కనక నారాయణీయం -70

పుట్టపర్తి నాగపద్మిని

రోజులు పరుగులు పెడుతున్నాయి.

          ఆ రోజు ఇంట్లో అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత, కనకమ్మ తళిహింట్లో వంట పూర్తి చేసుకుని సుందరాకాండ పారాయణం చేసుకుందామని అటు వెళ్తూ ఉంటే, గట్టిగా నాగ ఏడుపు. గాభరావేసి, తొందరగా పడసాలలోకి వచ్చేసరికి, నాగ మరింత గట్టిగా ఏడుస్తూ వచ్చి ఆమె కాళ్ళు చుట్టేసింది. తనతో పాటూ వచ్చిన తన స్నేహితురాలు చిట్టి (రామ సుబ్బ లక్ష్మి) కళ్ళల్లోనూ నీళ్ళు!

          నాగ రవికె నిండా రక్తం మరకలు!

          కనకమ్మ గుండె గుభేలన్నది. 

          కన్నీళ్ళతో కూతురిని దగ్గరికి తీసుకుని అడిగింది కనకమ్మ.

          “ఏమైందమ్మా, రవికె పైనంతా రక్తమెందుకయ్యింది? చిట్టీ, నువ్ చెప్పు, స్కూల్లో నాగ ఎవరితోనైనా కొట్లాడిందా? దీన్ని ఎవరైనా కొట్టినారా? ఎక్కడైనా పడిందా? తలకు  దెబ్బ తగిలినట్టు కూడా లేదే? మరేమైంది? చెప్పవే తల్లీ!’

          నాగ ఏడుపు ఇంకా ఆపలేదు.

          నోటిలోనూ రక్తమే!

          ‘నోట్లో దెబ్బ తగిలిందా? చాకు తగిలిందా?

          నాగ నోరు తెరిచి చూపింది, ఏడుస్తూనే!!

          ‘ అమ్మో, అంగిటి నుంచీ వస్తూంది రక్తం. ఏదైనా చాకు తగిలిందా? స్కూల్లో చాకులూ గీకులూ ఎవరు పట్టుకొస్తారు యీ విధంగా పిల్లలకు దెబ్బలు తగులుతూ ఉంటే ఆ సీతారామయ్య అయ్యవారు ఏమి చేస్తుంటాడు కళ్ళు మూసుకుని కూర్చుం టాడా? పిల్లల మధ్య ఏదైనా కొట్లాట వస్తే టీచర్లు వాళ్ళను సమాధాపపరచాలి కానీ, ఇట్లా కొట్టుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటారా?’

          కనకమ్మ కూతురు పరిస్థితి చూస్తూ ఊరుకుండలేకపోతూంది.

          ఈ హడావిడికి గుడిపాటి అవ్వ కూడ పరిగెత్తుకుని వచ్చింది, ఆరునెల్ల రాధమ్మ ను చంకనేసుకుని!

          ఆమె కూడా నాగ పరిస్థితి చూసి బెంబేలెత్తి పోయింది.

          ‘కనకమ్మా! ఎంత పెద్ద దెబ్బమ్మా! ముందు కొంచెం పసుపు పెట్టు, ఆ నోట్లోపల, రక్తం ఆగుతుంది!’

          కనకమ్మ వంటింటి గూటిలో సీసాలో ఉన్న పసుపు తీసుకుని వస్తూ ఉంటే, నాగ మళ్ళీ ఏడుపందుకుంది, ‘అమ్మా, వద్దొద్దు, మంట మంట!’ అని దొరక్కుండా పారి పోయే ప్రయత్నం చేస్తూంది.

          ‘లేదే, మెల్లిగా పెడతాను రామ్మా! నొప్పి తగ్గుతుందే తల్లీ! రామ్మా!! పోనీ జాకెట్ మారుద్దాం రా! అసలు ఆ సీతారామయ్యను ముందు కడిగేయవలె! పిల్లలనిట్లా వదిలేస్తారా, కొట్టుకుంటూ ఉంటే? ఒసే చిట్టీ! నువ్వన్నా చెప్పు ఏమైంది స్కూల్లో!!’

          నాగ  ఏడుస్తూ దూరంగానే ఉంది. తనతో పాటే చిట్టి కూడా, భయం భయంగా చూస్తూ!!

          ‘ఎవరూ కొట్టలేదమ్మా!మరీ..మరీ…!’

          నీళ్ళు నములుతూ ఉంది. ఎంతసేపటికీ, మాట పెగలటమే లేదు.

          ‘భయపడొద్దు, నాగకు దెబ్బెట్లా తలిగిందో చెప్పు. నేనిప్పుడే స్కూల్ కు పోయి ఆ హెడ్ మాస్టర్ పని పడతాను. వాళ్ళను నమ్మి స్కూల్ కు పంపిస్తే, పిల్లలు కొట్లాడు కుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటారా?’

          నాగ స్కూల్లో చేరనప్పటి నుంచీ కూడా స్నేహితులే వీళ్ళిద్దరూ ! ఒకే వీధిలో ఇళ్ళూ! చిట్టి అమ్మా నాన్నలు,  కైపా నాగభూషణం దంపతులకు పుట్టపర్తి దంపతు లంటే ఎంతో భక్తి ప్రపత్తులు. కనకమ్మ వాళ్ళకూ, వాళ్ళ పిల్లలకూ కూడ అమ్మే! (గౌరవ భావంతో పిలిచే పిలుపు అమ్మ. అంతే! వావి వరుసలు దీనికి వర్తించవు మరి!)  ఇప్పుడింకా దగ్గరితనం. ఇద్దరూ ఒకే తరగతి కూడా!! పక్క పక్కనే కూర్చుంటారు కూడా!! తనకు తప్పక తెలుస్తుందనే నమ్మకం కనకమ్మకు! 

          చిట్టి అని ముద్దుగా పిలువబడే రామసుబ్బలక్ష్మి ఏడుపునాపి మెల్లిగా అందు కుంది.          

          ‘నాగ ఏదో రాసుకుంటూ పెన్సిల్ నోటికి దగ్గరగా పెట్టుకుని ఉంది. నేను పక్కనే ఉన్నాను. ఏదో మాట్లాడుదామని, తన చేతిమీద తట్టే సరికి, తన చేతిలో కూచిగా (పదునుగా) ఉన్న పెన్సిల్ లోపల అంగిటిలో గుచ్చుకుందమ్మా! గబుక్కున నోటి నిండా బొళ బొళా రక్తం వచ్చేసింది. జాకెట్ మీదంతా రక్తం! (చెబుతూ ఏడుస్తూనే ఉంది చిట్టి.)

          గుడ్ల నీరు కక్కుకుంటూ కనకమ్మా, వెక్కిళ్ళు పెడుతూ నాగా, ఆందోళనగా గుడిపాటి అవ్వా, ఆమె చంకలో చిన్నారి రాధా.. అందరూ, చిట్టి మొహం కేసే చూస్తున్నారు.

          ‘నాగా నేనూ ఏడుస్తున్నాం. సీతారామయ్య సార్ మా ఏడుపు విని దగ్గరికొచ్చి చూసి, ఇద్దరినీ బైటికి తీసుకుని వచ్చి, అడిగితే చెప్పినాను, సార్, నా చెయ్యి తగిలింది సర్, అంతే! అని! సార్, నా చేతిమీద కూడా బెత్తంతో రెండేట్లు వేసి, నాగ నోరు కడిగించి, ఇంటికి పొమ్మని చెప్పినాడమ్మా! ఆయన కూడా వస్తానన్నాడు మీకు చెప్పడానికి.’  

          చేతిలో పసుపుతో నిలబడిపోయింది కనకమ్మ.

          పెన్సిల్ గుచ్చుకుని ఇంత దెబ్బ, అదీ అంగిట్లో! ఎంత సున్నితమైన ప్రదేశం! తిండీ తిప్పలూ ఎట్లా? తలచుకుంటూంటేనే భయం వేస్తూంది, పాపం పసిది, ఎట్లా ఓర్చుకుంటూందో! ఎంత నొప్పిగా ఉందో! అసలు నాగకు మాట్లాడేందుకు వస్తుందా? ఆ దెబ్బ పూడుకుంటుందో లేదో! లేకపోతే జీవితాంతం, సైగలు చేస్తూ మూగదానిలా ఉండిపోవాలా? అయ్యో రామచంద్రా! ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ తిరిగే పిల్లకు ఎంత కష్టం తెచ్చి పెట్టావయ్యా? కష్టంలోనూ సుఖంలోనూ నిన్ను మరిచిపోయిందే లేదే! ఇప్పుడు మాకూ, మా పిల్లకు ఎంత కష్టమిచ్చినా వయ్యా?’ కనకమ్మ వేదనతో దిక్కు తోచకుండా  విలవిల్లాడి పోతున్నది. 

          ఇంతలో సీతారామయ్య రానేవచ్చాడు. బక్క పలుచటి శరీరం. సన్నగా పొడుగ్గా, తెల్లటి పంచె జుబ్బా. కళ్ళద్దాలు. భుజాన ఉత్తరీయం. చేతిలోనే నశ్యం డబ్బా. మాటి మాటికీ నశ్యం పీలుస్తూనే ఉంటాడాయన. అందువల్ల ఉత్తరీయం పైన నశ్యం మరకలు దోబూచులాడుతూ ఉంటాయి. దగ్గరికి రాగానే ఒకింత నశ్యం వాసన కూడా!

          ఆయన్ని చూడగానే కనకమ్మలో కోపం రాజుకుంది.

          ‘ఏమప్పా!! మీ స్కూల్ లో గుడ్డిగా పాఠాలు చెప్పుకుంటూ పోవడమే పద్ధతా? పిల్లలు ఏమి చేస్తున్నారు? అని గమనించే పద్ధతి కూడా ఉందా?’

          సీతారామయ్య అందుకున్నారు,’అదేమిటమ్మా? పాఠం చెప్పేటప్పుడు బోర్డ్ మీదా పాఠం చెప్పే పద్ధతి మీదా దృష్టి ఉంటుందిగానీ, ప్రతి విద్యార్థినీ గమనిస్తూ ఉంటే ఇంక పాఠం చెప్పేదెట్లా? ఐనా ఒక మాట, పాఠం వినకుండా, నోట్లో పెన్సిల్  పెట్టుకుని ఎటో చూస్తున్నది, మీ బిడ్డ! తనను దండించాల్సింది పోయి నన్నే అంటు న్నారు మీరు! ఇదేమీ బాగాలేదు.’

          కనకమ్మకు సమాధానం తోచలేదు.

          ‘దెబ్బ తగలగానే పరిగెత్తుకుని వచ్చి, వసంత టీచర్తో నోరంతా శుభ్రం చేయించి, రవికె మీద పడ్డా రక్తమూ తుడిచి, వెంటనే ఇంటికి పంపించేసినాను కూడా!! ఇంతకూ డాక్టర్ దగ్గరికి పోతున్నారా, నన్ను తీసుకుని వెళ్ళమంటారా?’

          అడిగాడాయన.

          సమాధానం చెప్పేలోగా, వీధిలో వెళ్తున్న రిక్షా వాణ్ణి పిలిచి, నాగ చేయి పట్టుకుని పెద్ద మసీదు దగ్గరున్న ప్రభుత్వ వైద్య శాల శాఖకు వెళ్ళమని చెప్పాడాయన.

          స్కూల్ నుంచీ అందిన సమాచారంతో పుట్టపర్తి కూడా గాభరాగా ఇంటికి చేరుకున్నారు.

          వారిని చూడగానే ఏడుపు కట్టలు తెంచుకుంది కనకమ్మకు.

          పుట్టపర్తి మరో రిక్షాలో అరవిందుతో ప్రభుత్వ వైద్యశాల శాఖా కేంద్రానికి బయలు దేరారు.

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.