పౌరాణిక గాథలు -9

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ఆరాధన – ధ్రువుడు కథ

          ధ్రువుడు ఒక గొప్ప చక్రవర్తికి కొడుకు. అయినా కూడా చక్రవర్తి కొడుకుకి ఉండవలసి నంత గొప్ప రాజభోగాలు అతడికి దక్కలేదు. ధ్రువుడు, అతడి తల్లి కూడా ఎన్నో కష్టాల్ని అనుభవించారు. అందుకు కారణం అతడి సవతి తల్లి.

          పూర్వం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలందరు అతడి పాలనలో సుఖంగా జీవించారు.

          అతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు ‘సునీతి’, రెండవ భార్య పేరు ‘సురుచి’. సునీతి కొడుకు ‘ధ్రువుడు’. సురిచి కొడుకు ‘ఉత్తముడు’.

          ఉత్తానపాదుడు అన్ని ధర్మాలూ తెలిసినవాడే అయినా మోహాన్ని మాత్రం జయించలేక పోయాడు. చిన్న భార్య సురుచి అంటే అతడికి ఎక్కువ ఇష్టం. పిల్లలిద్దరూ మాత్రం సంతోషంగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు.

          ఒకరోజు ఉత్తానపాదుడు సురుచి మందిరంలో ఉన్నాడు. ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. ఉత్తానపాదుడు అతణ్ని ఎత్తుకుని ముద్దాడుతున్నాడు.

          అదే సమయంలో ధ్రువుడు కూడా తండ్రి ఉన్న మందిరంలోకి వెళ్ళాడు. ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చోడం చూసి, అతడికి సంతోషంగా అనిపించింది. నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు.

          ఉత్తానపాదుడి పక్కనే నిలబడి ఉన్న సురుచి ధ్రువుడి ముఖం వైపు చూసింది. అతడి మనస్సులో ఉన్న కోరికని గ్రహించింది. వెంటనే అతడి చెయ్యి పట్టుకుని పక్కకి లాగింది. “ధ్రువా! ఆగు! నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావో నాకు అర్థమయింది.

          నీకు నీ తండ్రి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు. నీకు ఆ అర్హతే ఉంటే నువ్వు నా కడుపున పుట్టి ఉండేవాడివి. వెళ్ళి శ్రీహరికి పూజలు చేసుకో. అప్పుడైనా నీ కోరిక తీరుతుం దేమో!” అని హేళనగా మాట్లాడింది.

          ఉత్తానపాదుడు సురుచి మాటలు విని కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయాడు. చిన్నవాడైనా కూడా సవతి తల్లి మాటలు ధ్రువుణ్ని బాధ పెట్టాయి. పరాభవా న్ని సహించలేకపోయాడు.

          కళ్ళ నుంచి నీళ్ళు జలజలారాలాయి. సవతి తల్లి మాటల కంటే ఆమె అంటు న్నప్పుడు తండ్రి మౌనంగా ఉండడం అతణ్ని మరింత బాధపెట్టింది.

          వెక్కి వెక్కి ఏడుస్తూ ధ్రువుడు తల్లి సునీతి దగ్గరకి వెళ్ళాడు. సునీతి కొడుకుని దగ్గరకి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నెమ్మదిగా తల నిమురుతూ “నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది.

          తల్లి అలా ప్రేమగా అడగ్గానే ధ్రువుడి దుఃఖం ఇంకా పెరిగింది. వెక్కిళ్ళుపెడుతూనే సవతి తల్లి దగ్గర జరిగిందంతా తల్లికి చెప్పాడు. తన కొడుకు సవతి తల్లిచేత అవమానం పొందడం ఆమెకి కూడా బాధ కలిగించింది.

          కొంతసేపయ్యాక “నాయనా! బాధపడ్డం వల్ల ప్రయోజనం లేదు. లోకంలో ప్రతి మనిషి కర్మకి బద్ధుడై  ఉంటాడు. కర్మను అనుసరించే అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని కాదని నడిచే శక్తి ఎవరికీ ఉండదు.

          నిన్ను చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. నేను కూడ ఏమీ చెయ్యలేను. నీ తండ్రి నన్ను దాసి కంటే ఎక్కువ నీచంగా చూస్తున్నారు. నేను చాలా దురదృష్టవంతు రాల్ని. నా కడుపున పుట్టడం వల్ల నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయేమో.

          కుమారా! ఈ విషయం అలా ఉంచు. సురిచి చెప్పిన దాంట్లో అసత్యం ఏదీ లేదు. ఆమె చెప్పినట్టు నువ్వు శ్రీహరి పాదాల్ని ఆశ్రయించు. నీకు అంతా మంచే జరుగుతుంది.

          నీకు కావలసినవన్నీ భగవంతుడు ఇస్తాడు. నువ్వు భక్తితో సేవిస్తే గొప్పసింహాసనమే ఇవ్వచ్చు!” అంది అనునయంగా.

          తల్లి మాటలతో ధ్రువుడు దు:ఖాన్ని వదిలి పెట్టాడు. ధైర్యాన్ని పొందాడు. తను కూడా మహర్షులు చేసినట్టు తపస్సు చెయ్యాలని అనుకున్నాడు. తల్లి అనుమతి తీసుకుని అడవులకి బయలుదేరాడు.

          అడవిలో నడుస్తుంటే అతడికి నారద మహర్షి కనిపించాడు. నారదుడు ధ్రువుడి గురించి మొత్తం యోగదృష్టితో చూశాడు. ధ్రువుడికి నారదుడు ఎవరో తెలియదు.అయినా కూడా నారదుడి పాదాలకి నమస్కారం చేశాడు.

          నారదుడు ఎంతో సంతోషించి అతడి తలని ముద్దాడి “కుమారా! నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. నీ తండ్రి ఒక గొప్ప మహారాజు. మీ ఇల్లు లక్ష్మీ నిలయం. చిన్న చిన్న అవమానాలు జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కర్మని అనుసరించి జరుగుతాయి. తపస్సు చెయ్యడమంటే అంత తేలిక కాదు. శ్రీహరిని చూడాలని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినవాళ్ళు ఉన్నారు. నువ్వు చిన్నవాడివి, తిరిగి ఇంటికి వెళ్లిపో!” అని చెప్పాడు.

          నారదుడు ఎంత చెప్పినా ధ్రువుడు తన పట్టు విడవలేదు.

          “మహాత్మా! నేను రాజకుమారుణ్ని. పౌరుషాభిమానాలు నాకు పుట్టుకతోనే ఉంటాయి. దైవ చింతనకి వయస్సుతో పనిలేదు. దృఢమైన మనస్సుతో ప్రార్ధిస్తే భగవంతుడు పలుకుతాడు.

          నేను చిన్నవాణ్ని కనుక ఏ విధంగా తపస్సు చెయ్యాలో తెలియట్లేదు. మీరు నాకు ఉపదేశిస్తే ఆ విధంగా తపస్సు చేసుకుంటాను!”  అని నారదుణ్ని ప్రాధేయపడ్డాడు ధ్రువుడు.

          నారదుడు ధ్రువుడి మనస్సు ఇంక మారదని అర్ధం చేసుకున్నాడు. అతడి పట్టుదలకి సంతోషించాడు. “కుమారా! జరుగుతున్న వాటికి దేనికీ మనం కర్తలం కాదు. అంతా భగవంతుడి అధీనంలోనే ఉంటుంది. తపస్సు చెయ్యాలని నీకు సంకల్పం కలిగించినవాడు కూడా భగవంతుడే. లోకం మొత్తం శ్రీహరే నిండి ఉన్నాడు. తపస్సు చేసుకోవాలంటే అందుకు అనువైన ప్రదేశం ఉండాలి.

          యమునా తీరంలో మధువనం ఉంది. అది నీ తపస్సుకు తగిన ప్రదేశం. భగవంతుణ్ని సేవించడానికి కావలసిన పువ్వులు, ఆకలి తీర్చుకోడానికి పండ్లు, పరిశుద్ధ మైన నీళ్ళు కూడా దొరుకుతాయి. నువ్వు చిన్నవాడివి కనుక నీకు నియమ నిబంధనలు లేవు!” అని చెప్పాడు.

          ధ్రువుడికి ఇరవై ఏడు రోజులు దీక్షతో జపం చేసి వాసుదేవుణ్ని చూడగలిగే విధంగా వాసుదేవ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ధ్రువుడు మహర్షికి నమస్కరించి మధు వనం వైపు నడిచాడు.

          ధ్రువుడు నగరం వదిలేసి వెళ్ళాడని తెలుసుకున్న ఉత్తానపాదుడు చాలా బాధ పడ్డాడు. నిద్రాహారాలు మానేసి కృశించిపోయాడు. రాచకార్యాలన్నీ వదిలేశాడు. ధ్రువుడు ఏమయిపోయాడో అని మధనపడుతున్నాడు.

          ఒకరోజు నారదమహర్షి వచ్చి “మహారాజా! ధ్రువుడికి ఏమీ జరగదు. అతణ్ని భగవంతుడే రక్షిస్తాడు. త్వరలోనే తప్పకుండా తిరిగి వస్తాడు!” అని ధైర్యం చెప్పి వెళ్ళాడు.

          ధ్రువుడు మధువనం చేరుకున్నాడు. యమునా నదిలో స్నానం చేసి తపస్సులో మునిగిపోయాడు. కొన్ని రోజులు పండ్లు తిని, కొన్ని రోజులు నీళ్ళు మాత్రమే తాగి, మరి కొన్ని రోజులు ఆహారం నీరు కూడా లేకుండ కఠోర దీక్షతో తపస్సు చేస్తూ అయిదు నెలలు గడిపాడు.

          అతడి తపస్సుకు మెచ్చి శ్రీహరి గరుడవాహనం మీద మధువనానికి వచ్చాడు. ఆ సమయంలో ధ్రువుడు ఒక వేలి మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. అతడు కళ్ళు విప్పగానే శ్రీమన్నారాయణుడు కనిపించాడు.

          ఆ తేజస్సు చూసి భగవంతుడే తనకోసం వచ్చాడని సంతోషంతో ఆనందభాష్పా లతో అభిషేకిస్తూ ఆయన పాదాల మీద పడ్డాడు. చిన్నవాడైన ధ్రువుడికి శ్రీహరిని ఎలా స్తుతించాలో తెలియలేదు.

          శ్రీహరి తన చేత్తో ఆ బాలుడి తల నిమిరాడు. ధ్రువుడు దివ్యజ్ఞానాన్ని పొందాడు. అతడి ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగి పోతోంది. అపూర్వమైన తేజస్సుతో పాటు, అతడి శరీరానికి కాంతి, బలం కూడా కలిగాయి.

          ధ్రువుడు రెండు చేతులూ జోడించి “ “దేవా! సకల జీవులకి ఆధారమైన నువ్వు ఈ చిన్నవాణ్ని అనుగ్రహించడానికి వచ్చావు. లోకపాలన కోసం అనేక రూపాలు పొందు తావు. నారదుడు చెప్పిన విధంగా నిన్ను సేవించాను. నీ విశ్వరూపాన్ని చూడగాలిగాను. నా సవతి తల్లి మాటలకి బాధపడి నిన్ను సేవించాను. అందుకు నేను కృతార్ధుణ్న య్యాను. దయతో నన్ను అనుగ్రహించు”!” అని ప్రార్ధించాడు.

          ధ్రువుడి మాటలకి శ్రీహరి ఆనందంతో  “కుమారా! మహా యోగులకి కూడా కుదరనంత దృఢమైన భక్తితో నన్ను వశం చేసుకున్నావు. నువ్వు చేసినట్టు ఇంత గొప్ప తపస్సు ఎవరూ చెయ్యలేదు. నా అనుగ్రహంతో నువ్వు దివ్యమైన పదాన్ని పొందుతావు.

          అది ఇప్పుడు మాత్రం కాదు. ఇరవై ఆరు వేల సంవత్సరాల తరువాత ఇది నువ్వు పొందుతావు. ప్రళయకాలంలో కూడా నీ దివ్య పదానికి నాశనం ఉండదు.

          కొంతకాలం తరువాత నీ తండ్రి రాజ్యం వదిలి అడవులకి వెళ్లిపోతాడు. నీసోదరుడు ఉత్తముడు మరణిస్తాడు. నీ సవతి తల్లి సురుచి కూడ తన కొడుకు మీద బెంగతో మరణిస్తుంది.

          ధ్రువా! నువ్వు నాకు గొప్ప భక్తుడివి.

          నువ్వు రాజ్యపాలన చేసే సమయంలో క్రతువులు చెయ్యి. బ్రాహ్మణులను గౌరవించు. కావలసిన సౌఖ్యాలన్నీ అనుభవించాక ఎవ్వరూ పొందని దివ్యపదాన్ని పొందుతావు!” అని చెప్పి శ్రీహరి అంతర్థానం పొందాడు.

          ధ్రువుడు తన తల్లితండ్రుల దగ్గరికి బయలుదేరాడు. అతడు తిరిగి వస్తున్నాడని చారులు వచ్చి రాజు ఉత్తానపాదుడికి చెప్పారు. రాజు సంతోషంతో చారులకి ఎన్నో బహుమానాలిచ్చాడు. భార్యలతోను, మంత్రి, పురోహితులతోను ధ్రువుడికి ఎదురు వెళ్ళాడు.

          ఊరి చివరకి రాగానే ధ్రువుడు అందరూ తన కోసం రావడం చూసి సంతోషించాడు. ఉత్తానపాదుడు ధ్రువుణ్ని ఎత్తుకుని సంతోషంతో ముద్దుపెట్టుకున్నాడు. సునీతి అనందానికి అంతే లేదు. ధ్రువుడు తల్లులకి నమస్కరించి, తమ్ముణ్ని కౌగలించు కున్నాడు.

          ధ్రువుడి అపూర్వమైన తేజస్సుని చూసి సవతి తల్లి సురుచి పూర్వం తను అన్న మాటని మరిచిపోయి “హరి అనుగ్రహాన్ని పొందిన నీకు ఇంక ఏ ఆపదలూ రావు!” అని దీవించింది.

          ధ్రువుడు శ్రీహరిని ఆరాధించాడు. శ్రీహరి అనుగ్రహంతో విమానంలో గ్రహ మండలం, త్రిలోకాలు, సప్తముని మండలం దాటి మహోన్నతమైన దివ్యపదాన్ని పొందాడు. తనతో పాటు తల్లిని కూడ స్వర్గానికి విమానంలో తీసుకుని వెళ్ళాడు.

          సవతి తల్లి అవమానించినందుకు మొదట దు:ఖపడినా తల్లి చెప్పినట్టు భగవంతుణ్ని ఆశ్రయించి ధైర్యంతో అడవుల్లో నారద మహర్షి చెప్పినట్టు శ్రీహరిని సేవించి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. చిరంజీవిగా మిగిలాడు.

శ్రీహరిని ఆరాధించి ధ్రువుడు చేరిన దివ్యపదమే ధ్రువమండలం!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.