పేషంట్ చెప్పే కథలు – 28

దాహం

ఆలూరి విజయలక్ష్మి

          దాహం! వెఱ్ఱి దాహం! నోరు పిడచగట్టు పోతూంది. కళ్ళూ, కాళ్ళూ తేలిపోతున్నాయి. పళ్ళు బిగబట్టి, కళ్ళను బలవంతాన విప్పుతూ రిక్షా తొక్కుతున్నాడు వెంకటరమణ. వీధి కుళాయి కనపడగానే ప్రాణం లేచొచ్చింది. రిక్షా ఆపి కుళాయి తిప్పాడు. ఒక్క బొట్టు కూడా పడలేదు. ఉసూరుమంటూ దగ్గరకొచ్చాడు. 

          “వెంకటరమణా!” అల్లంత దూరం నుంచి బిగ్గరగా పిలుస్తున్నారెవరో. కళ్ళనొకసారి తుడుచుకుని పరకాయించి చూసేలోగా ఆ మనిషి దగ్గరకొచ్చి సైకిలాపాడు.

          “ఒరేయ్! డాక్టరు గారు నిన్ను నిల్చున్న పళాన లాక్కు రమ్మన్నారు. దా! దా!!” నిప్పుల్లో, నిల్చున్నట్లు వెంకటరమణని తొందర చేసి సైకిలెక్కేశాడు డాక్టరు ప్రభాకర్రావు గారి కంపౌండర్. నాలుక పీక్కుపోతున్నా మారు మాట్లాడకుండా రిక్షా ఎక్కాడు వెంకటరమణ.

          “ఏంటి పంతులు గారూ? డాక్టరు బాబెందుకు రమ్మన్నాడు?”

          “కేసొచ్చింది. నీ గ్రూప్ కావాలంట”.

          అదీ నా గ్రూప్ రక్తం కావలసి వచ్చేప్పటికి నన్ను వెదుక్కుంటూ వచ్చాడు. ప్రొద్దున్న చేతిలో పైసా లేక కాళ్ళా వెళ్ళా పడి బ్రతిమాలినా తన రక్తం తీసుకోనన్నాడు. ఎప్పుడూ పాతికిచ్చేది, యిరవై రూపాయలిమ్మన్నా వద్దు పొమ్మన్నాడు. “ఏ.బి. గ్రూప్ ఎప్పుడో గాని అవసరం రాదు. రక్తం తీసుకున్నాక వారం రోజుల్లోపల ఉపయోగించకపోతే అది నీ నెత్తినో, నా నెత్తినో పోసుకోవాల్సిందే తప్పా మరేందుకు పనికి రాదు. అయినా నీ రక్తంలో హిమోగ్లోబిన్ ఏభయి పర్సెంటు కూడా లేదు. నీ రక్తమెక్కిస్తే ఏం ఉపయోగంరా బాబూ! పైగా ఎక్కడెక్కడ తిరిగి చస్తున్నావో! వి.డి.ఆర్.ఎల్. పాజిటివ్ వచ్చింది. నీ రక్తం ఎక్కించినాడికి ఉపయోగం లేకపోగా లేనిపోని జబ్బులు చుట్టుకుంటాయి” అని విదిలించి పారేసాడు ప్రొద్దున్న. 

          తన ముఖాన పాతిక రూపాయలు పడేసి వంద రూపాయలకమ్ముకుంటాడు రక్తం సీసా. తన లాంటి వాళ్ళ రక్తంతో వ్యాపారం చేసి వేలకు వేలు గడిస్తున్నా ఈ డాక్టరు ధనదాహం తీరదు. దాహం! మళ్ళీ తన దాహం గుర్తుకొచ్చింది వెంకటరమణకు. నోరు తడుపుకుంటే గాని ప్రాణం నిలిచేట్లులేదు.

          హాస్పిటల్ దగ్గర బండాపి ముందు వైపు దగ్గరకెళ్ళి దోసెడు నీళ్ళు పట్టి ఆబగా త్రాగాడు. నీళ్ళు లోపలకెళ్ళగానే అగ్గిలో నెయ్యి పోసినట్లయింది. నొప్పితో మెలికలు తిరిగిపోయాడు.

          “ఒరేయ్! అక్కడ తచ్చిల్లాడుతున్నావేంటిరా? దా! దా!” కంపౌండర్ అదిలించాడు. పొట్ట నొక్కుకుని బాధనాపుకుంటూ కంపౌండర్ వెనక లోపలికెళ్ళాడు. 

          వెంకటరమణ ఒంట్లో రక్తం బొట్లు బొట్లుగా సీసాలో చేరుతూంది. వాలిపోతున్న కళ్ళని విప్పి సీసా వంక చూసాడు. ఉపయోగం లేని రక్తం! జబ్బులంటించే రక్తం! అయినా ధర వంద రూపాయలు!  

          పాతిక రూపాయలు తీసుకుని బయటికొచ్చి నెమ్మదిగా రిక్షా ఈడుస్తూ ఆలోచిస్తు న్నాడు. ఒంట్లో రక్తం అమ్ముకుని ఈ డబ్బు సంపాదించేడు. మళ్ళీ అంత రక్తం తన ఒంట్లోకి రావడానికి ఈ డబ్బుకు పదింతలైనా చాలదు. అయినా తప్పదు. తనకిప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి. తన చెల్లి తలుపులమ్మకు రాక రాక పదేళ్ళకు కడుపొచ్చింది. పుట్టింటాళ్ళు గర్భదరిద్రులని తెలిసికూడా పుట్టింటి ఆశ చావక పది రోజులుండి వెళదా మని వచ్చింది. దానికి బలానికి కాస్త మందూ మాకూ కొనివ్వకపోతే మానె, కనీసం కడుపు నిండా తిండికూడా పెట్టలేక పోతున్నాడు. అది చాలదన్నట్లు నిన్నటి నుంచి జ్వరం దానికి.

          “ఒరేయ్! రమణా!” ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు రమణ. పక్కింటి నారాయుడు గబగబా తన వైపు వస్తున్నాడు. వెంటనే ఇంటిదగ్గర చెల్లెమ్మ కళ్ళ ముందు నిలిచి, అప్పటిదాకా చిన్నగా అరుస్తున్న పేగులు వేగంగా కదిలి పొట్ట చేత్తో పట్టుకుని విలవిలలాడాడు. 

          “ఒరేయ్! చప్పున పదరా!” నీ కోసం రెండు గంటల నుంచి తిరుగుతున్నాను. తలుపులమ్మకి బట్టలయిపోతున్నాయి. ఆ రక్తం కాలువలు చూసి కళ్ళు బయ్యర్లు కమ్మేసినాయి. పెద్దాస్పటలుకు తీసుకొచ్చాము. ఇదిగో, వెంటనే రక్తం ఎక్కించాలంచెప్పి రక్తం అర్జెంటుగా కొనుక్కురమ్మని ఈ సీసాలో కాత్తన్తా రక్తం ఏసిచ్చారు” గ్రూపింగుకి, క్రాస్ మాచింగ్ కి యిచ్చిన బ్లడ్ శాంపిల్స్ రమణ చేతిలో పెట్టాడు నారాయుడు. 

          ఒక్క క్షణం మెదడు మొద్దుబారినట్లయింది. మరుక్షణం పూనకం వచ్చిన వాడిలా డాక్టరు ప్రభాకరరావు బ్లడ్ బ్యాంకుకు పరిగెత్తాడు రమణ. వగరుస్తూ సీసాలిచ్చి డాక్టరుతో విషయం చెప్పాడు. గ్రూపింగ్ చేసి డాక్టరు రమణ వంక జాలిగా చూసాడు.

          “నీ చెల్లెలిదీ ఎ.బి. గ్రూపే రమణా! నువ్వు గుమ్మం ఎక్కేముందే నీ రక్తం కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిపోయారు”.

          “బాబూ. మళ్ళీ  తియ్యండి.నా ఒంట్లో రక్తమంతా తీసి నా చెల్లెలికివ్వండి. చప్పున తియ్యండి బాబూ!” రమణ దీనమైన ఏడుపుకి డాక్టరు కరిగిపోయాడు.

          యాంత్రికంగా రక్తం యివ్వడం, తీసుకోవడం తప్ప ఈ విషయం గురించి ఎక్కువ లోతుగా ఆలోచించని డాక్టరు తన బ్రతుకు తెరువుకు ముందు నుంచి వాడుకుంటున్న సమిధల్లో ఒకడైన రమణ హృదయ విదారకంగా ఏడుస్తూంటే చలించిపోయాడు. “రక్తం మీద వ్యాపారం చెయ్యడం ఈ పవిత్ర భారతదేశంలో తప్ప మరెక్కడా లేదు. తన లాంటి వారు మనుషుల డబ్బు అవసరాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని నడిపించేస్తు న్నారు. 

          ఇది తప్పని తెలిసి కూడా ఈ పని చెయ్యకపోతేనేం? అని డాక్టరు అంతరాత్మ నిలదీసింది. “ఈ సమాజంలో రక్తాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి, కొనుక్కోక గత్యంతరం లేని పరిస్థితి ఉన్నన్నాళ్ళు తాను కాకపొతే మరొకరు, మరొకరు, ఈ వ్యాపారాన్ని సాగిస్తూనే వుంటారు, అప్పుడప్పుడు రక్తదానం చెయ్యడంవల్ల ఆరోగ్యానికేమీ ముప్పులేదని, పైగా ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ప్రజలకి తెలిసి, విరివిగా రక్తదానం చేసే పరిస్థితులోచ్చే వరకు, మనిషి పట్టెడు తిండికోసమో, గ్రుక్కెడు సారా కోసమో రక్తాన్ని అమ్ముకునే పరిస్థి తులు మారే వరకు మరో దారి లేదు. నేనొక్కడినే మడిగట్టుకు కూర్చున్నందువల్ల పరిస్థితులు మారవు” అని అంతరాత్మను జోకొట్టాడు డాక్టర్. 

          “బాబూ అక్కడ నా చెల్లి చావు బ్రతుకుల్లో వుంది. దాని ప్రాణం నిలపండి”. డాక్టర్ కాళ్ళ మీద పడ్డాడు వెంకటరమణ.

          “రమణా! ఇప్పుడు నీ ఒంట్లో రక్తం తీస్తే ఆ అమ్మాయి ఈ రక్తంతో బ్రతకదు సరికదా, ముందు నువ్వు చచ్చిపోతావు”.

          “నేను ఛస్తే చచ్చాను. ముందు నా చెల్లి ప్రాణం కాపాడండి బాబూ!”

          డాక్టరుకేం చెయ్యాలో వెంటనే తోచలేదు, తానేమీ చెయ్యలేకపోతున్నందుకు బాధగా వుంది. ఈ వూళ్ళో మరో బ్లడ్ బ్యాంకు లేదు. జనరల్ హాస్పిటల్లో ఆనవాయితీ ప్రకారం ఎప్పుడూ బ్లడ్ ఉండదు. ఎ.బి. గ్రూప్ డోనర్సులో ఇంతకు ముందు టౌనంతా గాలిస్తే పట్టుకోగలిగినది ఒక్క రమణని. మళ్ళీ వాళ్ళ కోసం మనుషుల్ని పరుగెత్తించిన… వాళ్ళోచ్చేసరికి ఆ అమ్మాయెలా ఉంటుందో!… టైము చాలా విలువైనది. 

          “రమణా! ఎ.బి. గ్రూప్ లేనప్పుడు బి. గ్రూప్ రక్తం ఎక్కించొచ్చు. ముందు బి. గ్రూప్ క్రాస్ మేచ్ చేసిస్తాను. తీసుకెళ్ళు. ఈలోపు ఎ.బి. గ్రూప్ బ్లడ్ కోసం ప్రయత్నిద్దాం”. తనను కరుణించి సాక్షాత్తూ ఆ దేముడే దిగి వచ్చినట్లు డాక్టరు వంక చూసాడు రమణ. యిప్పటి దాకా యీయన్నెంత కర్కోటకుడనుకున్నాడు తాను! ఈయనకి ధనదాహం అని ఎంతగా తిట్టుకున్నాడు! తాను పొరపాటు పడ్డాడు. యెంత మంచి వాడిలోనూ ఎక్కడో దానవుడు దాగున్నట్లే యెంత కర్కోటకుడిలో కూడా ఏంతో కొంత మంచి కూడా ఉంటుంది. ఆ మంచి బయటకొచ్చే బలమైన ఘటన రావాలి. కంపౌండర్ని అడిగి మంచినీళ్ళు తీసు కుని నెమ్మదిగా ఒకొక్క గుక్క త్రాగుతున్నాడు వెంకటరమణ. ఇందాకటిలా కడుపులో నొప్పి రాలేదిప్పుడు, కడుపు చల్లబడినట్లయింది.

          గ్లాసు ఖాళీ చేసేటప్పటికి డాక్టర్ రక్తం సీసా అందించాడు. కాళ్ళు తేలిపోతున్నా బలవంతాన గుమ్మందాటాడు రమణ.

          “ఓరి రమణా! నీ చెల్లెలు కొంప ముంచేసినాదిరో” అంటూ ఎదురుగా పరుగెత్తుకొస్తు న్నాడు నారాయుడు. దబ్బున క్రింద కూలిపోయాడు రమణ. చేతిలో రక్తం సీసా పగిలి, తనలోని రక్తాన్ని భూమ్మీదకు నెట్టి, భూమి దాహం తీర్చింది. 

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.