నారి సారించిన నవల -1

-కాత్యాయనీ విద్మహే 

  నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- వలసపాలనా కాలపు నగర జీవనం,జీవితం రూపొందుతున్న క్రమంలో- ఎవరికీ వారు చదువుకొనే సాహిత్య ప్రక్రియలకు జరిగిన పరివర్తన చిన్నదేమీకాదు. సాహిత్య ప్రపంచంలో పాఠకులుగా స్త్రీలు కూడా ఉంటారన్న ఒక ప్రజాస్వామిక చైతన్యం నవలా ప్రక్రియ సందర్భం నుండి వ్యక్తం కావటం అందులో భాగమే. స్త్రీవిద్యా ప్రచారకుడు, ఆచరణ శీలి అయిన కందుకూరి వీరేశలింగం పంతులు నవలా రచయిత కావటమే కాక నవలా రచనను ప్రోత్సహించటానికి చింతామణి పత్రికలో నవలల పోటీలు పెడుతూ ‘నవలలో కథ చమత్కారంగా ఉండాలి కానీ నీతిబాహ్యంగా ఉండరాదని’ చెప్తూ “స్త్రీలు చదువగూడని మృదుత్వము తప్పిన మోటుమాటలు గాని యంశములు గాని యుపయోగింపగూడదు” అని హెచ్చరించటం గమనించవచ్చు. నవలకు పాఠకులగా స్త్రీలను గుర్తించగలిగిన ఆధునిక సామాజిక దృష్టి నవలా రచయితలుగా వాళ్ళను గుర్తించి గౌరవించగల సంస్కారంగా అభివృద్ధి చెందకపోవటమే ఆశ్చర్యకరం.

  తెలుగులోకి నవలా ప్రక్రియనైతే తెచ్చుకున్నారు గాని మొదట్లో దానిని ఏ పేరుతో వ్యవహరించాలో తెలియలేదు. కొన్నాళ్లు అంతకు ముందు తెలిసిన ‘ప్రబంధం’ అనే సాహిత్య నిర్మాణ ప్రత్యేకతను తెలిపే పద్యకావ్య వాచకానికి ‘వచన’  అనే విశేషణం చేర్చి ‘వచన ప్రబంధం’ అని వ్యవహరించారు. కందుకూరి వీరేశలింగం గారి ‘రాజశేఖరచరిత్ర’ నవలపై విమర్శ వ్రాస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ‘నవల’ అన్న పేరును ప్రతిపాదించాడు. కొత్త అనే అర్ధం గల ‘నవ’ అనే పదం ఆధారంగా నావెల్ అనే ఇంగ్లిష్ మాటకు దగ్గరగా వుండే ‘నవల’ ఆ రకంగా ఈ ప్రక్రియకు పేరుగా స్థిరపడి పోయింది.నవల దేశ్యపదం.స్త్రీ అని దానికి అర్ధం. 

ప్రపంచంలో సగం స్త్రీలు అయినా సాంఘిక ఆర్ధిక రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాలన్నిటిలో వాళ్ళు ఉపాంతీకరించబడినవాళ్లు.అందువల్లనే తెలుగులో నవల పుట్టిన ముప్ఫయ్ ఏళ్లకుగానీ స్త్రీలు నవలలు వ్రాయటం మొదలు కాలేదు. మొదలైన తరువాతకూడా సాహిత్యచరిత్రలో వాళ్ళ పేర్లు అరుదుగానే నమోదు అయ్యాయి. అందులోనూ ప్రస్తావనే ఎక్కువ. పరిశీలన , విశ్లేషణ తక్కువ. తెలుగులో సాహిత్య చరిత్రలు వీరేశలింగం నాటికే మొదలైనా అవి ప్రధానంగా కవిత్వచరిత్రలే. 1971 నాటికి గానీ తెలుగు నవలా సాహిత్య చరిత్ర రచన మొదలు కాలేదు. 

మొదలి నాగభూషణ శర్మ తెలుగు నవలా వికాసం(1971)వాటిలో మొదటిది. అందులో అనువాద నవలా రచయితలలో 1900-20 మధ్యకాలానికి చెందిన నవలా రచయితలలో ముగ్గురు  మహిళలు ఉన్నారు.1955-70 మధ్యకాలపు రచయితలుగా ఇల్లిందల సరస్వతీ దేవి తో మొదలు పెట్టి 19 మంది పేర్లు పేర్కొనబడ్డాయి. మాలతీ చందూర్ ,లత,రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి,ఆనందా రామం వంటి వాళ్ళ రచనల ప్రస్తావన అక్కడక్కడా వచ్చింది. చారిత్రక నవలా రచయితలో ఒక మహిళ పేరు కనబడుతుంది.అంటే వందేళ్ల నవలా సాహిత్య చరిత్రలో 23 (3+19+1) మహిళల పేర్లు మాత్రమే నమోదు అయ్యాయయన్నమాట.

తెలుగునవలా సాహిత్య చరిత్రలలో రెండవది బొడ్డపాటి వేంకట కుటుంబరావు రచించిన ఆంద్ర నవలా పరిణామం (1973). అనువాద రచయితలలో సత్యనాధమ్మతో పాటు పులగుర్త లక్ష్మీ నరసమాంబ పేరు కొన్ని వివరాలతో ఇందులో నమోదు అయింది. మళ్ళీ మల్లాది వసుంధర తనజావూరుపతనం అనే నవల  విస్తృత స్థాయిలో చర్చించబడింది. అంతకుమించి ఇతర మహిళా రచయితల పేర్లు లేకపోవటానికి ఇది ఆయన సిద్ధాంత గ్రంధంలో ప్రధమసంపుటం కావటమే కారణమై ఉంటుంది. తరువాతి సంపుటం ఆయన ప్రచురించలేదు. 1974 లో పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు రచించిన ‘తెలుఁగు నవలా సాహిత్యవికాసము’ వచ్చింది. ‘తెలుఁగు నవలా స్వర్ణయుగ సంక్రాంతిని ముత్యాల రంగవల్లులతో తీర్చిదిద్దిన రచయిత్రులు’ అనే శీర్షిక కింద 50 పుటలలో (క్రౌన్ ) 50 మంది రచయిత్రుల నవలలను ప్రస్తావిస్తూ కొంతవివరంగానే వ్రాయబడింది ఇందులో. 1990 లో వచ్చిన తెలుగు నవలానుశీలనం ముదిగంటి సుజాతారెడ్డి రచన. ఇందులో నాలుగురైదుగురిని మించి మహిళా రచయితల ప్రస్తావన కనబడదు. 

నిజానికి 1960 లలో నవలా రచనా రంగంలోకి మహిళల ప్రవేశం ఎక్కువైంది. అందుకు చదువుకొన్న మధ్యతరగతి అక్షరాస్య మహిళల సంఖ్య పెరగటం, పట్టణీకరణ, పత్రికారంగ విస్తరణ వీటిలో ఏవైనా కారణం కావచ్చు, అన్నీ కలిసి కూడా కారణం కావచ్చు. ఏమైనా 1970 లలో నవల అంటే అది ఆడవాళ్ళ సాహిత్య ప్రక్రియ అన్నంతగా స్థిరపడి పోయింది.ఆ పరిస్థితిపై అక్కసుతోనో ,అపేక్ష తోనో చతుర్లు వేయటం కూడా చూస్తాం. భార్యను లేబర్ రూమ్ కి పంపి ప్రసవ వార్త కోసం  వరండాలో ఆత్రంగా ఎదురుచూస్తుండే భర్త దగ్గరకు ఆసుపత్రి నర్సు వచ్చి మీకు ఆడపిల్ల పుట్టిందని చెప్పటానికి బదులు నవలా రచయిత్రి పుట్టిందని చెప్పినట్లు కార్టూన్లు వచ్చేవి అప్పట్లో. ఆడవాళ్ళ పనిని -ఇంటిపనిని- తక్కువ చేసి చెప్పే పితృస్వామిక సంస్కృతికి విస్తరణగా నవల ఆడవాళ్ళ ప్రక్రియ అని చిన్నచూపుకు గురికావటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మహిళల నవలల పై వాళ్లేందుకు రాశారు? ఏమి వ్రాసారు ?దేనిని గురి చూసి వ్రాసారు? ఎలా వ్రాసారు? నవలా ప్రక్రియ ద్వారా సమాజంతో వాళ్ళు చేసిన సంభాషణ సారం ఏమిటి?  ప్రయోజనం ఏమిటి? నవల వస్తుశిల్ప విస్తృతికి వాళ్ళ దోహదం ఏమిటి? తెలుగునవల అభివృద్ధి వికాసాల చరిత్రలో వాళ్ళ స్థానం ఏమిటి ? -వంటి ప్రశ్నలతో తెలుగులో వచ్చిన స్త్రీలనవలా చరిత్రను వ్రాసుకొనటం అవసరం. 

    సంఘ సంస్కరణ ఉద్యమం, అందులో భాగంగా స్త్రీల విద్యాభివృద్ధి కొరకు జరిగిన కృషి స్త్రీల సృజన విమర్శన శక్తుల వికాసానికి కారణమైంది.సమాజ సాహిత్య రంగాలలో వస్తున్న కొత్త పరిణామాల వైపు వాళ్ళ చూపును తిప్పింది. అప్పుడప్పుడే పుట్టి వివిధ ప్రచురణ సంస్థల ద్వారా విరివిగా ప్రచురించబడుతూ ఉన్న నవలల తో ప్రేరణ పొంది తామూ ఆ ప్రక్రియలో ప్రయోగాలు చేయటానికి ఉత్సాహపడ్డారు.ఆ క్రమంలో వచ్చిన తొలి తెలుగు స్త్రీల నవల సుదక్షిణా చరిత్రము.రచయిత జయంతి సూరమ్మ.1906 లో వచ్చిన ఈ నవల  పురుషులు వ్రాసిన రంగరాజ చరిత్ర, రాజశేఖర చరిత్ర వంటి తొలి తెలుగు నవలల పేర్ల నమూనాలోనే రావటం గమనించవచ్చు. ఇక్కడి నుండి ప్రారంభించి 1930 వరకు వచ్చిన స్త్రీల నవలల గురించి ఆ కాలపు పత్రికలలో వచ్చిన పుస్తక సమీక్షల ద్వారా, పీఠికలు, ముందుమాటల సంపుటాల ద్వారా,వ్యాసాలు ,సాహిత్య చరిత్రలు మొదలైన వాటి ద్వారా తెలుస్తున్నడి తప్ప అవి ఎక్కడా దొరకటం లేదు.అలాగని 1930 తరువాత స్త్రీల నవలలు అన్నీ దొరుకు తున్నాయని కూడా చెప్పలేం, కానీ ఒకటి రెండైనా దొరుకుతూ 1947 తరువాత వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందువల్ల  స్త్రీల నవలా చరిత్రను 1905నుండి 1929 వరకు ప్రారంభ దశ అని, 1930 నుండి 1947 వరకు వికాసదశ అని 1950 నుండి విస్తరణ దశ అని పేర్కొనవచ్చు. 1950 నుండి స్త్రీల నవలా చరిత్రను పదేళ్ల కాలపరిమితిని, అంటే ఒక దశకాన్ని ప్రమాణంగా తీసుకొని ,ఆ కాలపు ప్రత్యేక లక్షణాల నుండి ఒక్కొక్క రచయిత కృషిని అంచనా వేయటం ‘నారి సారించిన నవల’ ఉద్దేశానికి , ప్రయోజనానికి ఎంచుకొన్న పద్ధతి.

1

తెలుగు నవల ప్రారంభ యుగం  (1872- 1900) గడిచి అనువాద యుగం (1900-1920) లోకి అడుగు పెట్టిన అయిదేళ్ల తరువాత 1906లో జయంతి సూరమ్మ వ్రాసిన ‘సుదక్షిణా చరిత్రము’ నవల వచ్చింది. పురుష రచయితలు రంగరాజచరిత్ర ,రాజశేఖర చరిత్ర వంటి పురుషవ్యక్తి జీవిత చరిత్రలను నవలలు గా వ్రాస్తే  స్త్రీవ్యక్తి జీవితచరిత్రగా సుదక్షిణా చరిత్రము నవల రావటం సాహిత్య రంగంలోకి స్త్రీ ప్రవేశం వల్ల వచ్చిన ఒక మలుపు.సుదక్షిణ రఘువంశ మూలపురుషుడైన దిలీపుని భార్య. జయంతి సూరమ్మ రఘువును కన్న తల్లి అయిన సుదక్షిణను నాయికగా చేసి పౌరాణిక నవల వ్రాసిందో లేక ఆ పేరుతో ఒక స్త్రీపాత్రను కల్పించి సాంఘిక నవలే  వ్రాసిందో తెలియరావడం లేదు. 

జయంతి సూరమ్మ వెనువెంట నవలా రచనకు పూనుకొన్న ఇద్దరిలో దేవమణి సత్యనాథన్ వ్రాసిన ‘లలిత’ సాంఘిక నవల(పొదిలి నాగరాజు – రాయలసీమ నవల తొలి దశ -ఒక అధ్యయనం ,2015)  కాగా కృపాబాయి సత్యనాథమ్మ వ్రాసిన ‘కమలాంబ’ అనువాద నవల. క్రైస్తవ మిషనరీల ప్రభావంతో ,ప్రాపకంలో విద్యావంతులైన స్త్రీలు నవలా రచయితలుగా తలెత్తుతున్న సందర్భం ఇది. లలిత 1908 లో రాగా కమలాంబ 1909 లో వచ్చింది. చరితము, చరిత్ర అన్న మాటలను వదిలేసినా ఇవి కూడా ఒకానోక స్త్రీవ్యక్తి జీవిత పరిణామాలను చిత్రించిన నవలలు కావటం విశేషం.  క్రైస్తవ మతప్రచారం లక్ష్యంగా కమల అనే ఆంగ్ల మూలం నుండి అనువదించబడిన కమలాంబ అనే ఈ నవలను క్రిస్టియన్ లిటరరీ సొసైటీ ప్రచురించింది. లలిత స్త్రీల నవలలో తొలి తెలుగు సాంఘిక నవల. సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావం బలంగా ఉన్న నవల ఇది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దేవమణి సత్యనాథమ్మఈ నవలలో కథను విజయనగరం లో ప్రారంభించి బళ్లారి రాజమండ్రి ల మీదుగా నడిపించి బళ్లారిలో ముగించింది. కథాకాలానికి 14 ఏళ్ల పిల్ల అయిన లలిత జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల కథ ఇది. తండ్రి సోమనాథుడు రక్షకభట ఉద్యోగిగా చేసే ఆగడాలు వల్ల విసిగిన ఆటవికులు లలితను ఎత్తుకు పోతుంటే హరిదాసుడు అనే యువకుడు రక్షించటం, బావామరదళ్ళ బంధుత్వ సంబంధం వున్నవాళ్ళిద్దరి మధ్య ప్రేమ కలగటం ఇందులో  ఒక అంశం.అసలే తాగుబోతు అయిన తండ్రి పెద్దకూతురు ,భార్య మరణించటంతో మరింత తాగీ తాగీ ఉద్యోగం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్ళటం, తమ్ముళ్ళిద్దరూ పొట్టగడవని స్థితిలో ఊరువదిలి పోవటం, ఊళ్ళో యువకుల వేధింపులను తట్టుకోలేక లలిత బావ కోసం బళ్లారి వెళ్ళటం. అతని సలహా మేరకు రాజమండ్రిలో అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించటం, అనాధ గా తిరుగుతున్న తండ్రిని చేరదీసి పోషించటం ,తండ్రివల్ల ఎదురైనా సమస్యలను బావ సహాయంతో పరిష్కరించుకొనటం అతనితో పెళ్ళికి పరిస్థితులను సానుకూలం చేసుకొనటం వంటి ఘటనల క్రమంలో అభివృద్ధి చెందింది ఈ కథ.సంఘసంస్కరణోద్యమం సంబోధించిన అంశాలలో స్త్రీవిద్య , తాగుబోతుతనం అనే రెండంశాలను గురిచూసి ఇతివృత్తాన్ని నిర్మించటం ఇందులోని ప్రత్యేకత.  

1908 నాటికి స్త్రీలు చదువుకొనటమే కాక ఉద్యోగాలలోకి ప్రవేశించి తమ మేధో శక్తి సామర్ధ్యాలను జాతి జనుల ప్రయోజనాలకై ఉపయోగించే స్థితిని గురించి దేవమణి సత్యనాథన్ కన్న కలకు ఒక వ్యక్తీకరణ ఈ నవల అనుకోవచ్చు.బాల్యవివాహాలు అలవాటుగా ఉన్న ఆ నాటి సమాజంలో 14 ఏళ్ళు వచ్చిన లలిత అవివాహితగానే ఉందంటే బ్రాహ్మణేతర సామాజిక వర్గానికి చెందినది అయివుండొచ్చు. అందువల్లనే ఆమెకు చదువుకొనే వ్యవధి దొరికింది. ఉద్యోగం చేసుకొనే అవకాశమూ దొరికింది.  ఒంటరి ఆడపిల్లగా లలిత ఎదుర్కొన్న ఒక సమస్య ప్రేమించమని,పెళ్ళాడమని లేకపోతే చంపేస్తానని ఒక యువకుడు పెట్టిన ఒత్తిడి. ఈ నాటికి ఈ రకమైన ఒత్తిడి ఆడపిల్లల మీద యాసిడ్ దాడులుగా , చంపెయ్యటంగా మరింత తీవ్ర స్థాయిలో కొనసాగటం ఈ నాడు మనం చూస్తున్నదే. ఇళ్లను దాటి బయళ్లలోకి రావటం తమకాళ్ళ మీద తాము నిలబడటం అనే సాధికారత దిశగా స్త్రీల గమనాన్ని నిర్దేశిస్తూనే ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యల గురించి హెచ్చరించటం దేవమణి నిశితమైన ముందుచూపుకు గుర్తు.  

ఇంకొక విషయం కూడా ఉంది. పిల్లల పట్ల బాధ్యతతో ప్రవర్తించని తండ్రి అయినాసరే పిల్లల జీవిత నిర్ణేతలుగా తమ అధికారాన్ని వాడుకొనటానికి సర్వదా సిద్ధంగా ఉంటారు. తాగుబోతై ,ఉద్యోగాన్ని పోగొట్టుకొని పిల్లలను వాళ్ళ కర్మానికి వాళ్ళను వదిలేసివెళ్లిన సోమనాథం కూతురి పోషణలో స్థిమిత పడ్డాక ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో తాను నిర్దేశించాలనుకొన్నాడు. హరిదాసుడిని ప్రేమించిన సంగతి చెప్పి అతనిని తప్ప మరెవరినీ పెళ్ళాడనని చెప్పిన కూతురిని సహించలేకపోయాడు. ఆమెను వేధించటానికి కోర్టులో ఒక కేసు వేసాడు. ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా ఎదుర్కోవలసిన కుటుంబ పెత్తనాల గురించిన హెచ్చరికను ఆ రకంగా నవలెతివృత్తంలో భాగం చేసిందామె. 

సోమనాథుని పతనానికి కారణంగా మద్యపాన దురలవాటును చూపిస్తూ మనిషి వివేకాన్ని, కుటుంబాల మనుగడను  కొల్లగొట్టే తాగుబోతుతనంపై నిరసన నవల అంతటా పరచుకొని కనిపిస్తుంది. ఆ తాగుబోతు తనాన్ని పెంచి పోషించే మద్యం వ్యాపార సంస్కృతి దుష్పరిణామాలు ఈ నాటి సమాజం అనుభవంలోనివే. ఈ కారణంగా నవలా రచన తొలి అడుగులలోనే  ఆత్మగౌరవ జీవన ఆకాంక్షను అందుకు అవరోధంగా ఉన్న వ్యవస్థలపై ఒక నిరసన స్వరంతో స్త్రీలు ప్రకటించటం ‘లలిత’ నవలలో చూస్తాం. 

20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916), వి. శ్రీనివాసమ్మ ‘ప్రియాన్వేషణము’, ‘సేతు పిండారీ’ వంటి నవలలు వ్రాసినట్లు (నవ్యంధ్ర సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. జాతీయోద్యమంలో క్రియాశీల భాగస్వామి అయిన మాగంటి అన్నపూర్ణ 1917 లో వ్రాసిన సీతారామము నవల దొరికినట్లతే ఆమె వ్యక్తిత్వం ఎలా నిర్మితమవుతూ వచ్చిందో తెలుసుకొనటానికి వీలుండేది. 1918 లోనే   ‘రూపవతి’ అనే నవల వ్రాసి అట్లూరి వేంకట సీతమ్మ రచనారంగ ప్రవేశం చేసింది.కానీ ఆ నవల 1926 లో గానీ అచ్చు కాలేదు. ఉభయభాషాప్రవీణ ఆమె విద్యార్హత. కవితా విశారద ఆమె బిరుదు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు వ్రాసిన రాజస్థాన కథావళి లోని మోకలరాణా చరిత్ర ఆధారంగా రసపుత్ర రాజవంశానికి చెందిన రూపవతి ని నాయికగా చేసి సీతమ్మ ఈ నవల వ్రాసింది. 1/16 క్రౌన్ సైజులో 212 పుటలతో వచ్చిన ఈ చారిత్రక నవల, 1933 లో సవరణలతో  మళ్ళీ ప్రచురించబడింది. మద్రాసు రాష్ట్ర పాఠ్య పుస్తకాల కమిటీ ఆమోదాన్ని పొంది విద్యార్థులకు అధ్యయన విషయం అయింది. ఆమె రాధామాధవము అనే 313 పుటల సాంఘిక నవలను కూడా వ్రాసింది. కానీ రెండూ ఇప్పుడు అలభ్యాలే. 

1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన వందేమాతర ఉద్యమంతో జాతీయభావన మేల్కొన్న సందర్భంనుండి బంకిం చంద్ర , రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి వారి రచనలు వంగ భాష నుండి తెలుగులోకి రావటం మొదలైంది. అదే సమయంలో వంగదేశం నుండి అపరాధ పరిశోధక నవలలు ఇబ్బడి ముబ్బడిగా తెలుగులోకి రావటం చిత్రంగానే కనిపిస్తుంది. ఆంద్ర ప్రచారిణీ, వేగుచుక్క గ్రంథమాల వంటివి వాటిని విరివిగా ప్రచురించాయి. వాటిని నిరూపక నవలలు అని వ్యహరించారు. ఈ నిరూపక నవలలు రచనకు స్త్రీలు చొరవచూపటం విశేషం. సీరము సుభద్రాయాంబ ఒక ఫ్రెంచ్ నవలను అనుసరించి 1926-27 లలో ‘జాగిలము’ అనే నవల వ్రాసింది. ఆమె మార్గంలో నిరూపక నవలలు రచనకు పూనుకొన్న మరొక వ్యక్తి పూలవర్తి కమలావతీ దేవి. ఆమె వ్రాసిన నిరూపక నవలలో ‘మీర్ జుంలా (1929) ఒకటి. ‘విక్టోరియా క్రాస్’, పుళింద కన్య అనే నవలికలు మాత్రమే కాక ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలను, విజయభాస్కర విజయము (1929) అనే సాంఘిక నవలను కూడా ఆమె వ్రాసింది. భర్త ఎంత నిర్లక్ష్యం చూపినా , అన్య స్త్రీ పట్ల మొహంతో ఎన్ని ఇక్కట్లు పెట్టినా ఓర్చుకొని  బతకటం లోని స్త్రీల జీవిత సాఫల్యాన్నినిరూపించే ఇతివృత్తంతో నడిచిన ఈ నవలలో అలా జీవించటంలోనే స్త్రీలు సబలులు కాగలుగుతారన్నభావం,అలా జీవించటమే మానాభిమానాలతో బ్రతకటమన్నభావం అంతర్లీనంగా కనిపిస్తాయి. 

ఆ రకంగా 1906 నుండి 1929 మధ్య 23 సంవత్సరాల కాలం మీద స్త్రీల  నవలలు పదిహేనును మించి కనిపించవు.

*****
(ఇంకా ఉంది)

   ;

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.