ఆధునిక తెలుగు భాషా నిర్మాణం

– డా. టి. వెంకటస్వామి

          ప్రారంభంలో తెలుగు భాషా వ్యాకరణాలు, సంస్కృత భాషా ప్రభావంతో వచ్చాయి. ఆ తర్వాత ఆంగ్ల భాషా ప్రభావాలతో వెలువడ్డాయి. తెలుగును తెలుగు భాషాశాస్త్ర దృష్టితో పరిశీలించిన భాషావేత్తలు తెలుగు భాషా వ్యాకరణాలు రాశారు.

          భద్రిరాజు కృష్ణమూర్తి, జి.ఎన్. రెడ్డి, చేకూరి రామారావు, పి.యస్. సుబ్రహ్మణ్యం,
వెన్నలకంటి ప్రకాశం, జి. ఉమామహేశ్వరరావు మొదలైన ఆచార్యులు, భాషావేత్తలు ఆధునిక భాషా నిర్మాణాన్ని లోతుగాను, స్పష్టంగాను వివరించారు. ఆ కోవలో వెలువడిన పుస్తకం “ఆధునిక తెలుగు భాషానిర్మాణం”.

          విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రాన్ని, తెలుగు భాషా నిర్మాణాన్ని పాతిక సంవత్సరా లకు పైగా విద్యార్థులకు బోధించిన అనుభవంతో ఆచార్య శివుని రాజేశ్వరి ఈ పుస్తకాన్ని 2012లో రచించారు. వెలువడిన కొద్దికాలంలోనే ఆ పుస్తకాలన్నీ అమ్ముడు పోయాయి. ఎందరో విద్యార్థులు, పరిశోధకులు, భాషాభిమానుల కోరిక పై ఆ పుస్తకానికి మరికొంత సమాచారం చేర్చి ముద్రించారు.

          “ఆధునిక తెలుగు భాషానిర్మాణం” లో 10 విభాగాలు ఉన్నాయి. ‘వర్ణం’ అన్న మొదటి విభాగంలో తెలుగు భాషలోని ‘వర్ణ నియమావళి’ ఉంది. స్పర్శాలు, ఊష్మాలు, అనునాసికాలు, పార్శ్వికాలు మొదలైన హల్లులు, సంవృతాలు, వివృతాలు వంటి అచ్చుల ఉత్పత్తిని తెలుపుతూ వాటి వ్యాప్తిని, పదాల్లో చూపిస్తూ (Phonetic Script) ఫొనిటిక్ స్క్రిప్టులో అందించబడింది.

          రెండవ విభాగంలో ‘నామవాచకాల’ లక్షణాలు, రకాలు సిద్ధాలు, సాధ్యాలు, దేశ్య అన్యదేశ్యాల వివరణ ఉంది. మూడు, నాలుగు, ఐదు విభాగాల్లో లింగ, వచన, విభక్తుల నిర్మాణం వాని లక్షణాలు, రకాలు తెలుగు భాషలో వాని వ్యాప్తి విపులంగా చర్చించ బడింది. ఆరు, ఏడు విభాగాల్లో సర్వనామాల, విశేషణాల చర్చ ఉంది. నిర్వచనం, లక్షణాలు రకాలే కాక వాటి మధ్య సామ్యం, భేదాల పరిశీలన ఉంది.

          8వ విభాగం ‘క్రియ’ ఈ పుస్తకంలో ప్రధానమైన భాగం. క్రియా నిర్మాణంలో భద్రిరాజు కృష్ణమూర్తిగారు తెలిపిన ‘సన్నవేశ పద్ధతి’ ‘పదం-పదావళి పద్ధతి’ని అనుసరించి, క్రియ కు వివిధ రకాల ప్రత్యయాలు చేర్చి అనేక క్రియారూపాల్ని పట్టికల, ద్వారా వివరించడం ఇక్కడి ప్రత్యేకత. క్రియా ప్రాతిపదిక + కాలబోధక ప్రత్యయం + పురుషబోధక ప్రత్యయాల నిర్మాణాన్ని తెలుపుతూ ఒక్కొక్క క్రియకు 3 కాలబోధక ప్రత్యయాలు 8 పురుష బోధక ప్రత్యయాలు చేర్చి 24 (3 X 8 = 24) సమాపక క్రియా రూపాలను పట్టికలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసమాపక క్రియారూపాలు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త క్రియా రూపాల్ని వివరిస్తూ విద్యార్థుల ఉపయోగార్థం పట్టికలో ఇవ్వడమైనది. తెలుగు భాషలో ఉన్న విస్తారమైన క్రియా స్వరూపాన్ని లోతుగా వివరించే ప్రయత్నం జరిగింది.

          ఆఖరి రెండు విభాగాలు ‘ఆశ్రయితాలు’ (Clitics), ‘వాక్యం’ సంక్షిప్తంగా వివరించ బడ్డాయి.

          తెలుగు భాషా నిర్మాణాన్ని సులభశైలిలో వివరిస్తూ అవసరమైన చోట్ల పట్టికలు పొందుపరచడం వలన విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. ఈ పుస్తకం సెట్, నెట్, జె.ఎల్., డి.ఎల్. వంటి పరీక్షలకు, ఇతర తెలుగు పోటీ పరీక్షలకు చదివే విద్యార్థులకు ప్రయోజనకారి.

ఈ పుస్తకం పుటలు: 208; వెల: రూ.150.00

పుస్తకం దొరుకుచోటు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.