సహకారం

-ఆదూరి హైమావతి 

          అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులుండేవి.. ఎవరిపాటికి అవి సుఖంగా జీవించేవి. ఒకరోజున గజరాజు విహారంగా నడుస్తూ ఉదయాన్నే సరస్సులో స్నానంచేసి రావాలని బయల్దేరింది. సరస్సుకు కొద్ది దూరంలో ఉండగానే తమరాజైన సింహం అరుపు వినిపించింది. ఆ అరుపు బాధగా కష్టంలో ఉన్నట్లు అనిపించి వడివడిగా
నడుస్తూ ఆ అరుపు వినిపిస్తున్నచోటికి వచ్చింది గజరాజు.

          అక్కడ తమ రాజైన సింహం ముళ్ళగుట్టల చాటున ఉన్న ఒక ఊబిలోకి మునిగి పోతూ అరుస్తున్నది, ‘కాపాడమన్నట్లు.’ చాలా జంతువులు దూరంగా గుమికూడి చూస్తున్నాయి తప్ప ఏమీ సాయంచేసే ప్రయత్నం చేయలేదు.

          గజరాజు వెంటనే సమీపానికి వెళ్ళి తన తొండాన్ని ఆ సింహం నడుముకు చుట్టి
తన శక్తినంతా కూడగట్టుకుని బయటికి లాగసాగింది. చాలా ప్రయత్నం మీద సింహాన్ని
ఊబి నుండీ బయటికిలాగి దూరంగా విసిరేసింది. సింహం స్పృహతప్పి పోయింది. వెంటనే ఏనుగు సరస్సుకేసి పరుగుతీసి తొండం నిండా నీరుపట్టి తెచ్చి ఆ సింహం మీద
చిలకరించింది. కొద్దిసేపటికి సింహం మెల్లిగా కళ్ళు తెరచి చూసింది. ఏనుగు మరోమారు సరస్సులోకి వెళ్ళి మరికొంత నీరుతెచ్చి సింహం ముఖాన చిలకరించింది, కొద్దిగా నోట్లో పోసింది. ఆ నీరుత్రాగి మృగరాజు కళ్ళుతెరచి మెల్లిగా లేచి కూర్చుంది.

          ఏనుగుకేసి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ ‘గజరాజా! నీదెంత మంచి మనసు! మీ జాతికి శతృవునైనా నన్ను కాపాడను ఏంతో శ్రమించావు, ఊబి నుండీ బయటికి లాగడమే కాక నీరుతెచ్చి పోసి నా ప్రాణం నిలిపావు. నీకెలా కృతజ్ఞత తెలపాలో తెలీడం లేదు. నీవు
పోసిన నీటి వలన నాకు తెలివివచ్చింది.’ అంది.

          దానికి ఏనుగు ‘మహారాజా! మీరు అడవికి రాజు. మీరు ఆరోగ్యంగా, హాయిగా ఉంటేనే
కదా మేము నిర్భయంగా ఉంటాము. మా అవ్వ మా చిన్నతనంలో చెప్పింది. ఎవరైనా
స్పృహకోల్పోతే నీరుచల్లాలనీ, నీటిలోని ఆక్సిజన్ వారికి తెలివి కలిగిస్తుందనీచెప్పింది. అప్పటి నుంచీ మేమంతా, మాకు భగవంతుడు ఇచ్చిన ఈ తొండంతో స్పృహకోల్పోయిన వారి మీద నీరుతెచ్చి చల్లుతాము. మా తొండాన్ని మా కోసమే కాక ఇతరుల సేవకూ వినియోగిస్తాము. మా బలాన్నీ మా కోసం మాత్రమే కాక ఇతరులకు సాయంచేయనూ వినియోగిస్తాము. అందువల్లే నా బలాన్నీ, తొండాన్నీ మా మహారాజును బయటికి లాగనూ, నీరుతెచ్చి చల్లనూ ఉపయోగించాను.’ అంది .

          సింహం, దూరంగా ఉన్న జంతువులకేసి చూస్తూ ‘మీరంతా చూస్తూ ఉన్నారు తప్ప
నాకేమీ సాయంచేయను ముందుకు రాలేదు. మీ బుధ్ధులు తెలిశాయి.’ అంది కాస్త కోపంగా.

          వెంటనే ఏనుగు ‘మహారాజా మీ సమీపానికి రానే అందరికీ భయం. దానికి తోడు మిమ్ము బయటికి లాగను వారివద్ద ఏ ఉపకరణమూ లేదుకదా! మీ అంత బలవంతుడిని బయటికి లాగను వారి బలం చాలదు. మీకు సాయం చేయలేకే కానీ మరో ఉద్దేశ్యం వాటికి ఉండి ఉండదు. మన అడవిలో వారే కదా మహారాజా! మీరు వారిని మాన్నించాలి.’ అంది.

          సింహం మెచ్చుకోలుగా ఏనుగును చూస్తూ ‘ఓ గజరాజమా! ఈ రోజు నుండీ మీ జాతికంతా మా రాజ్యంలో ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నాము. అంతేకాక మీ జాతిలో
ఎవ్వరినీ ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా, మీ ప్రాణాలకు హానికలిగించకుండా ఆజ్ఞ
జారి చేస్తున్నాము. స్వేఛ్ఛగా మీరు హాయిగా మా రాజ్యంలో జీవించండి.’ అంది
గంభీర స్వరంతో.

          ఏనుగు ‘మహారాజా! ఈ దుబ్బల చాటునున్న ఈ ఊబిని పూడ్చేయాలి వెంటనే. మన అడవిలో ఏ జంతువూ దీనిపాలబడి ప్రాణాలు కోల్పోకుండా మనం జాగ్రత్త వహించాలి. మీరు అనుమతిస్తే మేమంతా కలసి ఈ ఊబిని పూడ్చేస్తాము.’ అంది.

          సింహం అనుమతించగానే కోతులు, ఎలుగుబంట్లూ, ఏనుగులూ మిగతా జంతువు లన్నీ ఎవరికి చేతనైన రీతిలో వారు ఎండుకట్టెలు, రాతి బండలూ తెచ్చి ఆ ఊబి సమీపాన వేయసాగాయి,పెద్ద ఏనుగులు నాలుగు వైపులా నిల్చి వాటిని ఊబిలోకి తొండా లతో విసిరి వేయ సాగాయి. ఇలా చాలా రాళ్ళూ ఎండు కొమ్మలూ వేశాక గజరాజు మామిడి టెంకలనూ, వెలగ పండ్లనూ కూడా సేకరించి లోనికి విసిరేసింది. అవి మొలిచి పెద్ద మానులైతే ఆ ఊబివాటి వ్రేళ్ళతో నిండిపోయి ఎవ్వరికీ ఏ ఆపదాకలుగదని వాటి ఉద్దేశ్యం. కొంత మన్ను సేకరించి తెచ్చి ఆ గుంటలో వేసేసి. జాగ్రత్త కోసం దానిచుట్టూతా పెద్ద కొమ్మలను విరిచి పెట్టాయి. ఎవ్వరూ అక్కడికి పొరపాటున కూడా వెళ్ళే అవకాశం లేకుండా చేశాయి.

          మృగరాజు అంతాచూసి ‘సెహబాష్! గజరాజమా! ఈ అడవికి మీరే సేనాపతిగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుండి ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరే సహకరించాలి.’ అంది. జంతువులన్నీ సంతోషంగా జయజయధ్వానాలు చేశాయి.

          విన్నారా! మనమూ మనలో ఎవరికి ఏ ఆపద సంభవించినా, ఏ అవసరం వచ్చినా అడక్కుండానే సహాయం చేద్దామా!

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.