
ఓపెన్ సీక్రెట్
-నిర్మలారాణి తోట
నాకు తెలుసు
నాకే కాదు సమస్తనారీలోకానికీ తెలుసు
నీ చూపుడు వేలెప్పుడూ నావైపే చూస్తుందని
నే కట్టే బట్టా నా పెరిగే పొట్టా
అన్నీ నీకు కాలక్షేపసాధనాలే
ఆక్షేపణల శోధనలే..
మడతపడ్డ నాలుగువేళ్ళు నిన్నేమని నిలదీస్తున్నాయో నీకెప్పుడూ కనిపించదు
నీ కురుచ బుద్దికి నా దుస్తులు పొట్టివైపోతాయి
నీ మైక్రోస్కోపిక్ చూపులకు ఆరు గజాల చీరకూ చిల్లులు పడతాయి
నువ్వెప్పుడూ
“నేను” కాని మాంసపుముద్దనే చూడగలవెందుకో..
చిత్రంగా అనిపిస్తుంది
మేము చేసిన బొమ్మలే
మమ్మల్ని బొమ్మల్నిచేసి ఆడిస్తుంటే…
అసహ్యంవేస్తుంది
ఆకలి తీర్చుకున్న చోటునే ఆకలిగా చూస్తుంటే..
ఒరేయ్ పిచ్చోడా
అద్దం మా చిరునామా కాదు!
ఆకారం అస్తిత్వం అసలేకాదు
పొడుచుకొచ్చే మీసాలు మగతనం కాదు
పొదివిపట్టుకునే వ్యక్తిత్వమొక్కటే మనిషితనమై నిన్ను నిటారుగా నిలబెట్టేది !
*****
Please follow and like us:

నిర్మలారాణి తోట విద్యుత్ శాఖలో ఉద్యోగం
ప్రచురించిన పుస్తకాలు ; 1. లోపలి మెట్లు ( కవితా సంపుటి) 2. ఒక చినుకు కోసం ( కవితా సంపుటి)
పొందిన అవార్డులు : రొట్టమాకురేవు కవిత్వ అవార్డు, కొత్తపల్లి నరేంద్ర బాబు స్మారక పురస్కారం, శంకరం వేదిక యువ కవితా పురస్కారం, కరీంనగర్ జిల్లాపరిషత్ నుండి విశిష్ట మహిళాపురస్కారం, కళా శ్రీ సాహితీ వేదిక జగిత్యాల వారి జీవన సాఫల్య పురస్కారం, కెనడా తెలుగుతల్లి పురస్కారం.
