ఈ తరం నడక – 6
కుంకుమ పూల తోట – స్వయంప్రభ
-రూపరుక్మిణి. కె
వెన్నెల కురవని రాత్రి… ఎంత పొయటిక్ గా ఉంది ఈ పేరు. పేరు వినగానే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది., కానీ అంతలోనే వెన్నెల కురవలేదంటూందేంటి అని అనుకున్నా… అందుకే ఆ పుస్తకం చదవాలన్న కుతూహలం పెరిగిపోయింది.
కొన్నిసార్లు కొన్ని నిజజీవిత గాథల్ని అతి దగ్గరగా చూసిన చూపు, ఎక్కడో గుండె లోతుల్ని తడిమి, తడపకుండా చెప్పే విషయంలో సూటితనం, పారదర్శకత తన ప్రత్యేకత., అసమానతల పట్ల అనిర్వచనీయమైన తెగువ చూపే అక్షరమాల, సర్దుబాట్లలో ఒదిగిపొమ్మని చెప్తూనే నిలువెత్తు కాగడాలని కావాలని కోరుకుంటుంది. ఈ స్వయంప్రభ నిజంగా స్వయంగా ప్రభవించే తేజో మూర్తి…
ఈ రచయిత పగిలిన అద్దానికి కూడా కుట్లు వేయగల నేర్పరి, తన చుట్టూ ఉన్న ఆవరణలో నుండి చెప్తూ మనసులో దాగిన బడబాగ్నికి అక్షరాల మూట కట్టి మనల్ని ఆ అరుణారుణిమ కుంకుమ పూలలో తడవమంటుంది.
నిరంతర ప్రయాణ జీవనగమనం అంటూ స్త్రీ కేంద్రకంగా రాసిన కవితలే ఎక్కువ.. స్వయంప్రభ వాక్యంలో కాస్త కరుకుదనము ఎక్కువే ఆ ధైర్య వాక్యానికి అబ్బురుపడక తప్పదు..
ఈమధ్య రాస్తున్న వారిలో వైష్ణవి శ్రీ తర్వాత అంత బలంగా సమాజ ధోరణి ఎండగట్టగల గొంతు ఈమెది అని చెప్పవచ్చు.
అయితే చిక్కంతా తన ఆవేశంలోనే ఉంటుంది. సునీతత్వంతో కలగలిసిన ఆలోచన అంతా స్పష్టమైన తాత్వికతతో నడుస్తుంది.
ఓ స్త్రీ గమనాన్ని నిర్దేశించడానికి మీరెవరు అంటూ ప్రశ్నిస్తుంది. ఆమె మనోద్వారాలని తెరచే అవకాశం ఇవ్వమంటుంది.
తన కవిత్వంలో ఆడపిల్లల పురుడు పోసుకునే సందర్భాన్ని పాదముద్రలుగా చెబుతూ // మానవత్వం ఎర్రతివాచీ పరిచి ఆహ్వానం పలికింది. ఉరివేసిన అడుగులకు సంకెళ్లు తెంపుకొని అష్టదిక్కుల ద్వారాలు తెరుచుకొని తరలి వచ్చిన వసంతంలో నడకసాగించాను // అని చెప్తుంది
కొన్ని పారిజాతాలని చేత పట్టుకొని ఆ పారిజాతాల కథలని మనకు వినిపిస్తుంది.
// చిత్రం ఏమీ కాదు, చెత్తబుట్ట ఒడిలో చిగురులోనే రాలి పడ్డ నెత్తుటి గుడ్డులవి
వీధి ఉయ్యాలలో గొంతు తడుపుకోవడానికి కన్నీళ్లు తప్ప చనుబాలకు నోచుకోని ప్రపంచపు గొంతుకలవి //
అన్నప్పుడు ఆవేదన, ఆవేశం,ఈసడింపు ద్వేషం, కసి,కనిపిస్తాయి ఈ సమాజంపై ఏమి చేయాలో అన్న నిస్సహాయతలో కలత చెందుతుంది.
ఒక అడుగు ముందుకేస్తేనే కదా మార్పులో తీర్పు తెలిసేది. చేర్పుల్లో కొత్త తూర్పు కనిపించేది అని ఆర్తిగా చెబుతుంది.
అంతేకాకుండా సమాజ కోణంలో రైతుల్ని, కలాల్ని కలిసి నడవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
“ కలం హలాన్ని కాయాలి
హలం గాదిలో నిండిన సర్వ కళలకు
బువ్వ పెట్టాలి ‘ రైతులు, కలాలు ఏకతాటిపై నడిస్తేనే అభివృద్ధి ఉంటుంది అని ఆశపడుతుంది. రైతులకి అండగా నిలబడమని ఆ రైతులు పెట్టే అన్నం ముద్దలే మనకు అక్షర రాశులు అవుతాయని ఎంతో తాత్వికంగా చెప్తుంది.
ఎప్పుడూ? ఎవరు? పరిచయం అవుతారో.. ఎవరు అపరిచిత అవుతారో?
ఈ రైలు పట్టాల్లాంటి జీవిత గమనంలో ఎవరికి ఎరుక, అని అంటూ
రెప్పల తడి గుండె తడి ని ఆరబెట్టి నిర్జీవమైన శిలగా మారుస్తుందని అప్పుడు నీవు ఎన్ని ప్రేమలోలకబోసినా ఆ స్త్రీ మనసు జటిలిమైపోతుందని జీవితాంతం రైలు పట్టాల్లా ప్రయాణించాల్సిందే కానీ ఎప్పటికీ కలవని కాలచక్రాలు ఆ మనుషులని మనసుని ముడి వేయలేవంటూ గుట్టు విప్పి చెప్తుంది.
వేద భూమి పై నిలబడి ఉన్నాం అంటూనే ఇది వేద భూమి కాదు వేదనలకి నెలవులు. ఈ దరిత్రిలో ధరణిని అయినందుకే ట్రోల్స్ కి గురవుతున్నాను అంటుంది
“ ఆప్తులెవ్వరూ రారు ఇక్కడ అయిన వారందరూ ధృతరాష్ట్రులే,
చుట్టూ ఉన్నదంతా కౌరవసభే “ అని విమర్శిస్తూ
‘వచ్చిన దారిని ఏమి చూస్తావు
నీ ముఖాన్ని ఈ విశ్వానికి చూపించింది అదే దారి అంటుంది “
శవయాత్రలో మానభంగం
మర్మాంగం విశ్వ దర్శనం
ఈనాడు వీక్షించండి తలలొంచుకొని
ఇంతకన్నా ఏమీ రాయలేని నా తల్లితనంతో “ అనే ఆమె వాక్యం లో
ఇంతటి వాడి వేడి వున్న వాక్యాలు రాయాలి అంటే చాలా ధైర్యం కావాలి. నీలి మేఘాలు చదివినప్పుడు మందరపు హైమావతి గారి కవిత్వం స్పురణకు వచ్చింది.
స్త్రీ మూర్తిని తన వాక్యంలో చెప్తూ
“ శ్లోకంలో కీర్తించబడుతూ
శోకంలో జీవిస్తున్నాను అంటుంది “
“ విశ్వమే కనుపాప అయినా నిర్నిద్ర కనులకు ఉలికిపాటేందుకు… రాలిపడ్డావో – రాజీ పడినావో రేగి ముల్లులా గుచ్చుతుంది లోకం “ అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది.
మగువకు తెగువ అవసరం అంటూ నిర్భీతిగా నిజాన్ని పటాపంచలు చేసి చూపించే తెగువ స్వయంప్రభ సొంతం.
అంతేకాదు మాతృత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్న ఈ సమాజం పైన తన అలక
// కాసింత మన్నైనా కప్పండి ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని యుగాలక తర్వాత అయినా అమ్మ తనపు చిగురులు ఉద్భవిస్తాయేమో ఈ మట్టి నుండి// అని ఆశిస్తున్నాను అంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కవితా సంపుటి నిండా… వాడి వేడి వుద్విఘ్నభరితమైన వ్యాఖ్యలు మనల్ని రోమాన్చితులను చేస్తాయి.
ఈ వెన్నెల కురవని రాత్రికి కుంకుమ పూల వానికి హృదయపూర్వక అభినందనలతో..
ఈ పుస్తకాన్ని నాకు పంపించిన రాధేయ గారికి, నెచ్చెలి డా|| కె .గీత గారికి థాంక్యూ-
*****
రుక్మిణి. కె MA economics, & telugu. కవి, రచయిత, టీచర్ & సామజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. కె.
రచనలు : 1..అనీడ
2.మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని కవిత్వసంపుటాలు
వివిధ సంకలనాలలో & పత్రికలలో కథలు, సామజిక వ్యాసాలు
పుట్టి, పెరిగింది,విద్యాభ్యాసము ఖమ్మం… ప్రస్తుత నివాసము హైదరాబాద్