పౌరాణిక గాథలు -12

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

పాతివ్రత్యము – దమయంతి కథ

          నలమహారాజు గుణగణాల గురించి ఒక హంస ద్వారా విన్న దమయంతి అతణ్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దమయంతి గురించి విని ఆమెనే పెళ్ళి  చేసు కోవాలని నలమహారాజు కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె ఒక రాజకుమారి, అతడు ఒక రాజకుమారుడు.

          కొంత మంది దేవతలు కూడా దమయంతిని పెళ్ళి చేసుకోవాలని స్వయంవరానికి వచ్చారు. ఎవర్నయినా సరే వాళ్ళల్లో ఒకళ్ళని పెళ్ళి చేసుకోమని చెప్పమని నలుణ్ని దమయంతి దగ్గరికి పంపించారు.

          కాని, దమయంతి మాత్రం నలుణ్నే ఎంచుకుంది. దేవతలు దమయంతిని పరీక్షిం చడానికే వచ్చామని, పెళ్ళి చేసుకోడానికి కాదని చెప్పి నలదమయంతుల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.

          మనిషైనాసరే, దేవుడైనాసరే స్త్రీ తన మనస్సుని ఒకసారి ఎవరికేనా ఇచ్చిందంటే దానికే కట్టుబడి ఉంటుంది. ఆ వ్యక్తి మరణించినా, వ్యాధితో బాధపడుతున్నా, ధనం మొత్తం పోగొట్టుకుని పేదరికంలో ఉన్నా తన మాటకి కట్టుబడి ఉంటుంది. ఇది ప్రాచీన కాలం నుంచీ వస్తున్న భారతదేశం యొక్క సంప్రదాయం.

          అదే విధంగా దమయంతి కూడా తన మనస్సుని నలుడికి ఇచ్చింది. వేరే వ్యక్తిని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దేవతలు ఆమె భావాన్ని గౌరవించి ఆమెని ఆశీర్వదిం చి వెళ్ళిపోయారు. వాళ్ళ వివాహం వైభవంగా జరిగిపోయి సంతోషంగా జీవిస్తున్నారు.

          చెడు లక్షణాలు కలిగిన కలి దమయంతిని పెళ్ళి చేసుకోవాలని స్వయంవరానికి వచ్చాడు. అప్పటికే స్వయంవరం జరగడం, దమయంతి నలుణ్ని వరించడం జరిగి పోయింది.

          కలికి నలుడి మీద అసూయ కలిగింది. అతడి మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించు కున్నాడు. కలి చెడు గుణాలు కలిగినవాడు కనుక, అవకాశం కోసం ఎదురుచూసి, ఒక బలహీనమైన క్షణంలో నలుణ్ని పట్టుకున్నాడు.

          నలుడి సోదరుణ్ని కలుసుకుని జూదం ఆడడానికి నలుణ్ని పిలవమని బలవంతం చేశాడు. కలిపురుషుడు తనని ఆవహించి ఉండడం వల్ల నలుడు జూదం ఆడడానికి అంగీకరించాడు.

          తన సర్వస్వాన్ని పోగొట్టుకుంటున్న నలుణ్ని దమయంతి హెచ్చరిస్తూనే ఉంది. కాని కలి ప్రభావం వల్ల నలుడు ఆమె మాటల్ని గౌరవించలేదు.

          అంతా పోగొట్టుకున్న తర్వాత నలదమయంతులు రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి పోయారు. వాళ్ళు రాజ్యంతోపాటు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు.

          అప్పుడు కూడా కలి పురుషుడు వాళ్ళని వెంబడిస్తూనే ఉన్నాడు. అందువల్ల వాళ్ళు అడవిలో కూడా అనేక బాధలు పడ్డారు. నలుడు తన బట్టల్ని కూడా పోగొట్టుకున్నాడు.

          తన వెంట వచ్చిన భార్య పరిస్థితిని, ఆమె పడుతున్న కష్టాల్ని చూడలేక  పోయాడు. ఒక రోజు రాత్రి నిద్ర పోతున్న సమయంలో ఆమెని అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళి పోయాడు. చివరికి వాళ్ళిద్దరూ విడిపోయారు.

          అప్పుడు కూడా కలిపురుషుడు వాళ్ళని వదల్లేదు. తనతో ఒక్క మాట కుడా చెప్ప కుండా తన భర్త అడవిలో తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకు దమయంతి చాలా బాధ పడింది.

          అయినా తన భర్తని ఒక్క మాట కూడా అనలేదు. ఆమెకి తన భర్తమీద ఉన్న ప్రేమ, నమ్మకం అంత గొప్పవి.

          తను ఒంటరిగా ఉండిపోయినందుకు దమయంతి బిగ్గరగా ఏడ్చింది. కాని ఆమె తన నమ్మకాన్ని వదల్లేదు. తిరిగి తిరిగి ఎలాగో అడవిలోంచి బయటపడి ఒక రాజ్యానికి చేరుకుంది.

          ఆమె బాధ అర్ధం చేసుకున్న మహారాణి ఆమెకి తన చెలికత్తెగా ఉద్యోగం ఇచ్చింది. దమయంతి తన గురించిన నిజాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. చాలా నమ్మకంగా మహారాణికి సేవ చేసి అక్కడ స్థిర పడింది.

          ఎప్పటికైనా పరిస్థితులు మారి తను తన భర్తని తప్పకుండా కలుసుకుంటానన్న నమ్మకంతో జీవిస్తోంది.

          (మనం చెప్పుకుంటున్నది ఒక కథ అయితే మరో విధంగా చెప్పబడిన కథ కూడా ఉంది. ఏ విధంగా చెప్పినా నలదమయంతుల జీవితం సుఖంగా ఉండాలని కోరుకు న్నదే).

          ఒక రోజు దమయంతి నుదుటి మీద ఉన్న కమలం గుర్తుని మహారాణి చూసింది. దాన్ని చూసి ఆమె చాలా కాలం క్రితం తప్పిపొయిన తన సోదరి కుమార్తెగా గుర్తించింది.

          రాణి అప్పటికే ఆ యువ దంపతుల కన్నీటి గాథని వింది. అందరూ అనుకున్నట్టే తను కూడా నలదమయంతులు ఇద్దరూ ఆ అడవిలోనే మరణించి ఉంటారని అను కుంది.

          దమయంతిని ఆ పరిస్థితిలో చూసి నిశ్చేష్టురాలయింది. తనని గుర్తించిన మహారాణికి దమయంతి తన కథ మొత్తం చెప్పింది. జరిగింది విని మహారాణి చాలా బాధపడింది.

          నలుడు కూడా బ్రతికే ఉంటాడని, ఇక్కడికి దగ్గర్లొనే ఎక్కడో కష్టాలు పడుతూ ఉండి ఉంటాడని అనుకుంది. ఎలాగయినా సరే తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ దంపతుల్ని కలపాలని అనుకుంది.

          తన మొదటి పని నలుడు ఎక్కడ ఉన్నాడో వెతికించడం. అది కూడా చాలా తెలివిగా జరగాలి అనుకుంది. అందుకు రాణి బ్రాహ్మణుల్ని ఎంచుకుంది. వాళ్ళని నలదమయంతుల పేర్లు చెప్పకుండా వాళ్ళ కథ మాత్రమే పాటగా పాడుతూ తిరగ మంది.

          “ఎక్కడయినా ఎవరయినా ఈ కథ విని దాన్ని గురించి మాట్లాడితే అతడే నలుడు. అటువంటి వ్యక్తి ఎవరయినా తారసపడితే అతణ్ని రాజ్యానికి తీసుకుని రండి” అని చెప్పింది.

          ఈ పని గడ్డివాములో సూదిని వెతుక్కోడం వంటిదే కాని, అసలు ఎదో ఒక విధంగా వెతకడం మొదలుపెట్టాలిగా. చేసేపనిలో నిబద్ధత పట్టుదల ఉంటే దేన్నయినా సాధించ వచ్చు.

          కలిపురుషుడు నలుణ్ని విడిచిపెట్టలేదు. నలుడు తన భార్యని అడవిలో వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచీ దురదృష్టం అతణ్ని వెన్నాడుతూనే ఉంది. ఉన్న కష్టాలకి తోడు అతణ్ని ఒక కాలనాగు కాటేసింది. దానివల్ల అతడు తన అందమైన రూపం పోగొట్టుకుని వికారమైన రూపాన్ని పొందాడు.

          నాగుపాము నలుడితో  “నలమహారాజా! నేను నిన్ను రక్షించడానికే ఈ పని చేశాను. మంత్రపరమైన ఈ బట్టని నీ దగ్గర ఉంచుకో. సరయిన సమయంలో దీన్నిధరించు. నీ అందమైన రూపం తిరిగి నీకు వచ్చేస్తుంది” అని చెప్పి వెళ్ళిపోయింది.

          నలుడు తన వికారమైన రూపంతోనే తిరుగుతూ ఒక రాజ్యానికి చేరుకున్నాడు. అతడిలో ఉన్న మంచి లక్షణాల ప్రభవాన్ని ఆపడం కలి పురుషుడి వల్ల కూడా కాలేదేమో…అతడికి రథాన్ని వేగంగా నడపగలగిన సామర్ధ్యం ఉండడం వల్ల రథసారథిగా ఒక రాజుగారి దగ్గర పనికి కుదిరాడు.

          నలుడు రథాన్ని చాలా వేగంగా నడపగలడు. అందువల్ల తక్కువ సమయంలోనే రాజుగారి దగ్గరున్న రథ సారథుల్లో మొదటివాడుగా నిలిచాడు. అతడి నైపుణ్యానికి రాజు గారు సంతోషించారు.

          అతడి వికారమైన రూపం అతడి విద్యకి  ఏ మాత్రం అడ్డు రాలేదు. ఏది ఎలా జరిగినా విధి అతడితో భయంకరంగా ఆడుకుంది. నలుడు తన భార్యని అడవిలో క్రూర జంతువుల మధ్య వదిలి వచ్చేశాడు.

          ఏదయినా క్రూరజంతువు ఆమెని చంపేసిందేమో కూడా తెలియదు. అదే జరిగితే నలుడు తనని తను ఎప్పుడూ క్షమించుకోలేడు.

          అతడి కష్టాల్లోకి అనుకోకుండా ఒక వెలుగురేఖ ప్రసరించింది. రథ సేవకుడుగా ఉన్న సమయయంలోనే ఒకరోజు బ్రాహ్మణుడు పాడుతున్న పాట ఒకటి విన్నాడు.

          ఆ కథ పూర్తిగా తనకు సంబంధించిందే. ఆ పాట విని గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. బ్రాహ్మణుడు అది గమనించి నలుడి దగ్గరికి వెళ్ళి అతడి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే మహారాణికి ఈ విషయం చెప్పడానికి తమ రాజ్యానికి వెళ్ళిపోయాడు.

          తన భార్య దమయంతి ఎక్కడో అక్కడ బ్రతికే ఉందని తెలుసుకుని నలుడు ఒక్కసారి ప్రశాంతమైన మనస్సుతో గట్టిగా గాలి పీల్చుకున్నాడు.

          బ్రాహ్మణుడు వెళ్ళి తను పాడిన కథని వినగానే ఏడ్చిన మనిషిని గురించిన వివరాలు మహారాణికి చెప్పాడు. అది విని మహారాణి, దమయంతి కూడా ఆశ్చర్య పోయారు.

          వికారమైన ఆకారంలో ఉన్న సారథిని, అతడికి  రథాన్ని నడపడంలో కల నైపుణ్యాన్ని తెలుసుకున్న మహారాణి తరువాత విషయాల్ని చాలా జాగ్రత్తగా నడిపింది.

          మరుసటి రోజు జరగబోతున్న స్వయంవరానికి మహారాజుని తప్పకుండా రమ్మని కోరుతూ నలుడు సారథిగా పనిచేస్తున్న రాజుకి మాత్రమే ఒక ఆహ్వానపత్రిక పంపించింది.

          అంత తక్కువ సమయంలో జరగబోతున్న స్వయంవరానికి తప్పకుండా రమ్మని పంపించిన ఆహ్వానాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు.

          ఆ రోజుల్లో అటువంటి ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళకపోతే రాజులు దాన్ని చాలా అవమానంగా భావించేవాళ్ళు. వెంటనే నలుణ్ని పిలిచి రథం తీసి బయలుదేరమన్నా డు.

          అందవికారంగా ఉన్నా కూడా ఆ సారథి మీద మహారాజుకి నమ్మకం ఎక్కువ. ఇద్దరూ బయల్దేరారు. దార్లో రాజుగారు పైన వేసుకున్న వస్త్రం గాలికి ఎగిరి పోయింది. రాజు తను పైన వేసుకునే వస్త్రం ఎగిరి పోయిందని నలుడు రథాన్ని ఆపితే వెళ్ళి తెచ్చు కుంటానని చెప్పాడు.

          కాని నలుడు రాజుతో “అయ్యా! మనం ఇప్పటికే వందల మైళ్ళు దాటి వచ్చేశాం. మీ వస్త్రం తెచ్చుకోవాలంటే మళ్ళీ వందల మైళ్ళు వెనక్కి వెళ్ళాలి. అది జరిగే పని కాదు” అన్నాడు.  నలుడు మహారాజుని స్వయంవర సమయానికి నగరానికి చేర్చాడు.

          అక్కడికి వెళ్ళాక స్వయంవరానికి తమకు తప్ప మరే రాజులకి ఆహ్వానం పంపించ లేదని మహారాజుకి అర్ధమయింది. అది నలుణ్ని తమ రాజ్యానికి రప్పించడానికి మహారాణి చేసిన తెలివైన ఏర్పాటు.

          దమయంతి నలుడు కలిసి మాట్లాడుకునేందుకు మహారాణి వీలు కల్పించింది. తమ కథ విని ఏడ్చిన అందవికారమైన రథ సారథిని చూసి కొంచెం సేపు దమయంతి తికమకపడింది.

          ఇంత అందవికారంగా ఉన్న ఇతడు తన భర్తేనా..? కాకపోతే తమ కథ ఇతడికి ఎలా తెలుస్తుంది..? కష్టాలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసే భరించారు. ఆమెకి తన భర్త సుఖంగా ఉండడం, తను అతనికి సేవ చెయ్యడం మాత్రమే కావాలి.

          ఆమె అతణ్ని తెలుసుకోవడం కోసం అడవిలో భార్య చీరలో భాగాన్ని తీసుకుని వెళ్ళిన విషయాన్ని ప్రస్తావించేలా చేసింది. ఆ పని చేసింది నలుడే కాబట్టి అతడు ఏడ్చాడు.

          ఇప్పుడు నలుడి మనస్సులో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒక్క క్షణం అతడు ఆమె పాతివ్రత్యాన్ని శంకించాడు. ఒక మంచి కుటుంబంలో జన్మించి, పవిత్రమైన మనస్సు కలిగిన దమయంతి వంటి స్త్రీ మళ్ళీ స్వయంవరానికి ఎలా ఒప్పుకుంది అనేది అతడి సందేహం.

          ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రశ్నించుకుని సందేహాలు తీర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మనస్సులు స్వచ్ఛంగాను, ప్రశాంతంగా ఉన్నాయి.

          తన ఆకారం తనకి వచ్చేందుకు తన దగ్గరే ఉన్న మంత్రమహిమ కలిగిన బట్టని ధరించే సమయం వచ్చిందనుకున్నాడు. వెంటనే నలుడు ఆ వస్త్రాన్ని ధరించాడు.

          అందవికారమైన అతడి ఆకారం మారిపోయి తనదైన రూపంతో యువకుడైన నలమహారాజు దమయంతి ఎదురుగా నిలబడ్డాడు. దమయంతి చాలా సంతోషపడింది.

          మహారాజు నలుణ్ని చూసి తన దగ్గర రథ సారథిగా పనిచేసిన వ్యక్తి చక్రవర్తి నలమహారాజని తెలుసుకుని నిశ్చేష్టుడయ్యాడు.

          నలమహారాజు తన సోదరుడితో మళ్ళీ జూదం ఆడాడు. అతణ్ని ఓడించి తన రాజ్యాన్ని తను దక్కించుకున్నాడు. నలుడు తన రాజ్యాన్ని, సంపదల్ని, భార్యని తిరిగి పొందాడు.

          కొంత కాలం అక్కడే ఉండి భార్యని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి కష్టాలు మొదలయ్యి అప్పటికి మూడు సంవత్సరాలు గడిచాయి.

          నలదమయంతులు ఎన్ని కఠిన పరీక్షలు ఎదురయినా స్వచ్ఛత, విధేయత, ధర్మం వదలకుండా వాటికి కట్టుబడి ఉన్నారు.

పాతివ్రత్యమే అతివలకి వజ్రాభరణం!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.