మధ్యతరగతి జీవనానికి ప్రతీక ‘పెంకుటిల్లు’

కొమ్మూరి వేణుగోపాలరావు నవల

-పారుపల్లి అజయ్ కుమార్

 

 

‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అని ఒక నానుడి వినే వుంటారు.

          అంటే మానవీయ సంబంధాలు, వాతావరణం, ఆహార పదార్థాల విషయాల్లో గతమే బాగుండేదని గొప్పగా చెప్పడానికి పెద్దలు ఈ మాటను ఉపయోగించేవారు.

          కథలకు కరువొచ్చిందో, వర్తమాన అంశాల పై పట్టుచిక్కడం లేదో తెలియదు కానీ, వర్తమానాన్ని కాదని గతం లోతుల్లోకి వెళ్ళి కథలను వెలికి తీస్తున్నారు నేటి మన సినిమా దర్శకులు.

          ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల్లో చాలా కథలు గతం నేపథ్యం కలిగినవే. రామ్‌చరణ్‌ కెరీర్‌లో భారీహిట్‌ చిత్రం ‘రంగస్థలం’, సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాలం 1980 ప్రాంతంలోనిదే.

          వెంకటేశ్‌ హీరోగా నటించిన నారప్ప సినిమా నేపథ్యం కూడా గతమే! ముప్పయ్‌, నలభై ఏండ్ల కిందటి పరిస్థితుల ఆధారంగా దీన్ని నిర్మించారు. దళితుల పై గ్రామపెద్దలు సాగించిన దమనకాండను హృద్యంగా తెరకెక్కించారు.

          పాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన ‘పుష్ప’ కథా కాలం 1990 ప్రాంతంలోనిదే. ఎర్ర చందనం మాఫియా నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది.

          కార్తి హీరోగా నటించిన ‘ఖాకీ’ సినిమా నేపథ్యం పాతికేండ్ల నాటిది.

          ఇటీవల విడుదలైన ‘విరాటపర్వం’ కూడా గతంలో జరిగిన వాస్తవ కథను కాస్త సినిమాటిక్‌గా తెరకెక్కించిందే.

          భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ‘కేజీఎఫ్‌’ నేపథ్యమూ గతమే.

          సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్‌’, వరుణ్‌తేజ్‌ ‘కంచె’, రానా ‘ఘాజీ’ ఇలా ఎన్నో సినిమాలు గతకాలాన్ని నమ్ముకొని తీసినవే. 

          కథా సమీక్ష లేదా నవలా సమీక్ష రాయకుండా ఈ సుత్తి సొద ఏమిటి అని విసుక్కుంటున్నారా?

          ప్రస్తుతం నేను కూడా వెనుకటి రోజుల్లో అంటే నేను కూడా పుట్టక ముందే ప్రభవించిన ఓ నవలా ఆణిముత్యం గురించి మీకు తెలియచేయటానికి సాహసం చేస్తున్నాను.

          ఇప్పటితరం వారికి అప్పటితరం నవలను పరిచయం చేయాలనే ఉత్సుకతతో ఇది రాస్తున్నాను.

నవల పేరు : పెంకుటిల్లు.

రచయిత పేరు : కొమ్మూరి
వేణుగోపాలరావు.

రచయిత పరిచయం :
1935 సెప్టెంబరు 4న జన్మించిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు సుప్రసిద్ధ తెలుగు నవలారచయిత మరియు కథా రచయిత.

          బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావంతో తెలుగులో నవలలు వ్రాయటం మొదలు పెట్టటం వలన అప్పట్లో ఈయనను “ఆంధ్రా శరత్” గా పిలిచేవారు.

          తరవాత్తరువాత శరత్ చంద్ర ప్రభావం నుండి బయటపడి తనదైన శైలిలో రచనలు చేసారు.

          సుమారు 50 పైగా నవలలు రాసారు.

          13 సంవత్సరాల వయసు నుండే కథలు రాయడం ప్రారంభించారు. వందలాది కథలు రచించారు.

          వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి.

          హౌస్‌ సర్జన్‌, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి, ఒకే రక్తం- ఒకే మనుషులు, గోరింటాకు, ఈ దేశంలో ఒకభాగం, ఆత్మజ్యోతి మొదలైనవి వీరి నవలల్లో కొన్ని.

          ‘పెంకుటిల్లు’ కొమ్మూరి వేణుగోపాలరావు 1956లో రాసిన సుప్రసిద్ధ నవల.

          1950 ల నాటి తెలుగు మధ్యతరగతి జీవనాన్ని నవలలో ప్రతిబింబించారు.

          కొమ్మూరి వేణుగోపాలరావు వృత్తిరీత్యా డాక్టరు. విజయవాడలో చాలా కాలం డాక్టరుగా పనిచేశారు.

          జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికత వైపు నడిచి ‘రేఖి’ అనే పుస్తకం రాశారు.
ఈయన 2004 అక్టోబరు 31న పరమపదించారు.

నవల సమీక్ష :
తెలుగు నవలా సాహిత్యంలో ప్రముఖమైన నవలల్లో ఒకటిగా పెంకుటిల్లు నవలను పేర్కొనవచ్చు.

          తెలుగు సాహితీ చరిత్రలో ఇదొక ప్రామాణికమైన నవల అని విమర్శకుల అభిప్రాయం. తెలుగు భాషాసమితి చేత ఉత్తమ నవలగా ఎంచుకోబడి, తెలుగులో వంద సంవత్సరాలలో వెలువడిన ఉత్తమ నవలల్లో ఒకటిగా గుర్తించబడిన అపూర్వమైన నవల పెంకుటిల్లు.

          ఇంటిపెద్ద, తన బాధ్యతను విస్మరిస్తే, ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకు కడుతుంది ఈ నవల.

          అన్నింటినీ మించి, కాలంతో పాటు మారుతూ వచ్చిన మధ్యతరగతి విలువల పరిణామక్రమానికి అక్షర రూపంగా పాఠక లోకంలో ‘పెంకుటిల్లు’ స్థానం ఎన్నటికీ పదిలంగానే వుంటుంది.

          బాగా డబ్బున్నవాళ్ళు పెద్ద పెద్ద మేడలలో వుంటారు. ఏమీ లేనివారు పూరిపాక లలో వుంటారు. ఉన్నవాళ్ళకి, లేనివాళ్ళకు మధ్యలో కొట్టుకులాడే మూడో వర్గమే మధ్య తరగతి వర్గం.

          కొన్నికొన్ని సంప్రదాయాల విషయాలలోనూ, విలువల విషయాలలోనూ పట్టింపులు ఎక్కువుగా పాటించే సగటు మనుషులు మధ్యతరగతిలో ఎక్కువుగా కనపడుతుంటారు.

          అటు వంటి అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబ కథ ఇది. కష్టాలకడలిలో మునుగుతూ, తేలుతూ నడిచే కథ.

          ఆ పెంకుటింటి యజమాని చిదంబర శాస్త్రి. అతని భార్య శారదాంబ. ముగ్గురు కొడుకులు నారాయణ, ప్రకాశరావు, వాసు.

          ముగ్గురు కూతుర్లు అన్నపూర్ణ, రాధ, ఛాయ.

          చిదంబంరం ముసలితల్లి వీరందరూ ఆ ఇంటి మనుషులు.

          చిదంబరానికి తాతల నుండి సంక్రమించిన రెండు ఎకరాల పొలం, ఓ పెంకుటిల్లు మాత్రం ఉన్నాయి.

          చిదంబరం ఏపనీ చేయడు. ఒకరి క్రింద పనిచేయడం ఇష్టం లేదంటాడు.వ్యాపారం చేసే తెలివిలేదు. కుటుంబం పట్ల బాధ్యతారాహిత్యం, సోమరితనం మూర్తీభవించిన చేతగాని చేవలేని మనిషికి నిలువెత్తు దర్పణం అతడు. స్నేహితులను పోగేసుకుని పేకాట ఆడుతుంటాడు రోజూ.

          అన్నపూర్ణకు పెళ్ళి అయింది. భర్త ముకుందరావు.

          నారాయణ చదువు ఆపేసి బాంక్ ఉద్యోగంలో చేరుతాడు. అతను తెచ్చే వంద రూపాయల జీతం, పొలం మీద వచ్చే కొద్దిపాటి ఆదాయం మీదనే ఇల్లు గడవాలి.

          నారాయణకు అప్పుడే పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేకపొయినా బామ్మ చావు బతుకుల్లో వుందని అందరూ కలసి పెళ్ళికి ఒప్పిస్తారు. సుగుణను పెళ్ళి చేసుకుంటాడు.
సుగుణ అతనికి అన్నివిధాలా తగిన భార్యగా అందరి మన్ననలు పొందుతుంది. ఇంటికి పెద్ద కొడుకుగా నారాయణ తన భాద్యతలను సాధ్యమైనంత వరకు నెరవేరుస్తుంటాడు.

          ప్రకాశరావు మదరాసులో లా చదువుతుంటాడు. అతనికి ఇంటి నుండి సరిపడా డబ్బులు సమయానికి రావు. కొంత మంది పిల్లలకు ట్యూషన్ చెపుతూ వాళ్ళిచ్చే అరాకొరా డబ్బులతో ఒకోపూట తినీతినక కాలం గడుపుతుంటాడు.

          అక్కడ మదరాసులో ప్రకాశరావు అద్దె కుండే ఇంటి యజమాని రామారావు కూతురు శకుంతల ప్రకాశరావుతో ప్రేమలో పడుతుంది. శకుంతల ధనవంతురాలు అన్న వెరపు,
కులం విషయంలో కొద్దిగా పట్టింపులు వున్న ప్రకాశరావు మొదట్లో ఆమెకు  దూరదూరం గానే వుంటాడు.

          పావలా డబ్బుల కోసం ప్రాకులాడి ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న వాసు కథ చదువుతుంటే అయ్యో పాపం అని హృదయం ద్రవిస్తుంది.

          రాధ పెద్దగా చదువుకోలేదు. కుటుంబం కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ, ఏం చెయ్యాలో తెలియని స్థితి. ఇంటి నుండి బయటకు అడుగు వేయలేని సాంప్రదాయా లు ఆమెకు అవరోధాలుగా నిలుస్తాయి. రాధ అందం ఆమెకు శత్రువులా మారుతుంది.
రాధను ప్రేమించి పెళ్ళికి వెనుకడుగు వేసిన పిరికి ప్రేమికుడు ఆనందరావు.

          అన్నపూర్ణ ఒక బిడ్డను కని కాన్పు కష్టమై చనిపోతుంది. చిదంబంరం తెచ్చిన అప్పు అతన్ని నేరస్థుడు అయ్యేలా చేసి జైలు పాలు చేస్తుంది.

          మదరాసులో శకుంతల తండ్రి చనిపోతాడు. శకుంతలకు ప్రకాశరావుతప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ క్రమంలో వారిద్దరు పెళ్ళి చేసుకుంటారు.

          రాధ స్నేహితరాలి భర్త శ్రీపతి ఒక మేకవన్నెపులి లాంటి వాడు. కుతంత్రంతో శ్రీపతి రాధ పై అత్యాచారం చేస్తాడు. రాధ చనిపోవాలని చెరువులో దూకుతుంది. బావ ముకుంద రావు రాధను రక్షిస్తాడు. ముకుందరావు ,రాధను పెళ్ళి చేసుకుంటాడు. ఈ సంగతులన్నీ విని ప్రకాశరావు, శకుంతలను తీసుకుని ఇంటికి వస్తాడు. నారాయణ వారిని ఆదరించి అక్కున చేర్చుకుంటాడు.

          కొంత కాలానికి జైలు నుండి విడుదలై వచ్చిన చిదంబంరం ఒక కిళ్ళీ కొట్టు అతని ద్వారా ఆ పెంకుటింట్లో అందరూ ఆనందంగా కలసిమెలసి జీవిస్తున్నారని విని, తన లాంటి సోమరులకు ఆ ఇంటిలో స్థానం లేదని ఎటో వెళ్ళిపోతాడు. స్థూలంగా ఇదీ కథ.

          ఈ నవల నా చిన్నతనంలోనే చదివాను. ఈ నవలలోని పాత్రలు నన్ను చాలా కాలం వెంటాడాయి. పెద్ద అయ్యాక ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.

          నవల చదువుతుంటే ఒక సినిమానో, డాక్యుమెంటరీనో చూసినట్లు అనిపిస్తుంది. సత్యజిత్ రే తీసిన సినిమాలా ప్రతీ సన్నివేశం నెమ్మదిగా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది.

          ప్రతీ సంఘటన, ప్రతీ సన్నివేశం మనింట్లోనో, పక్క ఇంట్లోనో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంటాయి.

          నారాయణ వ్యక్తిత్వం మనల్ని బాగా ఆకట్టుకొంటుంది. 1955 కాలం నాటి కథ ఇది అని గుర్తుంచుకొని చదివితే బాగా ఉంటుంది.

          నారాయణ కట్నం తీసుకుని పెళ్ళి చేసుకోలేదు. కట్నానికి వ్యతిరేకి. రాధ పై జరిగిన అత్యాచారానికి, నీ తప్పు లేకుందా జరిగినదానికి బాధపడటం అనవసరం అంటాడు. ఆసంగతి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదంటాడు.

          కులాంతర వివాహం చేసుకొని వచ్చిన తమ్ముడిని ఆదరిస్తాడు. ఆ రోజుల్లోనే రచయిత ఆ పాత్రను అంత ఆదర్శమూర్తిగా తీర్చిదిద్దాడు. రాధ పై జరిగిన అత్యాచారం విషయం తెలిసి కూడా మనఃపూర్తిగా రాధను అర్ధాంగిగా చేసుకుంటాడు ముకుందరావు.

          ప్రకాశరావు శకుంతలను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఆమెను పేదరాలిగానే రావాలంటాడు. శకుంతల కూడా తన ఆస్తిని ప్రజలకు ఉపకారంచేసే ఏవయినా సంస్థ లకు రాయాలని సంకల్పించుకుంటుంది. ఉదాత్తమైన పాత్రలు ఇవన్నీ.

          దాదాపు ఇరవై సంవత్సరాల వయసులోనే వేణుగోపాలరావు పెంకుటిల్లు నవల రాసాడు. అంత చిన్నవయసులోనే ఎంతో పరిపక్వతతో రాసిన నవల ఓ అద్భుతంలా చరిత్రలో మిగిలిపోయింది.

          ఆ కాలం నాటికి శరత్ బాబు బెంగాలీ నవలల ప్రభావం తెలుగునాట బలంగా ఉండేది. అందుకేనేమో రాధ, శకుంతల పాత్రల చిత్రణ కొంత మేరకు శరత్ చంద్ర నవలలలోని నాయికలను గుర్తుకు తెస్తుంది. వారి మాటలు, సంభాషణలు కూడా ఆ తరహాలోనే సాగాయి.

          రాధ ఒకచోట ఇలా అంటుంది. “మనుషులు, అంతా జరిగిపోయాక, ఇతరులను భంగపరిచాక అప్పుడు పశ్చాత్తాపం పడతారు.” నిజమే కదా యీ పలుకులు.

          “సుఖంగా వున్నప్పుడు బ్రతగ గలిగి, దుఃఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించటం ఎందుకు?” అన్నమాటలు మనల్ని ఆలోచింప చేస్తాయి.

          మానవ సంబంధాలు, విలువలకు ప్రాదాన్యతనిచ్చి రాయబడిన నవల ఇది. ఎన్నో పునర్ముద్రలను పొందింది.  ఎమెస్కో వారి ముద్రణలో వెనుక అట్ట వైపు రాసిన వాక్యాలు ఇవి.

‘మీ ముందున్నది మాములు నవల కాదు. తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారి నుండి సామాన్య పాఠకుని వరకూ ఉర్రూతలూగించిన నవల. తెలుగులో వంద  సంవత్సరాల నుండి వెలువడిన ఉత్తమ నవలల్లో ఇది ఒకటి. ప్రతి ఇంటా ఉండ వలసిన  అపురూపమైన నవల.’

          మరి ఇంకెందుకు ఆలస్యం! వెంటనే ఈ నవల చదవని వారు వెంటనే నవల కొని చదవండి.

మంచి పుస్తకాలను కొనండి.

పుస్తకాలను ఆదరించండి.

పుస్తకాలను చదవండి… చదివించండి…

 *****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.