అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 13

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియాలో స్థిరపడటానికి వచ్చిన క్రొత్తగా పెళ్ళైన జంట. వారిద్దరూ ప్రస్తుతం గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ అకామడేషన్ ఉంటున్నారు. గోపీ అతని భార్యతో డైవోర్స్ తీసుకోబోతున్నాడని తెలిసి ఇద్దరూ షాకయ్యారు. గోపీ నెల రోజులు
ఇండియా వెళ్ళాడు. విష్ణు, విశాలకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆమెను ఒలింపిక్ గేమ్స్ కి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఇండియా నుంచి ఒలింపిక్స్ చూడటానికి వచ్చిన జంట హరీష్, స్వప్న పరిచయమయ్యారు. నిద్ర లేచిన విశాలకు విష్ణు ఫోన్ వచ్చిందని ఆమె చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చాడు.

***

          విశాల, మొట్టమొదట విష్ణు కొన్న మొబైల్ కి వచ్చిన ఫోన్, ఎవరు చేసి ఉంటారా అని ఆశ్చర్యంగా ఫోన్ అందుకుని “హలో!” అంది.

          అవతల కంఠం “హాయ్! విశాల హౌ ఆర్ యూ? థిస్ ఈస్ మేగీ! ఐ గాట్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ! ఐ హేవ్ ఫార్ వార్డెడ్ యువర్ రెస్యూమె టు వన్ ఆఫ్ ద ఫేమస్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ టేఫ్ కాలేజ్. దే హేవ్ ఆఫర్డ్ యూ వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రామ్ ఫర్ వన్ మంత్” అని వివరాలు చెప్పింది.

          ఆ విషయం వినగానే విశాల చెప్పలేనంత సంతోషంతో “ఓ రియల్లీ! ఐయామ్ వెరీ ఎక్సైటెడ్! థాంక్యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్ట్యూనిటీ” అని ఆనందంతో అంది.

          మ్యాగీ వర్క్ ఎపుడు మొదలవుతుందో, ఎవరిని కలవాలో, లొకేషన్ అడ్రస్ అన్ని వివరాలు చెపుతుంటే నోట్ పాడ్ మీద అన్ని రాసుకుంది విశాల.

          విష్ణుని ఒక్కసారిగా కౌగలించుకుని, “నన్ను నేను నమ్మలేకపోతున్నాను. నాకు జాక్ పాట్ తగిలినంత ఆనందంగా ఉంది. ఇండియా నుంచి ఇలా చదువు పూర్తి చేసుకుని వచ్చిన నన్ను మీరు నిజంగా అందలం ఎక్కించారు. ఐయామ్ వెరీ హ్యాపీ! అంటూ ఆనందంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది విశాల.

          విశాల నోట్లో ఆమె ఇష్టంగా కొనిపించుకున్న చెర్రీ రైప్ చాక్లెట్ తుంపి,  “కంగ్రాట్యు లేషన్స్!” అంటూ పెట్టాడు విష్ణు. 

          ఇద్దరూ ఆ రోజు కబుర్లు చెప్పుకుంటూ, ఫ్రిజ్ లో నుంచి బ్రెడ్, బటర్ తీసుకుని పెనం మీద కాల్చుకుని బ్రేక్ ఫాస్ట్ తిన్నారు.

          ఇద్దరూ స్వంత ఇల్లు కాకపోయినా స్వతంత్రంగా ఒక ఇంట్లో మొదటిసారిగా కలిసి జీవనం మొదలుపెట్టారు. ఆ జంట ప్రతి క్షణం నిత్యనూతనంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

          ఇద్దరూ అవసరమైన ఐడెంటిటీ డాక్యుమెంట్స్, బ్యాగ్ భుజాన వేసుకుని బస్ ఎక్కి నేరుగా లైబ్రరీకి వెళ్ళారు. విశాల లైబ్రరీ కార్డ్ ఇచ్చి కంప్యూటర్ ఇంటర్ నెట్  చూసుకోవ డానికి గంట బుక్ చేసుకుంది.

          విష్ణు అక్కడే ఉన్న సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ న్యూస్ పేపర్ చూస్తున్నాడు. ఆ రోజు బుధవారం కావడంతో మధ్య పేజీలో రిక్రూట్ మెంట్ సెక్షన్ లో వివిధ రంగాలలో జాబ్స్ అడ్వర్ టైజ్ మెంట్స్ ఆసక్తిగా చూస్తూ జాబ్ మార్కెట్, తనకు సంబంధించిన బ్రాంచ్ లో జాబ్స్ వివరాలు డైరీలో రాసుకున్నాడు. చివరి పేజీలలో చిన్న చితక జాబ్స్ టెలీ
మార్కెటింగ్, ప్రోసెస్ వర్కర్ ఇలా ఉద్యోగ తీరు తెన్నులు అర్థం చేసుకున్నాడు.తరువాత ప్రక్కనే ఉన్నడైలీ టెలీగ్రాఫ్ పేపర్, ది గార్డియన్, ది ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్స్ తిరగే సాడు. వీకెండ్ గత శనివారం న్యూస్ పేపర్ లో గవర్న్ మెంట్ జాబ్స్ చూసిన తరువాత
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల గురించి అవగాహన ఏర్పడింది, ఒకళ్ళు చెప్పే కన్నా, స్వంతంగా రీసెర్చ్ చేసుకోవడం ఉత్తమం అనుకున్నాడు మనసులో.

          మరోప్రక్క విశాల కంప్యూటర్ ఇంటర్ నెంట్ ఓపెన్ చేసి తనకు వచ్చిన వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రదేశం వివరాలు సెర్చ్ చేసింది. టేఫ్ TAFE అంటే టెక్నికల్ అండ్ ఫర్ దర్ ఎడ్యుకేషన్ అని పూర్తి అబ్రివియేషన్ తెలుసుకుంది. ఆస్ట్రేలియాలో వర్క్ స్కిల్ బేస్ డ్.
నచ్చిన రంగంలో జాబ్ చేయాలంటే టేఫ్ లో షార్ట్ టెర్మ్ కోర్సెస్, క్వాలిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరడానికి మంచి బాట వేస్తుందని తెలుసుకుంది. విశాలకున్న గ్రేట్ క్వాలిటీ తను ముందు చేయబోయే ఏ పనిగురించైనా ముందే తగినంత హోమ్ వర్క్ చేసుకుని మంచి అవగాహనతో సిద్ధంగా వెళ్ళాలని అనుకుంటుంది.

          అక్కడే ఉన్న లైబ్రేరియన్ జాస్మిన్ ని చూసి పలకరింపుగా నవ్వింది విశాల. తనకు ఇష్టమైన ఇండియన్ కుకరీ బుక్స్ ఏ షెల్ఫ్ లో ఉన్నాయో తెలుసుకుని అక్కడకు వెళ్ళి “ఇండియన్ ఫ్లేవర్ ఎవ్విరి డే” పుస్తకం లైబ్రరీ కార్డ్ ఇచ్చి తీసుకుంది.

          అక్కడే మరోచోట మూడు, నాలుగు మధ్య వయసున్న చిట్టిచిట్టి పిల్లలు, మధ్యలో ఒక యువతి చాలా చలాకీగా పిల్లలకి పుస్తకంలో రైమ్స్ చెపుతూ వాళ్ళచేత చెప్పిస్తోంది. ప్రక్కనే పిల్లల తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళను చూస్తూ విశాల కాసేపు అక్కడే ఆనందంగా ఉండిపోయింది.

          ఇంతలో విష్ణు రావడంతో ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి న్యూ సౌత్ వేల్స్ ఆర్ టి ఏ ఆఫీస్ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పూర్తి చేసి, టెస్ట్ కోసం బుక్ చేసుకున్నారు.

          ఇండియన్ గ్రోసరీ షాప్ కి వెళ్ళి కావలసిన బియ్యం, పప్పు, కాయగూరలు  కొనుక్కు న్నారు. అక్కడ ప్రియ పచ్చళ్ళు చూడగానే విశాలకు ప్రాణం లేచివచ్చినట్లైంది. సరుకులైతే ఇష్టంగా కొనుక్కున్నారు గానీ వాటిని మోసుకుని ఇంటిదాకా బస్సులో వెళ్ళటం కష్టమే అని ఇద్దరూ అనుకున్నారు. గత్యంతరం లేక అక్కడే టాక్సీ స్టాండ్ లో టాక్సీ రాగానే అడ్రస్ చెప్పి ఎక్కారు.

          టాక్సీలో డ్రైవర్ సర్దార్ జీ అభిమానంగా ఇద్దరినీ పలకరించాడు. విశాలను చూస్తూ “బేటీ కహాసే ఆయే?” అనగానే విశాల “యహా నయీ ఆయే హై” అంది.

          “భారత్ హమారా మా కీ ఘర్ హైతో, యహా ఆస్ట్రేలియా ససురాల్ కా ఘర్ జైసా హోతా హై. సంభాల్ కే రహ్ నే సే యహా భీ బహుత్ అచ్ఛా హోతాహై! కోయీ జాబ్ కరో. పర్వా నహీ హై. ప్రెస్టీజ్ నహీ హోతా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ యహా అచ్ఛా హై. పైసా కమానా హై, ఛోటా, బడా నహీ దేఖ్ నా. పహ్ లే కుఛ్ ఛోటీ జాబ్ మిల్ తే తో, బినా సోచ్ కే లేనా. ఫికర్ మత్ కర్ నా” అని గడ గడ మాట్లాడుతూ వచ్ఛాడు.

          ఇల్లు రాగానే వాళ్ళకి సాయం చేసి సరుకులు కిందకి దించాడు. సర్దార్ జీ కారు లేకుండా సరుకులు చేత్తో పట్టుకురావడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని గ్రహించాడు.

          విష్ణు తన వేలట్ లోంచి ఇరవై డాలర్ల్ ఇచ్చి, షుక్రియా అని చెప్పాడు.

          సర్దార్ జీ మాటలు ఇద్దరినీ ప్రభావితం చేసాయి. ఇంట్లోకి వెళ్ళగానే విశాల వెంటనే కుక్కర్ లో అన్నం, పప్పు లంచ్ కోసం రెడీ చేయసాగింది.

          విష్ణుతో అంది, దేశం కాని దేశంలో సర్దార్ జీ అభిమానంగా మంచి ముత్యాలలాంటి మాటలు చెప్పారు. నిజంగానే డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పనైనా సంతోషంగా చేయమని చెప్పాడు. ఆయన మాటలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి అంది విశాల.

          “అవును విశాల నేను అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఖర్చులను తట్టుకోవాలంటే పి.హెచ్.డి కన్నా ముందు జాబ్ లో జాయిన్ అవ్వాలి. పైగా ఈ గోపీ వచ్చేలోగా మా ఆవిడ నాకు డెడ్ లైన్ కూడా ఇచ్చింది ఇల్లు మారాలని. అందుకని యుద్ధప్రాతిపదిక మీద అర్జెంట్ గా తెచ్చుకున్న డబ్బు అంతా ఖర్చు అవ్వక ముందే, సంపాదించే మార్గం చూడాలి. ఇక్కడకి వచ్చేదాక కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి నాకు పెద్దగా తెలియదు కదా!”

          “అవును, నిజమే! ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. గోపీ పరిస్థితి వేరు. మనం అతని ముందు నవ్వినా, తుళ్ళినా కూడా ప్రమాదమే. మన మధ్య మూడో వ్యక్తి, ఈ జంఝాటాలు వద్దు. మన ప్రయత్నం మనం చేద్దాం. అలా అని మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. నేను మీకు ఎప్పుడూ 100% సపోర్ట్ ఇస్తాను.” అని విశాల భరోసాని ఇస్తూ విష్ణు చేతిని పట్టుకుంది.

          విష్ణు కూడా ఇన్ని రోజులు విశాల ముందు కాస్త దర్పంగా ఉన్నాగానీ, ఇపుడిపుడే మనసులో భావాన్ని ఆమెతో పంచుకుంటున్నాడు.

          కుక్కర్ కూత రావడంతో ఇద్దరూ వేడి వేడి అన్నంలో పప్పు, అపుడే కొన్న ప్రియ పచ్చడి ఆవకాయ ఆస్వాదించారు.

          “ఆహా! ఆస్ట్రేలియా వచ్చినా అమ్మని, ఆవకాయని మరవలేదు. ఆవకాయ కని పెట్టిన మహానుభావా! నీకు శతకోటి వందనాలు” అంటూ గలగలా నవ్వింది విశాల.

          విశాల, విష్ణు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి మూడు వారాలైంది అప్పటికి. వాళ్ళు ఆస్ట్రేలియా వచ్చిన సమయాన అపుడపుడే ఇంటర్ నెట్ వృద్ధి చెందుతున్న రోజులు.
విష్ణు తన డైరీ తీసి ఒక నంబర్ కి ఫోన్ చేసాడు. అవతలి నుంచి జెస్సిక అన్న ఆమె “హాయ్ అడికో ఏజెన్సీ! హౌ కెన్ ఐ హెల్ప్ యూ?” అంది.

          వెంటనే విష్ణు తను చూసిన జాబ్ వివరాలు చెప్పి, ఆ ఉద్యోగం తనకు అన్నివిధాల తగినది అని, తన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ గురించి చెప్పగానే వెంటనే జెస్సిక అపాయింట్ మెంట్ బుక్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని ఆహ్వానించింది.

          తరువాతి రోజు ఉదయం విశాల మొదటిసారిగా ఆఫీస్ అటైర్ లో ఫాంట్, షర్ట్ వేసుకుని ఫార్మల్ గా తయారైంది. వేసుకున్నది ఇంగ్లీషు కట్టు అయినా, బొట్టు మటుకు నుదుటిన చిన్న చుక్క పెట్టుకుంది. తను ఎలా వెళ్ళాలో బసు నంబర్, టైం టేబుల్ చూసుకుని విష్ణుతో కలిసి బస్ ఎక్కి గ్రాన్ విల్ కాలేజ్ ఆఫ్ టేఫ్ దగ్గిర దిగింది. విష్ణు ఆమెకి ఆల్ ద బెస్ట్ చెప్పి తను అదే బస్ లో పేరమట్టా వెడుతున్నాను జాబ్ ఇంటర్వ్యూకి అని చెప్పాడు.

          విశాలకి ఉద్విగ్నత, కాస్త టెన్షన్, ఎక్స్సైంట్ మెంట్ అన్నీఉన్నా మనసులో దైవ స్మరణ చేసుకుని, ఊపిరి గట్టిగా పీల్చుకుని టేఫ్ ఆవరణలో ప్రవేశించింది. నేరుగా రిసెప్షన్ దగ్గిరకు వెళ్ళి తన పేరు చెప్పింది. జోడీ పేరు చెప్పగానే రిసెప్షన్ లో మిషెల్ వెంటనే జోడీకి ఫోన్ చేసి చెప్పింది. మిషెల్ విశాల చేతికి పెన్, రిజిష్టర్ చేసుకోవడానికి ఫాం ఫిలప్ చేయమని ఇచ్చింది.

          ఇంతలో జోడీ వచ్చి షేకేండ్ ఇచ్చి విశాలను లోపలికి తీసుకెళ్ళింది. విశాలకు ఇండక్షన్ సెషన్ లో అందరినీ పరిచయం చేసింది. విశాల స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్స్ ఇస్యూ చేయడం, అప్లికేషన్ ఫాంస్ ఫోల్డర్స్ లో పెట్టడం, ఫోన్ స్విచ్ బోర్డ్ ఎలా ఆపరేట్ చేయాలి, ట్రైనింగ్ మెటీరియల్స్ ప్రింట్, ఫోటోకాపీ చేయడం, బేసిక్ అడ్మిన్ డ్యూటీస్
ఎలా చేయాలో, ఏం చేయాలో అన్ని ఎక్స్ ప్లెయిన్ చేసింది. ఐనో యూ ఆర్ హైలీ క్వాలి ఫైడ్. బట్ దీస్ ఆర్ ఎసెన్ షియల్ టు వర్క్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ అని చెప్పింది.

          విశాల ఆ రోజు చురుకుగా అన్ని విషయాలు ఆకళింపు చేసుకుంటూ చలాకీగా తిరిగింది. ఆస్ట్రేలియన్ ఏక్సంట్ మెల్లిగా నేర్చుకోవడానికి నాకు నిజంగా ఇక్కడ పని నేర్చుకునే అవకాశం దొరకటం ఒక వరం అనుకుంది. మధ్యాహ్నం లంచ్ టైం కి రిలాక్స్ అవుతూ తను తెచ్చుకున్న ఉప్మా తిందామని అక్కడ కూర్చుంది. అదే సమయానికి అక్కడ టేఫ్ లో చదువుతున్న నందిని వచ్చి తనను పరిచయం చేసుకుంది.

          “నేను ఇక్కడకు రెండు రోజులు క్లాస్ లకి వస్తాను. చైల్డ్ కేర్ కోర్స్ చేస్తున్నాను. మిగతా మూడు రోజులు కాజువల్ వర్క్ చేస్తాను. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ పిక్ చేసి, పేక్ చేసి పంపడం. వీక్ లీ పే చేస్తారు. అవర్లీ రేట్ బాగుంటుంది. నాకు బాగానే ఉంది. నాకు మన భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం, సాయం చేయటం చాలా ఇష్టం” అని గడగడా తన గురించి చెప్పుకుంది.

          విశాల తన గురించి చెప్పి తన ఫోన్ నంబర్ ఇచ్చింది.

          లంచ్ అవర్ అవ్వగానే ఇద్దరూ వెళ్ళిపోయారు.

          విష్ణు బస్సు దిగి అడికో జాబ్ ఏజెన్సీ స్ట్రీట్ నంబర్ వెతుక్కుంటూ అక్కడకు చేరుకున్నాడు. ఇక్కడ జాబ్ ఏజెన్సీల పనితీరు గురించి తెలుసుకుని అబ్బురపడ్డాడు. ఉద్యోగం వెతుక్కునే వారికి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, డబ్బు తీసుకోకుండా జాబ్ వెతికి పెట్టే విధానం చాలా బాగుంది అనుకున్నాడు. ఎంప్లాయర్ దగ్గర కమిషన్ తీసుకుంటారు.

          ఆఫీస్ లోకి వెళ్ళగానే జెస్సికా వచ్చి అతనికి షేకేండ్ ఇచ్చి ఇంటర్వ్యూ రూంలోకి తీసుకెళ్ళింది. వరుసగా ప్రశ్నలు అడుగుతూ అతని రెస్యుమె చూసి చాలా ఇంప్రెస్ అయింది. “యూ ఆర్ టెక్నికల్లీ వెరీ వెల్ క్వాలిఫైడ్. దెర్ ఈస్ అ పొజిషన్ అవైలబుల్  ఫర్ యు. ఆర్ యూ అవైలబుల్ ఇమ్మీడియేట్ లీ?” అని అడిగింది.

          విష్ణు యస్ అనగానే జాబ్ వివరాలు, ప్లేస్ చెప్పింది. అయితే అది ఇండస్ట్రియల్ ఏరియా, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అక్కడకు దగ్గర్లో లేకపోవడంతో కారు కంపల్సరీ ఉండాలి అని చెప్పింది.

          ఆ మాటకు విష్ణు కాస్త నిరాశ చెందినా, వెంటనే తమాయించుకుని తన పరిస్థితి జెస్సికాకి వివరించాడు.

          “విష్ణూ, ట్రై టు గెట్ డ్రైవర్స్ లైసెన్స్ ASAP యాస్ సూన్ యాస్ పాజిబుల్. ఇన్ ద మీన్ టైం ఐ విల్ సెర్చ్ అదర్ జాబ్స్ ఫర్ యూ క్లోస్ టు యువర్ ప్లేస్” అంది జెస్సికా.

          విష్ణు మనసులో అనుకున్నాడు, జాబ్ ప్లేస్ కి దగ్గరగా ఇల్లు అద్దెకి వెతుక్కోవాలి తప్పదు. డ్రైవర్స్ లైసెన్స్ తెచ్చుకోవాలి. అంత వరకు ఏదైనా టెంపరరీగా ఎక్కడైనా జాబ్ చూసుకోవాలి. అదే విషయం ఓపెన్ గా జెస్సికాతో చెప్పాడు.

          దానికి జెస్సికా అతని ధృఢ నిశ్చయం చూసి, ఇతను ఏ పనైనా చేయగలడు అన్న ధీమాతో “ప్రస్తుతం నైట్ షిఫ్ట్ వర్క్ ఉంది. నీకు ఓకె ఐతే నీ రెస్యూమే ఎంప్లాయర్ కి ఫార్ వర్డ్ చేస్తాను. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కి దగ్గరగానే ఉంది” అని చెప్పింది.

          అలాగే ఓ యస్ అని ఐతే చెప్పాడు గానీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. జాబ్ నో అని చెప్పడానికి లేని పరిస్థితి. సిడ్నీలో రోజూవారీ ఖర్చులు చూస్తే ఆకాశాన్నంటు తున్నాయి. డ్రైవర్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే, ముందు ఇద్దరు లెసెన్స్ తీసుకోవాలి, కనీసం యాభై లెసెన్స్ చొప్పున ఇద్దరూ తీసుకోవాలి. క్లాస్ కి ఎంత కాదన్నా ముప్ఫై
డాలర్లు అవుతుంది. ప్రతీది డాలర్ తోనే ముడిపడి ఉంది. డబ్బు సంపాదించాలి.
విశాలని వదిలి రాత్రి షిఫ్ట్ కి నిద్ర మానుకుని వెళ్ళడమా? 

          సమాధానం లేని ప్రశ్నలు విష్ణుని వేధిస్తున్నాయి.

          “బంగారం లాంటి ఉద్యోగాన్ని కాలదన్నుకుని ఆస్ట్రేలియా వచ్చి పొరపాటు చేశానా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు” విష్ణు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.