జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-15

   -కల్లూరి భాస్కరం

          హరప్పా సీళ్లపై ఉన్న చిత్రాల ద్వారా లిపిని చదవడానికి ప్రయత్నించిన హ్రోజ్నీ, ఆ సీళ్లను దేవతలకు అంకితం చేసిన తాయెత్తు (amulet) లన్నాడు. వాటి పై ఉన్న దేవతలకు, పశ్చిమాసియాలోని దేవతలతో ఉన్న పోలికలను బట్టీ; హిట్టైట్ చిత్ర లిపి ఆధారంగానూ హరప్పా లిపిని గుర్తించడానికి కసరత్తు చేశాడు. ఆ క్రమంలో, విష్ణువు ని, శివుని, దుర్గను, ఇంద్రుని -హిట్టైట్ దేవతల ప్రతిరూపాలుగానూ; చంద్రుని, ఉషస్ ను, అప్సరస అయిన శకుంతలను- హురియన్ దేవతలు/అప్సరసల ప్రతిరూపాలుగానూ;  సూర్యుని మరో పేరైన మిత్రుని, సముద్రదేవుడైన వరుణుని -బాబిలోనియా దేవతలకు ప్రతిరూపాలుగానూ గుర్తించాడు.

          ఇదే సమయంలో, తను హరప్పా లిపిని పూర్తిగా పోల్చగలిగానని చెప్పడం లేదనీ, ఆయా పదాల వ్యుత్పత్తి విషయంలో కూడా పూర్తిగా ఒక నిర్ధారణకు రాలేదనీ ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. 

          కాకపోతే, పశ్చిమాసియా దేవీదేవతలకు, హరప్పా సీళ్ల పై కనిపించే దేవీదేవతలకు ఉన్న పోలికలను తోసిపుచ్చలేము. అవి పశ్చిమాసియా ప్రభావానికి నిదర్శనాలు. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే, ఇండో-యూరోపియన్, లేదా ప్రోటో-ఆర్యన్లతో, వారి మత సంస్కృతులతో హరప్పా నాగరికుల కంటే ముందు నుంచే పశ్చిమాసియా సంస్కృతు లకు సంబంధాలున్నాయి! ఆ మతసంస్కృతుల ప్రభావం పశ్చిమాసియా మీదుగా హరప్పా నాగరికుల మీద కూడా పడింది కనుక, హ్రోజ్నీ పోల్చుకున్నట్టు, ఇండో-యూరోపియన్, లేదా ప్రోటో-ఆర్యన్ దేవీదేవతలను పోలిన రూపాలు హరప్పా సీళ్ళ మీద ఉండడానికి ఎంతైనా అవకాశముంది. ఆ మేరకు హ్రోజ్నీ ప్రయత్నాన్ని గుర్తించాల్సి ఉంటుంది.

***

ఇప్పుడు తాజా జన్యుపరిశోధనలు ఏమంటున్నాయో చూద్దాం:

          మధ్యాసియాలోని నేటి తుర్క్ మెనిస్తాన్ లో గోనూర్ అనే ఒక పురావస్తు ప్రదేశం ఉంది. ఇది బ్యాక్ట్రియా-మార్జియానా పురావస్తు సముదాయం (BMAC) కిందికి వస్తుంది. క్రీపూ. 2250-1700 ప్రాంతానికి చెందిన ఈ పురావస్తు సముదాయాన్ని ఆక్సస్ నదీప్రాంత నాగరికతగా కూడా పిలుస్తారు. ‘అమూ దర్యా’ అని కూడా పిలిచే ఈ నది నేటి అఫ్ఘానిస్తాన్ లో ఉంది.

          గోనూర్ పేరులోని ‘ఊరు’ మన తెలుగు ఊరే. ఈ మాట అటు పశ్చిమాసియా నుంచి ఇటు దక్షిణాసియా వరకూ అదే అర్థంలో వ్యాపించి ఉంది.

          అలాగే, నేటి ఇరాన్ లోని ఆగ్నేయప్రాంతంలో షహర్-ఐ-సోఖ్తా అనే మరో పురావస్తు ప్రదేశం ఉంది. హరప్పానాగరికులకు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్న ప్రాంతా లలో గోనూర్, షహర్-ఐ-సోఖ్తా… రెండూ ఉన్నాయి. దాంతో హరప్పాకు చెందిన జనాలు కొందరు ఈ ప్రాంతాలకు వలస వచ్చారు. ‘దక్షిణ, మధ్య ఆసియాలలో జన్యుసంబంధ మైన అమరిక’ అనే పేరుతో 2018 మార్చిలో వెలువడిన DNA ఆధారిత అధ్యయన పత్రం (చూ. జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-12) వీరిని ‘సింధు సరిహద్దు (Indus Periphery)’ జనంగా నిర్వచించింది.

          ప్రాచీనకాలానికి చెందిన 612మంది తాలూకు DNA ఆధారంగా జరిగిన ఈ అధ్యయ నంలో భాగంగా, పైన చెప్పిన గోనూర్, షహర్-ఐ-సోఖ్తాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల DNAను విశ్లేషించారు. వీరిని క్రీ.పూ.3100-2200 మధ్య కాలంలో జీవించిన వారిగా నిర్థారించారు. అక్కడే లభించిన మరికొందరి DNA సమాచారానికి భిన్నంగా ఈ ముగ్గురి లోనూ 14 నుంచి 42 శాతం మేరకు ‘తొలి భారతీయు (First Indians)’ ల జన్యువారసత్వ మూ, ఏకంగా 58 నుంచి 86 శాతం మేరకు ఇరాన్ కు చెందిన వ్యవసాయజనాల జన్యు వారసత్వమూ కనిపించాయి. అప్పటి వరకూ హరప్పా నాగరికతా ప్రాంతం నుంచి ప్రాచీన DNA ను సేకరించని దృష్ట్యా, పై ముగ్గురి DNA సమాచారం ఎంతో విలువను సంతరించుకుంది. జన్యువారసత్వరీత్యా ఈ ముగ్గురినీ హరప్పా జనాలు మొత్తానికే ప్రతినిధులుగా భావించే అవకాశం ఏర్పడింది.

          అంటే, పశ్చిమాన ఇరాన్ కు చెందిన వ్యవసాయజనాలు, తూర్పున ఉన్న హరప్పా-సింధుప్రాంతానికి వలస వచ్చారన్నమాట! వీరిని ఇరాన్ లోని జగ్రోస్ పర్వత ప్రాంతాల నుంచి వచ్చినవారిగా గుర్తించారు. ఈ జగ్రోస్ ప్రాంతజనాలకు చెందిన ప్రాచీన DNA నుంచి పరిశోధకులు మరింత సమాచారాన్ని సేకరించారు. దానిప్రకారం, క్రీ.పూ. 7000ల నుంచి 8000ల సంవత్సరాల మధ్యకాలానికి చెందిన ఇక్కడి జనాల DNA, పశ్చిమ యూరేసియా జనాల జన్యువారసత్వానికి భిన్నంగా ఉంది. ఎలాగంటే, పశ్చిమ యూరేసియా జనాలలో ఉన్నట్టు వీరిలో అనటోలియా (నేటి టర్కీ) జన్యువారసత్వం లేదు. అనటోలియా జనాలు అటు పశ్చిమం వైపు, ఇటు తూర్పువైపు వ్యవసాయం విస్తరించడంలో ముఖ్యపాత్ర పోషించారు. కాకపోతే, తూర్పు వైపు వస్తున్నకొద్దీ ఆ విస్తరణ పలచబడుతూ వచ్చింది. జగ్రోస్ దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. జగ్రోస్ కు చెందిన వ్యవసాయజనాల్లో అనటోలియా జన్యువారసత్వం లోపించడానికి అదీ కారణం.

          క్రీ.పూ.3100-2200 ప్రాంతానికి చెందిన  గోనూర్, షహర్-ఐ-సోఖ్తా వ్యక్తులు ముగ్గురి లోనూ తొలి భారతీయులు, ఇరాన్(జగ్రోస్) వ్యవసాయజనాల జన్యువారసత్వం ఉండగా; పైన చెప్పిన బ్యాక్ట్రియా-మార్జియానా పురావస్తు సముదాయానికే చెందిన మరో 69 మంది ప్రాచీనులలో ఎక్కువ మంది DNAలో 60శాతం మేరకు ఇరాన్(జగ్రోస్) వ్యవసాయజనాల జన్యువారసత్వమూ, 21శాతం మేరకు అనటోలియా వ్యవసాయజనాల వారసత్వమూ, 13శాతం మేరకు పశ్చిమసైబీరియా సంబంధ జన్యువారసత్వమూ ఉన్నాయి. అంటే, వీరిలో గోనూర్, షహర్-ఐ-సోఖ్తాలకు చెందిన ముగ్గురు వ్యక్తులలో ఉన్నట్టే, హెచ్చు పరిమాణంలో ఉన్న ఇరాన్(జగ్రోస్) వ్యవసాయజనాల జన్యువారసత్వానికి అదనంగా అనటోలియా వ్యవసాయజనాల జన్యువారసత్వమూ, పశ్చిమసైబీరియా జన్యువారసత్వ మూ కూడా ఉన్నాయన్నమాట. గోనూర్, షహర్-ఐ-సోఖ్తా వ్యక్తులకూ, వీరికీ మధ్య 600 సంవత్సరాల అంతరం ఉంది.

          గోనూర్, షహర్-ఐ-సోఖ్తా వ్యక్తులలో తొలి భారతీయుల జన్యువారసత్వం చెప్పుకో దగిన మేరకు ఉండడంలో అర్థమేమిటి? అనటోలియా వ్యవసాయజనాల జన్యువారస త్వం తూర్పునకు వ్యాపించినకొద్దీ క్రమంగా పలచబడుతూ పూర్తిగా లోపించిన ప్రాంతం నుంచి వచ్చినవారి వారసులు ఈ ముగ్గురూ అన్నమాట! ఆ ప్రాంతమే హరప్పా నాగరికతాప్రాంతం. మొత్తంగా ఈ ప్రాచీన DNA విశ్లేషణ చెబుతున్నదేమిటంటే, క్రీ.పూ.3100-2200 మధ్యకాలానికి చెందిన హరప్పాజనంలో తొలిభారతీయుల (ఆఫ్రికా వలసదారుల వారసులు) జన్యువారసత్వమూ, ఇరాన్(జగ్రోస్) వ్యవసాయజనాల జన్యువారసత్వమూ-రెండూ ఉన్నాయి.

          అక్కడి నుంచి చాలా వెనక్కి, అంటే, క్రీ.పూ.7000-8000 సంవత్సరాల మధ్య కాలానికి వెడితే ఇరాన్(జగ్రోస్) వ్యవసాయజనాలకు తొలి భారతీయుల జన్యువారసత్వం ఉన్నట్టు ఆధారాలు లేవు. ఆ తర్వాతి కాలంలో తొలి భారతీయులలో ఇరాన్ (జగ్రోస్) వ్యవసాయజనాల జన్యువారసత్వం ఉండడాన్ని బట్టి వలసలు ఎటువైపు నుంచి ఎటు వైపు జరిగాయో స్పష్టంగా అర్థమవుతుంది.

          పశ్చిమాసియావైపు నుంచి హరప్పానాగరికతా ప్రాంతం వైపు వలసలు జరిగాయి. జన్యుసంబంధమైన ఈ ఆధారాలతోపాటు, ఇంతకు ముందు ప్రస్తావించుకున్న మత సాంస్కృతిక సంబంధమైన ఆధారాలు కూడా అదే చెబుతున్నాయి.

          ఇక్కడి నుంచి క్రీ.పూ. 1200-800 మధ్యకాలానికి వద్దాం. నేటి పాకిస్తాన్ లోని స్వాత్ వ్యాలీలో ఈ మధ్యకాలంలో జీవించిన 41 మంది ప్రాచీనుల DNAను విశ్లేషించారు. గోనూర్, షహర్-ఐ-సోఖ్తా వ్యక్తులలో కనిపించినట్టే వీరిలోనూ ఇరాన్ (జగ్రోస్) వ్యవసాయ జనాలకూ, తొలి భారతీయులకూ చెందిన జన్యువారసత్వం హెచ్చుమోతాదులో ఉంది. అదనంగా, కంచుయుగపు మధ్యకాలానికీ, ఆ తదుపరి కాలానికీ చెందిన స్టెప్పీజనాల జన్యువారసత్వం కూడా వీరిలో 22 శాతం మేరకు ఉంది. వీరికంటే దాదాపు రెండువేల ఏళ్ల క్రితానికి చెందిన గోనూర్, షహర్-ఐ-సోఖ్తా వ్యక్తులలో కానీ; వెయ్యేళ్ళ క్రితానికి చెందిన బ్యాక్ట్రియా-మార్జియానా పురావస్తు సముదాయానికి చెందిన వ్యక్తులలో కానీ స్టెప్పీ జన్యువారసత్వం లేకపోవడం ఇక్కడ గమనార్హం. అందుకు కారణం-వేరే కథ.

          ఏతావతా పై వివరాల ద్వారా తేలుతున్నదేమిటంటే, క్రీ.పూ. 3100-8000 మధ్య కాలానికే ఇరాన్ (జగ్రోస్) వ్యవసాయజనానికీ, తొలి భారతీయులకూ మధ్య గణనీయమైన స్థాయిలో మిశ్రమం జరిగింది. అందుబాటులో ఉన్న ప్రాచీన DNA ఆధారాలను బట్టి ఈ మిశ్రమం క్రీ.పూ. 4700-3000 మధ్యలో జరిగినట్టు శాస్త్రవేత్తలు ఖచ్చితమైన నిర్ధారణకు రాగలిగారు కానీ, క్రీ.పూ. 7000 సమీపకాలంలోనే మిశ్రమం జరగడానికీ అవకాశముంది. కాకపోతే, అందుకు సంబంధించిన ప్రాచీన DNA సాక్ష్యాలు ఇంకా శాస్త్రవేత్తలకు అంద లేదు.

          ఇరాన్ లోని జగ్రోస్ ప్రాంతం నుంచి హరప్పానాగరికతా ప్రాంతంవైపు వలస వచ్చిన వారు తమతోపాటు కొన్ని పశ్చిమాసియాభాషల్ని కూడా తీసుకొచ్చి ఉండాలి. అవి ఏవై ఉంటాయి?!

          ఆ దిశగా టోనీ జోఎఫ్ కొంత చర్చ చేశాడు. అప్పటికి పశ్చిమాసియాలో సుమేరియన్, ఈలమైట్, హట్టిక్, హురియన్, ఉరర్తియన్ భాషలు; సెమిటిక్ భాషలైన అక్కాడియన్, ఎబ్లైట్, ఎమొరైట్ లు; ఇండో-యూరోపియన్ భాషలైన హిట్టైట్, లువియన్ లు ప్రధానంగా ఉనికిలో ఉన్నాయి. ఇవన్నీ చిరకాలం క్రితమే అంతరించాయి. జగ్రోస్ పర్వత మధ్య, దక్షిణప్రాంతాలలోనూ; నేటి ఇరాన్ లోని ఖుజిస్తాన్ మైదానప్రాంతాలలోనూ, పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడీ- మధ్య మధ్య కొంత విరామంతో -ఈలమైట్లు బలమైన రాజ్యాలను స్థాపిస్తూవచ్చారు. వాటిలో క్రీ.పూ. 2700 సమీపంలో స్థాపించిన రాజ్యం మొదటిది. అయితే, అప్పటికి చాలా ముందునుంచే జగ్రోస్ నుంచి బెలూచిస్తాన్, దాని చుట్టుపక్కల గల మెహర్ గఢ్ మొదలైన చోట్లకు వలసలు మొదలయ్యాయి కనుక, ఆ వలసదారులు ప్రోటో-ఈలమైట్ భాషను మాట్లాడుతూ ఉండి ఉండాలి. వారు అప్పటికి పూర్తిస్థాయి వ్యవసాయదారులు కాకుండా, పశుపాలకదశలో ఉండి వ్యవసాయానికి అప్పుడప్పుడే అలవాటు పడుతూ ఉండవచ్చుకూడా.

          ఈ విధంగా జగ్రోస్ నుంచి దక్షిణాసియాకు వచ్చినవారిలో కొందరు ఇప్పటికీ పశుపాలకదశలోనే ఉండిపోయారు. బెలూచిస్తాన్ లోని బ్రాహూయీలు ఇందుకు ఉదాహరణ. వీరు మాట్లాడే బ్రాహూయీభాషకు ఈలమైట్ భాషతో చాలా దగ్గరి సంబంధం ఉంది.

మిగతా విశేషాలు తర్వాత…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.