పౌరాణిక గాథలు -8

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ

          భూ లోకంలో నిజం చెప్పేవాళ్ళల్లో హరిశ్చంద్ర మహారాజుని మించినవాళ్ళు లేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

          ఒకసారి స్వర్గంలో ఇంద్రుడు మహర్షులందరితో కలిసి సభ నిర్వహిస్తున్నాడు. మహర్షులందరూ ఇంద్రసభలో ఎవరి ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు.

          సభ జరుగుతుండగా ఎప్పుడూ నిజాన్నే పలికేవాడు ఎవరున్నారు? అనే విషయం మీద చర్చ వచ్చింది. దానికి వసిష్ఠ మహర్షి ‘హరిశ్చంద్రుడు’ అని సమాధానం చెప్పాడు.

          వెంటనే విశ్వామిత్ర మహర్షి కోపంగా లేచి హరిశ్చంద్రుడు కాదని గట్టిగా చెప్పాడు. ఆ విషయం మీద మహర్షులిద్దరు వాదించుకున్నారు.

          విశ్వామిత్ర మహర్షి పంతానికిపోయి తన పంతం నెగ్గించుకోవాలని అనుకున్నాడు.

          తను ఓడిపోతే తన తపస్సు వల్ల వచ్చిన ఫలితాన్ని సగం హరిశ్చంద్రుడికి ధార పోస్తానని వాగ్దానం చేశాడు విశ్వామిత్ర మహర్షి.

          తన పంతం నెగ్గించుకోడానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తున్నాడు. వసిష్ఠ మహర్షికి ఏ పంతమూ లేదు.

          ఎందుకంటే హరిశ్చంద్రుడు సత్యదీక్షా తత్పరుడని తెలుసు. అతడితో ఎవరూ అబద్ధం చెప్పించలేరని కూడా తెలుసు. అందుకే మౌనంగా ఉండి పోయాడు.

          ఇంద్రుడికి చెప్పి విశ్వామిత్ర మహర్షి సభ నుంచి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రమహర్షి ఇంద్రసభ నుంచి సరాసరి హరిశ్చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు.

          తను ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలని అనుకుంటున్నానని…ఏనుగు మీదకి ఎక్కి ఒక గవ్వని పైకి విసిరితే ఎంత ఎత్తుకి వెడుతుందో అంత ఎత్తుగల ధనరాశి కావాలని అడిగాడు.

          రాజు మహర్షి అడిగినంత ధనాన్ని ఇచ్చాడు. విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుడితో “రాజా! ఈ ధనాన్ని నీ దగ్గరే ఉంచు. నేను తరువాత వచ్చి తీసుకుని వెడాతాను” అని చెప్పాడు.

          హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మహర్షి కోరినట్టే ఆ ధనాన్ని తన దగ్గరే ఉంచుతానని చెప్పి విశ్వామిత్ర మహర్షిని తగిన విధంగా సత్కరించి పంపించాడు.

          విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తరువాత విశ్వామిత్ర మహర్షి కొన్ని క్రూర మృగాల్ని సృష్టించాడు. వాటి ద్వారా రాజుని తన దగ్గరకి రప్పించుకున్నాడు.

          మాతంగ కన్యల్ని సృష్టించి తమని పెళ్ళిచేసుకోమని వేధించమని చెప్పి రాజు దగ్గరికి పంపించాడు.

          ఆ కన్యలు రాజు దగ్గరకి వెళ్ళి తమని పెళ్ళి చేసుకోమని అడిగారు. అది ధర్మం కాదని చెప్పి రాజు వాళ్ళని పంపించేశాడు.

          దేనికీ లొంగని రాజుని చూసి విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చింది. ఒక ఉపాయం ఆలోచించాడు. రాజు దగ్గరికి వెళ్ళిఅతడి రాజ్యాన్ని మొత్తాన్ని దానంగా తీసేసుకున్నాడు.

          తరువాత అతణ్ని కుటుంబంతో సహా రాజ్యం నుంచి అడవులకి వెళ్ళగొట్టాడు. రాజు అడవులకి వెళ్ళిపోయాక అంతకు ముందు అతడి దగ్గర తను దాచుకున్న ధనాన్నికూడా ఇమ్మని అడిగాడు.

          ఆ ధనాన్ని తీసుకుని రమ్మని తన శిష్యుడు నక్షత్రకుణ్ని వాళ్ళవెంట పంపిం చాడు.

          నక్షత్రకుడు హరిశ్చంద్రుణ్ని అనేక విధాలుగా అవమానించి బాధలు పెట్టాడు. హరిశ్చంద్రుడి భార్యని అమ్మించాడు… కొడుకుని చంపించాడు. చివరికి రాజుని కూడా అమ్మేశాడు.

          చక్రవర్తి హరిశ్చంద్రుడు కాటికి కావలి వాడుగా ఉండే వాడి దగ్గర పనివాడుగా మిగిలాడు.

          నక్షత్రకుడు రాజుని అబద్ధం చెప్పమని అనేక విధాలుగా బాధిస్తూనే ఉన్నాడు. చివరికి రాజుతో అతడి భార్య మీద లేనిపోని నిందలు మోపి అతడితోనే చంపించాలని అనుకున్నాడు. అందుకు తగిన ఉపాయాన్ని ఆలోచించాడు.

          హరిశ్చంద్రుడు తన యజమాని ఆజ్ఞ పాలించడం కోసం తన భార్యని చంపడానికి కూడా సిద్ధమయ్యాడు.

          అంతలో విశ్వామిత్ర మహర్షి వచ్చి“ “రాజా! ఆగు. నీ భార్యని చంపకు. ఒక్క అబద్ధం చెప్పావంటే నీ కష్టాలన్నీ పోగొడతాను”” అన్నాడు.

          హరిశ్చంద్రుడు “స్వామీ! మీరు చెప్తున్నది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదని మహాత్ములైన మీరు అనడం నాకు నిజం గానే సంతోషాన్ని కలిగిస్తోంది.

          మీరు అంటున్నట్టు నేను ఒక్క అబద్ధమైనా చెప్పగలిగి ఉంటే నా కొడుకుని ఎందుకు చంపుకుంటాను… ఇప్పుడు నా భార్యని చంపడానికి ఎందుకు సిద్ధ పడతాను? అసలు ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవిస్తాను?

          అబద్ధం చెప్పలేను కనుకనే ఇన్ని బాధలు పడుతున్నాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి!”” అని చెప్పాడు.

          తిరిగి తనపని తను పూర్తిచెయ్యబోతుండగా హరిశ్చంద్రుడికి బ్రహ్మవిష్ణు మహేశ్వరు లు ప్రత్యక్షమయ్యారు.

          ““హరిశ్చంద్రా! నీ సత్యవ్రతానికి ఎంతో సంతోషంగా ఉంది. నీకు కావలసిన వరాలు కోరుకో”” అని చెప్పి అతడు అడిగిన వరాలు ఇచ్చి, అతడి కొడుకుని కూడా బ్రతికించి వెళ్ళిపోయారు త్రిమూర్తులు.

          విశ్వామిత్రుడు కూడా హరిశ్చంద్రుడి సత్యవ్రత దీక్షకి సంతోషించి ఇంతకు ముందు తను చెప్పినట్టు తన తపస్సు వల్ల కలిగిన ఫలితంలో సగభాగాన్ని హరిశ్చంద్రుడికి ధారపోసాడు. అతడి రాజ్యాన్ని అతడికి ఇచ్చి, మళ్ళీ అతణ్ని చక్రవర్తిని చేసి మంచి మనస్సుతో ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

          హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు అనుభవించినా అబద్ధం ఆడకుండా పట్టుదలతో సత్యాన్నే పలికి ఆదర్శంగా నిలబడ్డాడు. కనుకనే గాధిరాజు కొడుకు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి తపస్సు వల్ల వచ్చిన ఫలితంలో సగం ఫలాన్ని పొందగలిగాడు.

          త్రిమూర్తుల వరాలు కూడా సత్యదీక్ష వల్లే పొందగలిగాడు. అందువల్లే ఆయన మరణించి ఎంత కాలమయినా ఇప్పటికీ “సత్య హరిశ్చంద్రుడు” అని పిలవబడుతున్నా డు.

          కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పచ్చు అని పెద్దలు అన్నారు కదానని చీటికీ మాటికీ అబద్ధం చెప్పకూడదు.

          సత్యము అంటే ఇతరుల చేత చెప్పబడింది కాదు, విన్నది కాదు, చూసింది కాదు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడమే.

          ఉపనిషత్తులు కూడా ’సత్యమేవ జయతి నానృతం’ సత్యమే జయిస్తుంది, అబద్ధం కాదు అని చెప్తున్నాయి. అందుకని అందరూ మెచ్చే విధంగా నిజాన్నే మాట్లాడుదాం.

సత్య దీక్షని ప్రోత్సహిద్దాం!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.