పేషంట్ చెప్పే కథలు – 20

భయం

ఆలూరి విజయలక్ష్మి

          “ఇంత సాహసమెందుకు చేశారమ్మా? మీరు లేకపోతే ఈ పసివాల్లంతా ఏమైపో తారు?” తల్లి గండం గడిచి బయటపడిందో, లేదో తెలియక బిక్క మొహాలేసుకుని నుంచున్న పిల్లల్ని చూపిస్తూ అడిగింది శృతి. “తనలాంటి వాళ్ళకు చావడం సాహసం కాదు. బ్రతకడమే సాహసం” అనుకుంది కామాక్షి. మసకబారిన కళ్ళముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలు కదలసాగాయి.

          శృతి రాసిచ్చిన టానిక్ల లిస్టు వంక ప్రాణం లేనట్లు చూసింది కామాక్షి. తాను గర్భవతి అని తెలిస్తే యింటా బయటా తనను కాకుల్లా పొడుస్తారనీ, తనకీబిడ్డ వద్దనీ ఏ విధంగా నైనా తనకు గర్భస్రావం చేసేయమని డాక్టర్ని ప్రార్థించిందామె. కానీ, ఈ పరిస్థితిలో గర్భస్రావం చెయ్యటం ప్రమాదమని, యింకా నాలుగు నెలల్లో బిడ్డకాస్తా బయటపడ్డాక యింక పిల్లలు పుట్టకుండా చేసేస్తామని చెప్పి సాగనంపింది శృతి.  

          రెండేళ్ళ క్రితం ఆఖరి పిల్ల కడుపులో వున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చి భయంతో జలదరించింది కామాక్షి శరీరం.

          “ఏమంత మళ్ళూ, మాన్యాలు మూలుగుతున్నాయని ఇంతమంది పిల్లల్ని కనడం? ఈ వయసులో పిల్లలు! సిగ్గుచేటు!!” కోడలు హైమావతి. 

          “ఏళ్ళు రాగానే సరిగాదు, నలుగురూ ఏమనుకుంటారోననే సిగ్గు, ఎగ్గూ లేకుండా పోయింది మనుషులకు…” రెండో కూతురు రాధ. అటుగా వెళ్ళిన కామాక్షికి వద్దనుకున్నా వాళ్ళమాటలు చెవిలో పడ్డాయి. 

          దోషిలా అందరినీ తప్పుకు తిరిగి ఈ అర్భకురాల్ని ప్రసవించింది. తనకు ప్రతీ కానుపు గండమే. ప్రతిసారీ కిందెట్టు, మీదెట్టు. అందుకే తెగించి ఆ సమయంలో ఆపరేషన్ చేయించుకోవడానికి వీలుండేది కాదు. తరువాత సంసారపు ఝాన్ ఝాటంలో వెసులు బాటయ్యేది కాదు. కొంచెం వయసు గడిచాక ఈ వయసులో యింకా పిల్లల్లెం పుడతారులే అన్న అఙ్ఞానం , తన ఆరోగ్యం గురించి తెలిసి కూడా ఆపరేషన్ చేయించుకోని భర్తను చూసి ఆవేదన, పుట్టిన పిల్లలకు తిండి పెట్టలేని అశక్తత, కాలానుగుణంగా లేని తమ ప్రవర్తన పై కోపం… ఒకవైపు హృదయం చిత్రవధ ననుభవిస్తున్నా పిల్లల కోసం బలవం తాన అన్నిటినీ సహించింది. 

          కలలో నడిచినట్లు నడుస్తున్న కామాక్షికి అదంతా గుర్తొచ్చింది. మనసులో ఏదో ఊగిసలాట. అంతలోనే విరక్తి. అంతలోనే పిచ్చి తెగింపు. నాలుగు మందులషాపుల దగ్గర ఆగి మాత్రల్ని కొని జాగ్రత్తగా దాచింది. ఇంటికి వచ్చి పెద్దకోడలు రమపెట్టిన ముద్దతిని చాప వాల్చుకుని పడుకుంది. మనసంతా ఆలోచనలతో గందరగోళంగా తయారయింది. గాలికి పుట్టి, గాలికి పెరిగి ఎందుకు బ్రతుకుతూందో తెలియకుండా నిస్సారంగా బ్రతికింది న్నాళ్ళూ. దుర్భరమైన దారిద్యంతో పోరాడి పోరాడి అలిసిపోయింది. మళ్ళీ ఈ బెడద. మళ్ళీ కన్నబిడ్డల ఎదుట అపరాధిలా తలవంచుకుని బ్రతకవలసి రావడం. తన ప్రారబ్ధం కాకపొతే ఈ వయసులో తనకీ రాతేమిటి? ఈ విషయం నలుగురికీ తెలిస్తే తాను బ్రతకలేదు… తనకు చావంటే భయంలేదు. ఇల్లంతా సద్దుమణిగాక, తనలోని సంఘర్షణ నో కొలిక్కి తెచ్చి, ఒక నిశ్చయానికొచ్చి, మనసు రాయి చేసుకుని కొని దాచుకున్నమాత్రల నన్నిటినీ గబగబా మింగింది… యింక తనకంతా ప్రశాంతత. జీవితంలో యింతకు ముందెప్పుడూ రుచిచూడని ప్రశాంతత. తనిక బిడ్డల్ని పస్తు పడుకోబెట్టడమెలాగా అని బాధపడనక్కరలేదు. జబ్బు చేసి ప్రమాదంలో ఉన్న పిల్లల్ని గాలిలో పెట్టి ‘దేవుడా! నీ మహిమ!’ అనక్కర్లేదు. తెల్లారి లేచిందగ్గర్నుంచీ ఇంటి వాడితో, పాలవాడితో, చిల్లర దుకాణంవాడితో, అప్పులిచ్చిన వాళ్ళతో మాటలు పడడమెలాగా అనే భయంతో చావనక్కరలేదు. ఇంక తనపాలిట సిగ్గు, అవమానాలు వుండవు. ఏమిటిలా వుంది? గమ్మత్తుగా ఏదో లోకాల్లోకి ఎగిరిపోతున్నట్లుగా… తానెక్కడికెగిరిపోతూంది? స్వర్గానికా?… ఏమిటి తాను హాయిగా స్వర్గానికెగిరి పోతూంటే ఎక్కడిదీ కీచుమని ఏడుపు?… తన కడసారి పిల్లకదూ?… రేపటి నుంచి దానికి పాలెవరు పడతారు? తన చిన్నారి బిడ్డల ఆలనా, పాలనా ఎవరు కనుక్కుంటారు? ఎవరు తన బంగారు కన్నల ఆకల్ని కనిపెట్టి అన్నం పెడతారు?… ఆమ్మో! వద్దు. తాను చచ్చిపోదు… తాను బ్రతకాలి… తాను బ్రతుకుతుంది, కష్టమో, సుఖమో, చావో, రేవో తాను బ్రతకాల్సిందే. బ్రతికి రోజూ ఆకలితో, అవమానాలతో యుద్ధం చేస్తూ ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో తన బిడ్డల్ని పెంచుతుంది. అయ్యో! పిల్ల గుక్కలు పట్టి ఏడుస్తూంటే తనింకా పడుకునే ఉందేమిటి? లేచి వెళ్ళాలి. పాపకు పాలు పట్టాలి… మూసుకుపోతున్న కళ్ళను బలవంతాన విప్పడానికి ప్రయత్నిస్తూ అవయవాలను స్వాధీనంలోకి తెచ్చుకుని లేవడానికి ప్రయత్నిస్తూకుప్పలా కూలిపోయింది కామాక్షి! 

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.