పేషంట్ చెప్పే కథలు – 25

పెళ్ళికూతురు

ఆలూరి విజయలక్ష్మి

          మంగళవాయిద్యాలు పడుచుగుండెల్లో మరుమల్లెల జల్లుల్ని కురిపిస్తున్నాయి. పెళ్ళికూతురు వరలక్ష్మి ముస్తాబవుతూంది. కొంచెం దూరంలో కూర్చుని వరలక్ష్మిని చూస్తున్న శృతికి ఆమెతో తన మొదటి పరిచయం గుర్తుకొచ్చింది. 

          “గుడ్ మార్నింగ్ డాక్టర్!” నవ్వే సెలయేరులా, తృళ్ళిపడే జలపాతంలా వున్నా ఆ అమ్మాయి వంక ఒక్క క్షణం ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది శృతి. 

          “మా అమ్మగారికి కొంచెం ఒంట్లో బాగాలేదు. మీరు టెస్ట్ చేసి మంచి మందులు రాసివ్వండి” నొక్కులు నొక్కుల పొడవాటి జుట్టుతో, చారెడేసి కళ్ళతో, సంపంగి ముక్కు తో, నున్నగా మెరుగులీనుతున్న చెక్కిళ్ళతో, పసిమిరంగుతో బాపూ బొమ్మలా నాజూగ్గా, సుకుమారంగా వున్నా వరలక్ష్మి తరువాత చాలాసార్లు శృతి దగ్గరకు వచ్చింది. 

          ఒక పాదానికి పారాణి పెట్టుకుని, రెండోపాదం కొంచెం ముందుకు చాపి పారాణి పెట్టుకుంటున్న వరలక్ష్మి కళ్ళముందు స్మృతుల పరదాలొక్కొక్కటీ జారుతున్నాయి. కుసుమించిన యవ్వనం, అలరించే లావణ్యం, కొత్తగా దొరికిన చిరుద్యోగం, ఊహలు, కోరికలు, సుందర స్వప్నాలు. ఈ క్షణం గురించి ఎన్ని అందమైన ఊహల్ని పేర్చుకునేది తను! ఎన్నెన్ని మధుర భావనలతో తూగిపోయేది తాను! కానీ… కరుణించని కాలం పది హేను సుదీర్ఘ సంవత్సరాల తరువాతకు విసిరేసిందీ క్షణాన్ని. యిన్నాళ్ళగా తన నిరీక్ష ణ, ఇన్నేళ్ళ తన తపన యిప్పుడు ఫలించబోతున్నాయి. పది సంవత్సరాల క్రితం తన తలుపు తట్టిన అవకాశాన్ని యిప్పుడు అంది పుచ్చుకుంది. తనవాళ్ళ స్వార్థం తన కోరిక ల్ని ఉరితీస్తూందనే విషయాన్ని తనా నాడే గుర్తించి ఉంటే, తన బాధ్యతల కంటే తన జీవితమే తనకు ముఖ్యమనే రవ్వంత స్వార్థానికి చోటిచ్చి ఉంటె యెంత బావుండేది?!… పదేళ్ళ నాడే తనను ఇష్టపడి తన జీవితంలోకి అపురూపంగా ఆహ్వానించినా భాస్కర్రావు భార్య అయుండేది. తన గుండె లోతుల్లో యింకా బ్రతికేవున్న కోరిక, పెళ్ళికూతురు అలం కరణతో కళ్యాణ వేదిక పై అడుగు పెట్టాలనే అందమైన కల ఆ నాడే నిజమయుండేది.. వరలక్ష్మి కళ్ళల్లో కన్నీటి సముద్రం, హృదయంలో ఫలించని ఆశల ఘోష. 

          శృతి వరలక్ష్మిని గమనిస్తూంది. పదేళ్ళుగా ఆమె జీవితంలో జరిగిన ముఖ్యఘట్టా లన్నీ శృతికి తెలుసు. ఆమె సంతోషంగా తనకైతాను తలకెత్తుకున్న బాధ్యతలు, ఆ బాధ్యతల భారంతో ఆమె తల వంగిపోవడం, భాస్కర్రావుని తిరస్కరించేలా చేసిన అయినవాళ్ళ స్వార్థం, మరణశయ్య మీద వున్న తల్లికిచ్చిన మాట నిర్ధాక్షిణ్యంగా ఆమె బ్రతుకుని నలిపేయడం గుర్తుకొచ్చాయి శృతికి. 

          అన్ని భాధ్యతల నుండి విముక్తి పొందిన వరలక్ష్మి ఐదేళ్ళ నుంచి తోడు కోసం వెదుక్కుంటూంది. మారిపోయిన రూపురేఖలు, జారిపోతున్న యవ్వనం, సౌకుమార్యాన్ని కోల్పోయిన కదలికలు… ఎన్నో ఆశాభంగాల్ని సహించి, విసిగి వేసారి యింక వివాహ ఘట్టాన్ని శాశ్వతంగా మరచిపోదామనుకునే సమయంలో పదేళ్ళనాడు ఆమె తిరస్క్రు తిని మౌనంగా భరించి వెళ్ళిపోయినా భాస్కర్రావుకు మళ్ళీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. పాత పరిచయం, స్నేహం, సాన్నిహిత్యం కొత్త మలుపుకు తిరిగాయి. పెళ్ళయిన ఏడాదికే భార్యను పోగొట్టుకున్న భాస్కరరావు, ముప్పై ఐదేళ్ళు నిండిపోయిన వరలక్ష్మి, ఇద్దరూ ఎవరికి వాళ్ళు సంకోచంతో నిలబడిపోయారు, చివరకు వరలక్ష్మే ధైర్యంచేసి అడుగు ముందుకు కదిపింది. 

          తీరా ఒక నిర్ణయానికొచ్చాక వరలక్ష్మికో  సందేహమొచ్చింది. 

          “డాక్టర్ గారూ! నా వయసింత ముదిరిపోయింది కదా, పిల్లలు పుట్టే అవకాశముందా అసలు నాకు?” బేలగా చూస్తూ అడిగింది వరలక్ష్మి. 

          “ఎందుకు లేదమ్మా? ఇంకా పది సంవత్సరాల వరకు నీకు పిల్లలు పుట్టడానికవకాశ ముంది. నువ్విలాంటి అనుమానాలు పెట్టుకోకుండా సంతోషంగా పెళ్ళి చేసుకో” ధైర్యం చెప్పింది శృతి. 

          భాస్కర్రావు రిజిస్టర్ మేరేజ్ చేసుకుందామని అంటున్నా వినకుండా సంప్రదాయ బద్ధంగా, శాస్త్రోక్తంగా తన పెళ్ళి జరగాలని పట్టుబట్టింది వరలక్ష్మి. దగ్గర బంధువులు, ఫ్రెండ్స్, కొలీగ్స్… అంతా వచ్చారు. ఆసంరంభం, ఆ అలజడి, ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం… చిత్రమైన మనః స్థితిలో వుంది వరలక్ష్మి. 

          చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ దగ్గరకు వచ్చిన వాళ్ళందర్నీ తన అలంకరణ ఎలా ఉందని అడుగుతూంది వరలక్ష్మి. ఆమెతో బావుందని చెప్పి చాటుకు వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టుకుని ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. గుసగుసగా చెప్పుకుంటూ ఎద్దేవా చేస్తు న్నారు. వరలక్ష్మిని, వాల్లనూ చూస్తుంటే శృతికి బాదగా వుంది. జాలిగా వుంది. తమాషాగా వున్నా ఆమె రూపాన్నీ, అలంకరణనూ చూస్తే వెగటుగానూ వుంది.

          “మేడం! ఎలా వుంది? బావున్నానా?” ఆశగా అడిగింది వరలక్ష్మి. విషాదాన్ని గుండె ల్లో అణచుకుని ముఖానికి చిరునవ్వును పులుముకుని పెదవి విప్పబోయింది శృతి. 

          “అమ్మవారిలా ఆ అలంకరణేమిటి?- పన్నెండేళ్ళ బాలాకుమారిననుకుంటూంది కాబోలు!” వరలక్ష్మి చిన్నతమ్ముడి భార్య అలివేణి కావాలనే బిగ్గరగా అని వెటకారంగా నవ్వింది. 

          గురి బాగా కుదిరింది. గాయం లోతుగా అయింది. ఆ లోతుల్ని స్పృశించి ఉపశమ నం కలిగించే మందు శృతి  దగ్గరలేదు.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.