ప్రమద

నవలారాణి… యద్దనపూడి!

-పద్మశ్రీ

          ఒకమ్మాయి పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్ళింది. తన ఇతర సామానుతో పాటు ఒక ట్రంకుపెట్టెనీ పట్టుకెళ్ళిన ఆ అమ్మాయి తరచూ దాన్నిచేత్తో తడిమి ఎంతో అపురూపంగా చూసుకోవడం చూసి అత్తవారింట్లోని వారంతా ఆ పెట్టెలో నగలూ పట్టు చీరలూ లాంటి విలువైన వస్తువులు దాచుకుందేమోననుకున్నారు. అవేమిటో చూడాలన్న ఆత్రుతకొద్దీ ఒకరోజు ఆ అమ్మాయి గుడికి వెళ్ళగానే పెట్టె తెరిచి చూశారు. దాన్నిండా వారపత్రికల నుంచి కత్తిరించి దాచుకున్న సీరియల్‌ కాగితాలు భద్రంగా పేర్చి ఉన్నాయట. అవి ఏ సీరియల్సో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదుగా… జీవన తరంగాలు, సెక్రెటరీ… అలాంటివే మరికొన్ని.

          మరోసారి… ఏకంగా ఓ పత్రిక ఎడిటరే రచయిత్రి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. చాలా పెద్ద సమస్యే ఆమె ముందు పెట్టారు. అప్పటికి ఆయన కుమార్తె కాలేజీలో చదువుతోంది. పత్రికలో సీరియల్‌కి సంబంధించి వచ్చే వారం ఏమవుతుందో పత్రిక మార్కెట్‌లోకి రాకముందే ఆమె స్నేహితురాళ్ళు కరెక్టుగా డైలాగులతో సహా చెప్పేస్తు న్నారట. పైగా మీ నాన్న ఎడిటరూ.. అయినా నీకు తెలియదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదెలా సాధ్యం… పత్రికకు పంపకముందే రచయిత్రి దగ్గరే ఆ సీరియల్‌ని ఇంకెవరైనా చదువుతున్నారా అన్నది ఆయన సందేహం. అలాంటిదేమీ లేదనీ రాసింది రాసినట్లు వెంటనే పోస్టులో పంపుతున్నాననీ చెప్పారామె. దాంతో ఎడిటర్‌ గారు తన ఆఫీసులోనే నిఘా పెట్టగా తేలిందేమిటంటే… ప్రింటింగ్‌ విభాగంలో ఉద్యోగులే పత్రిక ప్రింటింగ్‌ పూర్తి కాక ముందే సీరియల్‌ కాగితాలను మట్టుకు బయటకు తీసుకెళ్ళి కాలేజీ ల్లో విద్యార్థులకు అమ్ముతున్నారని..! అది ‘జీవనతరంగాలు’ మహత్యం..!

          జీవనతరంగాలు సినిమాగా వచ్చి బాగా ఆడింది. దాంతో సెక్రెటరీ కూడా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఆ వార్త చూసి మహిళలు గుంపులు గుంపులుగా రచయిత్రి ఇంటి పై దాడి చేశారు. ‘ఆ సినిమా తీయడానికి వీల్లేదు, మీ హక్కులు వెనక్కి తీసుకో’మని డిమాండ్‌ చేశారు. ఎందుకనీ అంటే… రాజశేఖరం పాత్రకి ఏ హీరో సరిపోరనీ అసలు తమ ఊహల్లోని ఆ పాత్రకి ఎవరూ న్యాయం చేయలేరనీ చెప్పారట. సినిమా విడుదలయ్యాక కూడా మొదటి ఆట సగం చూడగానే కొందరు లేచి నేరుగా రామానాయుడు గారింటికి వెళ్ళి మరీ గొడవ పడ్డారట.

పాఠకుల రచయిత్రి

ఇలాంటి సంఘటనలు ఎన్నో చెప్పుకోవచ్చు… యద్ధనపూడి సులోచనారాణి గారి నవలల గురించి. తాను యథాలాపంగా ఓ అంశాన్ని ఎంచుకుని రాసుకుంటూ పోతాననీ, మరి కొన్ని వారాల తర్వాత అది ఏ మలుపు తిరుగుతుందో మొదట తనకీ తెలియదనీ అలాంటి తన రచనలు పాఠకులకు అంతగా నచ్చడం, సినిమాలుగా వచ్చి అంతకు మించి ఆదరణ పొందడం … ఇదంతా తన అదృష్టమనే అనుకుంటాననీ అనేవారావిడ. ‘నేనూ నా పాఠకులూ పబ్లిషర్లూ… ఇది త్రివేణీ సంగమం లాంటిది. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా మిగతా ఇద్దరూ లేనట్లే…’  అంటూ వినమ్రంగా చెప్పేవారు. నిజానికి పాఠకులకు ఆమె రచనలంటే ఎంత అభిమానమో, ఆమెకు పాఠకులంటే అంతకన్నా ఎన్నో రెట్లు అభిమానం. ‘కొత్తలో వారు నా పాఠకులయ్యారు, తర్వాత నేను వారి రచయిత్రినయ్యాను’ అంటూ తనకూ పాఠకులకూ మధ్య ఏర్పడిన అనుబంధాన్ని అర్థవంతంగా ఒక్కమాటలో చెప్పారు సులోచనారాణి గారు.

          రచనల ద్వారా ఉపన్యాసాలూ సందేశాలూ ఇవ్వడం ఇష్టం లేని యద్ధనపూడి తాను సృష్టించిన పాత్రల ద్వారానే పాఠకుల్లో జీవితం పట్ల ప్రేమని పుష్కలంగా నింపేవారు. ఆమెతో నా పరిచయం నాకు చదవడం వచ్చినప్పటి నుంచీ అంటే నమ్ముతారా..!

          అందరూ చందమామలూ బాలమిత్రలతో చదువు మొదలుపెడితే నేను యద్దనపూడి సులోచనారాణి గారి నవలలతో మొదలెట్టాను. మాదో చిన్న పల్లెటూరు. పిల్లల కథల పుస్తకాలు ఇంకా ఊరిదాకా రాలేదు. దాంతో చదివితే పాఠ్య పుస్తకాలు లేదా ఆటలు తప్ప మరో వ్యాపకమేమీ ఉండేది కాదు. స్కూలు చాలా దూరంగా ఉండటంతో నేరుగా హైస్కూల్లో ఐదో తరగతిలో చేరాను. మా ఇంటి చుట్టుపక్కల ఇళ్ళలో ఐదారుగురు టీనేజీ అమ్మాయిలు ఉండేవారు. అందరూ అర్థాంతరంగా చదువు ఆపేసినవాళ్లే. ఎవరైనా టౌన్‌ నుంచి వారపత్రికలు తెస్తే వాటిల్లో సీరియల్స్‌ చదువుతూ కాలక్షేపం చేసేవారు.

          ఆ ఏడాదే కొత్తగా మా స్కూల్లో లైబ్రరీ పెట్టారు. లైబ్రేరియన్ పల్లెలమ్మట తిరిగి చదువుకున్న వాళ్ళందరినీ అందులో సభ్యులుగా చేర్చుకున్నాడు. అలా మా ఊళ్ళో  అమ్మాయిలంతా చేరారు. వాళ్ళకి వారం వారం కొత్త పుస్తకాలు తెచ్చిచ్చే బాధ్యత రోజూ స్కూలుకి వెళ్ళే నాకు అప్పజెప్పారు. ఇక అప్పటి నుంచి ఐదుగురి పేరున ఐదు పుస్తకాలు తీసుకుంటే, ఒకరిదొకరు మార్చుకుంటూ అందరూ అన్నీ చదివేవారు. వాళ్ళతో పాటు నేనూ. వాళ్ళంటే పగలంతా ఖాళీనే కాబట్టి గబగబా చదివేసేవారు. నాకంత తీరికేదీ… అందుకని స్కూల్లో మాస్టారు పాఠం చెబుతుంటే మొదటి బెంచీలో కూర్చుని మాస్టారికి కనపడకుండా బల్ల కింద నవల పెట్టుకుని చదివేసేదాన్ని. చెవులేమో టీచరు చెబుతున్న పాఠం వింటుంటే, కళ్ళేమో అక్షరాల వెంట పరుగులు తీసేవి. యద్దనపూడి, కోడూరి కౌసల్యా దేవి, పోల్కంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచనారాణి, మాలతీ చందూర్… ఈ పేర్లన్నీ అప్పుడే పరిచయం అయ్యాయి.

          చదవడం వచ్చు కాబట్టి దొరికింది చదివేయడం తప్ప అర్థమవడానికి ఏమాత్రం అవకాశం లేని వయసూ నేపథ్యమూను. ఎనిమిదో తరగతిలో ఉండగా మొదటిసారి రైలెక్కాను. బాంబే, అజంతా ఎల్లోరా అన్నీ చూసుకుంటూ ఓ వారం రోజులు తిరిగొ చ్చాము. రైలు ప్రయాణం, హోటల్లో బస చేయడం, పార్కులు, సినిమాలు… లాంటివన్నీ తొలి అనుభవాలే. నవలల్లో అప్పటి వరకూ చదివిన వాటిని ప్రత్యక్షంగా చూశాను.  మరో కొత్త ప్రపంచం కనిపించింది. దాంతో ఆ పుస్తకాల మీద ఇంకా ఆసక్తి పెరిగింది.

          తర్వాత కూడా ఆ ఊళ్ళోనే ఉంటే ఎలా ఉండేదో కానీ… తొమ్మిదో తరగతి నుంచి నగరానికి మారడంతో నా నవలాపఠనానికి బ్రేక్‌ పడింది. ఇరవయ్యేళ్ళు వచ్చాక అనుకుంటా ‘జీవన సౌరభాలు’ ఎందులోనో  సీరియల్ గా వస్తే చదివిన గుర్తు. అందులో హీరోయిన్ వేసుకుందని ఉద్యోగం రాగానే బెనెటన్ షాపుకి వెళ్ళి ప్యాంటూ షర్టూ కొనుక్కో వడం మంచి జ్ఞాపకం. ఫలానా రచయిత, ఫలానా భాష అని లేకుండా కనిపించిన ప్రతి పుస్తకాన్నీ చదివేసే అలవాటు మాత్రం ఇప్పటికీ వదలకపోవడానికి కారణం యద్ధనపూడి నవలలతో పడిన పునాదే అని ఖచ్చితంగా చెబుతాను.

          ఆ వయసులో అర్థం కాలేదనుకున్నా కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సందర్భాలలో నా మీద ఆ రచనల ప్రభావం కనిపిస్తుంది. జీవితాన్ని ఉన్నదున్నట్టుగా స్వీకరించగలిగాను. ఒక స్త్రీగా నా ప్రాధాన్యాలూ విలువలూ నేను తెలుసుకోగలిగాను. అంతులేని ఆశావాదం, అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం… నాకు ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచే శక్తినిచ్చాయి. యద్దనపూడి నవలల వల్లనే చదవడం అలవాటైందనీ మరెన్నో మంచి పుస్తకాలు చదివి ఇలా ఉన్నానేమోననీ… అనుకుంటా. సరే… నా కథ పక్కన పెట్టి యద్ధనపూడి గారి దగ్గరకు వస్తా.

ఉమ్మడి కుటుంబం

వసుంధర కోసం 1999 సెప్టెంబరులో మొట్టమొదటిసారి యద్దనపూడి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నా మీద తన ప్రభావం గురించి చెబితే ఆవిడ నన్ను అక్కున చేర్చు కున్నారు. ఆమె రచనలు వారపత్రికల్లో సీరియల్‌, నవల, సినిమా రూపాలు దాటి బుల్లి తెర ధారావాహికలుగా ప్రేక్షకాదరణ పొందుతున్న రోజులవి. దాంతో ఆ పలుకుబడిని  తమ స్వార్థానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు కొందరు వ్యక్తులు. ఆమెకు తెలియకుండా ఆమె  రచనల్ని ఇతర భాషలోకి అనువదించి ప్రచురించారు. ఆ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె ఏ మాత్రం ఆవేశపడలేదు. చాలా కూల్‌గా మాట్లాడారు. తాను చెప్పదలచుకున్నది మాత్రమే చెప్పారు తప్ప ఎవరినీ వేలెత్తి చూపలేదు. అంత మంచి మనసు ఆమెది.

          మొదలుపెడితే ఆపకుండా చదివించే బిగి సడలని కథనం… సులోచనారాణి నవలల ప్రథమ లక్షణమని అందరికీ తెలుసు. పాఠకుడు తన ప్రమేయం లేకుండానే కథలోకి నడిచి వెళ్ళిపోయే వాతావరణాన్ని ఆమె కల్పిస్తారు. కథ చెప్పడంలో అద్భుత మైన నేర్పు ఆమె సొంతం. సన్నివేశాల్లో చోటు చేసుకునే నాటకీయత పేజీలు తిప్పేస్తూ పై పైన చదివే అలవాటున్న వారిని కూడా ఆగి ప్రతి వాక్యం చదివేలా చేస్తుంది. ఎక్కడో కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో పుట్టి పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్న ఆమె అసలు ఇంత గొప్ప రచయిత్రి ఎలా కాగలిగారు… నవలారాణిగా యావత్‌ తెలుగు ప్రజల మనసులు దోచుకోవడమే కాక తెలుగు నాట పఠనాసక్తి పెంపొందడానికి పునాది వేయగల శక్తి ఆమెకెలా వచ్చింది… అన్నది తెలుసుకోవడం ఆసక్తికరం. పదో తరగతే అయినా అప్పటి ప్రమాణాలు వేరు. దానికి తోడు ఆమె ఆంగ్ల పుస్తకాలు బాగా చదివేవారు. ఆంగ్ల సినిమాలు చూసేవారు.

          సులోచనారాణి గారి తండ్రి కరణంగా పనిచేసేవారు. ఐదుగురు అక్కలు, ముగ్గురు అన్నలకు ముద్దుల చెల్లెలిగా పుట్టారు. పెద్ద ఉమ్మడి కుటుంబం. వచ్చిపోయే బంధువులు. అది చాలదన్నట్లు ఇద్దరు అనాథ విద్యార్థులను ఆదరించిన పెద్ద మనసు ఆ కుటుంబానిది. అంతమంది మధ్య పెరగడంతో తనకన్నా పెద్దవారిని చూసి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నారు సులోచనారాణి. వేర్వేరు వయసులకు చెందిన, రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారందరినీ నిశితంగా గమనించేవారు. ఆ పరిశీలనే ఆమె రచనలకు ముడిసరకు అయింది. అంతేకాదు, భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఒక రకమైన ఒంటరితనంతో బాధపడుతున్న సన్నిహితులను చూసిన ఆమెలో చిన్న వయసులోనే మొదలైన సహానుభూతి ఆ తర్వాత ఆమెను సామాజిక సేవ వైపు మళ్ళించింది. అలాంటి పరిస్థితుల్ల్లో ఉన్నవారికి చిన్న చేయూత, ఒక మంచి మాట ఎంతో ఊరడింపునిస్తుందనీ వారి కళ్ళలో ఆ ఆనందం చూడటం తనకెంతో ఇష్టమనీ చెప్పేవారు. అందుకే తన పేరు మీద ఫౌండేషన్‌ ప్రారంభించి మిత్రబృందంతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు.

          సులోచనారాణి గారికి పద్నాలుగో ఏట పెళ్ళయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే తల్లి చనిపోయింది. ఇంట్లో అందరికన్నా చిన్నదైన సులోచనారాణి చాలా దిగులు పడి పోవడంతో ఎలా ఆమెను ఊరడించాలా అని ఆలోచిస్తున్న కుటుంబానికి ఆమెకి మంచి సృజన శక్తి ఉందనీ కథలు రాయించమనీ స్కూలు మాస్టారు సలహా ఇచ్చారట.  అలా మొదలైన కథారచన ఆమెను మళ్ళీ మనుషుల్లో పడేసింది. ఆమె తొలి కథ ‘చిత్ర నళినీయం’ 1957లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. అలా అడపాదడపా కథలు రాస్తూ ఉన్న సులోచనారాణిని పద్దెనిమిదో ఏట కాపురానికి హైదరాబాద్‌ పంపారు. మెట్టినింట బాధ్యతల నడుమ కథారచనను కొనసాగిస్తున్న వేళ ఊహించని సంఘటన ఒకటి జరిగింది.

 అనుకోకుండా తొలి నవల

సులోచనారాణిగారి ఇంటికి ఒక రోజు బాపూ రమణలను తీసుకుని జ్యోతి మాసపత్రిక ఎడిటర్‌ రాఘవయ్యగారు వచ్చారు. తమ పత్రిక కోసం ఒక నవల రాయమని ఆమెను అడిగారు.  ‘నవలా… నేను రాయలేను’ అని ఆమె… ‘రాయగలరు, రాయాల్సిందే’  అని వాళ్ళూ … రెండు మూడు గంటలు ఒకరినొకరు ఒప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరికి పెద్ద కథగా రాయడానికి అంగీకరించారు సులోచనారాణి. ఆ కాసేపట్లోనే లీలగా ఒక వస్తువు స్ఫురించడమూ దానికి ఆమె ‘సెక్రెటరీ’ అని పేరు పెట్టడమూ అనుకోకుండా జరిగిపోయాయి. నిజానికి ఆ రోజుల్లో అమ్మాయిలు చదువుకోవడమే గొప్ప అనుకుంటే ఉద్యోగం చేయడం ఇంకా గొప్ప. అందుకని ఒక మధ్యతరగతి యువతి, సెక్రెటరీగా ఉద్యోగం చేయడం, ఆ క్రమంలో ఆమె ఎదుర్కొనే ఇబ్బందులు, మహిళామండలి రాజకీయాలు… ఇదే మొదట ఆమె అనుకున్న కథ.  ‘జయంతి’ అన్న పేరు కూడా ఆ రోజే చెప్పేశారు. ఆ తర్వాత కథ సాగే క్రమంలో జయంతికి అండగా ఒక పాత్ర ఉండాలని అనుకున్నప్పుడు ఆటోమేటిగ్గా రాజశేఖరం పాత్ర రూపుదిద్దుకుంది. అంతేకానీ ఆ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని తాను ఏ మాత్రం అనుకోలేదన్నారు సులోచనారాణి.

          అన్నిటికన్నా ముఖ్యవిషయం- తొలి నవల సెక్రెటరీ మొదలు పెట్టినప్పుడు ఆమె వయసు కేవలం 24 ఏళ్ళు. గర్భిణి కూడా. రాయాల్సింది రాసి ఇచ్చేసి తన పనులేమో తానేమో అన్నట్లు ఉండేవారు. ఇక పాప పుట్టాక ఆమే తన లోకమైందనీ చిన్న వయసు కావడంతో పేరు ప్రఖ్యాతులూ వాటి పరిణామాల గురించి ఆలోచించే పరిణతి కూడా అప్పుడు తనకు లేదనీ చెప్పారామె. అలాంటిది సెక్రెటరీ పాఠక లోకంలో గొప్ప సంచలనం సృష్టించడమే కాక ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఆమె యాభై ఏళ్ళలో 75 నవలలు రాసేలా చేసింది.

          ఇంతకీ ఏ ముంది ఆ సెక్రెటరీలో… నవలగా, సినిమాగా వచ్చి అరవై ఏళ్ళవుతున్నా ఇప్పటికీ ఆ పుస్తకాన్ని ఎందుకు కొంటున్నారు… 75 ముద్రణలు ఎలా పొందింది… ఈ ప్రశ్ననే సులోచనారాణిగారిని అడిగితే- పాఠకులు జయంతిని ప్రేమించారు. ముఖ్యంగా మహిళలు ఆమెలో తమను తాము చూసుకున్నారు. మగవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి… అన్న వారి ఊహలకు ఆ పాత్రలు దగ్గరగా ఉండి ఉంటాయి… అందుకే వాళ్ళు ఇప్పటికీ ఆ నవలని ఇష్టపడుతున్నారు. జయంతి, రాజ శేఖరం పాత్రలను  స్త్రీ పురుషుల అనుబంధానికి ప్రతీకలుగా తీసుకుంటున్నారని నేను భావించా’నన్నారు.

జీవనతరంగాలుప్రత్యేకం

నవలగానూ సినిమాగానూ కూడా ఎంతో ప్రజాదరణ పొందిన జీవనతరంగాలు తనకెంతో ప్రత్యేకం అని చెప్పారు సులోచనారాణి చతుర ‘కథ వెనుక కథ’ శీర్షిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు. సాధారణంగా ఆమె- కుటుంబ జీవితం గురించీ, అనుబంధాల గురించీ ఎక్కువగా రాసేవారు. అలాంటిదే మరో నవల రాద్దామని ‘జీవన తరంగాలు’ మొదలెట్టా రట. అది సీరియల్‌గా రావడం ప్రారంభమయ్యాక పాఠకులను ఎంతగానో ఉర్రూతలూగిం చిందనీ, దానికి సంబంధించి లెక్కలేనన్ని సంఘటనలు జరిగాయనీ ఇన్నేళ్ళయ్యాక కూడా అవన్నీ తలచుకుంటే తనకి బీపీ వచ్చేస్తుందనీ అసలు ఒకోసారి ఆ నవల ఎలా రాయగలిగానా అని తన మీద తనకే ఆశ్చర్యం వేసేదనీ చెప్పారు. వారం వారం ఒక్కో భాగం రాసి పోస్టు చేసేవారట. నవల స్క్రిప్ట్ మొత్తం చేతిలో లేకుండా ఆమె మీద నమ్మకంతో ఎడిటర్లు సీరియల్‌ ప్రచురించేవారు. ఆ నమ్మకాన్ని ఆమె ఏనాడూ వమ్ము చేయలేదు.

          ఇక, జీవనతరంగాల దగ్గరికి వస్తే … ఆత్మాభిమానం మెండుగా గల రోజా పాత్రలో ఎందరో అమ్మాయిలు తమను తాము చూసుకున్నారు. అసలు అందులో క్యారెక్టర్లన్నీ పాఠకులకు ఎంతగా నచ్చాయంటే వాటిని నిజజీవితంలో వ్యక్తులుగా భావించి వారి గురించి తెలుసుకోవడానికి కొందరు పత్రికా కార్యాలయానికీ వచ్చేవారట.

          చందూ పాత్రని నిజజీవితంలో తాను చూసిన సంఘటన ఆధారంగానే సృష్టించారు సులోచనారాణి. వాళ్ళు ఉండే కాలనీలో తరచూ దొంగతనాలు జరిగేవట. ఒకసారి పోలీసులు మాటువేసి ఇద్దరబ్బాయిల్ని పట్టుకుని కొట్టి జీపులో ఎక్కిస్తుండగా ఆమె చూశారు. వాళ్ళలో ఒకరు నిండా పందొమ్మిదేళ్ళు కూడా లేని కుర్రాడు. ఎంతో సుకుమారంగా ఉన్నాడు. గాయాలతో రక్తమోడుతూ నిర్లిప్తంగా జీప్‌ ఎక్కుతున్న అతడిని చూసి ‘ఏ తల్లి కన్నదో ఇలాంటి బిడ్డల్ని, ఆ తల్లి కడుపు కాల’ అంటూ శాపనార్థాలు పెట్టిందట పక్కింటావిడ. అది విని సులోచనారాణి గారి మనసు చివుక్కుమంది. ఏ పరిస్థితులు అంత చిన్న పిల్లవాడిని చెడు మార్గం పట్టించాయో అన్న ఆలోచన చాలా కాలం వెంటాడిందనీ ఆ ప్రభావంతోనే చందు పాత్రను రాశాననీ చెప్పారు.

చాలా కోల్పోయాను

బోలెడన్ని నవలలు రాసిన గొప్ప రచయిత్రి… ఎన్నో సినిమాలకు తన కథలు అందిం చారు… సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అలాంటి ఆమె సెలెబ్రిటీగా ఓ వెలుగు వెలిగి ఉంటుంది అనుకుంటాం కదా… కానీ ఆమె ఎప్పుడూ వేదికల మీద కన్పించేవారు కాదు. సభలూ సమావేశాలకు హాజరయ్యేవారు కాదు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోవడం తప్ప లైమ్‌లైట్‌లో ఉండడాన్ని ఇష్టపడేవారు కాదు. సామాజిక సేవలో బిజీ అయ్యాక మాత్రమే అప్పుడప్పుడు తప్పనిసరైతేనే హాజరయ్యేవారు. ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు- ‘రచయిత్రిగా పేరు రావడం వల్ల చాలా కోల్పోయాను… మామూలు గృహిణిగా పొందే సంతోషాలూ సరదాలూ మిస్సయ్యాను. పెళ్ళిళ్ళకీ వేడుకలకీ వెళ్ళలేకపోయేదాన్ని. ఎప్పుడూ ఏవో కమిట్‌మెంట్స్‌ ఉండేవి. ఒకరికి నవల ఇవ్వాలి, మరొకరికి సీరియల్‌ ఇవ్వాలి… ఇలా రాస్తూనే ఉండాల్సి వచ్చేది’ అని చెప్పారు. ఎమెస్కోకి రాయమని ఎంతో బలవంతం చేస్తే తప్పనిసరై మొట్టమొదటి నవలగా ఆరాధన రాశారు, దానికి విపరీతంగా పేరొచ్చి వెంటవెంటనే 15 పునర్ముద్రణలు పొందడంతో ఆమెను తమ కోసం ఇంకా ఇంకా రాయమని అడిగేవారట. దాంతో ఏటా తన పుట్టిన రోజు అయిన శ్రీరామనవమి నాటికి ఒక కొత్త నవల ఎమెస్కో ద్వారా విడుదల య్యేలా ఒప్పందం చేసుకున్నారు సులోచనారాణి. అలా ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉండేవారు. ఎంత ఎక్కువగా రాసేవారో అంత వైవిధ్యభరితమైన సబ్జెక్టులనూ ఎంచుకునేవారు. ప్రతి దాంట్లోనూ  ప్రేమ కథ అంతర్లీనంగా ఉన్నా ప్రధాన అంశం ఏదో ఒకటి ఉంటుంది. ఏ రెండు నవలలూ ఒకేలా ఉండవు. ఎత్తుగడ నుంచీ ముగింపు వరకూ దేనికదే ప్రత్యేకం అన్నట్లుంటాయి.

అపురూపం ఆ కథానాయికలు

నాలాంటి ఎందరికో ఆరాధ్య రచయిత్రి అయిన యద్ధనపూడి సులోచనారాణి గారి నవలల గురించి ఓ అపప్రథ ఉంది. ఆమె రచనలు కలల్లో విహరించేలా చేస్తాయనీ వాస్తవ దూరంగా ఉంటాయనీ అంటుంటారు కొందరు. ఈ అభిప్రాయం సరైంది కాదనే నేను అనుకుంటాను. అందుకు నా జీవితమే ఉదాహరణ అనీ చెబుతుంటాను.

          అసలు ప్రేమగా, ఒకింత అపురూపంగా చూసుకునే భాగస్వామి దొరకాలనీ అతడు తనకు తగిన స్వేచ్ఛనిస్తూ తన వ్యక్తిత్వాన్ని గౌరవించాలనీ ఏ ఆడపిల్ల కోరుకోదు? అరమరికల్లేని మానసిక బంధంతో దాంపత్యజీవితం అనురాగ రంజితం కావాలని కలలు కననిదెవరు?

          నవలలు చదవని వారు ఆ కలలు కనరా? అది తప్పు కాదే. అటువంటప్పుడు ఈ నవలలు మాత్రం తప్పెలా అవుతాయి.

          పైపెచ్చు సులోచనారాణిగారి నవలా నాయికలు ఒకరి మీద ఆధారపడాలనుకోరు. అందగాడూ సంపన్నుడే భర్త కావాలనీ అనుకోరు. అలాంటివాడు తమకి విలువ ఇవ్వక పోతే అల్లంతదూరాన ఉంచగల ఆత్మాభిమానం వారి సొంతం. సెక్రెటరీలో జయంతికి రాజశేఖరం మీద ఆ నమ్మకం కుదరక చివరివరకూ అతనికి దూరంగా వెళ్ళిపోవడం మనకు తెలుసు కదా.

          సులోచనారాణి గారి నవలల్లో చాలా వరకూ కథానాయకలు ప్రేమకన్నా ఆత్మ గౌరవమే ముఖ్యమని భావిస్తూ దాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకెళుతుంటారు.  చుట్టూ ఉన్న పరిస్థితులకు తమ వ్యక్తిత్వానికి మధ్య జరిగే సంఘర్షణలో నలిగి పోతుంటారు. అయితే ఆ సంఘర్షణ పాఠకులకు విసుగు కలిగించదు, కథానాయికతో మమేకమై, ఈ పోరాటంలో ఆమె గెలవాలని కోరుకునేలా చేస్తుంది.

          ఆడపిల్లలకు వెన్నెముక ఉందనీ, నిటారుగా తలెత్తుకుని నిలబడాలనీ చెప్పేవే ఆమె నవలలన్నీ. అంతేకాదు, అమ్మాయిలు టీచర్లూ నర్సులూ మాత్రమే కాదు ఇతర ఉద్యోగాలూ చేయగలరని చెప్పడానికే అరవయ్యేళ్ళ క్రితమే సెక్రెటరీ రాశారామె.

          విమర్శకులను ఆమె అసలు పట్టించుకునేవారు కాదు. తన పాఠకులకు ఏంకావాలో అదే రాస్తాననేవారు. అప్పుడు తాను రాసింది ఇప్పటి అమ్మాయిల్లో చూస్తున్నాననీ నేటి స్త్రీలు పురుషుడి ముందో వెనకో కాక కలిసి నడవడాన్ని ఇష్టపడడం చూస్తే ముచ్చటే స్తోందనీ ఆమె చెప్పారు. నాలుగు తరాల వారు ఆమె రచనల్ని చదివారు. ఇప్పటికీ అవి అంతే ఆదరణ పొందుతున్నాయంటే వాళ్ళు కోరుకుంటున్నదేదో వాటిల్లో ఉందన్న సులోచనారాణి గారి అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమేననిపిస్తుంది.

ఏం కావాలో తెలుసుకోవాలి

ఆమె ముఖ్యంగా మహిళలకు ఒక సలహా ఇచ్చేవారు. తమకేం కావాలో తెలుసుకోవాలనీ, అప్పుడే దాన్ని సాధించుకోవడం తేలికవుతుందనీ, అది తెలియకుండా దేనికోసమో ఆరాటపడుతూ జీవితాన్ని కోల్పోకూడదనీ  చెప్పేవారు. మరో మాట కూడా చెప్పేవారు… ఉద్యోగం చేసినా చేయకపోయినా పెళ్ళీ పిల్లలూ సంసారాల జంఝాటంలో మునిగి పోవద్దనీ సమాంతరంగా మరో జీవన రేఖను గీసుకోవాలనీ. సామాజిక సేవ అందుకు చక్కటి మార్గమని తాను అనుభవంతో తెలుసుకున్నాననేవారు. లేకపోతే జీవితం యాంత్రికంగా తయారై చివరికి ఒంటరితనంతో బాధపడాల్సి వస్తుందని చెప్పేవారు. చిన్నప్పుడు చూపు లేని తన సోదరికీ, తొంభై ఏళ్ళ అమ్మమ్మకూ పుస్తకాలు చదివి వినిపించేవారట సులోచనారాణి. రచనా వ్యాసంగంలో ఉన్న అన్నయ్యకు తన చేతి రాతతో రచనలను ఫెయిర్‌ చేసి పెడుతూ ఉండేవారు. అంత పెద్ద ఉమ్మడి కుటుంబం లో ఎంతగా కలిసిపోయి ఉన్నా మళ్ళీ తామరాకు మీద నీటిబొట్టులా ఉంటూ తనదైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలిగాననీ అది ఎలా వచ్చిందో తనకు తెలియదనీ కానీ అందులోని సుఖాన్ని చూశాను కాబట్టి అందరికీ అదే సలహా ఇస్తాననీ చెప్పారామె. జీవితంలో ఏ లక్ష్యాన్ని అయినా నిజాయితీగా సాధించాలనేవారు.

          నమ్మిన విలువల్ని ఆచరణలోనూ చూపారనడానికి నిదర్శనం ఆమె జీవితం. తన రచనలకు ఎంతో డిమాండు ఉన్న సమయంలోనే కావాలని తనంతట తానే రిటైర య్యారు. రాసినంత వరకూ తన రచనలనూ తననూ పాఠకులు తమ ప్రేమలో, ఆదరాభిమానాల్లో ముంచి లేపారనీ జీవితం ఎంతో సంతృప్తిగా ఉందనీ అందుకే ఇక రాయాలని లేదనీ కొంతకాలం సాధారణంగా గడపాలనుకుంటున్నాననీ చెప్పారు. ఆమె జీవితాన్ని ప్రేమించారు. విలాసాలను ఇష్టపడేవారు కాదు. ఉన్నదాంతోనే తృప్తి పడేవారు. తనకి ఉన్నది ఒక్కతే కూతురైనా(లక్ష్మీ శైలజ) అభిమానులు లేకుండా తాను లేననీ వారితో కలిసి తనది జగమంత కుటుంబమనీ నవ్వేవారు. 

          ఏ క్షణమైనా తృప్తిగా కళ్ళు మూయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన ధీర ఆమె. అంతేకాదు, తన మరణానంతరం ఎవరూ సంతాపం ప్రకటించవద్దనీ, తన కోసం సభలు పెట్టవద్దనీ కోరారు. తన రచనలను తలచుకుంటే చాలన్నారు. అన్నట్టుగానే ఆమె అనాయాసమరణంతో హఠాత్తుగా నిష్క్రమించారు. అభిమానులకు కావలసినన్ని రచనల్ని తన జ్ఞాపకాలుగా మిగిల్చారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.