అక్షర బ్రహ్మపుత్రి ఇందిరా గోస్వామి-జగద్ధాత్రి 

“మీరు ఆత్మ కథ రాస్తే బాగున్ను కదా ?” అని ఇటీవలతన 90 వ జనం దినోత్సవం నాడు తెలుగు కథకు చిరునామా కారా మాస్టారిని ప్రశ్నించినపుడు ఆయన ఇచ్చిన సమాధానమిది “ ఆత్మ కథ రాయడం వలన అందులో సమాజానికి ఉపయోగ పడే విషయాలేమైనా ఉంటే తప్ప ఊరికే రాయగలం కదా అని ఆత్మ కథ రాయనక్కర్లేదు” ఎంత ఉదాత్తం ఆయన భావన. ఆత్మ కథల్లో బాగా పేరు పొందినవి సామాజిక ప్రయోజనం ఒనగూర్చినవి ఉన్నాయి ఉదాహరణకి గాంధీ గారి ఆత్మ కథ.  ఇప్పుడు మనమొక ఆత్మ కథ గురించి మాటాడుకోబోతున్నాం , అదీ అసంపూర్ణమైన ఆత్మ కథ, ఈ కథ భారత దేశం గర్వించదగిన జ్ఞాన పీఠం పొందిన బ్రహ్మపుత్రి అస్సాం రచయిత్రి ఇందిరా గోస్వామి ది.

1942 భారత దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ప్రతిఘటనను బ్రిటిష్ ప్రభుత్వం చవి చూసిన సంవత్సరం. క్విట్ ఇండియా అంటూ ఆగ్రహ తర్జని  చూపిస్తూ బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని స్వాతంత్ర్య పోరాటం లో అందరూ నిమగ్నమైన ఆ సంవత్సరం. అదే సమయం లో బ్రహ్మపుత్రా నదీ ప్రవహిస్తోన్న అహోమ్ (అస్సాం) లో జన్మించిన భారతీయ అక్షర పుత్రి ఇందిరా గోస్వామి. మమోని రైశమ్ గోస్వామి అనేది ఆమె కలం పేరు అందరూ ఆత్మీయంగా మమోని(అమ్మలాంటిది) అని పిలుచుకునే వారు ఈమెను. ఇది “అధా లిఖెతే దస్తావేజ్” పేరిట అస్సామ్ భాష లో ముందుగా రాయబడింది. తర్వాత ఆంగ్లం లోకి అనువదించబడింది. మహారాష్ట్ర లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఇది పాఠ్యాంశంగా ఉంచబడింది. 

ఇది ఆంగ్లం లో “ఆన్ ఫినిష్డ్ ఆటోబయాగ్రఫీ” పేరిట పాఠ్యాంశంగా పెట్టేంత గొప్పదా అని ఎవరికైనా అనిపిస్తుంది. అప్పుడు తెలుసు కోవాలి కదా ఎందుకు ఈ ఆత్మ కథ ఇంత ప్రాచుర్యం పొందిందో.. ఇప్పుడా పనే చేయబోతున్నాం మనం. 

ఎవరైనా తమ అనుభవాలనే రాస్తారు అయితే అందులో వారు ప్రపంచానికి, పాఠకులకు ఏమి అవగాహన కల్పిస్తారో అదే ప్రాధాన్యమైనది. ఇందిరా గోస్వామి రాసిన తన అనుభవాలనుండి ఆనాటి అస్సాం, భారత దేశం పరిస్థితులు, అలాగే ఆమె బృందావనం లో గడిపిన కాలం లో ఆమె గమనించిన అక్కడి వైష్ణవ బ్రాహ్మణ వితంతువుల వ్యథార్త జీవితాలు అన్నీ మనకు తెలుస్తాయి. ఊహ తెలిసిన నాటినుండీ ఎందుకో ఏదో పోగొట్టుకున్న వేదన, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తనలో నిక్షిప్తమై ఉన్నాయంటుంది ఈ రచయిత్రి. మరొక విషయం ఆత్మ కథ రాసుకోవాలంటే ఆత్మ స్థైర్యం ఉండాలి , అన్నిటికి మించి నిజాయితీ ఉండాలి అలాంటి సర్వ లక్షణాలు ఉన్న ఇందిరా ఏ దాపరికమూ లేకుండా తన జీవితనుభవాలను ఒక సీనియర్ రచయిత హోమెన్ బొర్గోహైన్ కోరిక మేరకు 1968 లో రాశారు. “నీ జీవితం లో అనేక విషాదాలు చవి చూసావు వాటిని అక్షరీకరించగల శక్తి గల సృజనాత్మకత కలిగిన దానివి నువ్వు, అంతే కాక అలా అక్షరాల్లోకి నీ వేదనని ఒంపుకుంటే నీకు కాస్త ఊరట లభిస్తుంది” అంటూ ఇందిరాకి ఉత్తరం రాసేరు హోమెన్. అప్పటికే ఆయన రచనలతో ప్రభావితమైన ఇందిరా ఆయన కోరిన విధంగానే రచన చేశారు. కొంత రాసినా అసంపూర్ణంగానే ఉంచేశాను అంటారు ఇందిరా ఆ పుస్తకానికి ముందు మాటలో. దానికి కారణం ఆరోజుల్లో తన జీవిత కథను  రాసుకునే ఒక ఆడపిల్లను స్వీకరించే సహృదయత అస్సాం చదువరుల లోకం లో లేదు. ఆత్మ కథ అంటే ఎవరైనా గొప్ప వ్యక్తులే రాయాలని భావించేవారు. 

1986 లో ఇందులోని మొదటి భాగం పేరు పొందిన అస్సామీ పత్రిక “అసోమ్ బాణీ” (ట్రిబ్యూన్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్) వారి బిహు ప్రత్యేక సంచిక లో ప్రచురించబడింది. ఈ పత్రిక సంపాదకుడు తిలక్ హజారికా ఇందిరాకు ఉత్తరం రాస్తూ “ మీకు తెలియదు ఈ ఆత్మ కథ ఎంత సంచలనాన్ని సృష్టిస్తోందో , మీరు తప్పక రెండవ భాగం కూడా మాకే ఇవ్వాలి” అని పట్టుబట్టారు. ఆయన ప్రోత్సాహం లేకుంటే రెండవ భాగం రాసి ఉండేదాన్ని కాను అంటారు ఇందిరా. ఇక మూడవ భాగం బిజోయ్ దత్త అనే అస్సామీ ప్రచురణకర్త విజ్ఞాపన వలన రాశాను అంటారు. ఆయనకు తన ఆత్మకథ ను అస్సామీస్ లో ఎలాగైనా ప్రచురించాలని ఆత్రం వలన ఆయన అంతగా తనను ప్రోత్సహించారని చెప్తారు ఇందిరా. మూడు భాగాలుగా రాసిన ఈ కథ పుస్తక రూపం లో వచ్చాక చాలామంది నుండి తనకు ఉత్తరాలు వచ్చాయని, ఎందరో అభిమానులు ఏర్పడ్డారని పేర్కొంటారు. 

ఈ అసంపూర్ణ ఆత్మ కథ లో కేవలం 1970 వరకు మాత్రమే తన జీవిత విశేషాలను రాసానని ఆ తర్వాత తన జీవితాన్ని మరెక్కడా రాయలేదని చెప్తారు. ఇది పుస్తకంగా 1980 లో వెలువడింది స్టెర్లింగ్ పబ్లిషర్స్ ప్రచురణ లో.

ప్రపంచ ప్రఖ్యాత పంజాబీ రచయిత్రి జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత, ఇందిరా గోస్వామికి ఎంతో ఆత్మీయ స్నేహితురాలు అమృతా ప్రీతం ముందు మాటతో ఈ పుస్తకం వెలువడింది. ఇందులో మూడు భాగాలుంటాయి “లైఫ్ ఇస్ నో బార్గైన్” (జీవితం లాభం కాదు) మొదటి  భాగం , “డౌన్ మెమొరీ లేన్” (జ్ఞాపకాల దొంతరలలో) రెండవ భాగం, “ద సిటీ ఆఫ్ గాడ్” (దేవుని నగరం) మూడవది. ఇందిరా జీవితం లోని కొంత భాగాన్నే ఐనా ప్రధానమైన భాగాన్ని ఆమె జీవితం లో ఎదుర్కున్న ఆవేదన నుండి ఆమెను ఆలోచనాపూర్వక రచయిత్రిగా , మానవత్వపు మూర్తిగా పరావర్తనం చెందించిన ఆ కొన్ని సంవత్సరాలను గురించి ఆమె రాయడం ఎంతో ముదావహం అంటారు అమృతా. శోకం నుండి శ్లోకం పలికిన విషయం మనందరికీ తెలిసినదే , వాల్మీకి రామాయణం రాసినట్టు ఈ ఆత్మ కథే  కాదు ఇంకా ఎన్నెన్నో నవలలు, కథలు రాయడానికి ఆమెను పురిగొల్పినది ఈ ఆత్మకథ వలన ఆమెకు పాఠకులనుండి లభించిన ప్రోత్సాహం, ఉత్సాహం , బాధ్యత. ఇందిరా గోస్వామిది గొప్ప ఆత్మ , ఈ విశ్వం వెనుక దాగి ఉన్న శక్తి రహస్యాన్ని కనుగొన్న ఆత్మ ఆమెది. అదే భావన ఈ రచన లో మీకు తేటతెల్లమౌతుంది అంటారు అమృతా. ఇంతగా ఇన్ని భాషల్లో పాఠక లోకాన్ని ప్రభావితం చేస్తున్న ఈ పుస్తకం లోని ఏముందో చూడాల్సిందే ఇక. 

మొదటి భాగం లో ఇందిరా తన బాల్యం షిల్లాంగ్ లో గడచిన రోజులను గూర్చి పేర్కొంటారు తప్ప , ఆ తర్వాత గౌహతి, దక్షిణ కామరూప లోనూ గడిపిన బాల్యం గూర్చి రాయరు. ఆమె బాల్యం అంతా తన తండ్రి ప్రభావమే, ఆయన ప్రేమ, ప్రతిభా , ఆయన విజ్ఞానం, అన్నీ ఇందిరాను సంపూర్ణంగా ప్రభావితం చేసాయనే చెప్పాలి. షిల్లాంగ్లో రాష్ట్ర విద్యాధికారి గా ఆమె తండ్రి ఉమాకాంత్ గోస్వామి ఉండగా 1956 నుండి ఈ కథ మొదలౌతుంది. అంటే అప్పటికి ఇందిరాకు 14 ఏళ్ళు. పైన్ మౌంట్ స్కూల్ లో తన విద్యాభ్యాసం, ఎక్కువగా ఆంగ్ల మాధ్యమం లో చదవడం వలన అస్సామిస్ భాష రాదు ఈమెకు అప్పట్లో. తనకు ఎంతో ఇష్టమైన ప్రాణ ప్రదమైన తండ్రిని ఎక్కడ ఎప్పుడు కోల్పోవలసివస్తుందో నని ఇలాగే ఆత్మీయుల పట్ల తనకు ఎప్పుడు అనిపించేదని, ఇలాంటి ఆలోచనవలన ఎప్పుడూ హృదయం ఆత్మ హత్యను ప్రేరేపించేదిగా అల్లకల్లోలంగా ఉండేదని చెప్తారు. ఇదే తెలియరాని ఆవేదనలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించడము దాని వలన ఎన్నో నిందలకు గురి కావడము, పెళ్లి కాక పోవడము లాంటివి జరిగాయి ఆమె జీవితం లో. తమకున్నంతలో తండ్రి తనను ఎంతో గారాబంగా పెంచారని చెల్లెళ్ళు, తమ్ముళ్లతో తాను హాయిగా గడిపిన బాల్యాన్ని, అంతరంగం అల్లకల్లోలమైన కౌమార దశ , ఆ తర్వాత ఆమె వివాహము, ఆమె భర్త హఠాన్మరణము  ఇంతవరకు ఈ మొదటి భాగం లో ఉంటాయి. నక్షత్ర గ్రహ చర దోషం వలన ఈ అమ్మాయికి పెళ్లి కాదని చెప్పిన జ్యోతిష్కులు , తన వివాహం కోసం తపించి పోయిన అమ్మను గురించి ఆత్మీయతతో చెపుతుంది. ఆత్మీయులు, స్నేహితులూ, అభిమానించే వారు , ప్రేమికులకు తన చుట్టూ లోటు లేక పోయినా తనెవ్వరితోనూ ఎటువంటి సంబంధము పెట్టుకోలేదని నిక్కచ్చిగా చెప్తుంది ఇందిరా. ఒకానొక బలహీన క్షణం లో ఒక స్నేహితునితో ఒక కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుంటుంది కానీ అతని వద్దకు వెళ్లడానికి గానీ , అతనికి జీవితాన్ని అర్పించాలని గానీ అనిపించదు ఆమెకు. అలాగే ఆ వివాహం బంధువుల దయ వలన విడాకులుగా పరిణమిస్తుంది. నిరంతరం ఏదో తపన ఎవరికోసమో ఆరాటం నిలవనిచ్చేది కాదు ఆమెను. చాలా చిన్న వయసునుండి సాహిత్యం పట్ల అభిమానము, అంతే కాక చిన్న వయసులోనే కథలు రాసింది. ఆమె మొదటి కథ తమ ఇంట్లో పెంచుకున్న ఏనుగు రాజేంద్ర మరణం గురించి కావడం ఆమెకు జంతువుల పట్ల ఎంత అభిమానమో తెలుస్తుంది. మొదటి కథకే మంచి పేరు వచ్చింది ఇందిరాకు. చదువు సాహిత్యము తనకు ప్రాణం పోసాయని ప్రాణాలు నిలిపాయని ఆమె నమ్మకం. 

ఇలాంటి మానసిక దశలో ఆమెకు యువకుడైన ఇంజనీర్ మాధవ రైశమ్ అయ్యంగార్ తో పరిచయం అవుతుంది. ఒక బ్రిడ్జ్ నిర్మాణ పని లో బిల్మోరియా కంపెనీ కోసం పని చేయడానికి అస్సామ్ వచ్చిన మాధవ్ ఆమెను మనసారా ప్రేమిస్తాడు. ఆమెను హృదయపూర్వకంగా తన జీవితం లోకి ఆహ్వానిస్తాడు. అంతులేని మాధవ్ అభిమానం ఆమెను కొద్ది రోజులు మరో లోకం లో విహరింపజేస్తాయి. అతనితో జీవితం , బ్రిడ్జ్ల నిర్మాణం లో చాలా ప్రతిభావంతుడైన తన భర్త తో అక్కడ కాంపుల్లో నివసించి ఉండటం, ఎందరో రకరకాల స్నేహితులు, ఆడపిల్లను తొలి సారిగా ఇంజనీర్ల కాంపుల్లో చూసి ఉత్సాహం తో ఆమె స్నేహాన్ని వాంఛించేవారు ఇలా ఎంతో ఆనందంగా గడుస్తోన్న సమయం లో మాధవ్ కు కాశ్మీర్ చెనాబ్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్ట మని ఉత్తర్వు వస్తుంది. ఎందుకో ఏదో కీడు జరగబోతుందన్న భావన ఇందిరా లో కలుగుతుంది. అక్కడ గడిపిన కొంత కలం తర్వాత ఇందిరా పీడ కల నిజమైపోతుంది. ప్రాణప్రదంగా ప్రేమించిన భర్త మాధవ్ , తనకు భరోసాగా ధైర్యంగా నిలిచిన సఖుడు, సచివుడు, స్నేహితుడు హఠాత్తుగా తనని వదిలి వెళ్లిపోవడం ఇందిరా జీవితంలో ఒక మరువలేని విషాదం. ఈ విషాదం జీవితాంతం ఆమెను వెన్నాడుతూనే ఉంది. అతి చిన్న వయసులో వైధవ్యం, ఆరాధించిన చెలికాడు మాయం కావడం, ఎలా ఈ జీవితాన్ని ఈదాలో ఏమీ తెలియక పోవడం ఆమెను కుదిపేస్తాయి. అంతకు కొద్ది రోజుల క్రితమే తండ్రి మరణం, ఆ పైన మధు అని పిలుచుకునే తన జీవన మాధుర్యం మాయం కావడం ఆమెను అతలాకుతలం చేశాయి. నడి సంద్రం లో మునిగిన జీవిత నావను అక్షరాలతెరచాపతో రక్షించి, సాహిత్యం చుక్కానితో దారి మళ్లించి ఎలా ఆమె జ్ఞాన మూర్తిగా ఆవిర్భవించిందో అన్న విషయం చదువరులందరినీ కంట తడి పెట్టిస్తుంది. చదివిన ప్రతివారి హృదయము చెమ్మగిల్లుతుంది. 

మళ్ళీ ఆమెలో ఆత్మహత్య చేసుకోవాలనే దృష్టి కలుగుతుంది, ఈ నిస్పృహ, నిరాశ నుండి తేరుకోవడానికి, తన చుట్టూ ఉన్న సమాజం, వైష్ణవ బ్రాహ్మణ కట్టు బాట్లు, ఆత్మీయులు హితులు అనుకున్నవారి హితోపదేశాలు ఇవన్నిటినీ తట్టుకుని మనిషిగా మిగలడానికి ఆమె పడే జీవన యాతన తదుపరి భాగాల్లో ఉంటాయి. 

మధుని కోల్పోయిన ఇందిరా జీవితం లో కొన్నేళ్ళ పాటు ఆకాశం వైపు చూసేదీ కాదు. ఆకాశం తెగి పడుతున్న భావన. ఈ ఆకాశమే తనకేదో అన్యాయం చేసిందన్న రోషం, దుఃఖం,  నిస్పృహ, భయం ఆమెని సంపూర్తిగా ఆవహించి ఉండేవి. అందుకే ఎప్పుడు మెడికల్ షాప్ కి వెళ్ళి గార్డినాల్ (నిద్ర మాత్రలు), సేకరించి (ఒకేసారి ఎక్కువ గా ఇచ్చేవారు కాదు) తన వేనిటీ కేస్ లో అడుగున దాచుకుంటుంది, ఏ క్షణాన్నైనా ఈ జీవితం చాలు అనిపిస్తే ఆ మాత్రలు తనను ఇహం నుండి విముక్తి కలిగిస్తాయని ఆమె ఆలోచన. ఎప్పుడూ తన కూడా ఆమె వేనిటీ కేస్ లో ఆ మాత్రలు ఉంచుకునేది. ఇలాంటి సమయం లో ఈ వేదనకు కొంచం దూరం జరగాలని ప్రయత్నించి ఆమె కొల్పరా లో ఒక సైనిక్ స్కూల్లో అధ్యాపకురాలిగా చేరుతుంది. “ఆమె ఈమధ్యనే విధవ అయింది ఆమెను తాకొద్దు” అని తమ ఆడపిల్లలికి చెప్పి దూరం తీసుకుపోయే బంధు జనాలను నిస్పృహతో నిర్లిప్తంగా చూడటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత. ఇలాంటి సమయం లో కూడా ఆమె విడిచి పెట్టని విద్య ఆమెను పోస్ట్ గ్రేడ్యుయేట్ చేసింది. అందుకే సైనిక్ స్కూల్లో టీచరుగా చేరింది. అక్కడ తన సహ ఉపాధ్యాయులతో ఆమె సహజంగా కలవడానికి విశ్వ విధాలా ప్రయత్నించడము, కలవలేని తనమేదో ఆమెను పట్టి ఆపడం ఇలాంటి డోలాయమాన పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగం చేస్తుంది. మొదట ఉన్న ప్రిన్సిపల్ తన బాబాయికి తెలిసిన వాడవడం చేత ఆమెను సహానుభూతితో అర్ధం చేసుకుంటారు. అక్కడే తన సహ ఉపాధ్యాయుడు ఒక సిక్కు యువకుడు ఆమెను వివాహమాడతానని అడుగుతాడు. మధు వెళ్ళిపోయిన తర్వాత తనని మనిషిగా గుర్తించి స్త్రీగా గౌరవించి తిరిగి జీవితం లో స్థానం కల్పిస్తానని అడిగిన మొదటి వ్యక్తి అతను. కానీ ఆమెలో ఏదో వెనుదీసిన భావన అతని ప్రేమ ప్రతిపాదనను సమ్మతించనీయదు. ఫలితంగా అక్కడ స్కూల్ నుండి రాజీనామా చేసి వచ్చేస్తుంది. 

ఈ రెండవ భాగం లో ఎక్కువగా ఆమె తండ్రి విద్యలోనూ , ఉద్యోగం లోనూ గడించిన మెడల్స్ గురించి పురస్కారాల గురించి, తమ కుటుంబాల్లో ఉన్న పద్ధతులను గురించి అస్సామ్ లో తమ తాతలు తండ్రులు కు ఉన్న ఖ్యాతి, ఆనాటి అస్సామ్ రాజకీయ పరిస్థితులు అన్నిటినీ కధనాత్మకంగా వివరిస్తుంది. అలనాటి అస్సామ్ లోని సంప్రదాయాలు, ఛాందసాలు, రాజకీయ వాతావరణం ఇవన్నీ ప్రస్పుఠంగా కనిపిస్తాయి. తన భర్త పని చేసే చోట వేల మంది కార్మికులున్న వారికి ఒక సంఘం లేక పోవడం ఆమెను కలత బరుస్తుంది. యజమాన్యానికి నచ్చితేనే ఉద్యోగం లేకుంటే వెళ్లిపోవాల్సిందే అన్న బాధ ఆమెను పిండి వేస్తుంది. తన భర్తను ఒకసారి ఎంతో ప్రమాదం నుండి కాపాడిన సిక్కు వ్యక్తి ని ఉద్యగo నుండి తొలగించడము, పేదవాడైన ఆ డ్రైవర్ మాట మాత్రం ఎదిరించకుండా వెళ్లిపోతుంటే తన వద్ద ఉన్న డబ్బులన్నీ మాధవ్ ఆదేశం మీద అతనికి ఇచ్చేయడం , ఈ సంఘటన ఆమెనే కాదు చదివే మనల్ని కూడా కంట తడి పెట్టిస్తుంది. ఈ ఆవేదనలు , సైనికుల బాధలు, వారి వితంతువులు వేశ్యలుగా , బిడ్డలు బిచ్చగాళ్లుగా మారడం చూసి చలించిపోతుంది. ఆ జీవితాలకు కథా రూపమిస్తుంది. సాహిత్యం ఆమెకు కాలక్షేపం కాదు బాధ్యతాయుతమైన నిరంతర  జీవన చర్యగా మారిపోతుంది. 

మూడవ భాగం ‘ద సిటీ ఆఫ్ గాడ్’ (దేవుని నగరం) లో ఆమె సైనిక్ స్కూల్ నుండి రాజీనామా చేసి బృందావనం లో రామాయణం మీద పరిశోధన చేయడానికి ఆమె గురువు శ్రీ లేఖరు ఆహ్వానించిన మీదట అక్కడికి వెళుతుంది. అక్కడే ఒక చిన్న ఇరుకు గదిలో కోవెలౌ దగ్గరలోనే ఉంటూ ఆమె తులసి రామాయణం కి అస్సామిస్ రామాయణం మాధవ ఖండెలి రాసిన ‘సప్తకాండ రామాయణం’ కి సారూప్యతల , మూల్యాంకనం  చేస్తుంది. హింది భాషను నేర్చుకుని ఆమె తులసి రామాయణం చదువుతుంది. తులసి దాస్ జీవితం లో కూడా తన జీవితం లో లాగే ఏదో వేదన ఆర్తి ఉన్నాయని గ్రహిస్తుంది. తులసి దాస్ జీవితమే తనను అతని రచన కన్నా ఎక్కువ స్ఫూర్తి కలిగించిందని చెప్తుంది. ఇక్కడ ఉండగానే ఆమె ‘నీలకంఠ వ్రజ’ నవల రాస్తుంది. ఆ నవలలో అక్కడ బృందావనం లో వైష్ణవ బ్రాహ్మణ విధవలు ఎలా రాధే శ్యామీ లు గా మారి అక్కడే  తమ జీవితాన్ని గడిపి అక్కడే ఆ మట్టిలోనే కలసి పోవాలనుకుంటారో , వారి దయనీయ గాధలు రాసింది. తమ అంత్య క్రియలకు తమ వద్ద సరిపడా డబ్బులు లేకుంటే ఆ రాధేశ్యామి లను ఎలా చీదరించి పారేసేవారో , వారు పాటలు భజనలు పాడి సంపాదించిన దానిని కూడా కొందరు ఎలా దోచుకునేవారో, అలాగే యువతులైన వారిని ఎలా లైంగికంగా లొంగదీసుకుని వారి జీవితాలను పాడుచేసేవారో కళ్ళకు కట్టినట్టు చెపుతుంది. ఇదే తర్వాతహ దీపా మెహతా తీసిన ‘వాటర్’ చిత్రానికి ప్రేరణ. చిన్న గుంటలు లాంటి వాటిల్లో ఈ వితంతువులు ఎటువంటి సహాయము  లేక, ఆర్ధికంగా డబ్బులు చాలక, అనారోగ్యలతో ఎలా జీవితాలను బలిదానం చేసుకుంటున్నారో ఆమె చెప్తుంది. అదే సౌదామిని అనే కథానాయిక నీలకంఠ వ్రజ లో తల్లి తండ్రులతో అక్కడికి ఉండటానికి వచ్చి ఎలా అక్కడి పరిస్థితులకు చలించి పోయి నేను ఇక్కడ ఉండను నేను బ్రతకాలి ఇలా కాదు అని ఎదిరిస్తుంది. ఇదంతా స్వీయానుభవం మీద ఇందిరా ఈ భాగంలో సవివరంగా చెప్తుంది. అక్కడే ఆమెకు పరిచయం అయిన కొందరు బాబాలు, కొందరు దొంగ సాధువులు, ఒక పాత మిత్రుని రాక , అక్కడ సైనిక్ స్కూల్ లోని సిక్కు యువకుడు రావడం తన కోసం, తను ఉంటున్న చిన్న గది చూసి అందరూ తాను కూడా పేద విధవనని భావించడం, లేఖరు అతని శ్రీమతి తనకు అండగా ఉండి తన పరిశోధన పూర్తి చేయించడం వరకు ఉంటుంది ఈ భాగంలో.

తన అంతర్మధనం తో జీవితం లో నిండి పేర్కొన్న విషాదం తో, ఇటు వైయుక్తిక వేదన, అంత వేదనలోనూ తన చుట్టూ జరుగుతోన్న సమాజం లోనీ అవినీతిని ఆమె నమోదు చేస్తుంది. అక్కడి వితంతువుల దయనీయమైన గాధలు వారి పాలిట జరుగుతున్న అన్యాయాలను అక్షరీకరిస్తుంది ఆవేదనతో. అక్కడి నుండి ఎప్పుడో తన తల్లి బలవంతం పైన తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం కి పెట్టుకున్న దరఖాస్తుకి ఇంటర్వ్యూ వస్తే , ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె గురువు ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి ఎంతో ఆదరంగా ఆమె జీవితానికి ఒక కొత్త మలుపు తిరగడానికి దోహద పడతాడు. తాను పరితపిస్తున్న వేదనకు సాంత్వన తన తండ్రి లా తనని ప్రేమించే సహకరించి తన జీవితానికి ఒక మార్గనిర్దేశనం చేసిన గురువు పట్ల ఆమెకు పితృ వాత్సల్యం కలుగుతుంది. 

ఇలా సాగిన ఈమె జీవిత చరిత్ర లో ఎన్నెన్నో గుండెను కుదిపేసే సంఘటనలు, ముఖ్యంగా ఆమె గదిలోనికి పాము దూరి ఉండి పోవడం. కొన్ని రోజులకి ఆ పాము ఉనికి తెలిసి వస్తుంది. ఈ వ్యర్ధ జీవితం జీవించే బదులు ఆ పాము కాటు వేస్తే బాగున్ను అనే భావనా కలుగుతుంది ఒకసారి. ఎప్పుడు నిద్ర మాత్రలను జాగ్రత్త చేసి ఉంచుకుంటుంది. ఇలాంటి మనోవేదన నుండి , దిగ్విజయంగా తన పరిశోధన పూర్తి చేస్తుంది. ఆపైన ఢిల్లీ వెళ్ళడం ఆమె జీవితంలోని అతి పెద్ద మలుపు. ప్రపంచం మెచ్చే రచయిత్రిగా ఆమె ఢిల్లీ వెళ్ళాక ఎదిగింది. ఒక చిన్న పిల్ల తండ్రి చాటు బుజ్జాయి, ఆ పైన భర్త చాటు ముగ్ధ, సర్వం అతి పిన్న వయసులోనే కోల్పోయిన వితంతువు , అనునిత్యం ఆత్మార్పణ చేసెయ్యాలన్న ప్రగాఢ వాంఛ నుంచి బయటపడి సాహితీ లోకం గర్వించదగ్గ  రచయిత్రిగా ఎదిగిందో ఈ ఆత్మ కథ మనకు విశదపరుస్తుంది. ఆమె సందేశం , ఆమె జీవితం ఇచ్చే సందేశం ఒక్కటే ఎన్నెన్ని బాధలలోనూ అక్షరం మాత్రమే , విద్య మాత్రమే ఆమెను రక్షించింది. ఆమెకు ఒక తోవ చూపింది. ఇది అనుభవపూర్వకంగా నమోదు చేసింది ఇందిరా. అందుకే ఈ ఆత్మ కథ కు ఇంత ప్రాచుర్యం ఇంత పరిమళం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత జీవితం ఒక ఆత్మ సంతృప్తి తోను, ఒక ధైర్యం తోనూ జీవించింది ఇందిరా. రెండు వేల ఏళ్ల నుండి జంతు బలి ఆచరిస్తున్న అస్సామ్ లో కామాఖ్య గుడిలోని ఈ పాశవిక బలులను ఎదిరిస్తూ ఆమె ‘చిన్న మస్తా’ అనే నవల రాసింది. ఇది చాలా తీవ్ర సంచలనం సృష్టించడం తో బాటు ఆమెకు చంపేస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి. అటుపైన ఆమె సూచించినట్టు గానే ఈ బలులు ఆగిపోయాయి అందరూ ఆలోచించారు , ఆచరించారు. ముందుగా మాత్రం ఎన్నో వ్యతిరేకతలు , అయినా అన్నిటిని ఎదుర్కుని నిలిచి 2011 నవంబర్ లో హృదయ సంబంధిత వ్యాధితో ఆమె గౌహతి మెడికల్ కాలేజ్ లో ఊపిరి విడిచింది. 

ఎక్కడో మొదలైన చిన్ని పిల్ల కాలువ ఎదిగి , ఎదిగీ బ్రహ్మపుత్రా నది లా జీవితం లోని అనుభవాలను , అనుభూతులను ప్రోది చేసుకుంటూ చివరికి సాహిత్య జ్ఞాన సాగరం లో తేలి ఆకాశం లో తారగా మిగిలింది ఇందిరా. ఆమె రచనల్లో స్త్రీ విముక్తి కోసం ఆరాటం పోరాటం కనిపిస్తాయి, మానవ సంబంధాలలోని వైచిత్రి కనిపిస్తుంది . ఇవన్నీ తన జీవితంలో ఆమె ఎదుర్కున్నవే. పేద సాదల పట్ల ఆమెకు ఎంతో దయ అందువలనే వారి గురించి ఆమె కధల్లో ఆర్ద్రమైన జీవితలుంటాయి. 

చివరికి అస్సామ్ తీవ్ర వాదుల గ్రూప్ అయిన ఉల్ఫా కి భారత ప్రభుత్వానికి నడుమ రాయబారిగా వ్యవహారిస్తుంది. ఎక్కడో వ్యక్తిగత వేదనకు రాలి పోవాల్సిన అతి చిన్న పువ్వు , జీవితపు ఆటుపోట్లను తట్టుకుని చివరికి అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిస్తుంది ఈమె జీవితం. ఈమె రచనలకు సాహిత్య అకాడెమీ, జ్ఞాన పీఠ్ లాంటి గొప్ప పురస్కారాలు, ఇంకా మరెన్నో గుర్తింపులు గౌరవాలు లు, పద్మశ్రీ  లభించాయి. రామాయణం గురించి ఆమె ప్రసంగాలు ఆసియా ,యూరప్ దేశాల లో ఏర్పాటు చేయబడ్డాయి. ఆమె దేశ విదేశాలు తిరిగి తన ప్రసంగ ధారను కొనసాగించింది. ఒంటరిగానే ఒంటరితనం తో పోరాడుతూ కేవలం అక్షరమే ఆలంబనగా నమ్మి ఆచరించి , సమాజానికి ఉపయోగ పడే , సమాజాన్ని ప్రభావితం చేసే సాహిత్యాన్ని అందించి ఇందిరా జన్మ ధన్యం. ఆమెను కన్న భారత మాత ధన్యం. ఈ మాత్రం ఇందిరా అసంపూర్ణ ఆత్మ కథను గురిచి పరిచయం చేయడం నా భాగ్యం. 

(కృతజ్ఞతలు: ఇండియా లో ఎక్కడా లభ్యం కానీ ఈపుస్తకాన్ని చాలా ఖర్చు పెట్టి అమెరికా నుండి నాకు పంపిన నా తమ్ముడు జగన్నాథ్ కి ప్రేమతో ..అక్క )

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.