దక్షిణ దేశ యాత్ర

(భాగం – 1)

(నవగ్రహ క్షేత్రాలు + పంచభూతలింగ క్షేత్రాలు + పంచ సుబ్రహ్మణ్య క్షేత్రాలు + రామేశ్వరము + కన్యాకుమారీ + మధుర మొదలగునవి)

-అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

          సాయికృష్ణా  ట్రావెల్స్‌ ద్వారా జూలై తొమ్మిది బయలు దేరి పదినాడు ఉదయము
6.45Am కు ఎగ్‌మోర్‌ కు చేరుకున్నాము. అక్కడ కాలకృత్యములు మరియు ఉపాహార ములు సేవించి మరల తొమ్మిది గంటలకు తిరుచ్చి పయనమైతిమి. తిరుచ్చిచేరుకునే సరికి దాదాపు ఒంటిగంట అయినది. అచట నుండి మరల కుంబకోణమునకు పయనమై తిమి. సాయంత్రము నాలుగు గంటలకు కుంబకోణమునకు చేరుకుంటిమి. ఎందుకనగా నవగ్రహ ఆలయములన్నియూ కుంబకోణ పరిసరములలోనూ, దగ్గర దగ్గరగా ఉండుట వలన కుంబకోణమును హాల్టీంగ్‌ పాయింట్‌ గా పెట్టుకున్నాము. మొత్తం అరవై మంది ఆరు మినీ బస్సులలో (విత్‌ ఏసీ )ప్రయాణం. 

          తమిళనాడులోని నవగ్రహ దేవాలయాలు కుంబకోణం సమీపంలోని చోళరాజులచే
నిర్మితమైన దేవాలయాల సమూహం. హిందూపురాణాల ప్రకారం, కాలవ ఋషి కుష్టు వ్యాధితో పాటు తీవ్రమైన అనేక వ్యాధులతో బాధపడుచుండెను. ఆ సమయమున ఆ ఋషి అనేక విధముల, వివిధ స్తోత్రములతో నవగ్రహాలను ప్రార్థించెను.

          అతని భక్తికి మెచ్చి నవగ్రహాలు మహర్షికి వైద్యం అందించాయి. మానవులకు వరాలు అందించే శక్తి గ్రహాలకు లేవని భావించిన సృష్టికర్త బ్రహ్మకు కోపం  వచ్చింది. ఆయన నవగ్రహాలు కుష్టి వ్యాధితో బాధ పడమని వారిని శపించెను. మరియు తెల్లని అడవి భూలోకములో సకల పూల వెలరుక్క అడవిలోనికి వారిని నివశించమని ఆదేశించె ను. అప్పుడు నవగ్రహాలు శివుని ప్రార్థించాయి. వారికి దర్శనమిచ్చి ఈస్థలం తమదేనని, ఆ స్థలం నుండి తమను పూజించే భక్తులను అనుగ్రహించ వలసి ఉంటుందనిచెప్పెను.

          ఒక్కో దేవాలయము ఒక్కో గ్రామములో కలదు. మరియు ఈ గ్రామాలను నవగ్రహ నివాసాలుగా పరిగణింపబడుతున్నాయి. వీటిలో ఎనిమిది ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి. సూర్యదేవాలయము మాత్రము సూర్యగ్రహానికి అంకితం చేయబడ్డది. ఇది పూర్తిగా సూర్యభగవానుని మరియు ఇతర నవగ్రహా దేవతల ఆరాధనకు అంకితం చేయ బడ్డది. మొదటిది ప్రధాన దేవతగా, రెండవది పరిచారిక దేవతగా పూజించబడుతుంది. ఇది పదకొండవ లేదా పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినది. మిగిలిన దేవాలయాలు 7వ-9వ శతాబ్ది లో నిర్మితమైనవి.

1.సూర్యగ్రహం – సూర్యనార్‌ కోవిల్‌ ( తంజావుర్‌ జిల్లా) శివలింగం-అగస్త్యశ్వర,
అమ్మవారు-ఉష, పద్మినీ

2.చంద్రగ్రహం – తింగలూరు ( తంజావురు) శివలింగం-కైలాసనాథ, అమ్మవారు-పెరియనాయకి

3.అంగారక గ్రహం – వైతాశ్వరన్‌కోవిల్‌ ( మైలాడుతురై జిల్లా) శివలింగం-వైధీశ్వర,
అమ్మవారు-తయ్యక్‌నాయకి

4.బుదగ్రహం – తిరువెంగడు ( మైలాడుతురై ) (తిరునాగేశ్వరము. శివలింగం-శ్వేతారణీశ్వర. అమ్మవారు-బ్రహ్మవిద్యాంబిక

5.గురుగ్రహం – అలంగుడి ( తిరువారూర్‌ జిల్లా). శివలింగం-ఆపత్సహాయేశ్వర.
అమ్మవారు-ఏళవర్‌కుళని.

6.శుక్రగ్రహం – కాంచనూర్‌ ( తంజావూరు). శివలింగం-అగ్నీశ్వర. అమ్మవారి పేరు-కర్పగవల్లి.

7.శనిగ్రహం – తిరునల్లార్‌ ( కాంచనూరు). శివలింగం-ధర్భారణ్యేశ్వర అమ్మవారి పేరు-పూన్‌మలై (భోగవతీ దేవీ)

8.రాహుగ్రహం – తిరునాగేశ్వరం ( తంజావురు). శివలింగం-నాగనాధ. అమ్మవారి పేరు-గిరికుచాంబిక.

9. కేతుగ్రహం – కీజ్పెరుపల్లం ( మాలాడుతురై). శివలింగం-నాగనాధ. అమ్మవారి పేరు-సౌందర్యనాయకి.

ఇందులో ఆరు క్షేత్రాలు, కావేరీ నదికి ఉత్తర దిశగా మరియు మూడు క్షేత్రాలు ధక్షిణ దిశగా కలవు

***

          ఈ దేవాలయాలు చోళరాజుల కాలం నాటివి. వీటిలో కొన్ని చోళుల కంటే ముందు
కల పల్లవులకాలం నాటివిగా చెబుతారు. వీటిని దర్శించుకున్న భక్తులు తమ తమ
గ్రహపీడలను విశేషంగా తొలగించుకుంటారు.

          భారతదేశంలో అత్యద్భుత నిర్మాణాలు అంటే …మొట్టమొదటగా చెప్పుకోవలసింది
ఆలయాలే. ఏకశిలలు, గండశిలలను సైతం వెన్నముద్దలుగా మలచి…ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని వేలఏండ్లనాడే అద్భుతాలు సృష్టించిన శిల్పులు
ఎందరో. ముఖ్యంగా దక్షినాదిలో ఏ ఆలయాన్ని చూసినా తనివితీరదు. నాటి రాజులంతా ఒక సాంస్కృతిక కేంద్రాలుగా ఈ ఆలయాలను అభివృద్ది చేశారు. వెయ్యేండ్లు  దాటినా ఆ ఆలయాలు చెక్కుచెదరకుండా మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా మనం చూడని…మన కనుల ముందు జరగని చరిత్ర.

          ఈ ఆలయాన్ని ఫలానా రాజు నిర్మించాడని చదవుకోవడం తప్ప..ఆ నిర్మాణ అనుభూతి మనకు తెలియదు. 

          మన కనులముందో … నాటి  రాజరాజచోళుడో… కాకతిరుద్రదేవుడో, శ్రీకష్ణదేవరాయ
లో….నాయకరాజులో ….పల్లవులో నిర్మించారని కథలు కథలుగా చెప్పుకుంటున్నాము.
మూడు రోజులలో నవగ్రహ దేవాలయాల సందర్శన జరిగింది. వీటితో పాటు కుంబకోణం పరిసర దేవాలయాల సందర్శన జరిగింది.

స్వామీమలయై చిదంబరం, మరియు సారంగపాణీ క్షేత్రాలు:

స్వామీమలయై; ఈ ఆలయం ప్రముఖ మురుగన్‌ క్షేత్రం. కుంబకోణమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు. మరియు కావేరీ నదీ తీరము తంజావూరు పట్టణమునకు దగ్గరగా కలదు. ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రలలో ఒకటి.

చిదంబరం- ఈ ఆలయాన్ని చిదంబర నటరాజ ఆలయముగా పిలుస్తారు. చాలా
పురాతనమైన క్షేత్రం. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్త్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. శ్రీకాళహస్థిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు. మూడు దేవాలయా లు ఒకే రేఖాంశం మీద ఉంటాయి.

          మరో విచిత్రం ఏమిటంటే ఈ మూడు దేవాలయాలు శాస్త్రీయపరంగా 79 డిగ్రీల 41
నిమిషాల రేఖాంశం పై ఉన్నట్లు ఋజువయ్యింది. శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు.
ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు
భాగంలో బంగారం బిల్వపత్రాలు ఉంటాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా
ఓ తెరను అడ్డు ఉంచుతారు అక్కడి పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రం భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం.

          ఏ రూపం లేకండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవసన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యము. అదే చిదంబర రహస్యమని చెబుతారు.

కుంభేశ్వర స్వామి క్షేత్రము- తమిళనాడు లోని కుంబకోణాన్ని ఆలయాలపుట్ట అని
అంటారు. సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రాంతం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ ప్రతీ అడుగుకు ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందులో కుంభేశ్వర ఆలయం చాలా ప్రాముఖ్యము కలిగినది. దీనిని ఆది కుంభేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న పరమశివుడు మిగిలిన శివలింగాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఒక కలశం ఆకారంలో పక్కాగా చెప్పాలంటే కూజా ఆకారంలో ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని మంగళనాయకి అని అంటారు. ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఆలయం ఉంది.

          ఇక బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందే ఈ శివలింగం ఏర్పడటం వల్ల దీనిని ఆదికుంభేశ్వర క్షేత్రం ( లింగం) అని అందురు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 15వ శతాబ్దంలో తంజావూరు నాయకులు విస్తరింపజేశారు.

          ఇక్కడి అమ్మవారిని సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా పెళ్ళికాని వారికి వెంటనే వివాహం అవుతుందని, సంతానం లేనివారికి  సంతానము చేకూరుతుందని భక్తుల నమ్మకం.

సారంగపాణిక్షేత్రము-  కుంబకోణం దగ్గరగా కావేరీ నదీ తీరాన పంచ రంగనాధ
ఆలయాల్లో ఒకటి. విలక్షణమైన పురాతన మందిరం. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి
కథతో ముడిపడి ఉన్న ఈ గుడిలో విష్ణుమూర్తి ఇల్లరికపు అల్లుడుగా కొలువు తీరాడు. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. ఇక్కడ …ఉత్తరద్వార దర్శనం లేదు. స్వామివారే ప్రత్యక్షంగా వచ్చి ఉన్నారు కాబట్టి. 150 అడుగుల ఎత్తు, 11 అంతస్తులతో సమున్నతంగా కనిపించే రాజగోపురం తమిళనాడులోని మూడో అతిపెద్ద రాజగోపురం.

***

          ఐదవరోజు కుంబకోణం నుంచి ఉదయం 6.30కి బయలుదేరాము. మధురైకి పయనం.

జంబుకేశ్వర లింగం- (జల లింగం)- జంబుకేశ్వరఆలయం, తిరువానైకల్‌ భారత
దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి ( తిరుచ్చి) జిల్లాలో ఉన్న ప్రసిద్ద
శివాలయం. తొలి చోళులలో ఒకరేన కోచెంగల్‌చోళన్‌ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు
చరిత్ర చెబుతోంది. శ్రీరంగం ద్వీపంలో ఉంది. 

          మహాదేవుని ఆజ్ఞమేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు.సాక్షాత్తు అమ్మవారు పూజ చేసిన లింగం. జంబు( నేరేడు) వృక్షాలు అధికంగా ఉండటం వలన జంబుకేశ్వరుడనే పేరు వచ్చింది. పంచభూత క్షేత్రాలలో రెండవది. ఇక్కడ  పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. తిరుచ్చికి 11 కి.మీ.దూరంలో ఉంటుంది ఈ ఆలయం.

***

అలగర్‌ కోయిల్‌- మధురైకి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్లనడుమ ఓ కొండ ప్రక్కన ఉన్న ఆలయమే అళగర్‌ కోవిల్‌. 108 వైష్ణవ క్షేత్రాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా అభివర్ణిస్తారు. మధురలోని మీనాక్షి అమ్మవారికి సోదరునిగా
భావిస్తారు. అమ్మవారి కళ్యాణము సుందరేశునితో ఈ స్వామివారే జరిపించారని
కథనం. అందుకే అమ్మవారి కళ్యాణ ఉత్సవాలప్పుడు స్వామివారి ఉత్సవవిగ్రహం ఇక్కడ నుంచి తీసుకెళతారు. ఈ ఆలయాన్ని నమ్ముకుని వందల ఏళ్ళుగా జీవిస్తున్న
వేలాది మంది ఉన్నారు.

          స్వామి వారితో పాటుగా వారి సతీమణి సుందరవల్లీ తాయారు వారి ఆలయం కూడా
ఉంది. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారిని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లీ తాయారు అన్న పేరు కూడా వచ్చింది.

***

ఫళమూడిర్చోలై-అలగర్‌కోయిల్‌ కొండలలోని , బాగాలోపల ఈ సుబ్రహ్మణ్యస్వామి  ఆరు దివ్యక్షేత్రలలో ఒకటి- ఆఖరుదైన ఫళమూడిర్చోలై (పళముదుర్‌సేలై) ఉన్నది. ఇక్కడ స్వామివారు చిన్నపిల్లవాని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చిన్న తనంలో ఆడుకునేవారని చెబుతూంటారు. ఇక్కడ వల్లీ మాత కూడా ఉంది. ఇక్కడ స్వామివారు భక్తురాలిని పరీక్షించిన ప్రాంతము. భక్తురాలికి జ్ఞానభిక్ష ప్రసాదించిన క్షేత్రం.
ఆరుక్షేత్రాలు- పళని, తిరుత్తణి, స్వామిమలై, పళముదిర్చోలై, తిరుప్పరంకుండ్రం
తిరుచెందూర్‌.

***

మధురమీనాక్షి ఆలయం:

మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులో ఉంది. ఈ దేవాలయం వేగైనది ఒడ్డున ఉంది. మధురై పట్టణం తమిళనాడులో రెండవపెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయం వారసత్వాలు మొదలైన వాటికి నిలయంగా ఉంటుంది. ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో మధురై ఒకటి. అనేక రాజ వంశాల పాలన చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ది పరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు, భారతదేశ సంస్కృతి, కళలు, అధ్యాత్మికతలలో ప్రధానపాత్ర  వహించే నగరాలలో మధురై పట్టణం ఒకటి.

          2500 ఏళ్ళ క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం ( మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్ళు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. ఈ ఆలయం గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.

          మధురై పాలకుడు మలయద్వజు పాండ్యరాజు చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్నపాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్ళాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించ
సాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్ళి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతారు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతీ ఏటా ‘ చిత్తిరై తిరువళ’ వేడుకగా నిర్వహిస్తారు.

          ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో ఎనిమిది గోపురాలు
ఉన్నాయి. సుందరపాండ్యన్‌ , పరాక్రమపాండ్యన్‌ లు 13, 14వ శతాబ్దాలలో తూర్పు
పశ్చిమ గోపురాలను, 16 వశతాబ్దంలో శివ్వంది చెట్టియార్‌ దక్షిణ గోపురాన్ని కట్టించారు. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. తూర్పుగోపుర సమీపంలో అష్ట లక్ష్మీమండపం ఉన్నది.

***

తిరువయ్యూరు- తంజావూరు జిల్లాలోని పట్టణం. పురాతన చోళరాజ్య పట్టణం. శ్రీ త్యాగరాజ స్వామి ఆలయానికి ఏప్రిల్‌ నెలలో జరిగే రథోత్సవానికి ప్రసిద్ది. ఇది తంజావూరు పట్టణానికి 11 కి.మీ.ఉత్తరాన కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యూరు అంటే ఐదు నదుల సంగమ పవిత్ర స్థలం అని అర్థం.” వడవార్‌, వెన్నార్‌, వెట్టార్‌, జూడుమూరుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి పేరు వచ్చింది.

          కర్ణాటకత్రయంలో ఒకరైన త్యాగయ్యగారు తిరువయ్యూరులో జన్మించారు. ఇక్కడ
ప్రతీ పుష్యబహుళపంచమినాడు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంగీత విద్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి ” పంచరత్న కీర్తనలు” గానం చేస్తారు. వారి వంశస్తులు 6వ, 7వ తరం వారు కూడా సంగీత విద్వాంసులు, మరియు నిత్యము స్వామివారి నిత్యకృత్య పూజలన్నీ జరుపుతారు. మరొక్క ముఖ్య విషయమేమి టంటే త్యాగయ్య గారు పూజించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు కూడా ఆ ఆలయ మందు కలవు.

***

బృహధీశ్వరాలయం- తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా
అద్భుతమైనది శ్రీ బృహధీశ్వరాలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో
ప్రముఖమైనది.

          చోళ శక్తి చిహ్నంగల ఈ అతి పెద్ద ఆలయం 1,30,000 టన్నుల గ్రానైట్‌ తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం. భారతదేశంలోనే అత్యంత
అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించదు. ఆలయగోడల పై  భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి.

          ఈ నగరం ఒకప్పుడు చోళుల యెక్క బురుజుగా ఉండేది. అంతే కాదు ఇది చోళులు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి తంజావూరు ధక్షిణ భారత దేశంలేని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా మారింది. క్రీ.శ.1010 లో రాజరాజు చోళ చక్రవర్తి నిర్మించిన బృహధీశ్వరాలయం.

          ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. పర్యాటక రంగంలో ఈ ఆలయానికి ప్రాముఖ్యత కలదు. ఎక్కడా సిమెంట్‌, ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించిన ఆలయం. ఇండియాలోనే అతి పెద్ద ఆకాశహార్మ్యం, 13 అంతస్తులు కలిగి ఉంది. శివలింగం ఎత్తు 3.7 మీటర్లు. శివుని వాహనం నంది కూడా తక్కువేమి కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు , 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. రాతి తోరణాలు, సొరంగాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు ప్రతిధ్వనించవు.

***

          చాలా వరకూ ప్రయాణం ఎక్కడికక్కడ ఏయే దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో
ముందే అన్నీ తెలుసుకుని దాని ప్రకారము, మా తీర్థయాత్ర జరిగింది. ఇప్పుడు
శ్రీరంగం పట్టణానికి  వచ్చాము.

శ్రీరంగం- తిరుచిరాపల్లి  లేదా తిరుచ్చికి కేవలం ఎనిమిది కి.మీ. దూరంలో కలదు.
దేవాలయం  కావేరీ- కొల్లిదం ( కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉన్నది.
ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణు
భగవానుని దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రము కూడా. శ్రీ మహావిష్ణువు పాలసముద్రము నుండి ఇక్కడే ఉద్భవించెను. ప్రపమచంలో అతి పెద్ద విష్ణుదేవాలయం కూడా ఇదే. భూలోక వైకుంఠం. ఈ ఆలయాన్ని ఇండియన్‌ వాటికన్‌ గా కూడా పిలుస్తారు.

          సుమారు ఇక్కడ 157 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ దేవాలయం, అతి పెద్ద రంగనాథ స్వామి విగ్రహం సేద తీరు తున్నట్లుగా కనబడతాడు. నాలుగు కిలోమీటర్ల
చుట్టుకొలత కలిగి ఉన్నది. ఏభై వరకూ వివిధ దేవతా మూర్తుల ఆలయాలు కూడా
కలవు. నాలుగు రోజులలో ఈ దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము.

***

తిరుప్పకుంద్రము- శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి యొక్క ఆరు దివ్యక్షేత్రాలలో రెండవది.
ఈ క్షేత్రములో స్వామివారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో కళ్యాణం జరుగు
తుంది. మధురైకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

          ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షేత్రం లో స్వామివారు కూర్చుని దర్శనమిస్తారు.
మిగతా అన్ని చోట్ల స్వామివారు నిలబడిన మూర్తినే చూస్తాం. ఇంకో విశేషమేమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే ఒక కొండరాతిని చెక్కి మలచినది. ఆలయంలోకి ప్రవేశించగానే ఇక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక భగవన్మూర్తి  ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి అభిషేకం జరగదు. కేవలం ఆయన శక్తి శూలమునకు అభిషేకం చేస్తారు.

***

ఫళని- ఈ క్షేత్రం దిండిగల్‌ జిల్లాలోని మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలోఉంది. ఆరు స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి వారిని దండాయుదపాణి అనే నామంతో పిలుస్తారు. ఈయనను ఫళనిమురుగాయని కూడా పిలుస్తారు. జ్ఞానఫలాన్ని ఇచ్చేవాడు కనుక ఫళనిస్వామి అయ్యాడు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి ఒక చేతిలో దండం పట్టుకుని, కౌపీనధారియై, వ్యుప్తకేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ  ఉంటారు. దానికి అర్థం ” నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో “- అని మనకి సందేశం ఇస్తున్నారు. అంటే ఫళని క్షేత్రం జ్ఞానమును ఇచ్చే క్షేత్రము.

          ఇక్కడ స్వామి వారి మూర్తిని తొమ్మిది విషపూరిత పదార్థాలతో ( వీటిని నవపాషా
ణములు అంటారు)అభిషేకిస్తారు. స్వామి వారు కొండ పైన ఉన్నారు. చేరుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి కాలినడకన మెట్లు ఎక్కడం. రెండు- రోప్‌వే మీద రైలు.

***

సుఛీంద్రము- నేరాన్ని ఋజువుచేసే శుచీంద్ర శివుడు. కన్యాకుమారికి కేవలం 13కి.మీ.ల దూరంలో ఈ ఆలయం కలదు. స్వయంభూ వెలసిన లింగ స్వరూపుడు. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. శుచీద్రం దత్తాత్రేయ క్షేత్రంగా ప్రసిద్ది చెందినది. శంకరభగవత్పాదులు పరమశివుని తాండవనృత్యాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ చూశారట. పరమ శివులు ఆదిశంకరుల వారికి ప్రణవమంత్రాన్ని ఉపదేశించిన స్థలం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే ‘ శుచీద్రం’ అని పేరొచ్చింది.

రామేశ్వరము- ఈ దేవాలయం ద్వీపములో కలదు. భారతదేశంలోని ఆలయాల
అన్నింటి కంటే విశాలమైన ఆవరణ కలిగియుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
12 వ శతాబ్దిలో విస్తరించబడింది. ఈ పట్టణం ప్రధాన భూబాగం నుండి పంబన్‌కాలువ ద్వారా వేరుచేయబడింది. శ్రీరాముడు నిర్మంచిన సేతువు ఇక్కడ ఉంది. లంకకు సముద్ర మార్గము ఇదే. రావణాసురుని నిహతుని చేశాక రామనాథేశ్వర లింగం ఇక్కడ శ్రీరాములవారు  ప్రతిష్టించారు. ఈ ప్రదేశము ప్రఖ్యాత తీర్థస్థలియే కాకుండా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం.

          కాశీకి వెళ్ళిన వారు అక్కడి గంగను తీసుకు వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారు. మళ్ళీ
ఇక్కడి ఇసుకను తీసుకు వెళ్ళి అక్కడ గంగలో కలుపుతారు. ఇక్కడ శివ లింగం సైకతం. ‘ ఇక్కడ సముద్రకెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, చిన్నచిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపుబళ్ళు, నీలిరంగులో మైమరపించే సముద్రము. ఎన్నాళ్ళు చూసినా తనివితీరనే తీరదు. చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కోటితీర్థాలు, రామపాదాలు, దనుష్కోటి, విభీషణాలయం మొదలగునవి చాలా ఉన్నాయి.

          ఈ ఆలయంలోని పెద్దభాగమైన నడవా లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం
1219 అడుగులు 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా స్థాపించ బడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం ఏ అడ్డంకులూ లేని 230 మీటర్ల పొడవు వుంటుంది.

          చోళ, జాఫ్నా, పాండ్య, విజయనగర మరియు నాయక రాజులు పాలించిరి. అభివృద్దిపరిచిరి. ఇచ్చట స్వామి తన భార్య పర్వతవర్ధిని అమ్మన్‌ తో కలిసి మొదటి ప్రాకారములో దర్శనమిస్తారు.

          సేతుపురాణ గ్రంథ ప్రకారము, రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా 64 తీర్థాలు
ఉన్నాయి. వాటిలో ఇరవై రెండు తీర్థాలు ఆలయం ప్రాంగణంలో ఉన్నాయి. ప్రస్తుతం
పదకొండు తీర్థాల్లోనే పవిత్ర స్నానము చేయుచున్నారు. వెళ్ళిన వాళ్ళలో దాదాపు
అందరమూ చేశాము.

          చాలా చోట్ల దర్శనమునకే ప్రాధాన్యత నిచ్చాము. కొన్నిచోట్ల సమయభావన వలన.
అభిషేకాలు కూడా అందరమూ స్వామి సన్నిధిలో చేయించుకున్నాము. మావరకైతే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, అభిషేకాలతో సహితము మావి పూర్తి అయినవి.

గమనిక:- చాలావరకూ దేవాలయాల గురించి క్లుప్తంగా, సంక్షిప్తంగా వివరిస్తున్నాను.
అవగాహన గురించి. చూసి తరించవలసినదే. చూస్తున కొద్దీ చూడాలనిపించే
దేవలయాలు, ప్రసిద్ద పర్యాటక ప్రదేశాలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.