ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య కొలకలూరి మధు జ్యోతి!

(ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య కొలకలూరి మధు జ్యోతి గారు ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నెచ్చెలి హార్దిక అభినందనలు తెలియజేస్తూ ఈ వ్యాసాన్ని అందజేస్తున్నది-)

  -ఎడిటర్

          ప్రముఖ రచయిత్రి,  విమర్శకురాలు, చదువుల సరస్వతి ఆచార్య కొలకలూరి మధు జ్యోతి గారు. రేడియోలో వ్యాఖ్యాతగా మొదలుకుని లెక్చరర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, తెలుగు శాఖాధ్యక్షులుగానూ పనిచేసి ఇప్పుడు ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పగ్గాలు చేపట్టిన శ్రీమతి కొలకులూరి మధు జ్యోతి గారు స్త్రీ మూర్తు లందరికీ  ఆదర్శం. 

          ఆచార్య మధుజ్యోతి తల్లిదండ్రులు శ్రీమతి కొలకలూరి భాగీరథీ, ఇనాక్ గార్లు. భర్త ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు. చి. సరయ. చి. ఆశీష్ ప్రభాత్ లు వీరి సంతానం. వీరు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చేసి గోల్డుమెడల్ సంపాదించారు. ‘తెలుగు సాహితీ వస్తు పరిణామం’ గురించి పరిశోధించి, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. పట్టా పొందారు. దీనికి – 2004 లో శ్రీ పురాణం సూరిశాస్త్రి మల్లాది సూరి శాస్త్రి స్మారక పురస్కారం లభించింది. తమిళం, అనువాదంలో డిప్లమాలు పొందారు.

          ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా తన కెరీర్ ను ప్రారంభించి,  ప్రతిష్టాత్మక మైన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మొదటి అటెంప్ట్ లోనే క్వాలిఫై అయ్యి పద్మావతీ  మహిళా యూనివర్శిటీలో లెక్చరర్ గా నియమితులయ్యారు. ఆచార్య మధుజ్యోతి 26 సంవత్సరాల బోధన పరిశోధనానుభవం కలిగి ఉన్నారు. వీరు శాఖాధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక సంఘాధ్యక్షులుగా, యూనివర్శిటి కమ్యూనిటి ఎంగేజ్మెంట్ డైరెక్టరుగా పని చేశారు. యుజిసి, ఎపిపియస్ సి, తెలుగు ఉభయరాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు రిసోర్సు పర్సన్ గా ఉన్నారు. విక్రమ సింహపురి, వేమన విశ్వవిద్యాలయాల తెలుగు పాఠ్య ప్రణాళి క సంఘ సభ్యులుగా ఉన్నారు.

          ఆచార్య మధుజ్యోతి 205 కి పైగా పరిశోధన పత్రాలను జాతీయ అంతర్జాతీయ సదస్సులలో వివిధ సభలలో సమర్పించారు. వివిధ పత్రికల్లో 84 పరిశోధన పత్రాలు, విజ్ఞాన సర్వస్వాలలో అనేక వ్యాసాలు ప్రచురించారు. పలు రేడియో ప్రసంగాలు చేశారు. టీవి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో పదకొండుమంది పిహెచ్.డి., నలుగురు ఎం.ఫిల్., పట్టాలు పొందారు. వీరి పర్యవేక్షణలో ఒక ప్రవాసాంధ్ర పరిశోధక విద్యార్థిని పిహెచ్.డికి కృషి చేస్తూ ఉంది.

          అనంతపురం రామచంద్ర నగర్ లో స్కూల్లో చదివారు. తన తల్లి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ పిల్లల్ని పెంచడం కోసం ఎనిమిది సంవత్సరాలు సెలవు తీసుకుని తమ అభివృద్ధికి తోడ్పడిన తన తల్లి ఆదర్శాన్ని గుర్తు చేసుకుంటూ చెబుతూ ఉంటారు. మదనపల్లిలో తన తల్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు పేద పిల్లలతో కలిసి దీపావళిని జరుపుకున్న సంగతిని తీపి జ్ఞాపకంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన తల్లి తన పట్ల చూపిన ప్రేమకు గుర్తుగా ఆమె రిటైర్ అయిన తర్వాత ఆమెకు చాలా మంచి పుస్తకాలు చదవటానికి, అలాగే తనకి ఇష్టమైన సంగీతాన్ని వినటానికి పాటలన్నీ క్యాసెట్స్ గా చేయించి అందించానని చెబుతారు.

          ఇక తన తండ్రి ఆచార్య కొలకులూరి ఇనాక్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన చిన్నతనంలో తన సోదరికి ఆయన  ‘పూర్ణమ్మ’  కథని చెబుతూ ఉంటే తన కంటి వెంట నీరు ధారలు కట్టిందని చెబుతారు. తన తండ్రి ఆ కథను హృదయాన్ని హత్తుకునేలాగా చెప్పారు అని అంటారు.

          తాను యూజీసీ నెట్ కి ప్రిపేర్ అవుతూ ఉండగా లైబ్రరీకి వచ్చి తన తండ్రి ఓల్డ్ పేపర్స్ అన్నిటినీ ఇచ్చి వెళ్ళారు. తన తండ్రికి తన పట్ల ఉన్న నమ్మకాన్ని, ఆశను గుర్తించి ఆ నెట్ ఎగ్జామ్ కి అప్పటి వరకు సీరియస్ గా  ప్రిపేర్ అవ్వకపోయినా,  అప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యి మొదటి అటెంప్ట్ లోనే తాను నెట్ క్వాలిఫై అయ్యానని చెబుతారు.

       తాను ‘గోన గన్నారెడ్డి’ అనే అడవి బాపిరాజు గారి నవల పైన రాసిన పత్రాన్ని  ఆమె తండ్రి ఇనాక్ గారు చదివి “మరింత మెరుగుపరుచుకోవాలి” అని అంటూ విమర్శించారని అది తన జీవితంలో ఎదుర్కొన్న మొదటి విమర్శ అని, తద్వారా తాను ఇంకా ఎంత కృషి చేయాలో తెలుసుకున్నారని ఆమె చెబుతారు.

          రచనా వ్యాసంగంలో మొట్టమొదటిగా చెప్పుకోదగిన రచన ‘అమ్మమ్మకు అప్పగింత’  అనేటటు వంటి కథల పుస్తకం. తన తల్లి ఈ లోకం నుంచి నిష్క్రమించినప్పుడు కలిగిన  దుఃఖానికి సంబంధించినటు వంటి నేపథ్యంలో ఈ రచన చేసారు. 

          అయితే తన మొదటి రచన విమర్శనా నేపథ్యంలో ఉన్నది. అలాగే తన కెరీర్ పరంగా కూడా విమర్శనాత్మకమైనటు వంటి వ్యాసాలు రాయటం ఎక్కువ అవసరం కనుక విమర్శలే ఎక్కువ రాసాను అని చెబుతారు. తన వృత్తిరీత్యా సమయమంతా యూనివర్సిటీలోనే గడపవలసి రావటం వల్ల సామాజిక పరిస్థితులు, సామాజిక సమస్యలు పట్ల అవగాహన తక్కువ అవడంతో ఇక కథలు ఎక్కువ రాయలేకపోయాను అనే అసంతృప్తి ఉందని చెబుతారు. 

          తనను ప్రభావం చేసిన రచనల గురించి చెబుతూ తాను చలం యొక్క సాహిత్యా న్ని చాలా ఎక్కువ చదివానని, ఇనాక్ గారి 104 పుస్తకాలు చదివానని, ఓల్గా, బెజవాడ గోపాల్ రెడ్డి, గోపీచంద్, శ్రీ శ్రీ మొ.న వారి పూర్తి రచనలు, అనేక విమర్శనా గ్రంథాలు చదవటం వల్ల తన ఆలోచనలో పరిపక్వత వచ్చిందని చెబుతారు. 

          ఒక రచయితని అంచనా వేయాలంటే కేవలం ఒక పుస్తకాన్ని చూసి చెప్పలేమని, మొత్తం వారి సాహిత్యాన్ని అంతటినీ కూడా చదవకుండా  వారిని విమర్శ చేయలేమని చెబుతారు.  

          మధుజ్యోతి గారికి జానపద సాహిత్యం అంటే  ఇష్టం. సైకాలజీని జానపదంలో పెట్టి చూడవచ్చు అని కొత్త విషయాన్ని ప్రతిపాదన చేశారు కూడా. 

          ఆమె పరిశోధన ‘తెలుగు సాహితీ వస్తు పరిణామం’. కాబట్టి ఆమెకు ప్రాచీన సాహిత్యం గురించి, ఆధునిక సాహిత్యం గురించి కూడా పూర్తి అవగాహన ఉంది.  స్త్రీవాద సాహిత్యం, దళితవాదం తనకు ఇష్టమైనటువంటివని, ఈ విషయాల పై ఎక్కువ పరిశోధన చేసి వ్యాసాలు రాశానని ఆమె చెబుతారు.

ముఖ్య రచనలు: బెజవాడ గోపాలరెడ్డి కవిత్వం -సౌందర్యం, సాహిత్యవీక్షణం, ‘తెలుగు సాహితీ వస్తు పరిణామం, దండోరా అంబేద్కర్ అభీష్టం, శ్రీ తాళ్ళపాక సాహిత్యాను శీలనం, ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం పై విమర్శనం(సం), పిడికెడు ఆలోచనలు, స్త్రీ వాద సాహిత్యం-సామాజిక అవసరం, ఆధునిక తెలుగు సాహిత్యం- దళిత సంస్కృతి, నాన్న(ఆచార్య కొలకలూరి ఇనాక్ జీవిత చరిత్ర), గుప్పెడు తలపులు, దళిత సాహిత్య సౌందర్య తత్త్వం, సంకల్పం- సంఘర్షణ- జయకేతనం గుఱ్ఱం జాషువా, తొలి దళిత ఆత్మగౌరవ స్వరం-కుసుమ ధర్మన్న కవి, అమ్మమ్మకో అప్పగింత వీరి కొన్ని ముఖ్య రచనలు.

అవార్డులు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు 2011, AP ప్రభుత్వంచే గుర్రం జాషువా అవార్డు 2016 లో , ఏపీ ప్రభుత్వం ద్వారా ఉగాది పురస్కారం 2017, . జాషువా సాంస్కృతిక సమాఖ్య వినుకొండ రచించిన గుర్రం జాషువా సాహితీ పురస్కారం, 2017లో  భారత సాంస్కృతిక వ్యవహారాలు, న్యూఢిల్లీ మరియు AP సాంస్కృ తిక వ్యవహారాల సహకారంతో అభినయ ఆర్ట్స్, తిరుపతి ద్వారా సాహితీ పారిజాతం, . మహాత్మా జ్యోతి రావు ఫూలే ఫౌండేషన్, నెల్లూరు ద్వారా సావిత్రి బాయి ఫూలే జాతీయ మహిళా అచీవర్ అవార్డు 2018లో ;  డా.బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు; . ఎస్.పి.మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి 5.9.2018 ద్వారా ఉత్తమ పరిశోధన పురస్కారం;   NGO నెట్‌వర్క్ ద్వారా తలమర్ల కళానిధి అవార్డు 2019 లో, సావిత్రి బాయి ఫూలే అవార్డు పీపుల్స్ ఫ్రంట్ 2020 లో,  వే ఫౌండేషన్, తిరుపతి ద్వారా వండర్‌ఫుల్ ఔట్‌స్టాండింగ్ ఉమెన్ అవార్డు;  డాక్టర్ బి.ఆర్. రత్నమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబేద్కర్ జాతీయ అవార్డు 2021 లో;  2021న ఒంగోలులోని కళా మిత్ర మండలిచే శ్రీమతి సింహాద్రి విశాలాక్షి స్మారక ప్రతిభా జాతీయ పురస్కారం మరియు అనేక ఇతర అవార్డులు అందుకున్నారు. 

          ఆచార్య మధుజ్యోతి గారు 225కి పైగా పరిశోధన పత్రాలను జాతీయ అంతర్జాతీయ సదస్సులలో,  వివిధ సభలలో సమర్పించారు. వివిధ పత్రికల్లో 84 పరిశోధన పత్రాలు, విజ్ఞాన సర్వస్వాలలో అనేక వ్యాసాలు, 24 పుస్తకాలు  ప్రచురించారు. 

          ఇంతటి ప్రతిభామూర్తి డిసెంబర్ 2023 లో ద్రవిడ విశ్వ విద్యాలయం ఉపకులపతిగా నియమితులవ్వడం తెలుగు సాహిత్యంలో, విద్యారంగంలో కృషి చేస్తున్న స్త్రీలందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం. 

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.