అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 7

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల డిగ్రీ పూర్తికాగానే ఎం.బి.ఏలో జాయిన్ అయ్యింది. ఎం.బి.ఏ చదువు తుండగానే విష్ణుసాయితో వైవాహికజీవితంలోకి అడుగు పెట్టింది. ఎం.బి.ఏ పరీక్షలలో డిస్టింక్షన్లో పాసైంది. విశాలకి, విష్ణుతో ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా వచ్చేసింది. విశాల, తాతగారు పోవడంతో డీలాపడినా, విష్ణు ఓదార్పుతో కోలుకుంది. బెంగుళూర్, మైసూర్లో అన్ని ప్రదేశాలు చూసారు ఇద్దరూ. విష్ణు, విశాల ఆస్ట్రేలియా వెళ్ళేరోజు అందరూ వాళ్ళకి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్చేరుకున్నారు.

***

          కార్లు ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే డ్రైవర్ డిక్కీ తెరచి సూట్ కేస్ లు, బ్యాగ్స్ అన్నీ బయటకు దించగానే, అక్కడే ఉన్న కూలీలు లగేజ్ అందుకుని, ట్రాలీలో పెట్టారు.

          మెల్లిగా అందరూ నడుచుకుంటూ గేట్ లోపలికి అడుగుపెట్టారు. అక్కడ సెక్యూరిటీ, వెళ్ళే ప్యాసెంజర్స్ ని మాత్రమే బ్యాగ్స్ తో చెకిన్ కి అనుమతించారు.

          విష్ణు, విశాల లగేజ్ తో సెక్యూరిటీ చెకిన్ సింగపూర్ ఎయిర్ లైన్స్ డెస్క్ వద్దకు చేరుకున్నారు. పాస్ పోర్ట్ చూపించి, బోర్డింగ్ పాస్ తీసుకుని, బాగ్స్ కి టాగ్స్ కట్టి, అన్ని వివరాలు ఫిలప్ చేసారు.

          లగేజ్ బుక్ చేసి, ఇంకా ఫ్లైట్ కి రెండు గంటలు టైమ్ ఉండటంతో, మళ్ళీబయటకు వచ్చి అందర్నీ కలుసుకున్నారు. వాళ్ళు వచ్చేలోగా విష్ణు అన్నగారు సందడిగా అందరి కీ టీ ఆర్డర్ చేసి నవ్వుతూ కలుపుగోలుగా మాట్లాడుతున్నారు.

          విశాల, విష్ణు రాగానే అందరూ వాళ్ళ చుట్టూ మూగి ‘అంతా ఓకేనా, విష్ణూ?” అంటూ గ్రూప్ ఫోటోలు దిగారు.

          విశాల అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళి “అత్తయ్యా! మిమ్మల్ని అందర్నీ వదలి, దూరం వెళ్ళిపోతున్నాను” అని చేతులు పట్టుకుంది.

          అన్నపూర్ణ గారు ప్రేమగా విశాల బుగ్గలు నిమిరారు. “ఇద్దరూ ఆనందంగా, సంతోషంగా ఉండండి.”

          ఇంతలో విష్ణు రాగానే విశ్వనాథం గారి కళ్ళు చెమర్చాయి. “అమ్మాయి, నువ్వు జాగ్రత్త విష్ణూ! వెళ్ళగానే కబురు చెపుతూ ఉండు. ఫోన్ చెయ్యి.”

          “అలాగే నాన్నగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త.”

          విశాల అమ్మ, నాన్న దగ్గరకు వెళ్ళి, గట్టిగా ఇద్దరినీ కౌగలించుకుంది.

          శారదగారు ఆ క్షణంలో ఎంతో ఉద్విగ్నతకు లోనై, “బంగారు తల్లీ! నీకు ఏ కష్టము రాదు. నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి” అని విశాలను ముద్దు పెట్టుకున్నారు.

          “ఇంక సెక్యూరిటీ చెకిన్ కి టైమ్ అవుతోంది విశాలా, మనం వెళ్ళాలి” అని విష్ణు అనడంతో, గట్టిగా అమ్మ, నాన్న చేతులు అప్యాయంగా నొక్కి “వెళ్ళి వస్తాను, నాన్నగారు, అమ్మా!” అంటూ బరువెక్కిన హృదయంతో లిఫ్ట్ లోకి విష్ణుని అనుసరించింది విశాల.

          విష్ణు, విశాల చేతిలో క్యాబిన్ బ్యాగ్స్ తో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని,  వెళ్ళవల సిన సింగపూర్ విమానం సిల్కైర్ టెర్మినల్ గేట్ వద్దకు చేరుకుని అక్కడ లాంజ్ లో కూర్చున్నారు.

          ఆ రోజు ఒక మోస్తరు రద్దీగానే ఉంది విమానశాల ప్రాంగణం.

          విశాల, విష్ణు ఇద్దరూ చేతిలో బోర్డింగ్ పాస్ మరియు చెకిన్ పాస్ చేతిలో పట్టుకుని, అనౌన్స్మెంట్ రావడంతో క్యూలో నించున్నారు.

          ముందుగా పిల్లలు ఉన్నవాళ్ళు, తరువాత వృద్ధులు, ఇంకా వీల్ చెయిర్ అసిస్టెన్స్ ఉన్నవారిని లోపలికి పంపుతున్నారు.

          విశాల ఎయిర్ పోర్డ్ లోకి అడుగుపెట్టిన తరువాత విష్ణుని కొత్తగా చూడసాగింది.

          విష్ణు ఈ రోజు మరింత గంభీరంగా ప్రతి చోట పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, మరో ప్రక్క విశాలను గైడ్ చేస్తూ ఆచితూచి మాట్లాడుతూ ఉండటం చూసి విశాల మనసు లో అనుకుంది.
“అవును మరి, మొదటిసారి సొంత దేశాన్ని, కన్నవారిని వదిలి వెడుతుంటే పెద్దరికం అనుకోకుండా దరిచేరి బాధ్యతలను గురుతెరిగేలా చేస్తుందేమో!”

          సిల్కైర్ విమానంలోకి అడిగిడగానే గగన వనితలు సాదరంగా అహ్వానం పలికి, సీటు నంబర్ చూసి ఎటు వెళ్ళాలో చేయి చూపారు.

          ఇద్దరికీ రెండు సీట్లు విండో వైపు వచ్చాయి. క్యాబిన్ లగేజ్ లోపలికి చేర్చి ఇద్దరూ సీటు బెల్ట్ వేసుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు.

          అంత వరకూ మాటలే కరువైన వారి ఇద్దరి మొహాలలో చిరునవ్వనే వెలుగురేఖ విరిసింది.

          ఎయిర్ హోస్టెస్ అందరూ కూర్చున్నాక ఇన్స్ట్రక్షన్స్, సీటుబెల్ట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నీ వివరించింది.

          ఎయిర్ క్రూ పైలట్ పరిచయం చేసుకుని, ఫ్లైయిట్ కాసేపట్లో టేకాఫ్ అవుతుందని అనౌన్స్ చేసాడు.

          పెళ్ళైన క్రొత్త జంట విశాల, విష్ణుసాయి చదువు పూర్తి చేసుకుని, రెక్కలొచ్చిన విహంగాలై, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, ఊహలలో నిర్మించుకున్న కలల సౌధం నిజం చేసుకోవడానికి, సప్త సముద్రాలు దాటి భరత భూమిని వదిలి, ఆస్ట్రేలియా ఖండం లోనికి అడుగు పెట్టడానికి గగనతలంలో పయనమవుతున్నారు.

          విష్ణు ఇంత వరకు తల్లిచాటు బిడ్డగా, విశాల తండ్రి చాటు తనయగా మసలారు.
ఇపుడు ఇద్దరూ పెద్దరికాన్ని వారిలో ఆవహించుకుని, బాధ్యతలను మున్ముందు భుజాల కెత్తుకునే సరిక్రొత్త నౌకలోనికి ప్రవేశించబోతున్నారు.

          విమానం నేలమీద నుంచి, గాలిలోకెళ్ళి, గగనంలో రివ్వున ఎగురుతుంటే విశాల, విష్ణు ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిటికీ లోంచి బయటకు ఉత్సాహంగా చూసారు.

          ఇద్దరి మనసులలోను ఎన్నో గూడు కట్టుకున్న విషయాలు మాట్లాడుకోవాలనిఉన్నా ఆ క్షణంలో చుట్టూ ఉన్నలోకం, మరే విషయం గుర్తు రాలేదు. సంతోషంగా ఆకాశంలో చంద్రుని తాకుతున్నామా అన్న మధుర భావనలో ఇరు హృదయాలు మౌనగీతం పాడు కున్నాయి.

          ఎయిర్ హోస్టెస్ వేడి వేడి టవల్స్ మొహం అద్దుకోవడానికి, సేద తీరడానికి అందివ్వగా ఇద్దరూ కాస్త రిలాక్స్ అయ్యారు.

          మబ్బుల్లో విహరిస్తున్న విశాల కిటికీలోంచి బయటికి చూస్తూ చిన్నపుడూ తను చూసిన పౌరాణిక సినిమాలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంది. మన సినీ దర్శకులు ఆకాశ వీధిలో పుష్పక విమానంలో ఇంద్రుడు, గయుడు లాంటి పాత్రలు, చిడతలు పట్టుకుని నారదుని త్రిలోక సంచారం ఈ మబ్బుల్లో ఎంత అద్భుతంగా చిత్రీకరించారో అనుకుని నవ్వుకుంది.

          ఇంతలో ఎయిర్ హోస్టెస్ స్నాక్స్ పాకెట్స్, చాక్లెట్స్ ఇచ్చింది.

          మనకి అలసట తెలియకుండా ఇలా ఇన్ని గంటల ప్రయాణానికి భలేగా స్నాక్స్ ఇస్తున్నారు.

          “ఇప్పటి వరకు నా కలల రాణితో విదేశీయానం గురించి కలలు కన్నాను, అది
నిజమవుతోంది. ఇంక ఇపుడు ఆస్ట్రేలియాలో నా రెండో ప్రేయసి అదే నేను చేయబోయే జాబ్ ఎలా ఉండాలో కలలు కనాలి కదా, అందుకే నిద్రలోకి జారుకుంటున్నాను. నువ్వు కూడా నిద్రపో. బాగా అలసి పోయాము.” అని విష్ణు అనగానే విశాల ముసి ముసి నవ్వులు నవ్వుతూ తను నిద్రలోకి జారుకుంది.

          సింగపూర్ లో కాసేపట్లో లాండ్ అవుతున్నట్లుగా పైలట్ అనౌన్స్ చేయగానే ఇద్దరూ మేలుకున్నారు.

          విశాల, విష్ణుని అనుసరిస్తూ సింగపూర్ లో అడుగు పెట్టగానే కాసేపు విస్తు పోయింది. పూర్తిగా మనుష్యుల రంగు, రూపురేఖలు, మాటతీరు అన్నీ మారిపోయాయి.

          విశాల తను చూసిన రష్ అవర్ సినిమాలో పాత్రల్లా ఇక్కడ మనుష్యులు ఉన్నారు అనుకుంది.

          ఇద్దరూ అక్కడ ట్రాన్సిట్ ట్రైన్ లో క్వాంటాస్ విమానం ఎక్కడానికి టెర్మినల్ పాయింట్ కి చేరుకున్నారు.

          నిజంగా క్వాంటాస్ విమానం పెద్దగా ఉంది. విమానం పై కంగారూ బొమ్మ, ఆస్ట్రేలియా ఎయిర్ హోస్టెస్ సిడ్నీ వెళ్ళడానికి వెల్ కం చెపుతూ, గేట్స్ ఓపెన్ చేసారు.

          సింగపూర్ నుంచి సిడ్నీ వెళ్ళడానికి దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం.

          విశాల, విష్ణు ప్రక్కనే మరో ఆస్ట్రేలియా జంట కూర్చున్నారు. విమానంలో చాలా మటుకు ఆస్ట్రేలియా ప్రయాణీకులే ఉన్నారు. వస్త్రధారణ, వేష, భాషలు మారిపోవడం తను ఎక్కిన క్వాంటాస్ విమానంలోనే గమనించింది.

          “ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా చాలా వేరుగా ఉంది కదా!” అని విష్ణుతో అంది.

          “విశాలా! ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఈస్ సిమిలర్ టు బ్రిటిష్ ఇంగ్లీష్. ఐతేఆస్ట్రేలియన్ స్లాంగ్ కంట్రీ రీజియన్స్ లో వేరుగా ఉంటుంది. వాళ్ళు పదాలు షార్ట్ కట్స్ లో ఉంటాయి. ఉదాహరణకు బ్రేక్ ఫాష్ట్ ని బ్రేక్కీ అని, ఆస్ట్రేలియన్స్ ని ఆసీ ఆసీ, ఫ్రెండ్ ని మేట్
అని అంటారు. ముందు ముందు మనం చాలా నేర్చుకుంటాంలే”

          ఇక ఫ్లైయిట్ లో ఇచ్చిన ఫుడ్ కూడా బ్రెడ్ సలాడ్ శాండ్ విచ్, వీట్ బిక్స్ అని సెర్వ్ చేయటంతో అలవాటు లేని ఆహారం అని విశాల ఎక్కువగా ఏమీ తినలేదు.

          విమానంలో స్క్రీన్ మీద ఆస్ట్రేలియా గురించి సమాచారం హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడసాగింది విశాల. విమానం దిగబోయే ముందు, ఎయిర్ హోస్టెస్ గూడ్స్ డిక్లరేషన్ ఫాం ఫిలప్ చేయమని ఇచ్చింది.

          ఆస్ట్రేలియాలో కొన్ని ప్రొడక్ట్స్, విత్తనాలు, హెర్బల్స్, ఖచ్చితంగా కస్టమ్స్ దగ్గిర డిక్లేర్ చేయాలి. క్వారంటైన్ నిబంధనలు ఇద్దరూ చదివి అన్నీ వివరాలు నింపారు.

          విష్ణు వచ్చే ముందు భారత దేశంలోనే ఆసీ డాలర్లు కొన్నాడు. ఆస్ట్రేలియా కరెన్సీ కోయిన్స్ ఐదు సెంట్స్, పది సెంట్స్, ఇరవై సెంట్స్, యాభై సెంట్స్, ఒక డాలర్, రెండు డాలర్లు నాణాలుగా ఐతే, $5, $10. $20, $50, $100 ప్లాస్టిక్ కరెన్సీ రూపంలో ఉంటాయి.

          భారతదేశంలో ముత్యాలలాగే, ఆస్ట్రేలియా ఓపల్స్ చాలా ప్రసిద్ధి అన్నమాట అని బ్రోచర్ లో చూసింది విశాల.

          ఆస్ట్రేలియాలో ఫ్లైయిట్ లాండ్ అవబోతోందని,లోకల్ టైమ్ ఉదయం ఆరు గంటలు అని పైలట్ అనౌన్స్ చేయటంతో విశాల తన వాచీ వంక చూసుకుంది.

          తన గడియారం ఇంకా భారతదేశంలో టైమ్ నాలుగున్నర గంటలు వెన్నక్కి
చూపెడుతోంది. విశాల తన వాచీని నాలుగున్నర గంటలు ముందుకి తిప్పింది.

          విష్ణు తన వాచీ సెట్ చేసుకుంటూ, “విశాలా! ఇక ఇప్పటి నుంచి మనం ముందుంటాము.”

          “ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారూ ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా, కంగారూ ముందుకు దుముకుతూ పరిగెడుతుంది కదా, అలాగే దేశ అభివృద్ధికూడా ఉండాలనేమో!”

          ఇద్దరూ కిటికీలోంచి చూస్తూండగా క్రింద సిడ్నీ తీరం సరిహద్దులు దీపపు కాంతు లలో మిరుమిట్లు గొలుపుతూ సుందరంగా కనించాయి.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.