వెనుతిరగని వెన్నెల(భాగం-51)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధించి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురయ్యి, పెళ్ళి ప్రపోజల్ తీసుకు వస్తాడు. తన్మయి ఒక ఏడాది గడువు పెట్టి, మధ్యలో కలుసుకోకూడదని నిబంధన పెడుతుంది.

***

          ఆదివారం ఉదయాన్నే తాయిబా “ఏం చేస్తురు మేడమ్?” అంటూ వచ్చింది.

          “రా తాయిబా” కూచో అంది తన్మయి.

          “బాబు ఈడ మంచిగ అలవాటు పడిండు. బాష మస్తు మాటాడుతుండు, మీ మాట గినుక గిసుంత మారనేలేదు” అంది నవ్వుతూ.

          తాయిబా ఎందుకో వచ్చి, ఏదో మాట్లాడుతూందని అర్థమైంది. 

          “చెప్పు తాయిబా” అంది స్టవ్వు మీద టీ పెడుతూ తన్మయి.

          వంటింటి గుమ్మానికి ఆనుకుని నిలబడి, ఏంలే మేడమ్, ఓ మాట చెప్త నీకు. నీ చెల్లె లెక్క అనుకో నన్ను” అంది నానుస్తూ.

          “సరే, చెప్పు మరి ” అంది నవ్వుతూ తన్మయి.

          “ఏంలే,  నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకో మేడం” అంది నెమ్మదిగా.

          తుళ్ళిపడింది తన్మయి. ‘ప్రభు ఒకట్రెండు సార్లు మొదట్లో రావడం చూసి ఇలా అంటుందా?’

          అదేవి పట్టించుకోకుండా “ఒంటరిగ  ఆడమనిసి ఉన్నదంటే ఎవరికైన లోకువే మేడమ్, మా యమ్మ మీద ఆన. ఆ బాదేవిటో నాకు గుడక తెలుసని చెపుతుంటిని. కాలేజీలో ఏమో గుసగుసలు పోతరు మీ గురించి, మీరు పెళ్ళి చేసుకుంటె అందరి నోళ్ళు  మూతపడతయ్యి ” అని తన్మయి ముఖంలోకి చూసింది.

          “కాలేజీలో తన గురించి గుసగుసలా?”  తన్మయికి మనసంతా బాధ అలుముకుంది. కానీ ఎవరా మాటలు అన్నారు? ఎందుకు అన్నారు? వంటి ఆరాలు తీసే కుసంస్కారం లేకపోవడం వల్ల “అనుకోనీ, నేనేవిటో నాకు తెల్సు. అయినా ఎవరి బాధలు వాళ్ళకి తప్ప మరొకరికి అర్థం కావు, అయినా నాకు ఇటువంటివి తెలుసుకునే ఆసక్తి లేదు తాయిబా” స్థిరంగా అంది తన్మయి.

          “అది పోని తియ్యి మేడం, పెళ్ళి సంగతి సూడు” అంది తాయిబా. 

          “ఏమో తాయిబా, అందరికీ అన్నీ కలిసివస్తాయంటావా?” అని నిట్టూర్చింది తన్మయి.

          “కుదుర్సు కోవాలె ప్రయత్నం సేయాలె” అంటూ “మా ఊర్ల ఒకాయన ఉండిండు. నేను అన్న అని పిలుస్త. నెలనాడు ఈడికి  వొచ్చి పొయ్యిండు. మొన్న దాక మిలటరీలో పనిచేసి అచ్చిండు. నిన్ను చూసింది మొదలు పెళ్ళికి అడుగుమని నా దిమాఖ్ తింటుండు. మీ కులమే, డబ్బు మస్తు ఉన్నది ఆడికాడ. నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే ఈ ఊర్ల బిజినెస్ పెట్టుకుని, ఈడనే సెటిల్ అయితనంటుండు” అంది గబగబా తాయిబా.  

          తన్మయికి అనుకోకుండా బాగా నవ్వొచ్చింది. “తాయిబా తనకు సంబంధాలు చూస్తుందన్నమాట. అతనెవరో తను కనీసం అబ్జర్వ్ కూడా చెయ్యలేదు. ఎవరో తనని చూసి ఇష్టపడడం ఏవిటీ, ఇలా రాయబారం పంపడం ఏవిటి”

          తన్మయి నవ్వడం చూసి  “ఏం మేడం నడుస్తదా” అంది తాయిబా ఆసక్తిగా ముందుకు వంగి.  

          తన్మయి తల అడ్డంగా ఊపుతూ “ఉహూ, హఠాత్తుగా నువ్వు ఎవరి గురించో చెప్పే సరికి నవ్వొచ్చింది”  అని ఏదో అనే లోపల 

          “నువ్వు గుడక నచ్చుకుంటే ఇప్పుడే ఫోను చేస్త, రేపీ పాటికి మాట్లాడుకోనికి వస్తరు” అంది తాయిబా.

          తన్మయి దీర్ఘంగా నిట్టూర్చి, “లేదు తాయిబా. పెళ్ళి అనేది అంత సులభం కాదు. నాతో సహజీవనం చేసే వ్యక్తి  ముందు నా మనస్సుతో సహజీవనం చెయ్యాలి. బొత్తిగా పరిచయం లేని వ్యక్తిని నా పక్కన ఉహించుకోలేను. నా మనస్తత్వం అందుకు సరి పడదు” అంది. 

          “అదేమంత పని, ఓ సారి మాటాడరాదు మేడం, పెళ్ళి జరంత సోచాయించు కున్నాక పెట్టుకుంటాననీ, ముందు దోస్తానా చేస్తననీ చెప్పు, ” అంది తేలిగ్గా. 

          “ఉహూ, నా వల్ల కాదు తాయిబా. ఇలా తొందరపాటు పెళ్ళి చేసుకుని, మళ్ళీ ఒక పోరాటం చేసే ఓపిక లేదు నాకు” అంది స్థిరంగా.

          అప్పుడే వచ్చిన బాబుని ముద్దాడుతూ “గీ పిల్లోన్ని సూడు మేడం, గెంత ముద్దుకొడు తుండో, వీనికోసమైనా నువ్వు జరంత సోచాయించాలె” అంది లేస్తూ.

          బాబు వైపు చూసింది తన్మయి. లోకమెరుగని అయిదేళ్ళ పసివాడు. దగ్గిరికి తీసుకుని తల నిమిరింది. తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే వీణ్ణి ఆ వచ్చేవాడు సరిగా చూడక పోతే! 

          నిజానికి ప్రభు అయినా తన భర్తలా వీడి బాగోగులు చూడగలడేమో కానీ, తండ్రి కాగలడా? 

          బాబు ప్రస్తావన వచ్చినపుడు చాలా తేలిగ్గా, “నాకు సంబంధించినంత వరకు వీడు నీ శరీరంలో భాగం” అన్నాడు. అంటే వేరుగా చూడడనే అర్థం అని అనుకోవాలని సిద్దార్థ అన్నాడు.  

          తన్మయి ఆలోచనలో పడింది. ఇదేవీ పట్టని బాబు గలగలా కబుర్లు చెప్పసాగేడు. 

***

          తాయిబా వెళ్ళగానే ప్రభుకి ఉత్తరం రాయడం మొదలు పెట్టింది.

          అసలు ప్రభుకి వాళ్ళ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారన్న విషయం సిద్ధూచెప్పిన దగ్గర్నుంచీ అన్యమనస్కంగా ఉంది తన్మయి. 

          ఇప్పుడు తాయిబా పెళ్ళి సంబంధం మాటలు విన్నాక ప్రభుకి వాళ్ళ వాళ్ళు పెళ్ళి  సంబంధాలు చూస్తూండడంలో తను బాధ పడాల్సింది ఏదీ లేదనిపించసాగింది.

          వయసొచ్చేక అనేక మంది పెళ్ళి సంబంధాలు తీసుకు వస్తారు. ఇందులో ప్రభు తప్పేం ఉంది? ప్రభు అటువంటి వాటికి విలువ ఇవ్వనపుడు తనతో అసలు ఈ ప్రసక్తి తీసుకు రావల్సిన అవసరం ఏవుంది? తన పిచ్చి గానీ ప్రభు ప్రేమను శంకించి దు:ఖ పడడం ఏవిటి? కల్మషం లేని వ్యక్తి మీద నమ్మకం రెట్టింపు అవ్వాల్సింది పోయి, అనవసరమైన అపోహలు పెంచుకుంటూంది తను. 

          కాకపోతే అతను తనకి తెలియకుండా కొన్ని విషయాలు దాస్తున్నాడన్నదే ఎందుకో భరించలేకపోతూంది. 

          అదే అంది సిద్దార్థతో మర్నాడు. 

          “ప్రేమ బంధం పెంచుకునే కొలదీ స్వార్థం ఇలాగే ముంచుకొస్తుంది. ప్రేమించిన వ్యక్తి పూర్తిగా తనకే స్వంత కావాలన్న ఆకాంక్ష పెరిగిపోతుంది. ఇలాంటి స్వార్థపు ఆలోచనే విభేదాలకు అంకురార్పణ అవుతుంది” అన్నాడు సిద్దార్థ.

          తన్మయి ప్రశ్న పూర్వకంగా చూసింది అతని వైపు. 

          “ప్రేమించడం అంటే ఏవిటి? ఒక్కసారి ఆలోచించండి తన్మయీ” అన్నాడు సాలోచనగా.

          “ఒకరితో ఒకరు కలిసి కాలమంతా హాయిగా గడపాలనుకోవడం” అంది నెమ్మదిగా తన్మయి.

          “ప్రేమగా జీవిస్తే ఎటువంటి జీవితం కోరుకుంటున్నారని నేను అడగడం లేదు, ఒక్క సారి ఆలోచించండి, ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకోవడాన్ని మించిన గొప్ప ప్రేమ ఉందా” అన్నాడు మళ్ళీ.

          సిద్దార్థ కళ్ళల్లో వివేకానందా పాఠశాలలో యోగ సాధన వల్ల, జ్ఞానసముపార్జన వల్ల కలిగిన తేజస్సుతో మురళి సాక్షాత్కారమయ్యేడు.

          తన్మయి ఒక్క క్షణం కళ్ళు నులుముకుంది.

          సిద్దార్థ కొంచెం గొంతు సవరించుకుని “ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే మనం ప్రేమించే వ్యక్తిని హాయిగా, తనకి నచ్చినట్లు స్వేచ్ఛగా ఉండనివ్వడం” అన్నమాట అన్నాడు.

          అక్షరాలా నిజం. కానీ అంత గొప్ప మనసు అందరికీ ఉంటుందా? అదే అడిగింది సిద్దార్థని.

          “మంచి ప్రశ్న. గొప్ప మనసు అయితేనే నిజమైన ప్రేమ అవుతుంది” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

          ఒక్కోసారి సిద్దార్థ మాట్లాడుతున్నపుడు జ్ఞానోదయం అయినట్లు అనిపిస్తూ ఉంటూంది.

          ఇవన్నీ తనకి తెలిసినవే అయినా ఆ సమయానికి సరిగ్గా ఆలోచించలేక పోతుంది ఒక్కోసారి.

          “థాంక్యు సిద్ధూ!” అంది ప్రశంసా పూర్వకంగా.

          బదులుగా “ఆల్ ది బెస్ట్” అని తర్వాతి క్లాసుకి బయలుదేరేడు సిద్దార్థ.

***

          ఆ రోజు ఉదయం లేచిన దగ్గర్నించీ కడుపులో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది తన్మయికి.

          నొప్పి మాత్ర ఒకటి వేసుకుని కాలేజీకి బయలుదేరింది.

          సగం దూరం కూడా వెళ్ళక ముందే మళ్ళీ నొప్పి ముంచుకు వచ్చింది. 

          తన్మయికి ప్రకృతి సహజ వైద్యాలంటే ఇష్టం. 

          తప్పనిసరయితే తప్ప మాత్రలు వేసుకునే అలవాటు లేదు.

          “ఎందుకింకా నొప్పొస్తూంది? మాత్ర పనిచెయ్యడం లేదా?” ఆలోచనలో ఉండగానే  హాస్పిటల్ సందు వచ్చింది.

          దాటబోతూ ఉండగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించసాగింది.

          తనకేదో కాబోతూందని వెంటనే అర్థమై హాస్పిటల్ వైపు బండిని తిప్పింది.

          కౌంటరులో తన్మయిని చూస్తూనే “అంతా మంచిగనె ఉన్నదా మేడం” అంది రిసెప్షనిస్టు.

          తన్మయి ఏదో చెప్పబోతూ ఉండగానే నొప్పి తీవ్రం కావడంతో కడుపు పట్టుకుని పక్కనే కుర్చీలో కూలబడింది.

          ఒక్క ఉదుటున లోపలి రూములోకి తీసుకెళ్ళేరు.

          లేడీ డాక్టరు పొత్తి కడుపు మీద అక్కడక్కడా నొక్కి పరీక్ష చేసింది. 

          “వెంటనే స్కానింగు చెయ్యాలి” అంది మరు నిమిషంలో డాక్టరు నొప్పి తీవ్రత ఎడమవైపని అర్థం కాగానే.

          స్కానింగుకి ఎక్కడికి వెళ్ళమంటారు? అంది బాధ పడ్తూనే తన్మయి.

          “మీరెక్కడికీ వెళ్ళనవసరం లేదు ఇక్కడే నేనే చేస్తాను. డోంట్ వర్రీ” అంది డాక్టర్. 

          తన్మయి నొప్పిని అదిమి పెడుతూనే వాచీ చూసుకుంటూ” నేనెంతసేపట్లో  వెళ్లొచ్చు డాక్టర్? కాలేజీకి టైం అవుతూంది” అంది.

          డాక్టర్ స్కానింగు పూర్తి చేసి గ్లోవ్స్ విప్పుతూ “ఎడమ పక్క ఓవరీ ఇన్ ఫెక్ట్ అయ్యింది. మీరు వెంటనే ఎడ్మిట్ కండి. సర్జరీ చెయ్యాలి” అంది డాక్టర్.

          “సర్జరీనా?” ఒక్కసారిగా ఉలిక్కి పడింది తన్మయి. 

          “అదీ వెంటనేనా? తల్లిదండ్రులిద్దరూ యాత్రల కెళ్ళేరు. తను ఆసుపత్రిలో ఉంటే బాబునెవరు చూస్తారు? సర్జరీ తర్వాత తనకెవరు సాయం చేస్తారు? ఇవన్నీ సరే, సర్జరీ సక్సెస్ కాక తనకేవైనా అయితే బాబు సంగతి ఏవిటి?” ఒక్కసారిగా అన్ని ఆలోచనలూ చుట్టుముట్టి వెన్నులో నుంచి వొణుకు పుట్టుకొచ్చింది. 

          అదే అడిగింది డాక్టరుని. 

          బదులుగా చిరునవ్వు నవ్వి, “మీరేం కంగారుపడకండి, ఆపరేషనుకి సిటీ నుంచి మంచి పేరున్న సర్జను వస్తారు. ఆపరేషను అయ్యేక నాలుగైదు రోజుల్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు, తేలికపాటి పనులు చక్కగా చేసుకోవచ్చు” అంది.

          అయినా “డాక్టర్, రేపు వచ్చి అడ్మిట్ అవుతాను, ఇవేళ్టికి నొప్పి తగ్గడానికి టేబ్లెట్లు రాసివ్వండి” అంది తన్మయి లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ.

          “సిస్ట్ బాగా ఎన్ లార్జి అయ్యింది, చిన్న కుదుపుకి కూడా అది పగిలిపోవచ్చు. అదే జరిగితే మీ ప్రాణానికే ప్రమాదం వస్తుంది. జాగ్రత్త మరి. ఇప్పటికైతే ఇంజక్షను, టేబ్లెట్స్ ఇస్తున్నాను.” అంది డాక్టర్.

          డాక్టరు ఎదురుగా తలూపినా, బయటకు వెంటనే వెళ్ళే ఓపిక లేక రిసెప్షనులో ఓ మూల కుర్చీలో కూలబడింది. 

          తనకి ప్రాణాంతకమైన పరిస్థితా? డాక్టరు ఏమీ కాదని చెప్పినా తన్మయికి వొణుకు అధికం కాసాగింది. ముద్దులొలికే బాబు ముఖం ఎదురుగా కదలాడసాగింది. తను లేకపోతే వాణ్ణెవరు చూస్తారు? బాబు పుట్టినపుడు తనకి డెలివరీ అత్యంత కష్టమై, డాక్టరు ఏదో ఒక్క ప్రాణాన్నే కాపాడగలనని చెప్పినపుడు భగవంతుణ్ణి తన ప్రాణం తీసుకుని, బాబుని బ్రతికించమని వేడుకుంది. కానీ ఇప్పుడు వాడు బతకాలంటే తనూ ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితి. కళ్ళు మూసుకుని “భగవంతుడా! వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకూ నన్ను బతికించి ఉంచు” అని దీనంగా వేడుకోసాగింది. 

          “తన్మయీ!” గాభరాగా సిద్దార్థ గొంతు వినబడడంతో పక్కకి చూసింది.

          తన్మయికి దు:ఖం తన్నుకొచ్చింది.

          “సిద్ధూ!” అంది గానీ, గొంతు పెగిలి రాలేదు.

          అతికష్టమ్మీద “మీరు.. ఇక్కడ…” అంది.

          కాలేజీలో పిల్లలెవరో మిమ్మల్ని హాస్పిటల్ కు వెళ్తూండగా చూసేమని చెప్పేరు.

          ఉదయం ఇంటి నుంచి మామూలుగానే బయలుదేరి వచ్చారని తాయిబా చెప్పింది.

          లంచ్ టైము అయిపోతున్నా మీరు రాకపోయేసరికి కంగారుపడి వచ్చాను “ఆర్యూ ఆల్ రైట్? ఏమైంది?” అన్నాడు.

          అతికష్టమ్మీద గొంతు పెగుల్చుకుని, తన్మయి చెప్పింది విని,

          “ఏమీ భయపడకండి, ముందు ధైర్యంగా ఉండండి మీకేం కాదు” అన్నాడు.

          తన్మయి మాట్లాడకుండా బేలగా తలూపింది.

          “ఎలా? తనకేమైనా అయితే ఎలా?” ఎంత వొద్దనుకున్నా అదే ఆలోచన.

          ఇప్పుడే వొస్తానుండండి అంటూ లేచెళ్ళి డాక్టరుతో మాట్లాడేడు సిద్దార్థ. 

          పది నిమిషాల్లో వచ్చి, “నా మాట విని ఇప్పుడే జాయినవ్వండి. నే వెళ్ళి తాయిబాను తీసుకొస్తాను.

          బాబు గురించి ఏమీ దిగులు పడొద్దు. మీరు కోలుకునే వరకూ నేను, తాయిబా సాయం చేస్తాం.” అన్నాడు సిద్దార్థ. 

          “ఆపరేషనుకి డబ్బులు జాయినింగుకి కొంత, అయ్యేక కొంత, డిశ్చార్జి అయ్యేటపుడు మిగతాది కట్టమన్నారు. మీరేమీ అనుకోకపోతే  జాయిన్ కావడం కోసం డబ్బులు నా అకౌంట్ లో నుంచి డ్రా చేసి తేగలరా?” నీరసంగా అంది తన్మయి.

          “అవన్నీ నేను పే చేస్తాను. మీరు బాగయ్యాక ఇద్దురు గాని” అన్నాడు.

          దేవుడిలా తనని కాపాడుతున్న సిద్దార్థ కు చేతులెత్తి నమస్కరిచింది.

          “ప్రతిగా అదేవిటి తన్మయీ, నేను మీ పరిస్థితిలో ఉంటే మీరూ ఇదే చేస్తారు ఖచ్చితంగా. నా గొప్పతనమేమీ లేదు. ముందు ఇదిగో కాస్త ఈ కొబ్బరి నీళ్ళు తాగండి. వెళ్ళి మీరు అడ్మిట్ కావడానికి ఏర్పాట్లు చేసి వస్తాను” అని లేచేడు.

          తన్మయికి తల్లిదండ్రులతో మాట్లాడాలని అనిపించింది.

          వాళ్ళు యాత్రల నుంచి ఇంకా పదిహేను రోజులకు గాని తిరిగి రారు.

          వాళ్ళు రాగానే ఇంటికొచ్చేకనైనా చదువు కుంటారని ఉత్తరం రాయడం మొదలు పెట్టింది.

“ప్రియమైన అమ్మకు, నాన్న గారికి….”

          మొదటి వాక్యం రాయగానే దు:ఖం తన్నుకు వచ్చింది.

          ఏమని రాయగలదు? తనకు వాళ్ళని వెంటనే చూడాలని ఉన్నదనా? ఆపరేషనుకి వెళ్ళే ముందు తల్లిని కౌగిలించుకుని చివరి వీడ్కోలు చెప్పాలని ఉన్నదనా? తను తిరిగి రాకపోతే బాబుని వాళ్ళే చూస్కోవాలని జాగ్రత్తలు చెప్పాలనా?

          చిన్నతనం నించీ తల్లిదండ్రులతో తను ఆనందంగా గడిపిన కాలమంతా కళ్ళ  ముందు కదలాడింది.

          బాగా చిన్న వయసులో ఏదో తీర్థానికి వెళ్ళేరు. ఉన్నట్టుండి అమ్మా, నాన్నా కనిపించలేదు. ఏడుస్తూ తిరుగుతున్న తనను రోడ్డు పక్కన అరటి పళ్ళ దుకాణం ఆమె చూసి, తన దగ్గిర కూచోబెట్టుకుంది. ఏడవొద్దని, ఎన్ని అరటి పళ్ళు కావాలన్నా తినమనీ చెప్పింది. మరో గంటలో గాభరాగా వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులు తనని హత్తుకు ని ముద్దుల వర్షం కురిపించడం, అంతలోనే తన ముందు గుట్టగా పడున్న అరటి పళ్ళ  తొక్కలు చూసి నవ్వుకోవడం జ్ఞాపకం వచ్చింది.

          అప్పట్నించీ ఎక్కడికి వెళ్ళినా తనని తండ్రి మెడ మీద కూచోబెట్టుకుని నడిచే వాడు.

          ఎక్కడికెళ్ళినా ఇంటికి రాగానే అమ్మమ్మ నరసమ్మ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళేది.

          ఒకసారి తనని బళ్ళో మేస్టారు కొట్టినపుడు స్కూలు మీదికి గొడవకేళ్ళేడు తండ్రి.

          ఒక్కతే సంతానం కావడం వల్ల తనని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసేరు. 

          తను, శేఖర్ విడిపోయినందుకు మానసికంగా, శారీరకంగా కృంగి పోయేరు.

          ఏవో చిన్న చిన్న విషయాలు మనసుని బాధించినా అమ్మా, నాన్నలంటే తనకి పంచప్రాణాలు. 

          వాళ్ళతో యాత్రలకి వెళ్ళక పోవడం గురించి ఎంతో బాధపడింది కూడా.

          అయినా ఒక విధంగా తను వెళ్ళకపోవడమే మంచిదయ్యింది. ఇదే నొప్పి  మార్గమధ్యంలో అయి ఉంటే అందరికీ కష్టం అయ్యేది. 

          తనకి ఇలా ఎమర్జన్సీ వస్తుందని తనెప్పుడూ కలలో కూడా ఊహించలేదు.

          ఇప్పుడిప్పుడే జీవితమ్లో స్థిరపడుతున్న తనకి సేవింగ్సూ పెద్దగా లేవు. 

          ఉద్యోగం వచ్చిన రెండో నెల నుంచీ “మార్గదర్శి తోడుంటే ఆనందం నా వెంటే” అనుకుంటూ చీటీ కట్టడం ప్రారంభించింది.

          కాలేజీలో వేస్తున్న చీటీ పాడేసి, బండి కొనుక్కుంది. ఇప్పుడు ఈ ఆపరేషను ఖర్చుకి మార్గదర్శి చీటీ కూడా పాడెయ్యాలిక.

          అంత నిర్వేదంలోనూ అప్రయత్నంగా నవ్వొచ్చింది తన్మయికి. ఒక పక్క ఆపరేష నుతో బతికి బట్టకడుతుందో లేదో భయం, అంత లోనే జీవన సమస్యలు.

          ప్రభుని వెంటనే చూడాలని ఉంది. తను పెట్టిన సంవత్సరం గడువుకి ఇంకా రెండు నెలలు ఉన్నాయి. కానీ తన స్వార్థం కోసం ఇప్పుడతన్ని గడువు గురించి అంతా మర్చి పోయి రమ్మనడం సబబేనా?  

          ఏం చెయ్యాల్లో అర్థం కాని  ఆలోచనలు బుర్ర దొలుస్తూ ఉన్నాయి.

          చివరికి ఏదయితే అయ్యిందని ప్రభుకి ఉత్తరం రాసింది.  

          కాలేజీ ప్రిన్సిపాలు గారికి మెడికల్ లీవు అభ్యర్థనతో సెలవు చీటీ రాసింది. 

          వనజ, మురళి, వెంకట్, మేరీ, యూనివర్శిటీ మాస్టారు జ్ఞాపకం వచ్చేరు. తనకేమైనా అయితే వాళ్కికి ఎలా తెలుస్తుంది? కాగితం తీసుకుని వాళ్ళ పేర్లు, అడ్రసులు  రాయ సాగింది. 

          తాయిబా ఒక్క పరుగున వచ్చినట్లు ఒగురుస్తూ “అరే మేడం, సారు చెప్పగనె మస్తు పరేషానయ్యింది. జల్ది ఉరికొచ్చిన, నువ్వీడ సక్కగ కూసొని రాస్తున్నవ? ఇగో అన్నీ బంద్ జేసి మంచిగ పండుకొ, బాబు గురించి పరేషాని గాకు, నే జూస్త” అని పక్కన కూర్చుని చెయ్యి నిమిరింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.