మలయమారుతం- (బ్రిస్బేన్) శారద కథలు పరిచయం

– ఎన్.ఎస్.మూర్తి

 

          ఈ కథాసంకలనంలో 15 కథలు ఉన్నాయి. 15 కథలలో జీవిత చిత్రణ ఉంది. చదువుకున్నవాళ్ళు ఆలోచనాపరంగా స్వతంత్రులుగా ఉండగలరు అన్నది ఒక భావన. కానీ, తమ వ్యక్తిగత అభిప్రాయాల పరిధిలో విషయ వివేచన చేసే వారే తప్ప, వస్తువుని లేదా సమస్యని దానికది విడిగా చూసి వివేచన చేసే వారు అరుదు. వయసూ, అందం, తాము నీతిమంతులమనే భావనా, అధికారాల్లాగే, చదువు కూడా అహంకారాన్ని ఇస్తుంది. తమ కంటే తక్కువ తెలివైనవారని భావిస్తున్న వారి పట్ల, కొంత చులకన భావమూ,వారిని ఉద్ధరించడమే తమ కర్తవ్యమనే ఒక మెట్టు పైని ఉన్నామనుకునే ఆలోచనా బయలు దేరుతాయి. తన శీలాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నానని భావిస్తూ, తనకంటే పదేళ్ళు తక్కువ వయసున్న అబ్బాయి మీద తనకే తెలియని ఒక అపేక్ష పెంచుకున్న ముప్ఫైఅయిదేళ్ళ స్త్రీ కథ…’అగాధం.’ అతను వివాహం చేసుకున్న పిల్ల గత చరిత్ర తెలియడం వలన ఆమెతో చిత్రంగా ప్రవర్తించిన ఆమెని, ఆ కుర్రవాడు చివరకి ఆమెలోని లోపాన్ని ఎత్తి చూపడం ఇతి వృత్తం.

          తన కూతురుకీ, పిల్లలకీ ఒక నీతి, పరులకి ఒక నీతి అనుసరించే సగటు తల్లి కథ… మాతృదేవోభవ.

          యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి చూపులు దాటి ముందుకు పోనపుడు, దాని దాటి వచ్చిన ఒక్క అవకాశాన్నీ వదులుకో లేక, ఆ అబ్బాయి పెళ్ళి చేసుకో దలుచుకున్న అమ్మాయి రేఖ గురించి అబద్ధాలు కల్పించి చెప్పిన సురేఖ కథ మలుపు. చిత్రంగా అదే రేఖ ఇరవై సంవత్సరాల తర్వాత ఒక బస్టాండులో సురేఖకు కనపడి, ఒకే బస్సులో, పక్క పక్క సీట్లలో ప్రయాణం చేస్తుంది. ఇంకా రెండు గంటలు ప్రయాణం ఉందనగా సురేఖ ప్రక్కనే నిద్రపోతున్న రేఖను లేపి సునీల్ తో ఆమె పెళ్ళి చెడగొట్టింది తనేనని చెప్పి, అందుకే తనకు పిల్లలు కలుగలేదన్న తన అపరాధ భావనని బయట పెడుతుంది ‘మలుపు’ కథలో. పడుకున్న రేఖను లేపి మరీ చెప్పడం వాస్తవానికి దూరంగా ఉంది.   

          మనకి తెలియకుండానే మనకంటే తెలివైన వారి పట్ల, అందంగా ఉండే వారి పట్ల కొందరికి ఆరాధనా భావం కలిగితే, కొందరికి ఈర్ష్య అసూయలు కలుగుతుంటాయి. ఈ అసూయా పరులు వారికంటే తాము ఎందులో మెరుగో వెతుక్కుని, దాన్ని ఎత్తి చూపి, వారికంటే తాము అధికులమని ఋజువు చేసుకునే అవకాశం కోసం చూస్తుంటారు.  తన మీద, తన జీవితం మీద తనకి ఉన్న అసంతృప్తి, తనకంటే తెలివైన, చురుకైన, అంద మైన స్త్రీ మీద ఈర్ష్యగా పరిణమించి, ఆమె భర్త ప్రవర్తనలోని లోపాన్ని ఎత్తి చూపించి జాలి ప్రదర్శిద్దామనుకున్న ఒక స్త్రీ, ఆ చురుకైన స్త్రీ, తన పట్ల, తన కుటుంబ బాధ్యతలని సమర్థవంతంగా నిర్వర్తించడం పట్లా అడ్మిరేషన్ ని ప్రదర్శించినపుడు,  చెప్పాలను కున్నది మరిచిపోవడమే గాక, తన మీద తన అయిష్టత కూడా తగ్గించు కుంటుంది ‘చాపల్యం’ కథలో.

          ‘వినిపించని రాగాలు ఇంకా మధురం’ అని కీట్స్ అన్నాడు గాని, గుండెలోతుల్లో మౌనంగా భరించే బాధల హోరు ఎంత కటువుగా ఉంటుందో అది అనుభవించవలసిం దే తప్ప మాటలకి అందేది కాదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు పెళ్ళి చేసుకున్న కారణాన, ఆ తర్వాత ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చినపుడు, ఊరట ఆశించి తల్లి దండ్రుల దగ్గరకు వస్తే తండ్రి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన తీరు ఆమె మరణానికి కారణం అయిందని ముదిమి వయసులో విడాకులు తీసుకున్న ఒక తల్లి, తను ప్రాజెక్టు పనిమీద ఆరు నెలలు బయటకి వెళ్ళినపుడు, కట్న కానుకలిస్తానన్న తన తమ్ముడు కూతురుని చెయ్యాలన్న ఉద్దేశంతో, తను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని తల్లిదండ్రులకి చెప్పి ఒప్పించిన అమ్మాయి తల్లిదండ్రులతో, తల్లి ప్రవర్తించిన తీరుకి ఆ పెళ్ళి చెడిపోయి నపుడు తల్లిని క్షమించలేక దూరంగా పై దేశాలకు వెళ్ళిపోయిన యువకుడి కథ వెరశి ‘నిశ్శబ్దపు హోరు.’

          “అన్నింటిలోకి సులువైనది ఏది?” అన్న యక్ష ప్రశ్నకు “ఇతరులకు సలహా ఇవ్వడం ” అంటాడు ధర్మరాజు మహాభారతంలో. ఆ పని మనం నిత్యం చేస్తూనే ఉంటాం. మనకి జీవితంలో సవాళ్ళు ఎదురైనపుడు ఇతరులకి మనం నూరిపోసిన వేల సలహాలలో ఏ ఒక్కటీ మనకి గుర్తుండదు. జీవితంలో వైరుధ్యం ఇదే.

          జీవితం సజావుగా సాగుతున్నపుడు ప్రమాదంలో చూపును కోల్పోయి, జీవితం వృధా అని నిర్ణయించుకుని, ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్న ఒక గణిత ఉపాధ్యాయినికి, ఆమె ఆలోచనలోని వైరుధ్యాన్ని ఎత్తి చూపి మామూలు మనిషిని చేసిన సాటి ఉపాధ్యాయుని కథ ‘వేగుచుక్క.’

          ఇలాంటి కథే సలీం అన్న రచయిత ఒక పిన్నిని గురించి వ్రాసినట్టు గుర్తు. స్త్రీలు చేసే త్యాగాల ముందు పురుషులు చేసే త్యాగాలు చాలా చిన్నవి. నాకు తెలిసి, బాల్య వివాహంలో ఈడేరకుండానే భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, అన్నదమ్ములు తనని 1910 ప్రాంతాల్లో మద్రాసులో ఉంచి మెడిసిన్ (ఆ రోజుల్లో LIM) చదివించిన కారణంచేత, తన జీవితాన్ని అన్న పిల్లల పెంపకానికే ధారపోసిన స్త్రీ నాకు ప్రత్యక్షంగా తెలుసు. భర్త లేక పోయినా దశాబ్దాల పాటు పిల్లల్ని పెంచి, సంసారాల్ని, ఆస్తులని నిలబెట్టిన అనేకానేక మంది స్త్రీల కథలూ తెలుసు. 

          బాధ్యత తెలియని భర్త ఇద్దరు పిల్లలున్న స్త్రీ, ఎవరూ చేయడానికి సాహసించని త్యాగం చేసి, అనుభవించిన పర్యవసానాన్ని దగ్గరగా గమనించిన సానుభూతిపరుడైన ఆమె మేనల్లుడి దృష్టిలోంచి చెప్పిన కథ…’ప్రహేళిక.’

          ‘ఏకానేకం.’ పెద్ద చదువుల మీద ఆశతో పెద్ద పెద్ద యూనివర్శిటీలని భ్రమ కల్పించిన పై దేశాలలోని అనామకపు యూనివర్శిటీలలో చేరి, ఇంటి నుండి వచ్చే సాయం చాలక ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడి సమస్యలకి అమాయకంగా బలై పోతున్న విద్యార్థుల కథ. ఇది వర్తమాన పరిస్థితులని చక్కగా ప్రతిబింబిస్తున్న కథ.

          ఎక్కడో చదివేను. రెండవ ప్రపంచయుద్ధకాలంలో జపాను వారి స్వాధీనంలో ఉన్న ఒక ప్రాంతాన్ని చేజిక్కించుకుందికి సమైక్య దళాల ఒక విభాగం ప్రయత్నించి, ఎక్కువ ఆయుధాలూ, బలగం ఉన్నప్పటికీ విఫలమైంది. ఆ దళాధిపతిని కోర్టుమార్షల్ చేసిన పుడు వాళ్ళ ప్రయత్నం ఎందుకు విఫలమైందో పది కారణాలు చెప్పాడుట. అప్పుడు కోర్టు మార్షల్ చేస్తున్న అధికారి ఇలా అన్నాడుట :” ‘నువ్వు చెప్పిన పది కారణాలూ సబబుగానే ఉన్నాయి గానీ, నువ్వు  పదకొండో కారణం చెప్పడం మరిచిపోయావు.’ ‘ఏమిటి?’అని కోర్ట్ మార్షల్ చెయ్యబడుతున్న వ్యక్తి అడిగితే దానికి ‘నువ్వు గెలుస్తావన్న నమ్మకం నీకు లేదు.’ అని బదులిచ్చాడుట. “

          మనం మన ఆలోచనలనీ, మన చేతలనీ సమర్ధించుకుందికి ఎంత మంచి కారణాలు చూపించి నప్పటికీ, మనం చెప్పుకోని, చెప్పడానికి ఇష్టపడని, కారణం వేరే ఉంటుంది. ఇతరుల ఆలోచనలనీ, చేతలనీ అవలీలగా విశ్లేషించుకునే మనం మన విషయంలోనూ, మనకు ఇష్టమైన వాళ్ళ విషయంలోనూ దీనికి మినహాయింపుగా ప్రవర్తి స్తామని చూపించే కథ ‘ముసుగులు.’

          పైకి డాంబికాన్ని ప్రదర్శిస్తూ అంతరాల్లో ప్రేమ కలిగుండే యువతీ యువకులు తమ ప్రేమను సాధించటానికి వేసే కొన్ని ఎత్తుగడల గురించి తెలియజేసే ప్రేమ కథ  ‘మలయ సమీరం.’

          తను ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా తనకంటే పెద్ద ఉద్యోగం, లేదా ఎక్కువ ఆదాయం సంపాదించే భార్యని చూస్తే చాలా మంది మగవాళ్ళకి ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. దానివల్ల కలిగే చెడు ఫలితాలకి దాంపత్య జీవితానికే విఘాతం ఏర్పడి నపుడు ఆడవాళ్ళే సర్దుకుపోవాలని అందరూ సలహా ఇస్తారు… అవసరమైతే ఉద్యోగాన్ని మానుకోమనడంతో సహా. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చే ఊరట ఎవరూ ఇవ్వలేరు. ఏ సంసారంలోనైనా సమస్యలకి సమాధానాలు భార్యాభర్తలే కనుక్కోవాలి తప్ప ఇతరులు   ఇచ్చే సలహాలు ఆచరణ యోగ్యం కావు అని చెప్పే మంచి కథ ‘మారేదీ మార్పించేదీ.’

          ఈ పుస్తకానికి పెట్టిన పేరుతో ఉన్న కథ ‘మలయమారుతం.’ ఉద్యోగాలతోనూ, దాని లోని ఒత్తిడులతో, సంసారాన్ని నడపడానికి కావలసిన వస్తువులు సమకూర్చడంలో మునిగిపోయిన యువ జంటలకు ముఖ్యంగా తమ పిల్లల సమస్యలను విశ్లేషించి సమాధానం కనుక్కోగల సమయమూ, ఓపికా ఉండవు. నిజానికి ఆ ఖాళీని పూరించడానికే పూర్వం సమిష్టి కుటుంబాలుండేవి. ఆ బాధ్యత కుటుంబంలోని వృద్ధులు తీసుకోవాలి. బాల్యంలోనే ఎదుర్కొంటున్న ఒత్తిడులు, ముఖ్యంగా ఇంజనీరింగు, మెడిసిన్ లలో సీటు రాకపోవడమో, వచ్చిన తర్వాత మొదటి సంవత్సరాల్లో ఎదుర్కొనే సమస్యలని వాళ్ళు మనసు విప్పి పంచుకోగల ఆసరా న్యూక్లియర్ కుటుంబాలలో ఉండటంలేదు. పిల్లలతో అనుబంధాన్ని పెనవేసుకుని, ఆ ఖాళీని పదవీ విరమణ చేసిన పెద్దలు పూరించగలరని చూపించే కథ.

          ‘భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు’ అంటాడు వేమన. ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాల వెనుకా, NGOల మంటూ కొన్ని సంస్థలూ, వ్యక్తులూ చేసే సహాయాల వెనుకా అయిష్టంగా పెట్టే తద్దినాల తంతు ఉంటుంది తప్ప వాటి వెనుక సేవా భావం తక్కువ. ఆ చేతల వెనుక స్పష్టంగా కనిపించే “నేను నీకు ఎంత ఉపకారం చేస్తున్నానో చూడు! దానికి నువ్వు ఎంతో కృతజ్ఞతగా ఉండాలి, (లేదా నా పార్టీకే ఓటు వెయ్యాలి)” అన్న భావన  తొంగి చూస్తుంది.  ప్రేమతో దగ్గరకి హత్తుకున్నపుడు స్పందించినంత ఆత్మీయంగా, మనిషి పెట్టుపోతలకి స్పందించడు అన్న సత్యాన్ని చాటి చెప్పిన కథ ‘చేయూత.’

          స్త్రీ పురుషులకి ఒకరి పట్ల ఒకరికి వయసుతోపాటు కలిగే ఆకర్షణ సహజం. కానీ ఆస్కార్ వైల్డ్ కీ, లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్ కీ మధ్య ఉన్న ఆకర్షణ గానీ, ప్రముఖ టెన్నిస్ క్రీడా కారిణి నవ్రాతిలోవా, రీట మే బ్రౌన్ ల మధ్యగానీ ఉండే ఆకర్షణ, సాహిత్యంలో చోటు చేసుకోకపోయినప్పటికీ అసహజం మాత్రం కాదు. నేటి సమాజంలో వారి పట్ల సానుభూతి కి బదులు అటు వంటి ఆకర్షణ కూడ సహజమైనదిగా స్వీకరించే భావన ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో పుట్టి పెరిగిన వారు దీనికి సకారాత్మకంగా స్పందించడానికి వెనుకాడతారు. పుట్టుకతో చేసిన లింగ నిర్ధారణ వయసు పొడచూపుతున్నపుడు శరీరంలో ఉత్పత్తి అయే హార్మోనుల ప్రభావం వల్లా, జెనెటిక్ కారణాల వల్లా అనేక మార్పులకు లోను కావచ్చు. మనిషి మనిషిగా జీవించడానికి సహృదయతా, సానుభూతీ, అనునయించ గల తోడూ అవసరమని చెప్పే కథ… ‘ఉన్నదానికీ అనుకున్నదానికీ.’

          కష్టాలు కట్టగట్టుకుని వస్తాయి, సుఖాలే, ఒంటరిగా వస్తాయని ఒక ఇంగ్లీషు సామెత. కొన్ని ఉద్యోగాలకి కేవలం నైపుణ్యం చాలదు. ఇతర అర్హతలు కావాలి. కానీ వయసంత మాయల మరాఠీ మరొకటి ఉండదు. యవ్వనంలో ఇచ్చిన నిగారింపులన్నీ ముదురు వయసులో లాక్కుంటుంది. ఉద్యోగం పోవడంతోనో, సంసారబంధం తెగిపోవడంతోనో, పదవీ విరమణతోనో జీవితం ముగిసిపోదు. ‘జ్యోత్సెజ్యోత్జలాకె చలో’ అన్నట్టు, మన జీవితం మిణుకుమిణుకు మంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆరిపోయే లోపు మరొక దీపాన్ని వెలిగిస్తూనే ఉండాలి అని చెప్పిన కథ ‘సజీవం.’

          శారద కథలు అనగానే ప్రముఖ తెనాలి రచయిత నటరాజన్ అని పొరబడె ప్రమాదం ఉంది. అయితే నేటి తరానికి ఆ పేరు అంతగా పరిచయం లేకపోవడం వల్ల ఆ అవకాశం తక్కువ అయి ఉండొచ్చు. శారదామురళి కథలు అని టైటిల్ పేజీ మీద ఉంటే బాగుండేది. (కానీ దానికి ఆమె తన ఉద్యోగ రీత్యా వచ్చే కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఇక నుండి తన రచనలన్నీ బ్రిజ్బేన్ శారద పేరుతో వస్తాయని చెప్పారు)

          శారద గారి కథనం బాగుంటుంది. మధ్య మధ్యలో ఆమె చేసే పరిశీలనలు చాలా లోతుగానూ, ఆలోచింపజేసేవి గానూ ఉంటాయి. పాఠకుణ్ణి ఆవేశపరుణ్ణి కాకుండా, ఆలోచనా పరుడిగా చేస్తాయని నా నమ్మకం. సాధారణంగా ఒక కథా సంకలనంలో గాని, కవితా సంకలనంలో గాని రెండు మూడు మంచి కథలు/ కవితలు ఉంటే అది మంచి సంపుటి అని నా అభిప్రాయం. ఇందులో అంత కంటే ఎక్కువే ఉన్నాయి.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.