బాబు మామయ్య అను శ్రీరమణ గారు- కొన్ని జ్ఞాపకాలు (శ్రీ రమణ గారి స్మృతిలో- )

 -రాంబాబు కొప్పర్తి

          మనలో ఎవ్వరం నన్నయను చూడలేదు, తిక్కనను చూడలేదు, మనకు పోతన శ్రీనాథుడు…..అందరూ తెలుసు….వందల ఏళ్ళక్రితం వారు గతించినా ఈ నాటికీ తెలుగు పాఠ్య పుస్తకాలు ” పద్య భాగాల్లో” వారి రచనలు ఉంచి పిల్లలకు తప్పనిసరిగా వారిని పరిచయం చేస్తున్నాము.

          మనలో కొంత మందిమి విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణ శాస్త్రి, ఆరుద్ర , తిలక్ శేషేంద్రలను చూసిన వారు ఉన్నారు.

          ఆ వరుసలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ, నండూరి రామోహనరావు బాపు, ముళ్ళపూడి…. వాళ్ళతో ఆత్మీయ అనుబంధం కలిగి మేము బాబు మామయ్య అనీ ప్రేమగా పిలుచుకునే శ్రీరమణ గారి గురించి లెక్కకు మించిన జ్ఞాపకాల నుంచి కొన్ని జ్ఞాపకాలు …..

          నేను పుట్టడమే Post Master గారి అబ్బాయిగా పుట్టాను. అందువల్ల అడ్రస్ ప్రాబ్లెమ్ రాలేదు.

          కానీ ఇప్పుడు అడ్రస్ కోల్పోయిన బాధ. 2019 దాకా ఒక మోస్తరు మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిన నేను ఆ తర్వాత నా పాత విజిటింగ్ కార్డు మార్చుకుని నా పేరు కింద కొప్పర్తి రాంబాబు …. 
(శ్రీరమణ గారి మేనల్లుడు ) అని C/O అడ్రస్ లాగా ట్యాగ్ లైన్ లాగా రాసుకుని చెప్పుకుని తిరగడం అలవాటు అయ్యింది.

          అనారోగ్యంతో గత రెండేళ్ళుగా ఆయన మంచం మీద ఉన్నా, ఇంటి దగ్గర వీల్ చైర్ లో కూర్చుని నేను ఫోన్ లో చెప్పే కబుర్లు వినే వారు. ఆ కబుర్లు అన్నీ ఒక రకంగా నేను ఆయనకు చెల్లించుకున్న బాకీ!

          అంతకు ముందు 40 ఏళ్ళు ఆధునిక తెలుగు సాహిత్యం , సాహితీ మూర్తులు, పత్రికా రంగం, సినిమా రంగం, మరీ ముఖ్యంగా బాపూ రమణల గురించి ఆయన ప్రతిసారీ గంటకు తక్కువ కాకుండా చెప్పిన అనేక గంటల కబుర్లు విన్నాను కాబట్టి ఫోన్ సంభాషణ ఆయన “అభిమాన విషయంగా” భావించే వాడిని.

తొలి జ్ఞాపకం :

నేను పదేళ్ళ వయస్సులో ఉండగా 1969 లో మా ఇంటికి లంబ్రెట్టా స్కూటర్ మీద ఇద్దరు అబ్బాయిలు రామ లక్ష్మణులు లాగా వచ్చారు. ఒకరు బాగా మంచి రంగు. ఇంకో ఆయన చామన చాయ.

          వాళ్ళిద్దరూ నాకు మావయ్యలు అవుతారు అని మా అమ్మా నాన్నా చెప్పారు.
అందులో మంచి రంగు ఉన్న ఆయన నాకేసి చూసి స్నేహంగా నవ్వాడు. నాకూ ఎందుకో ఆయన నవ్వులోని స్నేహ భావం నచ్చింది.

          ఆ రోజు తెలీదు, ఆ తర్వాత 60 ఏళ్ళకు post master గారి అబ్బాయిగా పుట్టిన నాకు ఆయన పేరే C/O అడ్రస్ అవుతుంది అని. ఆయనే మా బాబు మామయ్య ఉరఫ్ మిథునం శ్రీరమణ గారు.

          ఆయన్ని నేను ఎప్పుడూ పేరు పెట్టీ శ్రీ….గారూ చేర్చి పిలిచింది లేదు. కానీ ఆయన పేరు చెప్పుకోకుండా సాహిత్య లోకంలో మసిలింది లేదు.

          ఎక్కడ ఏ సాహిత్య సభకు వెళ్ళినా అక్కడి సాహిత్యాభిమానులు, రచయితలకు శ్రీరమణ గారి మేనల్లుడు గానే పరిచయం చేసుకునే వాడిని.

          2019 లో ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యాక అప్పటికి 50 ఏళ్ళ నుంచి ఆయనతో కొనసాగించిన సాహితీ బంధుత్వం ఒక్కసారిగా నాకు రోజు గడవడానికి , విశ్రాంత ఉద్యోగ జీవితం గడపడానికి ఆలంబన అయ్యింది.

          ఆంధ్రజ్యోతిలో చేరక ముందు ఆయన స్వగ్రామం వరహాపురంలో ఆయన జరిపే సన్మిత్ర సమావేశాలకు ముందుగా పిలిచేవారు. విజయవాడలో ఉండగా సాహిత్య సమావేశాలకు రమ్మని సమాచారం ఇచ్చేవారు.

          అట్లా 1978 లో ఒక ఆదివారం జరిగిన చలం సంస్మరణ సభకు వెళ్ళి ఆ రోజే Banking Service Recruitment Board పరీక్ష రాసి నేను బ్యాంక్ ఉద్యోగం తెచ్చుకున్నాను.
కాదు…కాదు ఆయన నేను పరీక్షకు వెళ్ళే ముందు దీవించిన దీవెన ఫలించి ఉద్యోగం వచ్చింది.

          నేను నలభై ఏళ్ళలో పది పన్నెండు ఊళ్ళలో ఉద్యోగం చేసి ఉంటాను.నేను ఉన్న ప్రతి ఊరూ ఆయన చూసినది , తెలిసినదే అయినా నేను అభిమానంగా రమ్మనడం ఆయన ప్రేమతో వచ్చి కేవలం ఒక్క రోజు తప్పితే మరొక రోజు మాతో గడిపి వెళ్ళేవారు.

          నేను ఒక దశాబ్ద కాలం మద్రాసులో ఉద్యోగం చెయ్యడం ఆయనకు బాగా సంతోషంగా ఉండేది. మద్రాసు వదలద్దు అనేవారు. అలాగే అక్కణ్ణించి విజయవాడ రావడం కూడా పర్లేదులే అన్నారు. ఎందుకంటే ఈ రెండు ఉళ్ళు ఆయన రెండు కళ్ళు అనుకునే వారు.

          మా ముగ్గురు అన్నదమ్ముల మా పిల్లల పెళ్ళిళ్ళకు దంపతులు ఇద్దరూ వచ్చి మమ్మల్ని పిల్లల్ని దీవించారు .

          నేను 2019 నుండి ఒక రెండేళ్ళు ఈనాడు FM రేడియో కోసం Book Mate అని ఒక ఆడియో కార్యక్రమం చేశాను. అంతకు ముందు నుంచి కొప్పర్తి కథావాహిని పేరుతో మంచి తెలుగు కథలు ఆడియో రూపంలో వాట్సప్ , you tube ద్వారా వినిపిస్తూ ఉన్నాను.
ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించి ఆయన రచనల్ని కొన్ని వినిపించడానికి అనుమతి ఇవ్వడంతో బాటు ఏది వినిపించదగినది చెప్తూ ఉండేవారు.

          కొన్ని కథలు సూచించారు. ఆయన సొంత లైబ్రరీలోని కథల పుస్తకాలు అన్ని నాకు ఇచ్చారు.

          ఆయన రచనల్లో ఇంచు మించు సగ భాగం నేను ఆడియోలు చేశాను…..

          ఆ విషయం ఆయన తన ఒక పుస్తకానికి ముందు మాటలో ప్రస్తావిస్తూ, ఆయన రచనలను నేను ” నోరు చేసుకుని వినిపిస్తున్నాను ” అనీ ఆయనకు అదనపు కీర్తి తెచ్చాను అనీ, నన్ను వర్ధిల్లమనీ దీవించారు.

          నేను ఆయనకు అదనపు కీర్తి తేవడం ఏమిటి ? … నా మొహం.

          మిథునం, బంగారు మురుగు కథల ద్వారా తెలుగు కథా లోకంలో శాశ్వత కీర్తి ప్రతిష్టలు పొంది, పేరడీ ప్రక్రియ ద్వారా తెలుగు సాహితీ మూర్తులను వారి రచనా శైలి మాత్రమే కాకుండా వారి స్వరూప స్వభావాలను కూడా కళ్ళ ముందు నిలిపిన మహా రచయిత , పత్రికా సంపాదకుడిగా , సినిమా రచయితగా తెలుగు సాహిత్య లోకంలో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆయనకు నేను అదనపు కీర్తి తేవడం ఏమిటి ? అని ఆలోచించాను.

          అదే మేనమామకు మేనల్లుడు మీది ప్రేమ అని తెలిసింది. ఆయన భుజాల మీది నుంచి తెలుగు సాహిత్య లోకాన్ని చూశాను.

          మా నాన్నగారికి ఆయన అప్పుడప్పుడూ రాసే ఉత్తరాల ద్వారా ఆయన కథా రచనకు వస్తువులు, ప్రేరణలు తెలుస్తూ ఉండేవి.

          మామయ్య రాసిన అన్ని కథలూ వేటికి అవే గొప్పవి. ఆయన కథల్లో ముఖ్యంగా ” బంగారు మురుగు” ” మిథునం” కథల్లోని వాక్యాలు ఆ తరువాతి కాలంలో అనేక పర్యాయా లు దినపత్రికల సంపాదకీయాలలో చోటుచేసుకోవడం గొప్ప విషయం.

          ఆయన బంగారు మురుగు కథ ఈ ఏడాది తొమ్మిదవ తరగతి ఉపవాచకంలో పాఠ్యాంశంగా చోటు చేసుకున్నది.

          ఆయన కథల్లో నాకు బాగా నచ్చిన కథ చివ్వరి చరణం.

          అది మంచి కథకుడు కావాలి అనుకున్న ప్రతి కథా రచయిత ఒకటికి పదిసార్లు చదవాల్సిన కథ.

          ధనలక్ష్మి మేనేజ్మెంట్ కోర్సు చదివే విద్యార్థులకు సిలబస్ గా ఉంచవలసిన కథ.

          రచనల్లో సామాజిక స్పృహ ఉండాలి అని ఘోషించే వారికి , తాను రాసిన బంగారు మురుగు మిథునం కథల్లోని అంశాన్ని , కాల మాన పరిస్థితుల్ని వివరిస్తూ సమకాలీన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కథ రాయాలి అనే నియమం తాను ఎప్పుడూ పెట్టుకో లేదు అనీ , గతకాలపు అనుభవాలు జ్ఞాపకాలు, నిత్యమైన సత్యమైన జీవితపు విలువలు తెలిసే విధంగా ( బోధించే విధంగా కాదు , నీతి సూత్రాల లాగా కాదు) మాత్రమే కథలు రాశాను అనీ , రికార్డు చెయ్యవలసిన చరిత్రను రికార్డు చెయ్యకపోతే ముందు తరాలకు పాత జీవితం తెలియదు అనీ అందుకే తన కథలు , “సాంఘిక శాస్త్ర సాహితీ వేత్తలు” కోరుకునే విధంగా ఉండవు అని నిర్మొహమాటంగా చెప్పారు.

          తాను, చూసినది, తనకు తెలిసినది మాత్రమే రాశాను అన్నారు.

          ఆయన రాసిన చివరి పెద్ద కథ “నాలుగో ఎకరం” పుస్తక రూపంలో వచ్చినపుడు కూడా ఇదే మాట చెప్పారు.

          తెలుగు నాట ఒకనాటి గ్రామీణ జీవితం , వ్యవసాయం ఏ విధంగా అర్బనైజేషన్ కబలింతకు గురి అయ్యాయి, డబ్బు ప్రలోభానికి మమతానురాగాలు బలి అయ్యాయి చెప్పిన కథ.

          మా బాబు మామయ్య రచనల్లోనే కాదు , మాటల్లో కూడా హాస్యము వ్యంగ్యమూ ఉట్టి పడుతూ ఉండేవి.

          ఒక సారి ఆయన్ను ఒక పెద్దాయన వాళ్ళ ఊరికి ఆహ్వానిస్తూ , సతీ సమేతంగా రమ్మని చెప్పారు….

          దానికి ఈయన సమాధానం….

          ” సతీ సహగమనం ఇప్పుడు సాధ్యం కాదులెండి” అనేశారు.

          1980 ల్లో ఆంధ్ర జ్యోతి ఆఫీస్ లో పనిచేసేప్పుడు లాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి. టెలిఫోన్ ఆపరేటర్ లేకపోతే ఫోన్ కాల్ ఒక విభాగం నుండి వేరొక విభాగానికి చక్రభ్రమణం చేసేదిట. అలా ఒకసారి పత్రికా ప్రకటనల విభాగం వారి కాల్ ఈయన తియ్యాల్సి వచ్చింది.

          ఫోన్ లో ఒక పల్లెటూరి ఆసామి,

          ” మా వాడోడు పొయ్యాడు ….మీ పేపర్లో ఏయ్యాల ఎంతవుద్ది ?”
అని అడిగాడు.

          ఈయన తన పని కాకపోయినా రేట్లు తెలుసు కనుక అంగుళానికి అయిదు రూపాయలు అని చెప్పారుట.

          దానికి ఆ పెద్ద మనిషి…
అబ్బో ఆడు ఆరడుగుల మనిషి , శానా అవుద్ది ఒద్దులెండి” అని ఫోన్ పెట్టేసాడుట.
ఇది నిజంగా జరిగిందా లేదా అన్న సంగతి అటుంచి ఆయన చెప్పే తీరుకి నవ్వు వచ్చేది. ఇలాంటివి కోకొల్లలు.

          ఆయన ప్రతి రచన మీదా తప్పనిసరిగా మా నాన్నగారి అభిప్రాయం కోరేవారు.

          టాగోర్ గీతాంజలికి మా నాన్నగారి తెలుగు అనువాదానికి ముందు మాట రాశారు.

          ఆ ముందు మాటకు ఆయన ఉంచిన పేరు ” మహాప్రసాదం”.

          అవును ఆయనతో రక్త సంబంధంతో కూడిన బంధుత్వం , సాహితీ లోకంలో విస్తృత పరిచయాలు ఉన్న ఆయన మేనల్లుడిని కావడం నాకూ మా కుటుంబానికి ఆ భగవంతు డు ఇచ్చిన ” మహా ప్రసాదం” .

*****

Please follow and like us:

One thought on “బాబు మామయ్య అను శ్రీరమణ గారు- కొన్ని జ్ఞాపకాలు (శ్రీ రమణ గారి స్మృతిలో- )”

Leave a Reply

Your email address will not be published.