నా అంతరంగ తరంగాలు-30

-మన్నెం శారద

(ఆలస్యమైనా ఫరవాలేదు, దయచేసి చదివే స్పందించండి )
————————————–
రేపే గొప్ప ప్రారంభం…
—————————–

          మా చిన్నప్పుడు కాకినాడలో కొత్త సినిమా రిలీజయినప్పుడు ఇలానే రాత్రి పూట పెట్రోమాక్స్ లైట్లతో ఊరేగింపు జరుపుతూ అరిచేవారు. నిజంగా ఎంత సంబరంగా ఉండేదో… చెప్పలేం. వరుసగా రకరకాల బళ్ళు పోస్టర్స్ తో వెళ్తుంటే సగం సినిమా చూసిన ఫీల్ వచ్చేసేది.

          ఆఁ రోజుల్లో పెద్దవాళ్ళు ఎప్పుడో జాలి తలచి ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళేవారు.

          ‘ఏం సినిమా కావాలోయ్…’ అని ఒకడంటే ‘ గులేబకావళి కావాలోయ్ ‘అని అప్పుడు రిలీజ్ అయిన సినిమా పేరు మిగతా వారు అరిచేవారు. చొల్లంగి అమావాస్య తిరునాళ్ళకి అలానే రకరకాల వాహనాల్లో దేవుళ్ళలా తయారయి నిలబడి వెళ్ళేవారు. కొందరు వాళ్ళని గుర్తు పట్టి “అరేయ్ ఆడు, మన దుర్గమ్మ కొడుకు సత్తిగాడురా, గుర్తట్టేవా!” అని అరచి వాడి తెలివికి వాడే మురిసి పోయేవాడు. ఇంకొకడు ఇంకో అడుగు ముందుకు వేసి ఆఁ పార్వతి ఏషం కట్టినోడు, మీసం సరిగ్గా గొరుక్కొలేదురా!”అని వాడి డిటెక్షన్ గురించి చెప్పి పళ్లికిలెంచేవాడు. మేము అత్తా అనిపిలిచే మా దూరపు చుట్టం ఒకామె “మాయదారి సంత! ఎవడాడు… ఆడికి సీత వేషం ఇచ్చినోడు… సగం నరికిన తాడి చెట్టులావున్నాడు!” అనగానే పిల్లలందరూ పకపకా నవ్వేవాళ్ళం!

          ఆఁ నవ్వులు కామెంట్స్ మా అమ్మగారికి, దొడ్డమ్మకి అసలు నచ్చవు. “ఇంక లోపలికి రండి!” అంటూ హుంకరించేవారు. ఊరేగింపు వెళ్లిపోయాకా వీధి చిన్నబోయేది. సినిమా ఆఖరు రీల్లో కరెంట్ పోయినట్లు మహా దిగులు ఆవరించేది.

          అందరూ ఉసూరుమంటూ లోపలికెళ్తుంటే నేను బాగా చిన్నదాన్ని కాబట్టి వీధి మలుపు దాకా దాని వెనుక నడిచి తిరిగి లోపలికొస్తుండగా ధడాలున తలుపు తీసి “ఏవే శారదా, ఇలా రావే… అని పిలిచేది మా ఇంటి పక్కన వుండే పార్వతమ్మ పెద్దమ్మ.అంతే! నేను గాలానికి చిక్కిన చేపలా గిలగిల్లాడి పోయేదాన్ని.

          నిజానికి ఆఁ వీధంతా మాదే “ఎవరూ మా ఇళ్లకు వచ్చేవాళ్ళు తప్పావేరేవాళ్ళు నడిచే వారు కాదు. ఈ పెద్దమ్మ మా దొడ్డమ్మకు చిరకాలపు స్నేహితురాలట… అందుకని వాళ్ళోక్కళ్ళే అక్కడ అద్దెకుండేవారు. మేమంతా పెద్దమ్మ అని పిలిచేవాళ్ళం.

          “ఇందాకేంటే… ఏవో అరుపులు వినిపించాయ్, ఏవయ్యింది?” అనడిగేది కొంచెం హిందీ సినిమాల్లో వేసే లలితాపవార్ లా ఒక కన్ను మూసి.

          కొత్త సినిమా ఊరేగింపు పెద్దమ్మా “అని చెప్పేదాన్ని కొంచెం ఉత్సాహం గా.

          “అప్పుడు నేనెక్కడున్నానే!” అనడిగేది సీరియస్ గా.

          ఇక నాకు పరీక్ష మొదలయ్యిందని అర్ధమయ్యేది. వంట చేస్తున్నావేమోపెద్దమ్మా!”

          “ఆఁ సింగినాదం, అప్పుడు వంటెంటే… ప్రొద్దునే చేసేసా కూరలన్నీ “

          “మరి బాత్రూం లో వున్నావేమో పెద్దమ్మా!”అనేదాన్ని బుర్రగీక్కుంటూ.

          “లేదే!”

          నాకు జుట్టు పీక్కొని ఏడవాలనిపించేది “సర్లే.. ఇంతకీ ఏం సినిమా?” మళ్ళీ ప్రశ్న.

          నేను పేరు చెప్పేదాన్ని కొంచెం ఉత్సాహం తెచ్చుకుని.

          “ఎంటీ వొడిదా… నాగ్గాడిదా…!” (అభిమానులు క్షమించాలి..అప్పుడలానే అనేవారు చాలామంది హీరోలని )

          “ఎంటీఆర్ పెద్దమ్మా!”

          “సాయిత్రి ఉందా.? “

          నేను నీరసం గా ఏదో చెప్పబోయేసరికి వీధి మలుపులో సదరు పెద్దమ్మ అల్లుడు ఫుల్ గా తాగి ఒక కట్ట ఆగరుబత్తులు వెలిగించి పట్టుకుని “అమ్మా దుర్గమ్మా మమ్మల్ని కాపాడు తల్లీ,” అని ఏవేవో మంత్రాలు, శ్లోకాలూ చదువుతూ టాప్ లేని రిక్షా లో రావడం కనిపించి గుండె గుభేలు మనేది.

          “పెద్దమ్మా, పెద్దమ్మా బావగారు వచ్చేస్తున్నారు!”అని చెప్పి భయంగా రివ్వున లోపలికి పరిగెత్తేదాన్ని. వాళ్ళింటి పెరటి కాంపౌండ్ వాల్ మా దొడ్డమ్మగారి స్థలం లోకి వచ్చేది. అక్కడే చిన్నతనం లో మా ఆటలూ, పాటలూ! మాలోని సకల కళలను వెలికి తీసిన ప్రాంగణం…. మాపాలిటీ లలితకళా తోరణం!

          కొబ్బరి , తాడి, మామిడి,జామ,పంపరపనస… ఇలాంటి చెట్లతో.. భలే ఉండేది ఆఁ ప్రాంతం. నేను పెద్దమ్మ గారి గోడదగ్గర నిలబడి ఏం జరుగుతుందోనని వినడానికి ప్రయత్నించే దాన్ని. అది వారింటి విషయాలు వినాలనే ఆసక్తి ఎంతమాత్రం కాదు.
ఆఁ జరగబోయేది కూడా నాకు తెలుసు.

          కాసేపట్లో కొడుతున్నట్లు గుభీ గుభీ శబ్దాలు పుష్ప అక్కయ్య ఏడుపు, పెద్దమ్మ శాపనార్ధాలు… వినపడేయి.

          నేను వెంటనే దొడ్డమ్మ దగ్గరకి పరిగెత్తి “దొడ్డమ్మా, దొడ్డమ్మా, బావగారు తాగొచ్చి అక్కయ్యని కొడుతున్నారు “అని చెప్పేదాన్ని. మా దొడ్డమ్మ చాలా ఆవేశపడుతూ వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టేది.

          పెద్దమ్మ కళ్ళుతుడుచుకుంటూ తలుపు తీసేది. ఏం జరుగుతుందిక్కడ ఆఁ ఏడుపులేంటి?”అని అడిగేది తీక్షణంగా.

          ” ఏదో చిన్నగొడవలే వెంకట రత్నమ్మ “అని సర్ది చెప్పబోయింది పెద్దమ్మ దొడ్డమ్మకి. దొడ్డమ్మ పెద్దమ్మని ఒక నెట్టు అవతలికి నెట్టి “ఇలాంటి నంగి మాటలు నాకు చెప్పకు, ఎన్నాళ్ళనుండో చూస్తున్నా ఈ భాగోతం! “అంటూ పుష్పక్క వైపు చూసింది.
పుష్పక్క నెత్తి నుండి రక్తం కారుతున్నది. పక్కన వాళ్ల చెల్లెలు వసుంధర వెక్కెక్కి ఏడుస్తున్నది అతనేమో స్పృహ లేకుండా పడివుండి ఏదేదో వాగుతూనే వున్నాడు.
నేనిప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వీడ్ని మూయించేస్తాను. దరిద్రం వదులుతుంది అంది దొడ్డమ్మ ఆవేశం గా. 

          అసలే పోలీస్ ఆఫీసర్ భార్య కదా!

          బదులుగా పార్వతమ్మ పెద్దమ్మ దొడ్డమ్మ కాళ్ళకి చుట్టుకు పోయింది. “వద్దు వెంకటరత్నం, పరువు పోతుంది. నీకు దణ్ణం పెడతాను. ఇంకోసారి ఇలా జరిగితే అలానే చేద్దువుగాని ” అంది ప్రాధేయ పడుతూ.

          “సరే, నీ ఖర్మ, ఇష్టం వచ్చినట్లు చేసుకో!”అంటూ తిరిగొచ్చేసింది దొడ్డమ్మ.

          అసలు కథ ఏమిటంటే పెద్దమ్మకు ముగ్గురు కూతుళ్లు. పెద్దామె ఎక్కడో శ్రీకాకుళం లో ఉంటుంది. ఆమె భర్త అక్కడ తహసీల్దార్. పెద్దమ్మ మాత్రం ఇక్కడ ఇద్దరి కూతుళ్ళని పెట్టుకుని అల్లుడు ఇంట్లో ఉంటుంది. పెద్దకూతురు పుష్ప కి పిల్లలు పుట్టలేదని రెండో కూతురు వసుంధర అక్కయ్యని ఇచ్చి పెళ్లి చేస్తే తాగుడు మానేస్తానని ఆఁ అల్లుడు గారు తాగొచ్చి ముగ్గుర్ని కొట్టేవాడట. ఇదంతా నాకు కొంత వయసొచ్చేకా అర్ధమైన విషయాలు!

          ఆఁ ఇద్దరూ మా ఇంటికొచ్చి మంచి పాటలు పాడేవారు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు… అది మాత్రమే నాకు తెలుసు!

          ఒక దుర్ముహూర్తన ఎవరికి చెప్పకుండా పెద్దమ్మ గుడిలో చిన్నక్కని ఇచ్చి గప్చిప్ గా పెళ్లి చేసెయ్యడం ఆఁ వెంటనే చిన్నక్క గర్భవతిగా ఉండగా ఆఁ సదరు తాగుబోతు అల్లుడు లివర్ చెడి ఠా అనడం జరిగి పోయాయి.

          ఇదంతా తెలిసిన పెద్దకూతురు, అల్లుడు వచ్చి వాళ్ళని తీసుకెళ్లిపోయారు.
తీసుకెళ్తూ పెద్దమ్మ పెద్దకూతురు చెప్పిన మాట గురించి అందరూ చెప్పుకునేవారు.

          “ఈ రోజు నుండి ఎవరన్నా ఏడ్చి రాగాలు తీస్తే తన్ని తగిలేస్తాను. వెంటనే చదువుకి దిగండి.” అంటూ వారి చేత మెట్రిక్యూలేషన్ చదివించి ఆమె భర్త పలుకుబడితో ఉద్యోగాలు వేయించిందట.

          నాకు బాగా ఊహ వచ్చేకా వాళ్లిద్దరూ వాళ్ళ బాబు తో మా దొడ్డమ్మ దగ్గరకు వచ్చారు.
ఆరోగ్యం గా హాయిగా వున్నారు. సూపర్నెంట్స్ గా ప్రమోషన్స్ వచ్చి ఆర్ధికం గా సెటిల్ అయ్యారు. ఇదంతా ఈ రోజు ఎందుకు చెబుతున్నానంటే ఆఁ రోజుల్లో పరువు మర్యాద లంటూ నిప్పుని వళ్ళో దాచుకుని వళ్లంతా కాల్చుకునే పెద్దమ్మ లాంటివారు చాలామందే ఉండేవారు.

          క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని కదిలినా మెదిలినా పెద్ద పెద్ద శిక్షలు వేసి హింసించి వారి చావులకి కారణమైన పెద్దల్ని కూడా నేను చూసాను.

          పరుల కొంపలమీదపడి అనవసరమైన ఆశక్తి చూపిస్తూ అడ్డమైన తీర్పులు ఇచ్చే ఇరుగుపొరుగులు కూడా బాగానే ఉండేవారు. ఇప్పుడిలాంటి దారుణాలు అమ్మాయిలకు ఆర్ధిక స్వాతంత్య్రం వచ్చాక బాగా తగ్గాయి.

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.