పౌరాణిక గాథలు -7

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ధైర్యము – సావిత్రి కథ

          ఆమెకి తెలుసు ఆమె భర్త ఒక సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని బ్రతికించుకోవాలని ఆమె పట్టుదల. ఆమె అనుకున్నట్టే పట్టుదలతో భర్తని బ్రతికించుకుంది కూడా. ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న సావిత్రి కథ.

          సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలా కాలం సూర్యభగవానుణ్ని ఉపాసించడం వల్ల ఆమె జన్మించింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు తగిన వరుణ్ని తనే ఎంచుకోవాలని అనుకుంది. వరుడి కోసం వెతుక్కుం టూ అనేక ప్రదేశాలు తిరిగింది.

          చివరికి ఒక అడవిలో ఆమెకి ఒక కుటుంబంతో పరిచయమైంది. వాళ్ళ కుమారుడు సత్యవంతుడు గొప్ప గుణవంతుడు. అతణ్ని చూసిన తరువాత అతణ్ని తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది.

          ఆ విషయం ఇంటికి వెళ్ళి తల్లితండ్రులకి చెప్పింది. సావిత్రి ఎంచుకున్న వరుణ్ని చూసి ఆమె దురదృష్టానికి అందరూ చాలా బాధపడ్డారు. సత్యవంతుడు రాజకుమారుడే అందులో ఎటువంటి సందేహమూ లేదు. సావిత్రి వంటి సుగుణాల రాశికి అతడు సరయి న వరుడే. కాని, అప్పటికే సత్యవంతుడి ఆయుష్షు చాలా వరకు పూర్తయి పోయింది.
సత్యవంతుడు అల్పాయుష్కుడే కాదు, జీవితంలో ఇంకా అనేక ఆపదల్లో చిక్కుకుని ఉన్నాడు. అతడి తండ్రి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.అందువల్ల అతడి కుటుంబమంతా అడవిలో నివసిస్తున్నారు.

          సత్యవంతుడి తల్లితండ్రులకి మాత్రమే తెలిసిన భయంకరమైన రహస్యం ఒకటుంది. అది తమ కుమారుడు ఒక సంవత్సరమే జీవిస్తాడని. ఆ విషయాన్ని వాళ్ళకి నారదమహర్షి చెప్పాడు. సత్యవంతుడిలో భగవంతుడు మెచ్చే ఒక గుణం సత్యాన్ని పలకడం. అతడికి ఆయుష్షు తక్కువ ఉందనీ; అతడి తల్లితండ్రులకి రాజ్యం లేక అడవుల వెంట తిరుగుతున్నారనీ…తెలిసి కూడా సావిత్రి అతణ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడం విని ఆమెని చూసి అందరూ జాలి పడ్డారు.

          ఆమె తల్లితండ్రులు మనస్సుని మార్చుకోమని సావిత్రికి మరీ మరీ చెప్పారు. బంధువులతోను, తెలిసినవాళ్ళతో కూడా చెప్పించారు. ఎవరు ఎంత చెప్పినా ఆమె వినలేదు.

          సావిత్రి తండ్రి “సావిత్రీ! ఇతణ్ని కాకుండా మరొక వరుణ్ని ఎంచుకో. సత్యవంతుడు మంచివాడు, గుణవంతుడే! అయినా అతడు దురదృష్టవంతుడు. నువ్వు రాజకుమార్తెవి కనుక నీకు మరొక వరుణ్ని కోరుకునే అవకాశం ఉంది కనుక, మళ్ళీ ఆలోచించుకో” అని చెప్పాడు.

          సావిత్రి మాత్రం “తండ్రీ! నేను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లని. నా మనస్సుని ఒకసారి సత్యవంతుడికి ఇచ్చేశాక మళ్ళీ మార్చుకోలేను. ఏది జరిగితే అది జరుగుతుంది. ఏది ఎలా జరిగినా దాన్ని నేను భరిస్తాను!” అంది పట్టుదలగా.

          నారద మహర్షి కూడా ఆమెకి అనేక విధాలుగా నచ్చచెప్పాడు. కాని ప్రయోజనం లేకపోయింది. సావిత్రి సత్యవంతుల వివాహం జరిగిపోయింది. తన ఆయుష్షు తగ్గిపోతోం దని సత్యవంతుడికి మాత్రం తెలియదు.

          పెళ్ళి జరిగిన వెంటనే సావిత్రి రాజభవనాన్ని వదిలి తన భర్తతో కలిసి అడవులకి వెళ్ళిపోయింది. అడవుల్లో అత్తమామలతో ఉంటూ వాళ్ళ ప్రేమని పొందింది.

          ఒక సంవత్సరం గడిచిపోయింది. కొన్ని రోజుల్లో అతడికి మరణం తప్పదు. ఈ నిజాన్ని సావిత్రి నిద్రలో కూడా మర్చిపోలేదు. ఆమెకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు తన భర్తను రక్షించుకోడమే ఆమె ధ్యేయం. రాత్రి పగలు భర్త ఆయుష్షు కోసమే భగవంతు ణ్ని ప్రార్థిస్తోంది. ఆమె అందరిలా కన్నీళ్ళతోను, బాధతోను గడపట్లేదు. రాబోయే ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ తను సాధించగలను అన్న నమ్మకంతో జీవిస్తోంది.

          సత్యవంతుడికి భూమి మీద అదే చివరి రోజు. కట్టెలు తీసుకుని రావడానికి దట్టమైన అడవిలోకి వెడుతున్న సత్యవంతుడితో సావిత్రి కూడా బయలుదేరింది.

          సత్యవంతుడు ఆమెను రావద్దని ఎంత చెప్పినా వినలేదు. అతణ్ని ఒక్కణ్నీ వదిలి పెట్టకుండా అతడితో పాటు తను కూడా అడవికి వెళ్ళింది. ప్రతి క్షణం భర్తలో కలిగే మార్పుల్ని గమనిస్తోంది. ఆ క్షణం రానే వచ్చింది. ఇద్దరూ దట్టమైన అడవిలో ఉండగా ఉన్నట్టుండి సత్యవంతుడికి నీరసంగా అనిపించింది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకో వాలని అనుకున్నాడు.

          సావిత్రి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. అంతే! అతడి శ్వాస ఆగిపోయింది. మొదట సావిత్రి చాలా భయపడింది. కాని, అంతలోనే తనని తాను సరిపెట్టుకుంది.
సత్యవంతుడు సత్యదీక్షతో భగవంతుడికి దగ్గరయ్యాడు. సావిత్రి తన పూజలతోను, పాతివ్రత్యంతోను పవిత్రతని పొందింది. ఆ విధంగా ఇద్దరూ దేవతా స్వరూపులయ్యారు.
సత్యవంతుడి ఆత్మని తీసుకెళ్ళడం అంత తేలిక కాదు. అందువల్ల అతడి ఆత్మని తీసుకుని వెళ్లడానికి యముడే స్వయంగా వచ్చాడు.

          సావిత్రి తన పాతివ్రత్య ప్రభావం వల్ల తన భర్త ఆత్మని తీసుకుని వెడుతున్న యముణ్ని చూడగలిగింది. తను కూడా అతడి వెనుకే నడుస్తూ వెడుతోంది.
సత్యవంతుడి ఆత్మను తీసుకుని వెడుతున్న యముడు తన వెనకాలే వస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్యపోయాడు.

          ఆమె వైపు చూసి “సావిత్రీ! వెనక్కి వెళ్ళిపో! నువ్వు నా వెనక రాలేవు!” అన్నాడు.

          సావిత్రి వినయంగా “స్వామీ! నేను నా విధిని నిర్వహిస్తున్నాను. నా భర్తని అనుసరించడం నా విధి కదా! ఇప్పుడు కూడా నేను నా భర్త సత్యవంతుణ్ని అనుసరిస్తూ వెనకాలే వెడుతున్నాను. అతడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను!” అంది.

          యముడు సావిత్రిని తన వెనుక రావద్దని అనేక విధాలుగా నచ్చచెప్పాడు. ఆమె వినకుండా అతడి వెనుకే నడుస్తూ “నేను వివాహితురాల్ని, భర్తని అనుసరించడం నా ధర్మం. నేను నా భర్తని అనుసరిస్తూ వస్తాను!” అని మళ్ళీ అదే మాట చెప్పింది.

          చావుకు భగవంతుడైన యముడు ఆమెకు భర్త యందు ఉన్న అంకిత భావాన్ని అర్ధం చేసుకున్నాడు. సావిత్రి పాతివ్రత్యానికి మెచ్చుకుని సత్యవంతుడికి పూర్ణాయుష్షు తో పాటు రాజ్యం, సంపదలు, పిల్లలు మొదలయినవన్నీ ఇచ్చాడు.

          అంతేకాదు సావిత్రి తల్లితండ్రులకి, అత్తమామలకి కూడా కావలసినవన్నీఇచ్చాడు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడ ధైర్యాన్నివదలకుండా పోరాడి సావిత్రి భర్తని దక్కించుకుంది.

          కొన్ని వందల సమస్యలు ఎదురుగా ఉన్నకూడా ఒక భారతీయ మహిళ చావుని సవాలు చేసి అనుకున్న దాన్ని సాధించడమే కాకుండా అసాధ్యమైన తన బంధువుల సమస్యల్ని కూడా భగవంతుడి అనుగ్రహంతో తీర్చగలిగింది. అందుకు ఆమె స్వచ్ఛమై న మనస్సు, పవిత్రత, ధైర్యమే కారణం.

ధైర్యమే అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.