పౌరాణిక గాథలు -18

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ

          కుంతలదేశపు మహారాజుకి మగపిల్లలు లేరు. ఒక కూతురు మాత్రం ఉంది. ఆమె పేరు చంపకమాలిని.

          తన రాజ్యానికి వారసులు లేరని బాధపడుతూ ఉండేవాడు. అతడి మంత్రి పేరు దుష్టబుద్ధి. పేరుకు తగ్గట్టే ఉండేవాడు.

          అతడి కొడుకు పేరు మదనుడు. కుమార్తె పేరు విషయ. తన కొడుకు మదనుడికి రాజు కూతురు చంపకమాలినిని ఇచ్చి పెళ్ళిచేస్తే రాజ్యం తనదవుతుందని దుష్టబుద్ధి దుష్ట ఆలోచన చేస్తుండేవాడు.

          ఒకరోజు దుష్టబుద్ధి పొరుగూరు వెళ్ళి వచ్చేసరికి రాజభవనంలో అతడికి ఒక బాలుడు కనిపించాడు. అతణ్ని రాజు పెంచుకుంటున్నాడని తెలిసింది.

          దుష్టబుద్ధి తన అనుచరుల్ని పిలిచాడు. ఆ బాలుణ్ని అడవికి తీసుకుని వెళ్ళి  చంపేసి రమ్మని పంపించాడు.

          అతడి అనుచరులు ఆ పసివాణ్ని చంపలేక అతడి చిటికెన వేలు మాత్రం కోసి అతణ్ని అడవుల్లో వదిలేసి వచ్చారు. దుష్టబుద్ధికి చిటికెన వేలుని చూపించారు.

          ఒకసారి దుష్టబుద్ధి తమ సామంత రాజు కుళిందకుణ్ని చూడడానికి వెళ్ళాడు. అక్కడ అతడికి ఒక బాలుడు కనిపించాడు. అతణ్ని చూసి తను చంపమని పంపించిన రాజకుమారుడే అనుకుని తన సందేహాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు.

          కుళిందకుణ్ని చూసి “రాజా! ఈ కుర్రవాడు ఎవరు?” అని అడిగాడు.

          దుష్టబుద్ధి అడిగిన దానికి రాజు “ఇతడు నాకు అడవిలో దొరికాడు. పేరు చంద్రహా సుడు. నాతో తీసుకొచ్చి విద్యలన్నీ నేర్పించాను” అన్నాడు.

          ఎలాగయినా సరే చంద్రహాసుణ్ని చంపాలనుకున్నాడు దుష్టబుద్ధి. అతడి చేతికి ఒక ఉత్తరం ఇచ్చి తన కుమారుడు మదనుడికి ఇచ్చి రమ్మని పంపించాడు.

          చంద్రహాసుడు ఆ ఉత్తరం తీసుకుని కుంతలదేశం చేరాడు. అలిసిపోయి ఒక ఉద్యానవనంలో నిద్రపోయాడు.

          అదే సమయంలో దుష్టబుద్ధి కూతురు విషయ ఉద్యానవనంలో తిరుగుతూ నిద్రపోతున్న చంద్రహాసుణ్ని చూసింది. ఎంత అందంగా ఉన్నాడో అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అతడి పక్కన ఉన్న ఉత్తరం తీసి చదివి ఆశ్చర్యపోయింది.

          దానిలో “ఈ ఉత్తరం తెచ్చిన వాడికి విషమునిమ్ము” అని రాసి ఉంది. దాని కింద ఉన్న తన తండ్రి సంతకం చూసి అతడి దుష్టపు ఆలోచన తెలుసుకుని అతణ్ని రక్షిం చాలని నిర్ణయించుకుంది. 

          ఎలా రక్షించాలా అని అలోచించింది. ఆమెకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఉత్తరంలో ‘ము’ అనే అక్షరాన్ని చెరిపేసింది. దాని బదులు ’ ‘య’ అనే అక్షరం రాసి ఉత్తరం మళ్ళీ అతడి పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది.

          చంద్రహాసుడు నిద్ర లేచి ఆ ఉత్తరం తీసుకుని రాజ్యంలోకి వెళ్ళి మదనుణ్ని కలుసుకున్నాడు. దుష్టబుద్ధి తనకు ఇచ్చిన ఉత్తరాన్ని మదనుడికి ఇచ్చాడు.

          మదనుడు ఆ ఉత్తరంలో ఉన్న తన తండ్రి సంతకం చూసాడు. దానిలో రాసి ఉన్న విధంగా మదనుడికి విషయనిచ్చి పెళ్ళి జరిపించాడు. తను అనుకున్న విధంగా జరిగి నందుకు విషయ కూడా చాలా సంతోషించింది.

          రాజ్యానికి తిరిగి వచ్చిన దుష్టబుద్ధి జరిగిన విషయం తెలుసుకున్నాడు. అప్పటికీ అతడికి బుద్ధి రాలేదు. మరో ఉపాయం అలోచించాడు.

          చంద్రహాసుణ్ని పిలిచి “నాయనా! మా ఊళ్ళో ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళయిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న చండికాలయంలోకి ఒంటరిగా వెళ్ళి దండం పెట్టుకుని రావాలి” అని చెప్పాడు.

          చంద్రహాసుడు దుష్టబుద్ధిని చూసి “ మీరు చెప్పినట్టే చేస్తాను” అన్నాడు.

          దుష్టబుద్ధి తన అనుచరుల్ని పిలిచి చంద్రహాసుడు గుడిలోకి వెళ్ళగానే అతణ్ని చంపెయ్యమని చెప్పాడు. వాళ్ళు చండికాలయంలోకి ప్రవేశించారు.

          చంద్రహాసుడు గుడిలోకి వెళ్ళబోతుంటే కుళిందకుడి నుంచి పిలిపొచ్చింది. ఆ మాట చెప్పడానికి మదనుడు అక్కడికి వచ్చాడు. చంద్రహాసుడు తనకు మామగారు చెప్పిన విషయం మదనుడికి చెప్పాడు.

          వెంటనే మదనుడు “బావగారూ! మీ బదులు నేను ఆలయంలోకి వెడతాను. మీరు కుళింద రాజ్యానికి వెళ్ళండి!” అని చెప్పి అతణ్ని కుళిందరాజ్యానికి పంపించాడు.

          చంద్రహాసుడు మదనుడు చెప్పినట్టు కుళింద రాజ్యానికి బయలుదేరాడు. చంద్రహాసుడి బదులు మదనుడు ఆలయంలోకి వెళ్ళాడు.

          ఆ విషయం తెలియని దుష్టబుద్ధి అనుచరులు దుష్టబుద్ధి చెప్పినట్టు ఆలయంలోకి వచ్చినవాడు ఎవరో చూడకుండా మదనుణ్ని చంపేశారు.

          వాళ్ళకి అక్కడికి వచ్చినవాడు చంద్రహాసుడు అవునో కాదో తెలియదు. పాపం తండ్రి దుష్టపు ఆలోచనకి మదనుడు బలయిపోయాడు.

          విషయం తెలిసిన దుష్టబుద్ధి పరుగెత్తుకుంటూ గుడికి వెళ్ళాడు. చచ్చిపడి ఉన్న కొడుకుని చూసి బాధని తట్టుకోలేని  దుష్టబుద్ధి గుండెకూడా ఆగిపోయింది.

          చంద్రహాసుడు తిరిగి వచ్చాడు. అసలు విషయం తనకు తెలియక పోయినా మామగారు, బావమరిదీ చచ్చిపోయి ఉండడం చూసి గుడిలోకి వెళ్ళి అమ్మవార్ని ప్రార్ధించాడు.

          మంచివాడైన చంద్రహాసుడి ప్రార్థన విని చండికాదేవి ఇద్దర్నీ బ్రతికించింది. చంద్రహాసుడు ఎంతో సంతోషించాడు. మదనుడు ఆనందంగా బావగార్ని కౌగలించు కున్నాడు.

          మదనుడు “నాన్నగారూ! ఇప్పటికైనా మీ దుష్టబుద్ధిని మార్చుకోండి!” అన్నాడు.

          అంత మంది మంచివాళ్ళ మధ్య తనొక్కడే దుష్టబుద్ధితో ఉన్నందుకు సిగ్గుపడి అప్పటి నుంచి దుష్టబుద్ధి తన ప్రవర్తన మార్చుకుని మంచివాడుగా మారిపోయాడు.

          మంచివాళ్ళతో కలిసి ఉంటే చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారిపోతారు. మంచివాళ్ళకి భగవంతుడు కూడా సహాయ పడతాడు.

సజ్జన సాంగత్యం దుష్టబుద్ధుల్ని మారుస్తుంది!

*****

Please follow and like us:

One thought on “పౌరాణిక గాథలు -18 – సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ.”

 1. అంతా బాగానే ఉంది. ఈకథ జైమిని భారతంలో ఉంది. కొంచెం తేడాగా ఉంది ఇక్కడి కథనం.

  చంద్రహాసుడు కథ ఏమిటీ?
  ఇదేమి తెలుగు?
  చంద్రహాసుడి కథ అనాలి కదా?
  ఔపవిభక్తికాలు ( అంటే ఇ టి తి అనే ఉపవిభక్తులు) వాడటం ఎందుకు నేటికాలం వారికి రావటం లేదో తెలియదు.
  రచయితలూ రచయిత్రులూ కూడా తెలుగు సరిగా వ్రాయలేకుండా ఉంటే ఎలా?

Leave a Reply

Your email address will not be published.