వెనుతిరగని వెన్నెల(భాగం-59)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణంనించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా ఎదురయ్యి పెళ్ళి చేసుకుంటాడు.

***

          ఇల్లు ఖాళీ చేసి తాళం చెవి తాయిబాకు ఇస్తుంటే ఎంతో బాధ కలిగింది తన్మయికి.
ఉద్యోగ నిమిత్తమై ఒంటరిగా ఊరుకాని ఊరొచ్చిన తనకి ఎంతో సాయపడ్డది. తనకు అక్కచెల్లెళ్ళు లేని లోటు తీర్చింది తాయిబా. ఎన్నో సార్లు కష్టకాలంలో బాబుని చూసు కుని ఎంతో సహాయం చేసింది.

          గేటు దగ్గిర “నే చెప్పింది జర యాదుంచుకో మేడం, మీ అత్తమామల లెక్కేమున్నది తియ్యిగాని, సారు, నువ్వు గిట్ల మంచిగుంటె అంత మంచిగైతది” అంటూ కౌగిలించు కున్న తాయిబాకు వీడ్కోలు పలుకుతూ “మిత్రమా! ఇంత మంచి అమ్మాయికి నా తరఫున ఎప్పుడూ సహాయం చెయ్యి” అని మనసులోనే వేడుకుంది.

          తాయిబాకు తనంటే ఎంత ప్రేమ!

          జీవితం తనకిచ్చిన అరుదైన వరాలివన్నీ. ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు తను?
వాకిట్లో మొక్కలకు, చిన్న డాబా మీద గింజలు ముక్కున కరుచుకుని రెక్కలు అల్లాడిస్తూ తుర్రున ఎగురుతున్న పిచికలకు వీడ్కోలు పలికి మౌనంగా ప్రభు బండి వెనక ఎక్కింది.
బాబు సరదా పడితే సామాన్లతో బాటూ ప్రభు మేనల్లుడి వెంట వ్యానులో పంపించింది.
ఊరు దాటుతూ ఉండగా రోడ్డు మలుపు నించి దారి పొడవునా అటూ ఇటూ వీడ్కోలు పలుకుతున్న మోదుగ పూల చెట్ల పరిమళం తాకగానే గుండెమాటున దాగున్న జ్ఞాపకాలు ఒక్కపాటున విరబూసేయి.

          తనా ఊరికి వచ్చిన మొదటిరోజు అప్పటి వరకు ఎప్పుడూ పరిచయం లేని కొత్త పరిమళం, తేమలేని చల్లని పీఠభూమి గాలి సేదతీర్చలేని ఎడతెగని దుఃఖం. ప్రాణ ప్రదమైన విశాఖ సముద్రాన్నొదిలి తెలియని ప్రాంతంలో అడుగుపెడుతూ మనస్సంతా తీగలుగా అల్లుకున్న దిగులుతో ఒంటరిగా బాబుతో ఒకే ఒక్క సూట్ కేసుతో అడుగు పెట్టింది అక్కడికి. ఇప్పుడు? ఒక వ్యాను నిండా సామాన్లు అయ్యేయి. బాబుతో ఒంటరిగా మొదలైన జీవితం ప్రభు రాకతో వసంతాన్ని సంతరించుకుంది. ఉన్నట్టుండి ప్రభు కుటుంబమూ తమతో చేరి ఇప్పుడు ఒక్కసారిగా సంసారం సాగరం అయ్యింది. కానీ తనంటే బొత్తిగా ఇష్టం లేని వాళ్ళ మధ్య బతకడమే ఇప్పుడు పెద్ద సమస్య. ప్రభు తల్లి భయంకరమైన మాటలు గుర్తుకు వచ్చి మళ్ళీ ఈటెల్లా గుచ్చుకోసాగేయి. ప్రభు భుజాన చెయ్యి వేసి కళ్ళు మూసుకుంది. ఆ చేతిని తన చేత్తో నిమురుతూ ఏదో అర్ధమైనట్లు “కాస్త ఓపిక పట్టురా ప్లీజ్, అన్నీ సర్దుకుంటాయి” అన్నాడు అనునయంగా. తన్మయి నిశ్శబ్దంగా తన చేతిని వెనక్కు తీసుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది.

          అప్పుడప్పుడే చీకటి పడుతూ సంధ్య వెలుగు ఆకాశమంతా పరుచుకుంటూ ఉంది.
తన్మయికి తమ ఊరు, ఎన్నో సాయంత్రాలు ఒంటరిగా జాజి పందిరి పొదరింట్లో కూచుని చదువుకున్న పుస్తకాలు, వనజతో కబుర్లు చెప్పుకుంటూ గడిపిన గోధూళి వేళలు, అజ్ఞాత మిత్రునికి రాసిన పొందికైన లేఖలతో అనంతాద్భుతమైన అనుభూతిగా, హాయిగా సాగిన తన యవ్వన కాలమంతా జ్ఞాపకం వచ్చింది. తరువాత గడిచిన జీవితమంతా ఎప్పటి కప్పుడు కొత్తకొత్త సమస్యలే. తనకు మాత్రమే జీవితం ఇలాంటి అంతుచిక్కని ప్రహేళిక లాంటి కాలాన్ని భవిష్యత్తుగా బహూకరిస్తూందెందుకో! నిస్త్రాణగా కళ్ళు మూసుకుంటూ “మిత్రమా! ఎప్పటిలానే నా జీవితాన్నినీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను నువ్వే  నడిపించు” అనుకుని కళ్ళు తెరిచింది.

          తన్మయి మాటలు విని ఆకాశం అభయహస్తాన్నిచ్చినట్లు దూరంగా ఉల్క ఒకటి రాలిపడింది.

***

          కాలేజీ నుంచి దాదాపు గంట దూరంలో ఉందీ కొత్తిల్లు. ఇంటి దగ్గర్లో మరో కాలనీలో ఉన్న స్కూలొకటి చూసి బాబుని జాయిన్ చేసింది. పొద్దుట వాణ్ణి స్కూలు ఆటో ఎక్కించి, వెంటనే బయలుదేరి రోడ్డు మీదికొచ్చి బస్సు పట్టుకుంటే తొమ్మిది గంటల వేళకి అటూ ఇటూగా కాలేజీకి వచ్చి పడుతూంది. ఈ మధ్యలో ఎక్కడ లేటయినా మరింత లేటు కావడం ఖాయం! అసలే కాలేజీలో ప్రిన్సిపాల్ ట్రాన్స్ ఫర్ అయ్యి కొత్తగా లేడీ ప్రిన్సిపాల్ జాయిన్ అయ్యేరు. సొంతంగా కారున్న ఆవిడ కాలేజీ సమయానికి అరగంట ముందే వచ్చి కూచుని, లేటొచ్చిన వాళ్ళు లెక్చరర్లయినా ఆప్సెంటు వేసేస్తుందని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఇల్లు మారడం ఒక విధంగా తనకి దురదృష్టమే అనుకుంది తన్మయి.

          ఇక ఇంట్లో ఎవరి గదుల్లో వాళ్లు సర్దుకున్నారు. తన్మయి ఇంట్లో ఉన్నంతసేపు సాధ్యమైనంత వరకు తన గదిలోనే ఉండసాగింది. ఎక్కువగా తన్మయి ముఖం కనబడకో ఏమో ప్రభు తల్లి కాస్త నెమ్మదించినట్టు కనబడింది. పొద్దున్న తన్మయి కిందికి వచ్చేసరికే ప్రభుకి, తన్మయికి, బాబుకి కేరేజీలు కట్టేసి రెడీగా ఉండసాగేయి. తనని వంటింట్లోకి అడుగుపెట్టొద్దని ప్రభు తల్లి శాసనం వేసినందుకు బాధ కలిగినా, సమయానికి వండి పెడ్తున్నందుకు సంతోషించింది తన్మయి. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మొదటి రోజే మధ్యాహ్న భోజనం చేసేందుకు కారేజీ మొదటి బాక్సు మూత తెరవగానే నీరయిపోయిన రాత్రన్నం జిగురుగా చేతికి తగిలింది. ఒక్కసారిగా దుఃఖం ముంచు కొచ్చింది తన్మయికి. తనకిదేం ఖర్మ!

          తన ఇంట్లో తను వండుకుని తినడానిక్కూడా వీలులేదు. వాళ్ళేం పెడితే అది తినాలి. వాళ్ళు పెడుతున్నది ఇదీ. ఎదురుగా అప్పుడే బాక్సు మూత తియ్యబోతున్న ఇద్దరు ముగ్గురు లెక్చరర్లు తన్మయి ముఖంలోకి చూసీ చూడనట్లు తలదించుకున్నారు.
విసవిసా బయటకు నడిచి రోడ్డు మీదికి వచ్చి ప్రభుకి ఫోను చేసింది తన్మయి. మారు మాట్లాడకుండా అంతా విన్న ప్రభు అట్నించి చాలా కూల్ గా “ఆ కేరేజీ పడేసి ఏదైనా తెప్పించుకుని తిను” అన్నాడు. తన్మయి చికాకొచ్చి ఫోను పెట్టేసింది. అసలే ఒక పక్క ఆకలి మండుతుంది. మరో పక్క గుండెల్లో ఈ మంట. కేరేజీ పడేసి ఏదైనా  తెప్పించుకో వాలని తనకీ తెలుసు. అసలు తనెందుకు ఫోను చేసింది? తన బాధ చెప్పుకోవడానికి అతను తప్ప ఎవరున్నారు తనకి? వాళ్ళ వాళ్ళు ఎలా తనని ఏడిపిస్తున్నారో అతనికీ తెలియాలి కదా!

          కనీసం “అయ్యో, అలాగా సాయంత్రం వాళ్ళతో మాట్లాడుతాననైనా” అనలేదు ప్రభు. ఇక అతనితో చెప్పుకుని ఏం ప్రయోజనం?

          వెనక్కి దిగులుగా నడిచి వస్తున్న తన్మయికి బస్సు దిగి అప్పుడే కాలేజీకి వస్తున్న సిద్దార్థ ఎదురయ్యేడు.

          “ఉదయం లేటయ్యిందండీ. ఎలాగూ ఆబ్సెంటు పడుతుందని సెలవు పెట్టి మధ్యాహ్నం సెషన్ కి వస్తున్నా” అన్నాడు.

          సమాధానం లేని తన్మయి ముఖం చూస్తూనే మనఃస్థితి పసిగట్టినట్టు “ఎలాగూ లంచ్ అవరే కదా, కొంచెం టీ తాగి వెళ్దాం రండి” అంటూ త్రోవ పక్కనే ఉన్న చిన్న హోటల్లోకి దారి తీసేడు.

          బాధతో, ఆకలితో, అవమానంతో, దుఃఖంతో, దిగులుతో కళ్ళుదించుకుని కూచున్న తన్మయి భోజనం చెయ్యలేదన్న సంగతి ఇట్టే పసిగట్టి టిఫిను ఆర్డరు చేసేడు. తిన్నాక స్థిమితపడ్డ తన్మయి “థాంక్యూ సిద్ధూ!” అంది కళ్ళ మీది సన్నటి నీటి పొరని ఒత్తు కుంటూ. జరిగిందంతా విన్న సిద్దార్థ గట్టిగా నిట్టూర్చేడు.

          “బాధ పడకండి. మంచి మనసున్న మీకెప్పుడూ అపజయం కలగదు. మీరు చదువు కున్న వారు. సంస్కారం కలిగినవారు. అతని వైపు వాళ్ళేవరికీ సంస్కారం లేనట్లుంది. వాళ్ళకున్న పరిజ్ఞానం, వాళ్ళ జీవితాల పరిధీ మీతో పోలిస్తే దాదాపు సున్నా. మీరు చూసిన జీవితం వాళ్ళేవ్వరూ చూసి ఉండరు. ఆ కుటుంబంలో వయసుల్ని పక్కన బెడితే జీవితానుభవంలో మిమ్మల్ని మించిన వారూ ఉండరు. ఏ విధంగా చూసినా మీ కంటే అల్పులే వాళ్ళంతా. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. అటువంటి వాళ్ళ వల్ల మీ కంట్లో కన్నీరు ఉబకకూడదు.” అన్నాడు.

          తన్మయి విభ్రమంగా చూసిందతని వైపు. ఎంత బాగా చెప్పేడు!

          “ఇక ప్రభు పరిస్థితి ఎటూ మాట్లాడలేనిది. వాళ్ళు ఎటువంటి వాళ్ళో అతనికి బాగా తెలుసు. కానీ తన వాళ్ళని కాదని మిమ్మల్ని వెనకేసుకురాలేడు. అందువల్ల తను ఎక్కడ వాళ్ళకు దూరమవుతాడేమోన్న భయం అయ్యి ఉండొచ్చు. ఏదేమైనా, ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళను వదులుకోలేని మంచి కొడుకు అతను అన్నాడు “మంచి” అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. కానీ ఈ విషయాన్ని పెళ్ళికి ముందు మీతో స్పష్టంగా చెప్పి ఉంటే బావుం డేది. బహుశా: ఇదే జీవితమంటే. నిరంతర పోరాటం. ఇంత కంటే గొప్ప కష్టాలెదుర్కొని నిలదొక్కుకున్న మీకు నేను చెప్పనవసరం లేదనుకుంటా” అని తన్మయి మౌనంగా ఆలోచిస్తుండడం చూసి…

          “ప్రభు విషయం నాకంటే మీకే బాగా తెలుసు. మంచి కొడుకు మంచి భర్త కాగలడని సామెత ఉంది కదా! అది నిజమౌతుందేమో ఆలోచించండి” అన్నాడు. తన్మయి అర్థం అయినట్లు తలూపింది.

          “సరే మరి, మంచి అద్రక్ చాయ్ తాగి బయలుదేరుదామా” అన్నాడు చిన్నగా నవ్వుతూ. తన్మయి తేలికపడ్డ మనసుతో ఊపిరి తీసుకుంటూ ప్రతిగా చిర్నవ్వు నవ్వింది.

***

          తిరిగి వస్తున్నపుడు బస్సులో ఒళ్ళు తెలీకుండా నిద్రపట్టేసింది తన్మయికి.
అంతలోనే కల కూడా రాసాగింది.

          తన్మయి బస్సు దిగి ఇంటికెళ్ళే దారిలో చిన్న సిలిండరుతో బాటూ ఉండే స్టవ్వొకటి కొంది. “నేను వంటింట్లోకి అడుగు పెట్టకూడదు కాబట్టి పైన మన గదిలో నేను  వండు కుంటాను” అంది.

          “ఇంత చిన్నగదిలో వంట పెడితే ఎలా?” అని ముఖం చిట్లించిన ప్రభుని పట్టించు కోనట్లు , అది తన సమస్య కానట్లు తెచ్చిన పాల పేకెట్టుని గిన్నెలోకి వంపి స్టవ్వు మీద పెట్టింది.

          “ఏదో పొద్దున్నే పాలు కాచుకుందుకో, అస్తమాటూ కిందికి దిగి వెళ్ళలేని చిన్న చితకా అవసరాలకో ఈ చిన్న స్టవ్వు వాడుకో కావాలంటే. మధ్యాహ్నం కేరేజీ కావాలంటే బయటి నుంచి తెప్పించుకో. అంతేగాని మొత్తం వంట వేరే పెడితే ఏం బావుంటుంది?” అన్నాడు.

          “అంతే గాని వాళ్ళకు రాత్రి అన్నాలు కేరేజీల్లో పెట్టొద్దని చెప్పవన్నమాట. అయినా నేను వంటింట్లోకి రాకూడదని శాసనం వేసేరుగా. ఇంకేం చెయ్యమంటావు?” అంది గట్టిగా తన్మయి.

          ప్రభు మాట్లాడకుండా తల తిప్పుకోవడం చూసి “ఇక మీదట ఇంటి ఖర్చులేవీ నేను కట్టడం లేదు. నా ఖర్చులు, బాబు ఖర్చులు పోగా మిగిలివేవైనా ఉంటే సేవింగ్సు బ్యాంకులో వేస్తాను. ఇల్లు నువ్వూ, మీ వాళ్ళూ కలిసి నడుపుకోండి. ఇక మీదట సాయంత్రం భోజనం కూడా నేనే వండుకుంటాను. గదిలో కాకపోతే మధ్య హాల్లో” అని పుస్తకం తీసుకుని డాబా మీదికి వెళ్ళసాగింది. ఇంతలోనే పక్కనున్న ఎవరో కుదపడంతో మెలకువ వచ్చింది తన్మయికి.

          అబ్బా! చిన్న కునుకు పట్టిన కాస్సేపు కూడా ఇంటి గొడవల కలే. కలలో అప్రసన్నంగా ఉన్న ప్రభు ముఖం గుర్తుకొచ్చి తనలో తను చికాకు పడుతూ బస్సు దిగి, బండి తీసుకుని ఇంటి ముందు ఆగంగానే ఎక్కడలేని అలసట వచ్చింది తన్మయికి.
తల్లి కోసమే చూస్తున్నట్లు గేటు పుచ్చుకుని అటూ ఇటూ ఊగుతున్న బాబు తన్మయిని చూస్తూనే పరిగెత్తుకుని వీథి చివరికి ఎదురొచ్చి బండెక్కేడు.

          పాత ఇంటి అలవాటుగా అలా పరిగెత్తుకు వస్తున్న బాబుని వారిస్తూ “నాన్నా! రోడ్డు మీద బళ్ళు వస్తున్నాయి కదా! అలా పరిగెత్తొచ్చా” అంది మందలింపుగా.

          “అమ్మా! ఆకలేస్తూ ఉంది” అన్నాడు.

          “అదేమ్మా, స్కూలు నించి వచ్చి పాలు తాగలేదా?” అంది.

          బాబు తల అడ్డంగా ఊపుతూ “మనిద్దరికీ పాలు మనమే కొనుక్కోవాలట” అన్నాడు.

          “సర్లే, ఆ విషయం నేను చూస్తాను, ఇవేళ్టికి సెంటర్లో ఏమైనా తిందువు” అంది తన్మయి బండి వెనక్కి తిప్పుతూ.

          పైకి అలా అందే కానీ మనస్సులో ఈ చికాకులకి బాధ కలగసాగింది. ప్రభుతో చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని మధ్యాహ్నమే బాగా అర్థమయ్యింది. ఇక అన్నీ తనే చక్కదిద్దుకోవాలి. తిరిగి ఇంటికొస్తూనే ఒంపకుండా తిరిగి తీసుకొచ్చిన కేరేజీని అక్కడే టేబుల్ మీద పెట్టి మెట్లెక్కసాగింది. వెనకే వంటింటి సింకులో విసురుగా పడ్డ కేరేజీ శబ్దాన్ని వినిపించినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

          గదిలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా తల తిరుగుతున్నట్లు అనిపించసాగింది. అతికష్టమ్మీద పైకెళ్ళి మంచమ్మీద వాలిపోయింది. అంతలోనే కడుపు మెలితిప్పుతూ వాంతి రాసాగింది. తన్మయికి స్పష్టంగా అర్థం అయింది వేవిళ్ళని. బాబు పుట్టినప్పుడు అయిదు నెల్లు నిండే వరకు వేవిళ్ళతో తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గుర్తుకొచ్చి భయం పట్టుకుంది.

          చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని తలగడకు జేరబడి కూచుండి పోయింది. “ఒక పక్క తనని ఎలా వేధించాలా అని చూస్తున్న ఇంట్లో వాళ్ళు, నానాటికీ క్లిష్టమవుతున్న ఉద్యోగం, మరోపక్క పార్ట్ టైముగా చెయ్యాల్సిన పీ.హెచ్.డీ వర్కు , అప్పుడప్పుడే బాగా ఊహ తెలుస్తున్న బాబు, వీటన్నిటితో ఇప్పుడు కడుపున పాపాయి” నిస్సత్తువగా కళ్ళు  మూసుకున్న తన్మయి ప్రభు స్పర్శతో కళ్ళు తెరిచింది.

          నుదుటి మీద చెయ్యేస్తూ “ఏరా, ఒంట్లో బాలేదా” అన్నాడు లాలనగా. మధ్యాహ్నం అతను మాట్లాడినది కూడా మర్చిపోయి అతన్ని అల్లుకుపోయింది. నిశ్శబ్దంగా తల నిమురుతూ “వాళ్ళ తరఫున నేను సారీరా. ఇక రేపట్నుంచి ఇద్దరం ఇంట్లో నుంచి కేరేజీ మానేద్దాం. సెంటర్లో మెస్ లో మాట్లాడేను. పొద్దున్నే మనిద్దరికీ వేడివేడిగా టిఫిను కట్టిచ్చే స్తాడు” అన్నాడు మళ్ళీ అందుకే తన్మయి బాధపడ్తున్నదనుకుని.

          తన్మయికి ప్రభు తన గురించి ఆలోచిస్తున్నందుకే బోల్డు సంతోషం వేసింది.
నిశ్శబ్దంగా తలుపుతూ నిశ్చింతగా కళ్ళు మూసుకుని అతని చెవిలో నీరసంగా గొణిగింది.
తన్మయి ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతూ సంతోషిస్తాడనుకున్న ప్రభు తన్మయి ఒళ్ళో తలాన్చి ఒక్కసారిగా దుఃఖపడసాగేడు.

          బిత్తరపోయి ప్రభుని హత్తుకుని “ఏమైంది?” అంది.

          దాదాపు పది నిమిషాల తర్వాత కాస్త స్థిమితపడి “ఏమోరా. తండ్రి కావడమంటే ఇలా ఉంటుందా? నాకే తెలీడం లేదు” అన్నాడు ప్రభు.

          అప్పటికి తేరుకున్న తన్మయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.

          అంతలోనే ప్రభు వస్తూనే ఏమన్నాడో జ్ఞాపకం వచ్చి ఆలోచనలో పడింది. తను చెప్తున్న పరిష్కారం సరైనది కాదని ప్రభుకి కూడా తెలుసు. ఎన్నాళ్ళు బయట తింటారు? పైగా రోజూ బయట తినడం ఆరోగ్యకరమేనా?

          ఇంతలో ప్రభు “నేనూ నీకో మంచి వార్త చెపితే నాకేమిస్తావు?” అన్నాడు. తన్మయి ఏదో అనేలోగా “నాకు ప్రమోషనిచ్చేరు. జీతం మరో పదివేలు పెంచేరు. ఇక మీదట ఇంటి ఖర్చులేవీ నువ్వు కట్టొద్దు. నీ ఖర్చులు, బాబు ఖర్చులు పోగా మిగిలివేవైనా ఉంటే సేవింగ్సు బ్యాంకులో వేసుకో” అన్నాడు.

***

          వారాంతంలో తన్మయిని డాక్టరు పరీక్షకి తీసుకువెళ్ళేడు ప్రభు.

          “డాక్టరు చెప్పింది అర్థమైందిగా. నువ్వు దేనికీ కష్టపడొద్దు. ఉద్యోగం ఒక్కటీ కాగానే హాయిగా రెస్టు తీసుకో.” అన్నాడు తిరిగి వస్తున్నపుడు ప్రభు బండి నడుపుతూనే తన్మయి చేతిని ఒక చేత్తో పట్టుకుంటూ.

          అతని వీపుకానుకుని కూచుని నిశ్శబ్దంగా తలూపింది తన్మయి.

          ఇంట్లోనూ ఈ వార్త తెలిసి సంతోషించినట్టే కనబడ్డారందరూ. కానీ అతని తల్లి ముక్కు చీదడం మాత్రం ఆపలేదు.

          వాళ్ళ కొడుక్కి వచ్చే పది లక్షల కట్నం పోగొట్టిందని ఒకసారి, ఆడపడుచు లాంఛ నాలు పోయాయని ఒకసారి, చిన్న కొడుకు పెళ్ళి ఎంత ఘనంగా ఉహించుకుందోనని మరోసారి రోజుల తరబడి వాళ్ళు పంచాయితీలు పెట్టడం ప్రభు వాళ్ళతో ఓపిగ్గా మాట్లాడ్డం వింటూనే ఉంది తన్మయి.

          తన ముఖమ్మీదే ఏవేవో మాటలు విసురుగా వినిపిస్తున్నా విననట్లు , తామరాకు మీద నీటి బొట్టులా నిమిత్తమాత్రంగా ఉండడం అలవాటు చేసుకుంది. తనకి ప్రభు ముఖ్యం అనుకుంటూ ఆ సాయంత్రం బాల్కనీలో విరబూసిన పూలలోంచి ఒక గులాబీని కొయ్యబోయింది. తొడిమకున్న ముళ్ళు చప్పున గుచ్చుకున్నాయి. చప్పున ఏదో అర్థమైనట్లయ్యింది. అందమైన గులాబీకి ముళ్ళున్నట్టే ఇతని చుట్టూ వీళ్ళంతా. గులాబీని అందుకోవాలంటే ముళ్ళు గుచ్చుకోక తప్పదు. ముళ్ళు గుచ్చుకున్న వేలిని విదిలిస్తూ ఆకాశంలోకి చూసింది. అద్భుతమైన నెలవంక పసిపాప నవ్వులా విరిసింది.

“తెల్లగా నెలవంక తేలిపోతోంది –
చల్లగా నా ఊహ
మెల్లగా భావాల
నల్లిబిల్లిగ పాట
లల్లుతో వుంది
ఆకాశమే నన్ను ఆలకించింది –
నా చింతలో ఆస
నటియించడము జూచి
నాకోస మొక జాలి
నవ్వు పూచింది”

మల్లవరపు విశ్వేశ్వరరావు గారి కవిత జ్ఞాపకం వచ్చింది.

          “మీరున్న చోట ఇంకెవరున్నా వాళ్ళతో కలిసి తిట్టుకుంటూ అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రమే మీలా సంయమనంతో ఉండగలరు” అన్న సిద్దార్థ ప్రశంసా పూర్వక మాటలు జ్ఞాపకం వచ్చేయి.

          జీవితం ఎంత సౌందర్యవంతమైందో అంతకంతా క్లిష్టమైంది!
          ఎంత క్లిష్టమైందో అంతకంతా సౌందర్యవంతమైనదీను!!

          పడమటి వేపున్న తమ గది తలుపు మూసుకుంటే అంతా తన ప్రపంచమే తన్మయికి. బాల్కనీలోంచి వినిపించే సాంధ్యరాగాల నడుమ బుద్ధుని దాపున వెలిగించిన అగరొత్తు పరిమళం మనసుకి ప్రశాంతతని చేకూరుస్తూ ఉండగా రవీంద్రుని గీతాంజలి చేతిలోకి తీసుకుని పేజీ తిప్పగానే ముత్యాల్లాంటి వనజ చేతి వ్రాతలో “నా తన్మయికి -ఎప్పటికీ నీ వన ” అన్న అక్షరాలు కనిపించాయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.