విజ్ఞానశాస్త్రంలో వనితలు-16

పోరాడి ఓడిన ఇడానోడక్ (1896-1978)

– బ్రిస్బేన్ శారద

          2023 లో విడుదలై ప్రపంచమంతటా విజయ భేరి మ్రోగించి ఏడు ఆస్కార్ అవార్డులు కొట్టేసిన చిత్రం “ఓపెన్‌హైమర్”. రెండవ ప్రపంచ యుద్ధంలో “మన్‌హాటన్ ప్రాజెక్ట్” అన్న పేరుతో అణుబాంబును తయారు చేయడానికి సారథ్యం వహించిన  శాస్త్రవేత్త “రాబర్ట్ ఓపెన్‌హైమర్” గురించిన చిత్రం అది.

          అణుబాంబు తయారీకి మూల సిద్ధాంతమైన “అణు విచ్ఛిన్నత” (Nuclear Fission) ప్రపంచ చరిత్రని మార్చేసిందనటంలో అతిశయోక్తి లేదు.

          అణు శక్తిని విడుదల చేసే ప్రక్రియ “అణు విచ్ఛిన్నత”. అణువులో జరిగే చాలా రకాల ప్రక్రియల్లో ఇదొకటి. ఈ అణు విచ్ఛిన్నతని మొదటగా ప్రయోగశాలలో కనిపెట్టింది (1938) ఓట్టోహాన్ అనే శాస్త్రవేత్త అయితే, సైద్ధాంతికంగా దీన్ని నిరూపించింది (1939) లీసా మైట్నర్, ఆమె సహచరులు. దీనికై 1944లో ఓట్టోహాన్ నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు.

          అయితే న్యూక్లియర్ఫిషన్ ప్రక్రియని అంతకు ముందే చాలా యేళ్ళ క్రితం ఇడానోడక్ (Ida Nodack) అనే జర్మన్ శాస్త్రవేత్త ఊహించి ఒక పరిశోధనా పత్రంలో వ్రాసింది.

          అదెలా జరిగిందంటే-1934లో ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఎన్రికోఫెర్మీ (Enrico Fermi) తన ప్రయోగశాలలో కొన్ని ప్రయోగాల అనంతరం, “యురేనియం మూలకాన్ని న్యూట్రాన్‌లతో మోదడం (bombarding) ద్వారా దాన్ని యురేనియంకన్నా ఎక్కువ అణు భారమున్న మూలకాలకి మార్చొచ్చని” సిద్ధాంతీకరించారు.

          ఆ పేపరు చదివిన ఇడా ఆ సిద్ధాంతంతో విభేదించారు. యురేనియం మూలకాన్ని న్యూట్రాన్లతో మోదితే, యురేనియం అణు కేంద్రం విచ్ఛిన్నమై తక్కువ అణు భారం వున్న పదార్థాలు వెలువడుతాయనీ, అనగా అణువు విచ్ఛిన్నమవుతుందనీ ప్రతిపాదించారు.

          అయితే ఆమె సిద్ధాంతాన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఆ తరవాత ఈ శాస్త్రంలో జరిగిన హడావిడిలో ఆమె పేరెవ్వరూ ప్రస్తావించనేలేదు. ఆ రకంగా చరిత్ర పుటల్లో అనామకురాలిగా మిగిలిపోయింది ఇడానోడక్. అయితే ఈ ఒక్క సిద్ధాంతమే కాక ఆమె ఇంకా చాలా ముఖ్యమైన పరిశోధనలు చేసారు. రెండు మూలకాలని కనుగొన్నారు.

          1896 లో జర్మనీలో టక్కేదంపతులకి జన్మించారు ఇడా. ఆమె తండ్రి వార్నిష్ తయారీలో పని చేసేవారు. 1918 లో ఇడా కెమికల్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ ముగించారు. వెను వెంటనే కెమిస్ట్రీలో పరిశోధన మొదలు పెట్టి 1921 లో పీహెచ్‌డి పట్టా అందుకున్నారు.

          ఆ రోజుల్లో ఇడా, వాల్టర్నోడాక్ (Walter Nodack) అనే శాస్త్రజ్ఞుడు చేసే పనిలో ఆసక్తి చూపించేది. వాల్టర్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్‌లో కెమిస్ట్రీ శాఖలో పని చేసేవారు. ఎంతో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తగా పేరున్నవారు.

          1871లో మెందెలెయేవ్ ప్రతిపాదించిన పీరియాడిక్ టేబుల్ (మూలకాల ఆవర్తాన పట్టిక) అప్పటికే శాస్త్రవేత్తలను ఎంతో ఆకర్షించింది. ఆవర్తన పట్టికలో కొన్ని మూలకాలు ఇంకా అప్పటికి శాస్త్రజ్ఞులు కనిపెట్టలేదు, కానీ ఆ అణుభారాలున్న మూలకాలు ఉండొ చ్చని ఊహించి ప్రతిపాదించింది ఆవర్తన పట్టిక.

          ఇందులో ముఖ్యంగా 43, 75 అణుభారాలున్న మూలకాలను భూమి మీదున్న ఖనిజాల నుంచి వెలికితీయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వాల్టర్ పనిచేస్తున్న గ్రూపు కూడా 1922లో ఈ పనిలో పాలు పంచుకోసాగింది. ఇడా ఉత్సాహంగా ఆ పని చేయడానికి 1924లో వాల్టర్‌తో కలిసింది.

          అయితే ఆ రోజుల్లో జర్మనీలో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం కష్టంగా వుండేది. మొదటి ప్రపంచ యుద్ధం కారణాంగా ఉద్యోగాల కొరత వుండేది. ఆ సమయంలో ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఏ సంస్థకీ ఇష్టం వుండేది కాదు. అందుకే ఇడా జీతం లేకుండా వాల్టర్‌తో కొలాబొరేటర్‌గా పని చేసింది.

          1925లో కొన్ని ప్రయోగాల అనంతరం వాల్టర్, ఇడా ఇంకొందరు సహచరులు, 43, మరియు 75 అణుభారాలున్న మూలకాలు కనుగొన్నామని ప్రకటించారు. 43 అణుభారం వున్న మూలకాన్ని మసూరియం అనీ, 75 అణు భారం వున్న మూలకాన్ని రేనియుం అనీ పేర్లు పెట్టారు.

          1926లో ఇడా, వాల్టర్పెళ్ళాడారు. ఇడాటక్కే, ఇడానోడాక్ అయింది. 1928లో నోడాక్ దంపతులు 600 కిలోల మోలిబ్డినైట్ అనే పదార్థము నుంచి ఒక్క గ్రాము రేనియం (75) మూలకాన్ని వెలికి తీయగలిగారు. అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా మసూరియం (43) మూలకాన్ని మాత్రం వెలికి తీయలేకపోయారు. దాంతో వారి అన్ని ప్రయోగాలనీ, ఫలితా లనీ శాస్త్రవేత్తలు హేళన చేసారు. అయినా ఇడా, వాల్టర్ తమ ప్రయోగాల పట్లా, ఫలితాల పట్లా విశ్వాసం ప్రకటించి వారి ఏ ఫలితాల ప్రకటనలనీ వెనక్కి తీసుకోలేదు.

          1937లో, ప్రయోగశాలల్లో సైక్లోట్రాన్ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన తరవాత కానీ వాళ్ళిద్దరూ సూచించిన మసూరియం(43) అణుభారం వున్న మూలకం వెల్లడి కాలేదు. అయినా నోడక్దంపతులకి చెందాల్సిన గౌరవమూ, పేరూ దక్కనేలేదు. శాస్త్ర ప్రపంచం దాదాపు వారిని మర్చిపోయినట్టే నటించింది.

          ఆ తర్వాత 1934లో ఫెర్మీ ఉదంతం జరిగింది. అప్పుడు కూడా శాస్త్ర ప్రపంచం ఆమె ప్రతిపాదనలనూ, సిద్ధాంతాలనూ హేళన చేసి తీసిపారేసింది.

          1938లో న్యూక్లియర్ఫిషన్ సిద్ధాంతం ఓటోహాన్ అతని సహచరులూ ప్రపంచానికి వెల్లడి చేసారు. 1939లో ఇడా తాను ఇంతకు ముందే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టు ప్రకటించి, ఆ విషయం ఓటోహాన్ కొత్తగా కనుగున్నది కాదని సవాల్ విసిరారు. ఓటోహాన్, అతని ప్రయోగశాలా ఆమె ప్రశ్నలకి అసలు సమాధానం కూడా ఇవ్వలేదు. ఆమెనొక అనామకురాలిగా, తప్పుడు ప్రయోగాలనీ, ఫలితాలనీ ఇచ్చే అనామకురాలిగా తీసిపడే సారు.

          ఆ తరవాత ఇడా, కేవలం వాల్టర్‌తో పాటు రీసెర్చి అసోసియేట్‌గా పని చేస్తూ వచ్చారు.

          ఇద్దరూ కలిసి చేసేది సమానమైన పరిశోధన అయినా, వాల్టర్ ప్రొఫెసర్ హోదాతో వుంటే, ఇడా కేవలం అతని సహాయకురాలిగా వుండేది. అన్నిటికంటే అన్యాయమైన విషయం, పరిశోధనా ఫలితాలు ఒప్పుకోదగ్గవిగా అనిపిస్తే, అ పేపరు వాల్టర్ పేరుతో, కొంచెం అనుమానాస్పదంగా (అంటే, అప్పటికి నిర్ధారించలేని సిద్ధాంతాలు) అనిపిస్తే అవి ఇడా పేరుతోనూ పంపేవారట. అంటే, పేపరు ప్రచురితమవుతే వాల్టార్ పేరూ, తిరస్కరించబడితే అది ఇడా పేరుతో వుండేటట్టన్నమాట.

          1944 నించి 1968 వరకూ ఇడా, వాల్టర్ ఇద్దరూ జర్మనీలో, టర్కీలో కొన్నాళ్ళు పనిచేసారు. 1960లో వాల్టర్ మరణించారు. 1968లో ఇడా పదవీ విరమణ చేసారు. ఆ తరవాత పదేళ్ళకి అంటే 1978లో జర్మనీలో ఇడా మరణించారు.

          ఇడా, వాల్టర్దంపతుల పేర్లు మూడు సార్లు నోబెల్ బహుమతికి ప్రతిపాదించబడ్డా యి. జర్మన్ కెమికల్ సొసైటీ వారి లైబిగ్ మెడల్ 1931లో వారికిచ్చారు. స్వీడిష్ కెమికల్ సొసైటీ కూడా వారిని సన్మానించి ఆదరించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.