నా అంతరంగ తరంగాలు-32

-మన్నెం శారద

తప్పిపోయిన నా గురువులు గుర్రం మల్లయ్య గారు…

‘అయ్యో మీ గురువులు ఎక్కడ తప్పిపోయారూ?’ అని కంగారు పడకండి.

          నాకు ఆయన శిష్యరికం చేసి  చిత్రకళ నేర్చుకునే మహద్భాగ్యం తప్పిపోయిందని నా భావం.

          నాకు అయిదేళ్ళోచ్చేవరకు మేము ఒంగోల్లొనే వున్నాం. అదే మా నాన్నగారి ఊరు!

          “అదేంటి… మీ నాన్నగారి ఊరు నీది కాదా? ” అని మరో ప్రశ్న కూడా మీరడగడానికి వీలుంది.

          సహజంగా తల్లి ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది.

          తరచు మేం సెలవులోస్తే  మా అమ్మమ్మ గారి ఊరు కాకినాడ వుడాయించేవాళ్ళం.

          అప్పట్లో కాకినాడ భలే బాగుండేది. మా పిల్లల సైన్యం కూడ చాలా పెద్దది ” అందరూ తరచుగా సెలవులకి అక్కడ కలిసేవాళ్ళం.

          సరే… ఇక్కడ కాకినాడ అందం అప్రస్తుతం కాబట్టి… అసలు విషయంలోకి వచ్చేస్తా.

          ఒంగోలు నుండి మా నాన్న గారికి మాచర్ల ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికి నాకు అయిదేళ్లు నిండి ఆరు నడుస్తున్నది.

          అప్పటినుండీ నాకు జరిగిన ప్రతీ సంఘటనా జ్ఞాపకమే!

          సరే…మేమంతా మాచర్ల వెళ్లిపోయాం.

          అంతవరకూ మేము బడి మొహం చూసి ఎరుగం.

          ఆఁ రోజుల్లోనే నాన్నకు ట్రాఫిక్ భయమట. మా అమ్మగారు బడికి పంపాలని ట్రై చేస్తే మా నాన్నగారు వెనక్కి తీసుకొచ్చేసేవారు.

          అక్కడకి వెళ్ళాకా ఒక సంవత్సరం గాలి తిరుగుళ్ళే! మాచర్లంతా సర్వే చెయ్యడమే!

          నేనక్కడ చేయని అల్లరి లేదు. ఇప్పటికి మా వాళ్ళు నా అల్లరి గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే నేను నవ్వుకుంటుంటాను.

          మాచర్ల వాతావరణం నాకు బాగా నచ్చింది.

          ఊరిని అర్ధచంద్రాకారంలో చుట్టుకుని ప్రవహించే చంద్రవంక, చెన్నకేశవ స్వామి ఆలయం, రోడ్డుల కిరువైపులా పందిరివేసినట్లు, ఆకాశాన్ని కనపడకుండా అల్లుకు పోయిన వున్న పెద్ద పెద్ద రావి, వేప, చింతచెట్లు… నాగార్జున సాగర్ కి వెళ్లే దారిలో పచ్చని నల్లమల్ల అడవి ఛాయాలు… అక్కడే నాకు ఏదో ఒకటి రాసే అభిరుచికి నాంది పలికింది.

          అక్కడే రకరకాల పాముల్ని, తేళ్ళని, మండ్రకప్పల్ని చిన్న సైజ్ పాముల్లాంటి జెర్రి ల్ని కూడా చూసే భాగ్యం కూడా కలిగింది.

          బడి లేదు గిడీ లేదు.

          చక్రపాణి గారనే మాస్టారు నాకు, అక్కకి ట్యూషన్ చెప్పేవారు.

          భలే మంచి మాస్టారు.

          ఆయన వలనే  తెలుగు మీద ఆశక్తి, అనురక్తి కలిగాయి.

          ఈ మాస్టర్ గారి గురించి నేను నా బాల్యం గురించి రాసిన ‘చిగురాకు రెపరెపలు’ పుస్తకంలో వివరంగా రాసాను. నేను కొంచెం కూడా ఆఁ మాస్టర్ గారిని మరచిపోలేదు. అంత అభిమానం… నాకు ఆయనంటే.

          నాకెందుకు… బొమ్మలు వేయాలన్న ఆసక్తి కలిగిందో తెలియదు కానీ, ఎక్కడ చూస్తే అక్కడ ఏవేవో బొమ్మలు గీసేసే దాన్ని.

          మాకు పోస్ట్ ఆఫీస్ పక్కనే కానీ, మేడమీద కానీ క్వార్టర్స్ ఇస్తారు. అలాగే మాచర్లలో కూడా పక్కనే వుంది.

          మాకు పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళడానికి లోపల గుమ్మాలు కూడా ఉండేవి.

          ముందూ వెనకాల వున్న పెద్ద కాంపౌండ్ కి మధ్యగా అక్కడ దొరికే  పెద్ద పెద్ద నాపరాళ్ళని గోడలుగా పాతి పెట్టేరు.

          వాటినిండా నేను చాక్ పీస్ లతో నాకు తోచిన బొమ్మలు గీసేదాన్ని. 

          సాయంత్రం మొక్కలకు నీళ్లు పెడుతూ రన్నర్స్ వాటిని శుభ్రం చేసి  “మళ్ళీ కొత్త బొమ్మలు గియ్యి పాపా! “అని  ఉత్సాహ పరిచేవారు.

          నేను మావైపే కాకుండా… పోస్టాఫీస్  వైపు కూడా ఎడా పెడా బొమ్మలు వేసేసేదాన్ని.

          నాతోపాటూ మా అక్కకూడ వేస్తుండేది.

          ఒకరోజు మా నాన్న “ఒరేయ్ శారదా, ఒకసారి ఇలా రారా!” అని కేక పెట్టేరు ఆఫీస్ లొంచే.

          అక్కడక్కడే తడుంకుని ఏదో ఒక పని చేస్తూ తిరిగే నాకు వెంటనే నాన్న పిలుపు వినిపించి పరిగెత్తుకుని వెళ్ళేను.

          అప్పుడు నాకు చిన్న క్రాఫ్ లా హెయిర్ కటింగ్ ఉండేది. 

          “ఇదిగోండి సర్, ఇదే మీరు చూస్తానన్న మా ఇంట్లో పెద్ద ఆర్టిస్ట్! ” అని ఒక వ్యక్తికి నన్ను పరిచయం చేశారు నాన్న నవ్వుతూ.

          ఆయనెవరో నాకు తెలియదు.

          నేను ఆయన వంక అయోమయంగా చూసాను.

          “అట్లా ఎగతాళిగా మాట్లాడకండి సర్,ఈ అమ్మాయి ఈ వయసులోనే ఇంత బ్రహ్మండంగా బొమ్మలు వేస్తుందంటే నేర్పిస్తే చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది.!”అని నా వైపు తిరిగి ఏమ్మా, బొమ్మలు వేయడం నీ కిష్టమా? “అని అడిగారు.

          నేను అవునన్నట్లుగా తలవూపేను.

          ఆయన నా తలనిమిరి “నా దగ్గరకు రోజూ ఒక గంట పంపించండి సర్, మీ అమ్మాయిని. పెద్ద ఆర్టిస్ట్ ని చేస్తాను” అని చెప్పి వెళ్లిపోయారు.

          అంతే! నా మనసులో ఆయన చెప్పిన మాటలు బాగా నాటుకు పోయాయి.

          రోజూ మా నాన్నతో, అమ్మతో నన్ను ఆయనదగ్గరకు పంపమని గొడవ చేసేదాన్ని.

          కానీ వాళ్ళు నా మాటను అంత సీరియస్ గా తీసుకోలేదు.

          మాచర్ల హై స్కూల్లో సీట్స్ లేవంటే అక్కడ దగ్గరలో వున్న దుర్గి అనే పల్లెటూరు వెళ్లి మరుసటి సంవత్సరం మా అక్క into థర్డ్ ఫారం, నేను  into ఫస్ట్ ఫార్మ్ పరీక్ష రాసి  స్కూల్లో చేరాం.

          “ఏం సీట్లు లేకపోతే  ఇంకో బెంచీ వేయొచ్చుగా!” అని నేను మా నాన్నని సతాయిస్తూనే  వున్నా.

          కొంత వెనుకబడిన ప్రాంతం కావడం వలన ఏమో, కాస్త ఎక్కువ వయసు వారో లేక బాగా ఎత్తుగా ఉండేవారో గాని క్లాసులో పిల్లలంతా చాలా పెద్దగా అనిపించేవారు.

          త్వరలోనే నేను డ్రాయింగ్ మాస్టర్ గారికి బాగా పెట్ నయిపోయాను.

          ఆయన నన్ను చూసి ‘శారద నీరద మరాళ మల్లిక…’ అంటూ పద్యం పాడే వారు.

          ఆఁ సారి స్కూల్ వార్షికోత్సవ డ్రాయింగ్ పోటీలో నేను పేడ్ పెన్సిల్స్ తీసుకుని వెళ్తే “అబ్బో పెద్ద ఆర్టిస్ట్ వచ్చిందిరోయ్!” అందరూ నన్ను చూసి నవ్వడమే!

          చివరకి 1st ప్రైజ్ నాకే వచ్చింది.

          ఒకసారి మా స్కూల్ స్టూడెంట్స్ నందర్నీ అక్కడకు దగ్గరలో వున్న ఆర్ట్ మ్యూజియం చూపించడానికి తీసుకెళ్లారు. ఆది పూర్తిగా నన్ను పెద్ద ఆర్టిస్ట్ ని చేస్తానన్న  గుర్రం మల్లయ్య గారిదే!

          ఆయన నన్ను గుర్తు పట్టి   “ఏమ్మా నేను రమ్మంటే రాలేదూ… నాన్న పంపలేదా?” అంటూ పలకరించారు.

          నేనేం చెప్పలేక దిక్కులు చూస్తుంటే మా డ్రాయింగ్ మాస్టారు జోక్యం చేసుకుని “బాగా చిన్న పిల్లని పంపివుండరు” అని సర్ది చెప్పారు.

          ఆ విషయం మా నాన్నకు  చెప్పి మళ్ళీ దెబ్బ లాట వేసుకున్నా. మా నాన్న గారు అన్నిటికీ నవ్వే జవాబు!

          ఆఁ తర్వాత నాన్నకు గురజాల, ఆఁ తర్వాత నాగార్జునసాగర్ రైట్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయ్యింది.

          అక్కడ హిల్ కాలనీలో గుర్రం మల్లయ్యగారు నిర్మించిన మోడల్ డాం చూసాక  నాకు కళ్ళ నీళ్లు వచ్చాయి.

          ఇంతటి మహానుభావుడు నాకు బొమ్మలు వేయడం నేర్పిస్తానంటే నేర్చుకోలేక పోవడం నా దురదృష్టం కాకపోతే మరేమిటి?

          అక్కడ రాసివున్న ఆయన వివరాలు ఇలా వున్నాయి.

          మాచెర్ల కు చెందిన గుర్రం మల్లయ్య గారు బందరు జాతీయ కళాశాలలోని ప్రముఖ చిత్రకళా కోవిదులని ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్రకళను అభ్యసించారని, ఇంటర్‌మీడియట్ వరకు చదివి 1920 లో కలకత్తా వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్‌వద్ద శాంతి నికేతన్‌లో మూడు సంవత్సరాలు చిత్రకళాభ్యాసం చేశారని ఆ సమయంలో వారు  వేసిన చిత్రాలు, వ్రాసిన వ్యాసాలు బెంగాలీ భాషా పత్రికలలోను ఇతర భాషల పత్రికలలోను ప్రచురితమయ్యాయని, కళాశాలలో పనిచేస్తున్నప్పుడే గాంధీజీ పిలుపును అందుకుని మద్యపాన నిషేధము, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాలలో పాల్గొన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగులు నిర్వహించడంతో అరెస్టయ్యారని, మాచర్లలో నవయుగ చిత్రకళా సమితి పేరుతో ఒక సంస్థను స్థాపించి ఎందరినో చిత్రకారులుగా తీర్చిదిద్దారని తెలిసి చాలా ఖిన్నురాలాయ్యాను.

          ఆయన చిత్రం కోసం గూగుల్ లో వెదుకుతున్నప్పుడు మరిన్ని విషయాలు తెలిసి అబ్బురపడ్డాను.

          నాగార్జున కొండ నుండి కొన్ని అపురూపమైన శిల్పాలను విదేశీయులు తరలించుకు పోవడాన్ని గమనించి ప్రభుత్వానికి రిపోర్టు చేసి ఆ శిల్పసంపద మన దేశం నుండి తరలి పోకుండా కాపాడారని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఇక్ష్వాకుల కాలం నాటి విజయపురి శిథిలాలను, శిల్పాలను నీటిలో మునిగిపోకుండా భద్రపరచవలసిన ఆవశ్యకతను ఇతడు స్వయంగా నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు విన్నవిస్తే నెహ్రూ స్వయంగా పరిశీలించి వాటి నమూనాలు తయారు చేయించి కొండపై మ్యూజియం ఏర్పాటు చేసి వాటిలో ఉంచవలసిందిగా ఆదేశించారని, నెహ్రూ ఆదేశం ప్రకారం వీరే స్వయంగా అన్ని నమూనాలు తయారు చేయించారట.

          నాగార్జున శిల్పకళ ప్రావీణ్యతను ప్రజలకు తెలియజేయడానికి వీరే కోలవెన్ను రామకోటేశ్వరరావుతో కలిసి నాగార్జున శిల్పకళా పీఠాన్ని నెలకొల్పి 11 సంవత్సరాలు అనేక మందికి శిక్షణ ఇచ్చి మంచి శిల్పులుగా తయారు చేశారట.

          ఇంకా చాలా వివరాలు వున్నాయి.

          మల్లయ్య గారిని ఆచార్య రంగా “అభినవ బ్రహ్మన్న”గా వర్ణించారట.

          ఈ చరిత్ర అంతా తెలిసాక వారి శిష్యరికం చేసే అదృష్టం పోయినందుకు  నేను ఎంతగానో బాధ పడ్డాను.

          సరయిన టైంలో సరయిన నిర్ణయం తీసుకోలేక పోతే  ఎన్నింటినో కోల్పోవలసి వస్తుంది.

(చివరగా పెట్టిన నా బొమ్మ ఒకసారి నేను గుర్రం మల్లయ్య  గారి గురించి ఏదో సందర్బంగా చెప్పినప్పుడు  చూసి వారి మనవడు గుర్రం శ్రీనాథ్ గారు వేసి పంపినది.)

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.