నిష్కల – 36

– శాంతి ప్రబోధ

జరిగిన కథ:పెద్ద కొడుకును చూడాలని తాపత్రయ పడుతుంటుంది సుగుణమ్మ. తన కూతురు దగ్గరకు వెళ్ళాలని ఆలోచనలో ఉంటుంది శోభ. సహచరుడు అంకిత్ , ప్రియా బాంధవి సారా, సారా తల్లి వాంగ్ లతో అమెరికా నుండి మాతృదేశం బయలుదేరింది నిష్కల.

***

 
          పెద్ద కుదుపులకు లోనవడంతో ప్రయాణికుల హాహాకారాలు ..  మొదట రఫ్ లాండింగ్ అనుకున్నారు. 
 
          కానీ, కాదని అర్ధమైన మరుక్షణం ఎవరికి వారు లేచి దిగిపోవాలని, తమ ప్రాణం కాపాడుకోవాలనే ఆతృతలో .. నడుంకి బిగించిన సీట్ బెల్ట్ లాగి పడేసి కేబిన్ బ్యాగేజ్ అందుకోవడానికి హడావిడి పడిపోతున్నారు..  
 
          అంతలో  సీట్ బెల్ట్ ఎవరూ తీయొద్దని, ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చొమ్మని అనౌన్స్ చేస్తున్నారు.  
 
          ఆ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. 
 
          పల్టీ కొట్టి ఆగినట్లు ఉంది అని ఒకరు అంటే పక్కనున్న కిటికీలోంచి చూస్తూ ఇంజిన్ నుండి పొగ వస్తున్నది అని మరొకరు అంటున్నారు. 
 
          అయ్యో.. అటు చూడండి. సన్నని మంట అంటున్నారు ఇంకెవరో .. కూర్చున్న దగ్గర నుంచి కదలనివ్వని విమాన సిబ్బందిని తిట్టుకుంటూ కొందరు.. ఏమి జరిగిందో అర్ధంకాక హాహాకారాలు చేస్తూ చాలా మంది. 
 
          కంగారు పడవద్దని సిబ్బంది పదే పదే చేస్తున్న ప్రకటన ఎవరూ చెవికెక్కించు కోవడం లేదు. 
 
          తెలుగు, హిందీ భాషల్లోని సంభాషణ వాంగ్ కి ఏమీ అర్ధం కావడం లేదు. ఆమె గుండె భయంతో దడ దడ లాడుతున్నది.  పక్కన ఉన్న కూతురు సారాని చూసి కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. తల్లి మనోస్థితి అర్ధం చేసుకున్న సారా భయం లేదన్నట్లు తల్లి చేతిని నొక్కింది. 
 
          నా దురదృష్టం వెంటాడుతుందేమో..! అయ్యో.. నాతో పాటు మీ జీవితాన్ని కూడా బలిదీసుకుంటున్నానా? నో నో.. అలా జరగడానికి వీల్లేదు. లేవండి .. లేవండి అని అరుస్తూ నడుముకు బిగించి ఉన్న బెల్టు లాగిపారేసింది వాంగ్.  
 
          నిష్క్ .. అని ముందు వరుసలో కూర్చున్న నిష్కలని ఆందోళనగా పిలిచింది. 
 
          వీళ్ళు మనని దిగనివ్వడంలేదు. ఇందులో మాడి మసిచేస్తారేమో.. అటు చూడండి. ఇంజన్ దగ్గర మంటలు.. అరుస్తున్నారు ఎవరో. ప్రయాణికులంతా అరచేతిలో ప్రాణాలు  పెట్టుకున్నారు.
 
          ఇదిలా ఉంటే మరోవైపు కొందరు ఔత్సాహికులు కిటికీలోంచి ఆ దృశ్యాన్ని వీడియో తీస్తున్నారు. నిష్కల అంకిత్ ల ముందున్న యువకుడు తన మొహం కూడా అందులో వచ్చేట్లుగా కిటికీ వైపు వొదిగిపోతూ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ దృశ్యం చూసి అంత ఆందోళన కలిగించే క్షణాల్లోనూ చిన్నగా నవ్వుకున్నారు నిష్కల అంకిత్ లు. 
 
          మసక మసకగా ఉన్న కాబిన్ లైట్ వెలుతురు .. కేబిన్ నుంచి పైలట్ ప్రయాణికుల నుద్దేశించి మాట్లాడుతున్నారు. మీ భయాందోళనలు నాకు అర్ధమవుతున్నాయి. కానీ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. పరిస్థితి అదుపులోనే ఉంది. కొద్ది క్షణాల్లో మిమ్మల్ని క్షేమంగా బయటికి పంపిస్తాం. రన్ వే పై లాండ్ అవుతున్న క్రమంలో విమానాశ్రయంలోని గడ్డిలోకి దూసుకువెళ్ళింది. విమానం ముందు భాగంలోని అండర్ బెల్లీ తెగిపోయి దాని ముక్కు బాగా దెబ్బతింది. లాండింగ్ గేర్ ఫెయిల్ అయింది. అందు వల్ల వచ్చిన ఇబ్బంది అంతే అని చెప్పారు. 
 
          ఏవో చిన్నపాటి గాయాలు తప్ప అందరూ క్షేమమే కావడంతో ఊపిరి పీల్చుకు న్నారు. అశుభ ఘడియల్లో బయలుదేరాం అందుకే ఇలా జరిగింది అంటున్నారెవరో..  ఈ వేళ నిద్రలేచిన సమయం బాగుంది అని ఇంకొకరు. ఏదేమైతేనేం పెద్ద గండం గడిచింది అని ఒకరు .. 
 
          ఆ తరువాత కొద్ది క్షణాల్లోనే ఎమర్జెన్సీ సిబ్బంది విమానం ఎస్కేప్ స్లైడ్ ల ద్వారా బయటకు దింపారు. మసక వెలుతురులో కనిపిస్తున్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ , ఎగ్జిట్ 
 
***
          నిష్కల అంకిత్ ల  జంట కూడా ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది.  కుటుంబ సభ్యులు అందరూ వస్తున్నారు. నిషి కూడా వచ్చి అంకిత్ తో తన సహజీవనం గురించి సామాజిక ప్రకటన చేస్తే బాగుండేది అనుకున్నది శోభ.  
 
          సాధారణంగా కనిపించే ముహూర్తం, తాళి కట్టడం లేకుండా వీళ్ళిద్దరు ఒక జంటగా కలిసి బతుకుతున్నారు. భారతదేశంలో పుట్టి పెరిగి విద్యావంతురాలైన తన బిడ్డ తన సంబంధాల స్థాయిని దాటి సామాజిక స్థాయిలోకి వెళ్ళడం చాలా గొప్పగా తోచింది ఆ క్షణాన.  
 
          సమాజం ఏర్పాటు చేసిన పద్ధతులు, ఆచారాలు కాదని బయటికి రావడం పెద్ద సవాలే. అందరికీ సాధ్యం కాదు. సమాజానికి కొన్ని నియమాలు నిబంధనలు పెట్టింది మనుషులే. ఆ మనుషులే అప్పటి సమాజ అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ముందు ఏర్పాటు చేసుకున్న నియమాలను, నిబంధనలను, ఆచారాలను, కట్టుబాట్లను మార్చుకోవచ్చు. తిరగ రాసుకోవచ్చు. కానీ అలా చెయ్యరు. చేయనివ్వరు. విచిత్రంగా ఆ మార్పులో భాగం అయ్యే వారిని, అందుకు దోహదం చేసే వారిని రాచిరంపాన పెడుతుం ది సమాజం. 
 
          జంట కలిసి జీవించడానికి ఎవరి మత ఆచారాల ప్రకారం బంధుమిత్రుల సమక్షం లో పెళ్ళి చేసుకున్నప్పటికీ అది కూడా ఒక రకంగా సామాజిక ప్రకటనే అని తోచింది శోభకు. ఆ జంట అప్పటి నుండి సహజీవనం చేస్తామని బంధుమిత్రుల సమక్షంలో ప్రకటంచడమే కదా అనుకున్నది ఆమె.  
 
          అమ్మాయికి అబ్బాయికి ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ ఉందా .. ప్రేమ ఉందా ..అని చూడకుండా పెద్దలు కొన్ని లెక్కలతో పెళ్ళి చేసి వాళ్ళను కలిసి బతకమంటారు. వివాదాలకు పునాది మన వివాహ వ్యవస్థలో ఉంది. పెద్దలు నిర్ణయించి చేసే పెళ్ళిళ్ళలో ఇరువైపుల ఆస్తులు చూడడం, ఇచ్చిపుచ్చుకోవడంతో కూడిన ఆర్థిక కోణం అనేక సమస్యలకు కారణం అవుతున్నది. ఏ రకంగా జరిగిన పెళ్ళి అయినా రిజిస్ట్రేషన్ చేస్తే న్యాయబద్దం అవుతుంది. చట్టం, న్యాయం తెలిసిన నిషి సహజీవనంలో ఎవరి  జోక్యం లేదు. వారిద్దరికీ ఒకరిపట్ల ఒకరికి ఉన్న ఆకర్షణ, ప్రేమ, వ్యామోహం తప్ప. అదే వారిని కలిపింది. కలిపి ఉంచుతుంది అని నమ్ముతున్నారు వాళ్ళు.  
 
          ప్రేమ, ఆకర్షణ మనిషికి ఎంత అవసరమో ముఖ్యంగా దంపతులయ్యే జంట మధ్య ఎంత అవసరమో అర్థం చేసుకోకుండా పాపంకింద చూసే సమాజంలో పుట్టిన నా కూతురు పెళ్ళంటే వ్యాపార బంధం కాదంటుంది. నిన్ను నన్ను పోషించుకునే ఒప్పందం లేకుండా కలిసి బతకడం అంటుంది. ఎవరి జీవితానికి వారే బాధ్యులు అంటుంది. ఎంత స్పష్టంగా ఆలోచిస్తుందో అంతే స్పష్టతతో జీవించాలంటుంది నిషి. 
 
          వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏడడుగులు నడిచా. ఏడేడు జన్మల బంధంగా మిగలాలని పెద్దల ఆశీస్సులు, దీవెనలు పుష్కలంగా అందుకున్నాం.  చట్ట బద్ధంగా ఏర్పడిన బంధం. కానీ, మా మధ్య ఆ బంధం ఉందా ? హృదయ సంబంధం ఉందా ? లేదు. 
 
          కానీ, బావ మనసుకు దగ్గరైన స్త్రీతో జీవిస్తున్నాడు. వారు శాస్త్రోక్తంగా పెళ్ళి  చేసుకోక పోవచ్చు, చట్టబద్దమైన రిజిస్టర్ పెళ్ళి అయినా చేసుకున్నారో లేదో…  కానీ, వారి బంధాన్ని కాదని అనగలమా? వారి సహజీవనం పెళ్ళి వంటిదే కదా! వారిద్దరూ భార్యాభర్తలే కదా! వంట గదిలో పని చేసుకుంటూ ఆలోచిస్తున్నది శోభ. 
 
          జీవితాన్ని రంగుల్లో కాకుండా బ్లాక్ అండ్ వైట్ లో చూస్తేనే బాగుంటుందేమో ! శోభ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ “ఇంతకీ ఆ బర్రెలక్క గెలిచిందా? ఎన్ని ఓట్లు వచ్చినయి” డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అడిగింది సుగుణమ్మ. 
 
          “ఎన్నికల్లో ఓడినా ఆమె గెలిచింది అత్తా.. ” అంటూన్న శోభ ఇంటి ముందు ఆగిన కారు శబ్దం విన్నది. రేపు కదా బంధువులు రావలసింది. ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటూ వంట గది కిటికీలోంచి బయటకు తొంగి చూసింది. 
 
          బజారు వాకిట్లో ఉన్న నందివర్ధనం, గన్నేరు కొమ్మల మధ్య నుండి కారు దిగుతూ వాంగ్, సారా కనిపించారు. వాళ్లెవరో తెలియక అలా చూస్తుండగా అంకిత్ ని చూసింది.  
తర్వాత తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తన కళ్ళు మోసం చేస్తున్నాయేమోనని తన చేతిని తానే గిల్లి చూసుకుంది.  
 
          అత్తా ఎవరొచ్చారో చూడు ఉద్వేగంతో అంటూ వాకిట్లోకి పరుగు పెట్టింది శోభ.  
ఆ వెనుకే సుగుణమ్మ. 
* * * * *

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.