నా అంతరంగ తరంగాలు-28

-మన్నెం శారద

ఒకనాటి జ్ఞాపకం….

          చిన్నతనం నుండి మా  నాన్నగారి  ఉద్యోగ రీత్యా  మేము అనేక ప్రాంతాలు  తిరిగాం. అలా అనుకోకుండా అనేకమంది ప్రముఖ వ్యక్తులని చాలా దగ్గరగా  చూడటం జరిగింది. 

          ప్రముఖ నటి  భానుమతిగారినయినా, మధుబాల గారినయినా, సావిత్రి గారినయినా, వాణిశ్రీగారినయినా, అనంతనాగ్  గారినయినా …. ఇలా చాలా మంది   ప్రముఖుల పరిచయం నాకు లభించింది.

          చాలా చిన్నతనం నుండీ  రాస్తున్నాను. రాయడం, బొమ్మలు వేయడం డాన్స్ చేయడం నాకు passion. లోకాన్ని ఉద్దరించేయాలని కాదు. నా మీద ఏదో గురుతర బాధ్యత ఉందనీ కాదు.

          హాస్యం, సెంటిమెంట్ నాకు ఇస్టమైనా విషయాలు  కాబట్టి  అవే ఎక్కువగా రాస్తూ పోయాను.

          నా  బాధ్యతల్ని , ఉద్యోగాన్ని నిర్వహిస్తూ నా హాబీస్ నిలబెట్టుకుంటూ వచ్చాను. అప్పటి పట్టుదల అలాంటిది!

          1982నుండి రచనా రంగాన్ని పురుషులు ఆక్రమించిన  తరుణంలో నేను వారి మధ్య నిలదొక్కుకున్నాను.

          నాకు ఇష్టమైన , నాకు నచ్చిన విషయాల్ని రాస్తూపోయి పాఠకుల  అభిమానాన్ని పొందగలిగాను.

          దాదాపు అప్పట్లో వచ్చిన  అన్ని పత్రికల్లో నా రచనలు , ఇంటర్వ్యూ లు వచ్చాయి.

          నేను బయటకు వెళ్లడం, గ్రూపులు మైంటైన్ చెయ్యడం ఎప్పుడూ లేదు.నాకంత  సమయం, ఇంటరెస్ట్ కూడా లేదు.

          నా రచనల వల్ల ఈ  సొసైటీ  మారిపోతుందని పిచ్చి వూహ కూడా నాకేమీ లేదు.

          ‘ఆవిడేమి  రచయిత్రి… బొమ్మలు వేసుకుంటుందని మొహం మీదే అన్నవారు కూడా వున్నారు.. అన్నిటికి చిరునవ్వే  నా జవాబు!

          అందరిని  మనస్ఫూర్తి గా నమ్ముతాను.

          అవార్డ్స్ ఇస్తే తీసుకున్నాను. లేకపోతే లేదు. ఆ యావకూడ లేదు.

          ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం పూలిచ్చిన తిరిగి ముళ్ళిచ్చి బాధించే వారుంటారు.

          ఒక సారి నంది అవార్డ్స్ కమిటీలో జరిగిన ఈ సంఘటన నా స్నేహితులకి షేర్ చేస్తున్నాను… Take it easy 

***

          ఒకసారి  నంది అవార్డ్స్ కమిటీలో నేను , ప్రముఖనటి రోజారమణి ,,Dr పద్మావతి [DR అంబేద్కర్ సినిమా నిర్మాత ] కీర్తి శేషులు చాట్ల శ్రీరాములు గారు తదితరులం  మెంబర్స్ గా ఉన్నాము . ఆ సారి  నేను కధ, మాటలు రాసిన [ స్వాతి చినుకులు, మంజులనాయుడు దర్శకత్వం ] పదమూడు కధల సీరియల్ ప్రదర్శనకి వచ్చింది .

          శ్రీరాములుగారిని చూడటం అదే మొదటి సారి .

          వారు  రైటర్, థియేటర్ ఆర్టిస్ట్ ,రసరంజని వ్యవస్తాపకులుగా అందరికీ తెలుసు . ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు గంభీరంగా వుండేవారు. చాలా styleగా  వచ్చేవారు .

          నేను రోజా రమణి , పద్మావతి డిస్ ప్లే మొదలయ్యేవరకూ ఏదో ఒకటి మాట్లాడుతూ జోక్స్ వేసుకుంటుండే వాళ్ళం ,

          రోజారమణి బాగా నవ్వించేది. ముగ్గురం కమిటీ ముగిసేకా పద్మావతి బసచేసిన  గోల్కొండ హోటల్ కి గానీ, లేదా  మా ఇంటికో రోజా ఇంటికో వెళ్లి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నలభయి రోజుల కమిటీ కాబట్టి చాలా  క్లోజ్ అయిపోయాం.

          రోజా సరదాగా శ్రీరాములుగారు రాగానే  “ష్!, బుస్సీ దొరగారొస్తున్నారు”  అనేది చిన్నగా. మేము మాటలు ఆపేసే వాళ్ళం .

          నిజానికి మాకు ఆయన మీద చాలా గౌరవముండేది .

          నా సీరియల్ డిస్ప్లే కి నేనుండకూడదు కాబట్టి  ఆ రోజు నేను వెళ్ళిపోయాను.

          ఆ మర్నాడు నేను, రోజా , పద్మావతి  కబుర్లు చెప్పుకుంటుండగా సడెన్  గా  శ్రీరాములుగారు వెనుక వరుస నుండి ముందుకొచ్చి రెండు చేతులూ జోడించి  “అమ్మా శారదా రచయిత్రివంటే  చాలామందిలా ఏదో రాస్తావనుకున్నాను , నిన్న నీ కధలు చూసి కళ్ళు చెమర్చాయమ్మా! O Henry చాయలున్నాయమ్మా .చిన్న దానివని  నీకు పాదాభివందనం చేయడం లేదు ” అన్నారు.

          నేను ఉలిక్కిపడి లేచి నిలబడి ఆయనకి  నమస్కరించాను.

          తర్వాత  నా సీరియల్ కి అధిక వోటులొచ్చినా అది విడి విడి కధలు కాబట్టి  బహుమతికి అర్హత లేదని అప్పటి చైర్ పర్సన్  రాజకీయం చేసి ఇన్ వేలిడ్ చేయడానికి చాలా ప్రయత్నించారు .

          నా దగ్గరకి వచ్చేసరికి  Uటర్న్ తీసుకోవడం నాకు అనేక విషయాల్లో అనుభవం కాబట్టి నేను మౌనంగా వుండి పోయాను .

          కానీ కొందరు మెంబర్స్ ఇది సహించ లేక పోయారు. ఇంకా అనేక విషయాల్లో మరికొన్ని రాజకీయాలు ఆయన చేయడంతో  విషయం  డైరెక్టర్ కి ,చీఫ్  సెక్రటరీ కాకి మాధవరావు గారి దృష్టికి వెళ్ళింది .

          ఫలితంగా ఆయన స్థానంలో మరొకరు అప్పాయింట్ అయ్యారు.

          “మేము 40రోజులుగా మీకు కారులిచ్చి, గౌరవంగా చూస్తున్నది మీరు కళాకారులని, రచయితలని, సొసైటీలో ఒక విశిష్ట స్థానం ఉందని మత్రమే! ఆ విషయం మీరు మరచి పోవద్దు.

          మేము ఏ కేటగిరీలో సబ్మిట్ చేస్తే అందులోనే  మీరు చూడాలి  “అని  ఆనాటి డైరెక్టర్ చంద్ర శేఖర్ గారు వార్నింగ్ ఇవ్వడంతో నా చేతుల్లోకి నంది వచ్చింది ,కధ సుఖాంతం !

          నా కోసం పోరాడిన వారిలో కీర్తి శేషులు చాట్ల శ్రీరాములుగారు ఒకరు అటువంటి వారి మాటలకన్నా పెద్ద అవార్డులున్నాయా !?

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.