రాగసౌరభాలు-5

(శంకరాభరణము)

-వాణి నల్లాన్ చక్రవర్తి

          శంకరాభరణం అనగానే K. విశ్వనాథ్ గారు, శంకరాభరణం శంకరశాస్త్రి, ఓంకార నాదాను సంధానమౌ గానమే… అనే పాట గుర్తుకురాక మానవు కదూ? ఈ శంకరాభరణ రాగ లక్షణాలు, పూర్వాపరాలు ఈ సంచికలో తెలుసుకుందాము.

          ఈ రాగం 72 మేళకర్తల వరుసలో 29వది. కటపయాది సూత్రానికి అనుగుణంగా రాగం పేరుకు ముందు ‘ధీర’ అనే పదం చేర్చటం వలన ధీరశంకరాభరణం అయింది. మేళకర్త రాగం కనుక సంపూర్ణ రాగం. ఇందులో స్వరాలు షడ్జం, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కాకలి నిషాదం. అనేక జన్యరాగ సంతతి కలిగిన జనకరాగం. అత్యంత పురాతనమైన రాగము. సర్వస్వరగమకవరీక రక్తి రాగము. కచేరీలలో ప్రధాన రాగంగా పాడదగిన రాగం. విస్తార మైన రాగాలాపనకి అనువైనది. ఈ రాగాన్ని హిందుస్తానీ సాంప్రదాయంలో బిలావల్ అని అంటారు. బిలావల్ ఆ సాంప్రదాయంలో మొదటగా నేర్చుకునే రాగం. పాశ్వాత్య సంగీతంలో ఈ రాగాన్ని C మేజర్ అని పిలుస్తారు. ఈ రాగం ఏ సమయంలోనైనా పాడదగ్గదే కానీ సాయం సమయం శ్రేష్టం. చక్కని శ్రావ్యత కలిగిన మృదువైన రాగం. రాగాలలో ఈ రాగాన్ని రాజుగా భావిస్తారు.

          ఎటువంటి రచనలకైనా అనువైన రాగము. ఈ రాగాన్ని గమకాలు లేకుండా పాడితే పాశ్వాత్య పోకడలతో ఉంటుంది. శ్రీముత్తుస్వామి దీక్షితులవారు ఆ పోకడలు ఉండేలా అనేక నోటు స్వరాలను కూర్చారు. సంగీతం ప్రారంభదశలో కూడా ఇవి సులభంగా నేర్చుకొన వచ్చును. శ్రీ త్యాగరాజ స్వామి కూడా పాశాత్య పోకడలు ఉండేలాగా ‘వరలీల గానలోల’ అనే కీర్తన రచించారు.

          ఈ రాగం వలన అనేక శారీరక, మానసిక బాధలను తొలగి, సాంత్వన కలుగుతుం దట. ఈ రాగం విన్న వారికి తమ బాధలన్నీ తొలగి పోయిన భావన కలుగుతుందట. ఈ రాగం శాంతరసాన్ని, భక్తి, శృంగార రసాలను అద్భుతంగా పోషించగలదు.

          ఇపుడు ఈ రాగం గురించి ప్రచారంలో ఉన్న పిట్టకథలు తెలుసుకుందాము. శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు తమిళనాడులో గల కివ్వెలూరు శివుని దేవాలయాన్ని దర్శించినపుడు, ఆయన మదిలో శంకరాభరణ రాగంలోని ‘అక్షయలింగ విభో’ అనే కీర్తన మెదిలి, అది పాడటానికి అనుమతించమని పూజారిని అర్థించారట. కానీ పూజారి గుడి మూసే సమయం అయిందనీ, శివుడు ఎక్కడికి పారిపోడు కాబట్టి మళ్ళీ రమ్మని కటువుగా చెప్పాడట. దీక్షితులవారు మూసి ఉన్న ద్వారం ముందు కూర్చాని అత్యద్భుతంగా శంకరాభరణ రాగాన్ని ఆలపించి, తన రచన ‘అక్షయ లింగవిభో’ అనే కీర్తనని అత్యంత భక్తితో ఆలపించారట. దారిని పోయేవారంతా కూడి ఆ గానానికి ముగ్ధులై, తమ బాధలన్నీ మటుమాయమైనట్లు భావించారట. అంతేకాదు, మూసి ఉన్న ఆలయద్వారాలు వాటంతట అవే తెరుచుకొని స్వామి దర్శనం అయిందట. ఈ గాథ అప్పట్లో తమిళ దేశమంతటా ప్రచారం అయిందట. శంకరాభరణరాగం శక్తి అటువంటిది.

          1820 ప్రాంతంలో నరసయ్యర్ అనే సంగీత విద్వాంసుడు తంజావూరు ఆస్థానంలో శంకరాభరణరాగాన్ని అద్భుతంగా ఆలపించి, సెర్ఫోజీమహరాజుచే ‘శంకరాభరణం నరసయ్యర్’గా గౌరవ బిరుదుని పొందాడట. ఆ బిరుదు అతనిలో చాలా గర్వాన్ని పెంచింది. నరసయ్యర్ కి కొంత ధనం అవసరమై రామభద్ర మూపనార్ అనే జమీందారు వద్ద ‘తన’ శంకరాభరణ రాగాన్ని తనఖా పెడతానన్నాడట. సహజంగా కళాభిమాని అయిన జమీందారు ఈ చర్యకు చాలా బాధపడి అప్పటికి సొమ్ము ఇచ్చి పంపాడట. ఆ సొమ్ము తిరిగి ఇచ్చేవరకు ఆ రాగాన్ని పాడనని నరసయ్యర్ మదగర్వంతో శపథం చేశాడట. కొద్ది రోజులకే మరొక ఆస్థానంలో పాడవలసిన సందర్భం ఎదురైనపుడు తన శపథాన్ని, అసహాయతను వ్యక్తం చేశాడట. ఆ జమీందారు మూపనార్‌కి ధనాన్ని ఋణ విముక్తి కోసం పంపితే, ఆయన ఆ ధనాన్ని తిప్పి పంపాడట. అంతేకాక అందరి సొత్తు అయిన శంకరాభరణ రాగాన్ని తన సొంతమే అయినట్టు తాకట్టు పెట్టటాన్ని తప్పు పట్టాడట. అప్పటికి ఆ రాగాన్ని పాడినా, తన తప్పు తెలుసుకొని, సిగ్గుతో అవమాన భారంతో కివ్వెలూరు దేవాలయాన్ని చేరి, శివుని గురించి, శంకరాభరణ రాగం గురించి ధ్యాన నిమగ్నుడై కొంతకాలానికి తన పాపప్రక్షాళన చేసుకున్నాడట. శంకరాభరణ రాగమే కాదు, ఏ రాగాన్ని సొంతమని భావించినా, కించపరచినా ఎంతటి మహాపాపమో ఈ ఉదంతం తెలియజేస్తుంది.

          ఇవండీ, ఈ రాగ వైభవాన్ని తెలియజేసే సంగతులు. మనమందరం భారతీయులు గా గర్వించదగ్గ మరొక విషయం చెప్పనా? మన జాతీయగీతం ‘జనగణమన’ ఈ శంకరాభరణ రాగంలోనే ఉందండోయ్! గొప్ప విషయం కదూ! ఈ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎంత ప్రధానమైన రాగమైనా, లలిత సంగీతం, సినీ సంగీతం, జానపదం, ఇలా ఎటువంటి రచనలకైనా చక్కని బాణీలుగా నిలుస్తుంది. అంతేకాక విశ్వవ్యాప్తంగా హిందుస్తానీ, పాశ్చాత సంగీతాలలోనూ ఈ రాగం ఉండటం కూడా ఒక కారణం కావచ్చు.
ఇపుడు ఈ రాగంలో కొన్ని ప్రసిద్ధ రచనలు చూద్దామా ?

శాస్త్రీయ సంగీతం
1. స్వరరాగసుధారస – త్యాగరాజు
2. మనసు స్వాధీనమైన – త్యాగరాజు
3. బుద్ధి రాదు – త్యాగరాజు
4. అక్షయలింగ విభో – ముత్తుస్వామి దీక్షితులు
5. సరోజ దళ నేత్రి – శ్యామాశాస్త్రి
https://youtu.be/4Sppfxm5OB0?si=Oy_Drsxw6LgTmCpY

6. అలరులు కురియగ – అన్నమాచార్యులు

లలిత సంగీతం
1. రాల లోపల పూలు పూసిన – సి. నారాయణరెడ్డి – పాలగుమ్మి విశ్వనాథం
2. నారాయణ నారాయణ అల్లా అల్లా – దేవులపల్లి – పాలగుమ్మి విశ్వనాథం
https://youtu.be/hmeSmFF141I?si=qcgKKXBIEoqRULFy

3. నదీసుందరి సుధాస్యందిని – దేవులపల్లి – చిత్తరంజన్

సినీ సంగీతం:
1. ఓంకార నాదానుసంధానమౌ గానమే – శంకరాభరణం – యస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి
2. ఉరికే చిలకా – బొంబాయి – హరిహరన్, చిత్ర
https://youtu.be/4J5aQNqRu_A?si=Z0xhi3az9uAYySHq

3. వెన్నెల్లో గోదారి అందం – సితార – యస్ జానకి

          చెలులూ! చూశారుగా,ఆఘ్రాణించారుగా శంకరాభరణ రాగ సౌరభం? తిరిగి మరొక అద్భుతమైన రాగంలో వచ్చే సంచికలో కలుద్దాము.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.