పేషంట్ చెప్పే కథలు – 18

కొత్తగాలి

ఆలూరి విజయలక్ష్మి

          “మీరు తల్లి కాబోతున్నారు” గర్భనిర్దారణ చేసింది శృతి. మెల్లగా ఎక్సామినేషన్ టేబల్ దిగివచ్చి శృతికి ఎదురుగా కూర్చుంది అమరేశ్వరి. శృతి ఊహించినట్లు ఆమె ముఖం సంతోషంతో విప్పారలేదు. అంత మంచి వార్తను విన్న ఉద్వేగంతో ‘థాంక్ యూ’ అనలేదు. శృతికి తెలిసినంత వరకు అమరేశ్వరి కొంచెం లేట్ గానే వివాహం చేసుకుంది. ఇన్నాళ్ళకు వివాహమయి తల్లి కాబోతుంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యే ఆడవాళ్ళనే చూసింది కానీ, ఇంత నిర్లిప్తంగా కూర్చునే వ్యక్తిని చూడడం ఇదే ప్రథమం. “ఆర్ యు నాట్ హ్యాపీ? తల్లి కాబోతున్నానన్న భావన మీకు సంతోషాన్ని కలిగించడం లేదా?’ ఉత్సుకంగా చూసింది శృతి. 

          “పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న దాన్ని, తల్లి కావడంలో పెద్ద విశేషమేముంది?” శృతి వంక వింతగా చూసింది అమర. ఆమె ప్రశ్నకు తొట్రుపడి గుక్క తిప్పుకోవడానికో నిమిషం పట్టింది శృతికి. 

          “వెల్” సర్దుకుంటూ చిన్నగా నవ్వి, ఆమె వివరాల్ని ఎంటినేటల్ కార్డు మీద వ్రాయసాగింది శృతి. 

          “డాక్టర్!” అమర పిలుపు విని తలెత్తింది శృతి. 

          “బ్లడ్ టెస్ట్స్ చెయ్యాల్సిన అవసరం లేదా?”

          “చెయ్యాలి. బ్లడ్ తీసుకుంటామిప్పుడు” అవసరమైన పరీక్షల్ని అడిగి చేయించుకోవాలని ఆలోచన కొంత మంది మహిళలకైనా వస్తున్నందుకు సంతోషపడింది శృతి. 

          “ఎందుకడుగుతున్నానంటే… మా వారికి పెళ్ళికి ముందు కొన్ని అలవాటులుండేవి. సుఖవ్యాధులు వున్నాయేమోనని నా అనుమానం. నాకాయన అలవాట్ల గురించి తెలిసి బ్లడ్ టెస్ట్స్ చేయించుకునేలోగానే పీరియడ్ మిస్ అయ్యాను. అలాంటి వ్యాధులేవైనా ఆయనకు ఉండి వుంటే నాకు, నా నుంచి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు అంతే ప్రమాదముంది కదా?” సూటిగా, ఎలాంటి సంకోచాలూ, నదురూ, బెదురూ లేకుండా తన సమస్యను శృతికి చెప్పింది అమర. అమర ధోరణి కొత్తగా ఉంది శృతికి. భయం భయంగా, గిల్టీగా, సగం దాచి సగం చెప్పే ఆడవారిని, అలాంటి తిరుగుబోతు భర్త లభించినందుకు క్రోధంతో మండిపడుతూ అతన్నీ, విధినీ తూర్పారపట్టే వారినీ చూసింది కానీ, పరిస్థితిని యింత  నిబ్బరంగా స్వీకరించే మహిళ తారసపడడం యిదే మొదటిసారి. 

          “మీరు చెప్పేది రైటే. ఇప్పుడు నేను చేయించబోయే పరీక్షలలో దానికి సబంధించినది కూడా ఉంటుంది” ఎంటినేటల్ కార్డు వ్రాయడం పూర్తిచేసి బ్లడ్ తీసుకుంది శృతి. ‘వాళ్ళంతట వాళ్ళు అడిగి చేయించుకోకపోతే మానే, కనీసం డాక్టర్లు చెప్పినప్పుడైనా నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఎన్నో గర్భస్రావాల్ని, మృత శిశు జననాల్ని నివారింపవచ్చు. శారీరక, మానసిక వికలాంగులు పుట్టకుండా జాగ్రత్త పడవచ్చు’ తన ధోరణిలో తాను ఆలోచిస్తూంది శృతి. 

          “ఒక్క అరగంట కూర్చోగలరా? రిపోర్ట్ చూసి మందులు వ్రాసిస్తాను” కేసు షీట్ అమర ముందుకు జరుపుతూ అడిగింది శృతి. 

          “కూర్చుంటాను” లేచి బయటకు వెళ్ళబొయింది అమర. 

          “ఒక్క నిమిషం కూర్చోండి… మీరేమీ అనుకోనంటే చిన్న ప్రశ్న.”

          “అడగండి” చిరునవ్వు విరిసిందామె అధరాల మీద. ఒక నిమిషం తటపటాయిస్తూ ఉండిపోయింది శృతి. 

          “మీ భర్త అలవాట్లు… ఈ విషయాన్ని మీరింత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు? మీకేమీ బాధలేదా?” ఈమె హృదయం సంతోషానికి, బాధకూ అతీతంగా మారిపోయిందా?! అంచేతే ఏ అనుభూతుల ఒత్తిడికి లొంగకుండా నిర్వికారంగా చెప్పగలుగుతుందా?- ఆమె ఏం జవాబిస్తుందోనని కుతూహలంగా ఎదురుచూస్తూంది శృతి.

          “ఇందులో బాధపడడానికేముంది?… ఇప్పుడు మా వారి వయసెంతో తెలుసా? ముప్పైయెనిమిది. ఆయన కుటుంబ బాధ్యతలు ఆయన్ని, నా పరిస్థితులు నన్ను పెళ్ళి చేసుకోకుండా ఆపాయి. బాధ్యతలు వేరు. శారీరకమైన ఉద్రేకాల్ని నిగ్రహించుకోవడం వేరు. ఇన్నేళ్ళోచ్చిన మగవాడు అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాడని ఆశించడం, ఒకవేళ అలా ఉండకపోతే నాకేదో అన్యాయం జరిగిపోయిందని రాద్ధాంతం చెయ్యడం వెర్రితనం కాదా?” ఆశ్చర్యపోయి వింటూందామె మాటల్ని శృతి… ఐతే, అలాంటి అలవాట్లు తప్పులేనివని ఈమె అభిప్రాయమా? లేక తప్పనిసరై సర్ధుకుపోతూ సమర్ధిస్తూందా? మనసులో ఎలాంటి నియమాలు, సిద్దాంతాల పట్ల ఆకర్షణ, నమ్మకం వున్నా నూటికి నూరుపాళ్ళు శీలం, పవిత్రతల మీద గొప్ప అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ మాట్లాడే వనితల్నే చూడడం వల్ల అమర నిర్భయత్వం ఆకర్షణీయంగా కనపడింది శృతికి. 

          “కానీ…” ఓకే క్షణం ఆగి తేరుకుని ప్రశ్నించబోయింది శృతి. 

          “మీరడగబోయేదేమిటో నాకు తెలుసు. నాకిలాంటి వ్యవహారాలుంటే నా భర్త యింత తేలిగ్గా తీసుంటాడా, యింత సహజంగా తీసుకుని నాతొ సరిగ్గా కాపురం చేస్తాడా అని కదూ? యిద్దరికీ సమానమైన న్యాయం ఉండాల్సిన పరిస్థితిలో అతనికంటే చదువులోనూ, సంపాదనలోనూ ఏ విధంగానూ తీసిపోని నేను యింత లొంగుబాటుగా ప్రవర్తించడం నా వ్యక్తిత్వానికి మచ్ఛకదా అని కదూ మీరు ప్రశ్నించేది?” ఆశ్చర్యంగా తన మనసులోని ప్రశ్నల్ని అమర నోటి వెంట వింటోంది శృతి. కానీ యింకా కొన్ని ప్రశ్నలుండిపోయాయి శృతి మనసులో. ఒకదానికొకటి సబంధంలేని ప్రశ్నలన్నీ కలిసి ఒక చిక్కుముడి తయారయింది. 

          “నేను ఉద్రేకాలు లేని మనిషిని కాదు. కానీ ఏవేవో ఇంహాబిషన్స్, ఈ సమాజం ఆడదానికి పెట్టిన అనేకమైన ఆంక్షలు, వ్యక్తిగా నాకున్న నమ్మకాలు నా ఉద్రేకాల్ని చంపేశాయి. కేవలం ఈ దేశంలో ఆడపిల్లగా, అదీ మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టి పెరగడం వల్లే నేనిలా ఉండగలిగాను. మగవాడిగా పుడితే అతనిలానే ప్రవర్తించడానికి ఎక్కువ అవకాశముందనిపిస్తుంది నాకు. అంటే – తప్పేదైనా ఉంటే అది అన్ని అవకాశాలూ, అధికారాలూ మగవాడికి కట్టబెట్టిన సంప్రదాయానికి కానీ, వ్యక్తిగా నా భర్త తప్పేంలేదనే నిర్ణయానికొచ్చాను.” ఏ మాత్రం ఆవేశం లేకుండా చెప్పసాగింది అమర. ఆమె సిద్దాంతాలు పూర్తిగా మింగుడు పడడంలేదు శృతికి. 

          “ఐతే యిదంతా మీకు సహజంగా కనిపిస్తూందా?” ఆమెతో చర్చ ఆసక్తికరంగా వుంది శృతికి. తరువాత చూడాల్సిన పేషెంట్స్ ఎవరూ లేకపోవడం వల్ల తీరిగ్గా కూడా వుంది. 

          “నాకెలా కనిపిస్తూందన్నది కాదు సమస్య. ఇప్పుడున్న పరిస్థితి యిది. ఈ పరిస్థితిలో ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా బ్రతుకులో తీపిని యెంత ఎక్కువ అనుభవించగలం అని ఆలోచిస్తున్నాను… జీవితం చాలా చిన్నది. అందులో దాదాపు సగభాగం గడిచిపోయింది. గడిచిపోయిన వాటి గురించి, యెంత ప్రయ్తత్నించీ తిరిగి సరిచేయలేని వాటి గురించి తలబ్రద్దలు కొట్టుకుంటూ తన జీవితంతోపాటు ఎదుటివాడి జీవితాన్ని కూడా నరకం చెయ్యడం మంచిది కాదనిపించింది… దంపతులకు కావలసింది వేర్వేరుగా గడిచిపోయిన గతంకాదు, ఒకటిగా నడుస్తున్న వర్తమానం, ఒకటిగా నడవాల్సిన భవిష్యత్తు… గతంతో రాజీ పడకపోవడం తెలివి తక్కువ, వర్తమానంతో రాజీపడిపోయి బ్రతకడం అసమర్థత” శృతి మనసులోని చిక్కుముడి మరింత జటిలం కాసాగింది. విలువలు, తప్పొప్పుల ప్రమాణాలు మారిపోతున్నాయి. అవి కొద్దో, గొప్పో ఆడ, మగా యిద్దరికీ వర్తిస్తున్నాయి. ఈ పరిస్థితిలో కొంత రాజీ, కొంత తిరుగుబాటు, కొంత కన్ఫ్యూషన్ తప్పవేమో! అమర వంక చూస్తున్న శృతిలో ఆలోచనల వలయాలు లేస్తున్నాయి.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.