పేషంట్ చెప్పే కథలు – 27

తెల్లారింది

ఆలూరి విజయలక్ష్మి

          ఆకాశం కదిలి కదిలి రోదిస్తూంది. వరాలు గుండెలో దుఃఖ సముద్రం ఎగసి ఎగసి పడుతూంది. వరాలు కూతురు జానకి ఫిట్స్ తో ఎగిరెగిరి పడుతూంది ఫిట్ వచ్చినప్పు డల్లా జానకి ముఖం వికృతంగా మారుతూంది. భయంతో బిగుసుకుపోతున్న వరాలు తన అశ్రద్ధను, అజ్ఞానాన్ని, అసహాయతను తలచుకుని తననుతాను వెయ్యి శాపనార్థాలు పెట్టుకుంటూంది. 

          పిల్ల ఒళ్ళు నిగారింపుగా ఉంటే కడుపుతో వున్నప్పుడలాగే ఉంటుందనుకుంది. తలనొప్పి, వాంతులంటే తిన్నది సరిగ్గా అరగక అవుతున్నాయనుకుంది. మూడు రోజుల్నుంచి నొప్పులతో బాధపడుతూంటే ‘బడేబాబు’ చలవ చేతిమీద ఆశపెట్టుకు కూర్చుంది. పిల్ల బాధతో విలవిలలాడిపోతుంటే తనకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. అక్కడికీ కోడిని, కొబ్బరికాయనీ దిగదుడుపు తీయించింది. గద్దెకు పంపి విభూతి తెప్పించి, ముఖాన పెట్టింది. వెంకటరమణమూర్తికి ముడుపు గట్టి మొక్కుకున్నా ఆ మాయదారి దేవుడు తన మొరాలకించలేదు. వాతం కమ్మేదాకా తాను కళ్ళు తెరవలేదు. తాను కళ్ళు తెరిచేసరికి బిడ్డ కళ్ళు విడడం లేదు. 

          దిక్కులేని అక్కుపక్షి తాను. కళ్ళు తెరిచీ ప్రయోజనం లేకపోయింది. డబ్బుకోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. తన కన్నీళ్ళకు కరిగే నాధుడే లేకపోయినాడు. ఏభైరూపాయ లు పుట్టించడానికి తాతలు దిగొచ్చారు. తన ఏడుపు చూడలేక మరిడయ్య మామ బండి గట్టుకొచ్ఛాడు. సుబ్బమ్మత్త, కమలమ్మ తనకు ధైర్యం చెప్తూ తోడుగా వచ్చారు.

          కటిక చీకట్లో, గతుకుల రోడ్డుమీద పడి రెండు కోసులు నడిచి బండి రోడ్డుకి చేరుకునే సరికి ఆఖరి బసెల్లిపోయిందన్నారు. తమ నవజీవాలు కుంగిపోయి దిక్కు తెలియక ఏడుస్తోంటే, మరిడయ్య మామ బండిని పట్నానికి మళ్ళించాడు. మూడు కోసుల దూరం తిరిగి బండి పట్నం చేరుకునేటప్పటికీ మూడు జన్మలెత్తినట్లనిపించింది. పట్నం మొగదుల్లో వాకబు చేస్తే పుణ్యాత్ముడెవరో ఈ అమ్మ పేరు చెప్పాడు. 

          అర్ధరాత్రైనా పిలవగానే వచ్చి పిల్లను శ్రద్ధగా పరీక్ష చేస్తోంది. ఈ తల్లి చేత్తో తన బిడ్డకు ప్రాణం పోస్తుంది… దేవుడు తన నుంచి అన్నీ లాక్కున్నాడు. రెక్కలు రాని కూనల్ని తన చేతుల్లో పెట్టి సొర్గానికెళ్ళిపోయాడు తన పెనిమిటి. రెక్కలొచ్చాక తనకాసారా అవుతారన్న కొడుకులిద్దర్నీ పెద్ద కాలవ మింగేసింది. తన ప్రాణాలన్నీ అప్పటి నుంచీ ఈ పిల్లమీదే పెట్టుకుని బ్రతుకుతూంది… అదిగో, తన బిడ్డను బ్రతికిన్చే దేవత బయటికి వస్తోంది. 

          జానకికి ఇంజెక్షన్స్ చేసి, గొంతులో గురగుర లాడుతున్న తెమడను సక్షన్ తో తీసి, నోట్లో “ఎయిర్ వే” పెట్టి బయటకు వచ్చింది శృతి. 

          “అమ్మా! దిక్కులేని దాన్ని తల్లీ! నా బిడ్డనునాకు దక్కించి పున్నెం గట్టుకోమ్మా!”  శృతి కాళ్ళ మీద వాలి వెక్కి వెక్కి పడింది వరాలు. 

          “ఇంత మించిపోయేదాకా ఎందుకూరుకున్నారు? త్వరగా తీసుకొస్తే బావుండేది”. విచారంగా అంది శృతి. అంతలో జానకికి మరో ఫిట్ వచ్చింది, శృతి గబగబా లోపలికి  వెళ్ళింది. ఫిట్ వున్నా కొన్ని సెకన్లు ఎన్నో గంటల్లా అనిపించాయి. ఫిట్ తగ్గగానే పెద్ద గురక, ఊపిరితిత్తులనిండా నీటి బుడగలు కదులుతున్నట్లు విపరీతమైన శబ్దం. ఆక్సీజెన్ సరిగ్గా వెళ్తూందో, లేదో చూసి, బి.పి. నోట్ చేసింది శృతి.

          జానకి పరిస్థితి నిమిష నిమిషానికీ విషమిస్తూంది. చెయ్యవలసింది చెయ్యగలిగింది అంతా చేస్తూ జానకి చేతిని పట్టుకుని పల్స్ ని గమనిస్తూంది శృతి. పదహారేళ్ళు కూడా నిండకుండానే నూరేళ్ళు నిండుతున్న ఆ పిల్లవంకా నిస్సహాయంగా చూస్తూందామె. ఈ అమ్మాయిలా రోజూ ఎంతోమంది అకాల మృత్యువుకు గురవుతున్నారు. గర్భంతో వున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సకాలంలో వైద్య సహాయం తీసుకోక పోవడం, అవసరమైనప్పుడు నా నా యాతనా పడుతూ మైళ్ళ కొలదీ ప్రయాణం చేస్తేగాని వైద్యం అందని పరిస్థితి, అజ్ఞానం, దారిద్య్రం, మూఢ నమ్మకాలు, విలువైన ప్రాణం పట్ల దారుణమైన నిర్లక్ష్యం- స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా ఈ కథ యిలా కొనసాగుతూ వుంది… శృతి హృదయంలో విషాదం పేరుకుంటూంది. ఏమీ చెయ్యలేక పోతున్నానన్న నిస్పృహ, ఏమన్నా చేయగలిగి ఆ అమ్మాయిని బ్రతికించగలిగితే బావుండునన్న తహ తహ. అంతా మించిపోయాక తీసుకొచ్చారన్న కోపం. ఏమూలో ఆమె పరిస్థితి మెరుగవు తుందన్న ఆశ, మెరుగయి ఆమె నవ్వుతూ యింటికి వెళ్ళాలన్న బలమైన కోరిక… శృతి శక్తివంచన లేకుండా మృత్యువుతో పోరాడుతూంది. 

          ఆకాశం కన్నీళ్ళు కార్చడం ఆపేసింది. కానీ వరాలు కళ్ళుకట్టలు తెంచుకుని ప్రవహిస్తూనే వున్నాయి. భళ్ళున తెల్లారుతూ ఉండగా జానకి బ్రతుకూ తెల్లారిపోయింది.  

*****     

Please follow and like us:

One thought on “పేషంట్ చెప్పే కథలు-27 తెల్లారింది”

  1. విజయలక్ష్మి మేడం గారి కథ చాలా బావుంది.ఇలాంటి కన్నీటి కథలు ఎన్ని చూసి ఉంటారో.

Leave a Reply

Your email address will not be published.