా ఎస్ పి ఆలోచనల సుడుల్లో తిప్పిన రచయిత మాజీ పోలీసు అధికారి కావడం ఒక విశేషం.

          స్త్రీ శరీరానికే సంబంధించిన మరొక కథ రుబీనా రాసిన ‘పి ఎం ఎస్’. వైద్య శాస్త్రంలో ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పి ఎం ఎస్) గా పిలిచేది స్త్రీలు కౌమార దశ నుంచి మెనోపాజ్ దాకా అనుభవించే వేదన. ప్రతి నెలా రుతుస్రావం సమయంలో స్త్రీని మెలి తిప్పే దుర్భరమైన పొత్తి కడుపు నొప్పి గురించి, శారీరక మార్పులు మనసు మీద చూపే ప్రభావం వల్ల కలిగే చిరాకు, అసహనం గురించి పాఠకులకు తెలివిడిని ఇస్తుంది ఈ కథ.

          స్త్రీ మనసుకు సంబంధించిన కథ వేమూరి సత్యనారాయణ రాసిన ‘సలహా కావాలి’. నిజానికి ఈ సంక్షుభిత సమాజంలో ఎవరు ఎవరికి ఏం సలహా ఇస్తారు? సలహాదార్లెవరూ లేరు. ఎవరికి వారే సలహాదార్లు కావాలి.

          తల్లిగా స్త్రీ ఎట్లా సంస్కృతి వాహికగా ఉంటుందో, తల్లీ కొడుకుల అనుబంధపు ఆర్ద్రతతో చిత్రించారు కోడూరి విజయకుమార్ (తల్లి). మరొక వైపు నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని మూడు తరాల తండ్రుల, కొడుకుల కథగా కొత్త శిల్ప సంవిధానంతో చిత్రించారు వి మల్లికార్జున్ (పీడకల). ఒక యువకుడి ఆశనిరాశల డోలాయమానాన్ని ‘నా గదిలోపల చీకటిలో’ అని వినూత్నంగా చిత్రించారు మహమ్మద్ గౌస్. మనకాలపు యువతరం ఆలోచనల, అనుభవాల గుచ్ఛాలివి.

          జీవితానికీ, సాహిత్యానికీ, కథకూ అనివార్యమైన, అవిభాజ్యమైన వస్తువు ప్రేమ. ఈ సంకలనంలో వేరు వేరు స్థాయిల, కోణాల ప్రేమ చిత్రణ కనీసం మూడు కథల్లో జరిగింది. మూడూ విభిన్నమైన కథాంశాలు, విశిష్టమైన వాతావరణాలు, విలక్షణమైన పాత్ర చిత్రణ లు. ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసీ, ప్రేమ కోరుకుని, ప్రాణాధికంగా ప్రేమించి, ప్రేమ పొంది, జీవితంలోంచి హఠాత్తుగా నిష్క్రమించిన యువతి కథ ‘పారడాక్స్’ (ఝాన్సీ పాపుదేశి), సినిమాలలో డాన్స్ మాస్టర్ల జీవితం అనే చాల తక్కువ మందికి తెలిసిన జీవితంలోంచి ఒక శకలం తీసుకుని ఇద్దరు డాన్సర్ల ప్రేమ, సహజీవనం, వ్యసనం, స్త్రీ స్వేచ్ఛ వంటి అన్ని అంశాలనూ ఇమిడ్చి సమర్థంగా చిత్రించిన చరణ్ పరిమి (వింగ్స్ & షాడోస్), అసలు ప్రేమ అంటే ఏమిటి, అది మానసిక ఆందోళనా, కంఫర్టా అనే మౌలిక ప్రశ్నలు రేకెత్తించిన కరుణ కుమార్ (ప్రేమ) మన సమాజంలో మానవ సంబధాలలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలని చెపుతున్నాయి.  

          వినియోగదారీ సంస్కృతి, వస్తువ్యామోహం మనను ముంచెత్తడానికి ప్రధాన మార్గం వ్యాపార ప్రకటనలు – అవి ఒకప్పటి పత్రికల్లో ప్రకటనలు కావచ్చు, లేదా ఇప్పుడు టివి స్పాన్సర్ షిప్ అడ్వర్టైజ్ మెంట్లు కావచ్చు, లేదా ప్రతి ఇంటికీ భౌతికంగా చేరి, ఆకర్షించి, మాయచేసి, ఊదరగొట్టి మనకు అవసరమైనదో, అనవసరమైనదో ఒక సరుకులోకి, చదువులోకి, వినోదంలోకి, వ్యాపకంలోకి మనను తోసే, లాగే, నెట్టే, గెంటే ప్రోద్బలం కావచ్చు. ఈ ఇతివృత్తాన్ని ‘బ్రోచర్’ అనే ఆలోచనా స్ఫోరకమైన కథగా మలిచారు మన్ ప్రీతమ్. “నిశ్శబ్దంగా కనిపించకుండా ఒక మనిషి జీవితాన్ని… కాదు కాదు, ఒక వ్యవస్థని ఎలా నాశనం చేయొచ్చో కనిపించని ఆ ‘బడా’ముఖాల్ని బ్రోచర్ల రూపంలో చూసాడతను.”

          అలాగే ‘బలి’ (ఉప్పులేటి సదయ్య), ‘గ్రామాలు వదలండి’ (ఇండ్ల చంద్రశేఖర్), ‘ముత్కారి పల్లాటాలు’ (గంధం విజయలక్ష్మి) కుల అంతరాలను, దళిత జీవిత సమస్య లను, దళితుల పట్ల వివక్షను బలంగా, ఆయా సమూహాల నుడికారపు సౌందర్యంతో చిత్రించాయి.

          ‘స్థితి’ (మధురాంతకం నరేంద్ర), ‘మాసిన మబ్బులు’ (సురేంద్ర శీలం) మన సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి బ్యురాక్రసీలోకి వెళ్లి, తాము వచ్చిన వర్గాలకు న్యాయం చెయ్యలేని, ఆ అన్యాయాలకు బాధ్యులుగానే మారుతున్న స్థితిని వర్ణించాయి. “అటు యిమడలేక, యిటు పారిపోలేక, యెటు వెళ్తున్నానో తెలియక, యిలా కాక మరోలా వుండే తెగువ లేక…” అనేది ఆ స్థితి. “’I know your background. మీరు ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలుసు. సో, జరగాల్సిన పనులన్నీ ఎలా చేయాలో మీకు తెలుసు. సింపుల్. వాళ్ళవాడిలా వాళ్ళ దగ్గరికి వెళ్ళీ కన్విన్స్ చెయ్యాలి.’ ఆ మాట వినగానే చిరాగ్గా అనిపించింది. ఎదురుగా గాంధీ, అంబేద్కర్ బొమ్మలు. లేచి ఆ ఫొటోల మీద ఒక నల్లక్లాత్ కప్పాలనిపించింది.”

          ప్రజాస్వామ్యానికీ, నిజమైన ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు చిహ్నంగా ఉండ వలసిన ఎన్నికల రాజకీయాలు ఇవాళ్టి సమాజంలో ఎట్లా వక్రీకరణకు గురై సాగుతున్నాయో, ఎన్నికలంటే ఎన్ని అక్రమాలో, ఎన్ని అబద్ధాలో, ఎన్ని కలలో, ఎన్ని కల్లలో అద్భుతంగా చిత్రించారు ఆలూరి అరుణ్ కుమార్ (ఒడ్డున ఉన్నోడు).

          తన మీద తాను విమర్శనాత్మకంగా, కొండొకచో పరిహాస దృష్టితో, లేకపోతే వ్యక్తికైనా, సమాజానికైనా ఆరోగ్యం అంత బాగున్నట్టు కాదు. ‘నేనెందుకు రాయాలి’ లో అరిపిరాల సత్యప్రసాద్ తెలుగు సాహిత్య లోకం ప్రస్తుత స్థితి మీద అటు వంటి విమర్శనూ, పరిహాసా న్నీ ప్రదర్శించినట్టున్నారు. పరిస్థితి ఇంత నిరాశామయంగా ఉన్నదా అనిపిస్తుంది గాని అటు వంటి కొరడా దెబ్బలు అప్పుడప్పుడైనా తగులుతుండవలసిందే.

          సేంద్రియ ఆహారం, పర్యావరణం వంటి భావనల్లో తొంగిచూసే ఆధిక్యతా భావనలు, కులం, వర్గం, పట్టణ మధ్యతరగతి కులీన ఆభిజాత్యం, గ్రామీణ అమాయక నిక్కచ్చి తనం వంటి విషయాలను పాఠకుల దృష్టికి తీసుకువచ్చే కథ ‘మిత్రవాక్యం’ (జి ఎస్ రామ్మోహన్).

          ఈ కథలన్నీ తరతమ స్థాయిలో విలువైనవే గాని ఈ సంకలనం ‘ఈ కాలానికి ఒక విలువైన కథాసూచిక’ అని సంపాదకులు చెప్పుకున్న మాటకు నిజంగా ప్రతీకలు అనదగిన మూడు కథల గురించి చెప్పాలి.

          మొదటిది పెద్దింటి అశోక్ కుమార్ ‘సహగమనం’. గ్రామీణ జీవన వైరుధ్యాలను అనేక పొరల్లో, అనేక స్థాయిల్లో, ఆయా తలాలకు సంబంధించిన సూక్ష్మ వివరాలతో చిత్రించిన కథ ఇది. మానవ స్వభావంలోని మంచీ చెడూ, రాజ్యానికీ మనిషికీ మధ్య వైరుధ్యం, మనిషికీ మనిషికీ మధ్య భిన్న ప్రయోజనాల వైరుధ్యాలు, డబ్బు వల్ల మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పులు, బాధితులు, మధ్యవర్తులు, పైరవీకార్లు, అధికార యంత్రాంగం అనే వేరు వేరు దృష్టికోణాల నుంచి చెప్పిన ఈ కథ వస్తువు ఎంపిక, కథన సంవిధానం, నుడికారం వంటి అనేక విషయాలలో పాఠ్యాంశం కాదగినది.

          రెండవది పూడూరి రాజిరెడ్డి ‘ఎడ్డి’. మనిషి కాటగలిసి పోవడం, ఎప్పటికో తిరిగి రావడం అనే పాతదే అనిపించే వస్తువుతో కొత్త కథనశైలితో కథకుడు చేసిన విన్యాసం, దాన్ని ఒక వ్యక్తి కథ స్థానం నుంచి తాత్విక కథగా అభివృద్ధి చేసింది. పొరుగూరు తెలియని, తమ నాంపల్లి గుట్ట అవతల మరొక దేశమే అనుకునే అమాయక స్త్రీ దేశం కాని దేశంలో తప్పిపోతే, ఆ తప్పిపోవడంలో తన పాత్రేమీ లేకపోయినా, ఆ సమయంలో అడగ వలసిన ప్రశ్న అడిగి ఉంటే, చెయ్యవలసిన పని చేసి ఉంటే తప్పిపోవడం జరిగి ఉండేది కాదని జీవితాంతం అపరాధభావనతో మథనపడే మరొక పాత్ర. అక్కడితో కూడ కథ అయిపోలేదు, అటు వంటి అపరాధ భావన ఆ పాత్రది మాత్రమే కాదనీ, తనది కూడ అని కథకుడంటాడు, తమది కూడ అని పాఠకులు అనుకునేలా చేస్తాడు. “ఆ ఒక్క క్షణం, నిలబడాల్సిన సమయంలో, నిలబడాల్సిన చోట గట్టిగా నిలబడకపోవడం వల్ల, అత్యవసరమైన సందర్భంలో కూడా నోరు ఎత్తలేక పోవడం వల్ల, లోకాన్ని ఎదుర్కోవ డానికి కావాల్సిన ధైర్యం లేకపోవడం వల్ల” లోకం అనేక అన్యాయాలు సజావుగా సాగి పోతున్నాయనే ఎరుకను కలుగజేస్తుందీ కథ. “ఇంకా నాకు సత్తయ్య గుర్తొస్తాడు. ఒక పరిస్థితంటూ వచ్చినప్పుడు నోరు ఎత్తలేని, దాని కోసం నిలబడలేని సందర్భాలు గుర్తొస్తాయి. వాటివల్ల నేను ఎందరినో బాధ పెట్టి వుంటాను. చేయగలిగింది చేయలేక పోయి ఉంటాను” అని అనుకునే స్థితిలో ప్రతి ఒక్కరూ ఉంటారు.

          చివరగా మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘డూ యూ జాయిన్?’ – వర్తమాన భారతం లో మోషా దుర్మార్గ రాజ్యంలో ముస్లింల మీద సాగుతున్న దౌర్జన్యాలు, అనుమానం తయారీలు, వ్యతిరేకత, విద్వేష వ్యాప్తి వంటి అనేక అంశాల గురించి అతి సున్నితంగా జైపూర్ లిటరరీ ఫెస్టివల్ లో ఇద్దరు ముస్లిం, ముగ్గురు హిందూ జర్నలిస్టుల మధ్య జరిగిన సంభాషణలతో సాగిన కథ ఇది. దానికి సమాంతరంగా తెలుగు రాష్ట్రాలలో అమలవుతున్న ముస్లిం వివక్ష రూపాలలో ఐదిటిని అక్కడక్కడ చెపుతూ మారుమూల పల్లె నుంచి అంతర్జాతీయ పుస్తకోత్సవం దాకా ఈ కాషాయ విషవిద్వేషం ఎట్లా చాపకింద నీరులా పాకుతున్నదో, వెయ్యి పడగలు విప్పి బుస కొడుతున్నదో చిత్రిస్తుందీ కథ. మరొక స్థాయిలో అంబానీ, అదానీ, దమానీల దోపిడీని ప్రస్తావిస్తూ, దాన్ని సహిస్తున్న సమాజమే అణగారిన ఒక మత సమూహాన్ని అనుమానించడానికీ, అవమానించడానికీ, దౌర్జన్యం చేయడానికీ ఎట్లా ఉత్సాహపడుతున్నదో మరొక అంతర్ కథనం సాగుతుంది. ప్రతి దానికీ నెహ్రూను తిట్టే, సావర్కర్ లైఫ్ అండ్ లెగసీని ఔదల దాల్చే, తోటి ముస్లిం జర్నలిస్టు లను నేరుగా అనుమానించే, అవమానించే జర్నలిస్టు పాత్ర ఒకటి, “నా సానుభూతి అంతా ముస్లింల గురించే. వారు గౌరవాన్ని ఎర్న్ చేయాలి, కష్టమే. బట్. వాళ్ళు ఖచ్చితం గా ప్రయత్నించాలి. నేనేమంటా నంటే ఇది హిందువుల దేశం… వారి ఔదార్యమే మనకు శిరోధార్యం అని గ్రహిస్తే చాలు. ముస్లింలకు ఈ చిన్న ఎరుక లేకపోతే ఎలా? రాబోయే తరాల కోసమైనా మీ పరిమితులు తెలుసుకుంటే…” అని విషం కక్కుతుంటే, వినేవాళ్ళు దాన్ని ఆపి ఆ రథయాత్ర నుంచి దిగిపోతారా, ‘బహుజన రక్త చిహ్నాలతో’ సాగుతున్న ఆ రథంలో ఇంకా కొనసాగుతారా అనేది ఇవాళ ప్రశ్న. ఆ వాహనం దిగి మిగిలిన ఇద్దరు జర్నలిస్టులు తమ ఎంపిక ప్రకటిస్తారు. మీరెక్కడ కలుస్తారు అని పాఠకులను నిలదీ స్తుందీ కథ.

          ఈ ఇతివృత్తాన్నే మరొక తలం నుంచి చిత్రిస్తుంది కూనపరాజు కుమార్ ‘సులేమాన్ కారు’.

          అన్నిటికన్ని కథలూ సర్వ సమగ్రంగా ఉన్నాయననక్కర లేదు. కొన్ని కథలు ఇంకా మెరుగ్గా రాసి ఉండవచ్చు, బాగా రాసిన కథల్లో కూడ భాషాదోషాలు, అన్వయ లోపాలు, అసమగ్రతలు ఉండవచ్చు. ఈ కాలానికి సూచిక అంటున్న దానిలో కార్మికులు, విద్యార్థు లు, ప్రజా ఉద్యమాలు లేకపోవడం సమంజసమేనా అనీ, పాలక దుర్మార్గాలు, రైతాంగం అంత స్వల్పమేనా అనీ అడగవచ్చు. కాని మొత్తంగా సంకలనం ప్రభావం ముందు అవి చిన్న నలుసులే.  

మనం గడుపుతున్న జీవితంలోనే మనకు తెలియని కోణాలను, మన చుట్టూ ఉన్న సామాజిక జీవనంలో మన అనుభవం లోకి రాలేని కోణాలను అర్థం చేసుకునే సున్ని తత్వాన్ని చదువరులలో పెంచడమే, జీవితాన్ని, జీవిత దృక్పథాన్ని ఉన్నతీకరించడమే సాహిత్యం చెయ్యగల పని అనుకుంటే ఈ కథలు ఆ పనిని సమర్థంగా చేశాయనే చెప్పాలి.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.