నారి సారించిన నవల

-కాత్యాయనీ విద్మహే   

3

1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి ఇదిమహారాష్ట్రలో శివాజీ తరువాత అతనికొడుకు శంభాజీ పాలనాకాలపు కాలపు రాజకీయ కల్లోలాన్ని చిత్రించిన నవల అని, కొమర్రాజు వేంకట లక్ష్మణరారావు వ్రాసిన శివాజీ చరిత్ర,  చిల్లరిగె శ్రీనివాసరావు వ్రాసిన మహారాష్ట్రుల చరిత్రచదివి తన నవలకు చారిత్రక సామాగ్రిని సమకూర్చుకొన్నానని పేర్కొన్నది . భర్త తాను చదువుతున్న రైనాల్డ్స్ వ్రాసిన మార్గరెట్ నవలలోని కథాకల్పన గురించి చెప్పిన విషయాలను మహారాణా రాజసింహుడి పాత్ర గుణగణాల నిరూపణలో బాగా ఉపయోగించుకొన్నానని కూడా చెప్పింది. రాజమహేంద్రవరంలోని దైవం రాజగోపాల మూర్తికి ఈ నవలను అంకితమిచ్చింది. 

1680 లో తండ్రి మరణం తరువాత  మహారాష్ట్ర రాజ్యానికి రాజు అయిన శంభాజీ మొఘల్ చక్రవర్తులతో తలపడుతూ 1689 లో ఔరంగజేబుకు బందీ అయి మరణశిక్షకు గురి అయినాడని చరిత్రచెబుతుండగా ఈ నవలలో రచయిత్రి 1680 లోనే  సింహఘడ్ యుద్ధంలో అతను మొఘలులకు మరికొంతమంది సామంతులతో బందీగా చిక్కి పదేళ్లు నిర్బంధంలో ఉండి కోటిరూపాయల కప్పం తో విముక్తుడైనట్లు కల్పించింది.నిజానికి మహారాష్ట్రులకు మొఘలులకు మధ్య సింహఘడ్ యుద్ధం జరిగింది శివాజీ కాలంలోనే,1670లో. దానిని ఎందుచేతనో కమలావతీ దేవి పదేళ్ల ముందుకు జరిపింది. శంభాజీ అవివేక నిర్ణయంవల్ల జరిగిన ఆ యుద్ధం కారణంగానే కొంకణ రాజ్యానికి అమితనష్టం జరిగిందని ప్రారంభంలోనే స్థాపించి, ఆ నేపథ్యంలో నవలెతివృత్తాన్ని నిర్మించుకొంటూ పోయింది. ఔరంగజేబు బందీ గా ఉన్న కాలంలో  పాలనాధికారాలు నిర్వర్తించిన అతని మేనమామకు మద్దతుగా ఉన్న సామంతులు, జమీందార్లు శంభాజీ రాకతో అతను తమను శిక్షింపక మానడన్న భయంతో మహారాష్ట్ర ను వదలి రసపుత్ర రాజ్యానికి వలసపోయినట్లు సూచించి ఏడేళ్ల తరువాత పరిస్థితులు చక్కబరచుకొని శంభాజీ విశ్వాసాన్ని తిరిగి పొందగలమన్న భరోసాతో వాళ్ళు తిరిగిరావటం ప్రారంభించారని చెప్తూ నవలా కథను అక్కడ ప్రారంభించింది. చంద్రఘడ్ జమిందార్ భానోజీ అలా తిరిగివస్తున్నవాడు. అతని కూతురు స్వయంప్రభ. అతను పెంచుతున్న పిల్లలు వీరపాలుడు, కుముద్వతి. అదేసమయానికి శంభాజీ తోపాటు బందీగా కొనిపోబడిన సింహబలుడు కూడా విముక్తుడై తిరిగి వస్తున్నాడు. శంభాజీ తదనంతరం మహారాష్ట్ర రాజ్యాన్ని ఔరంగజేబుకు దఖలు పరచటానికి చేసిన ప్రయత్నాల వల్ల భానోజీ దృష్టిలో అతను దేశద్రోహి. 

నవల ప్రారంభంలోనే ప్రవేశపెట్టబడిన మరొకపాత్ర శూరసేనుడు. రసపుత్రవీరుడు. ప్రతాపసింహుడి ప్రతినిధిగా మహరాష్ట్రకు వస్తున్నాడు. వీరపాలుడికి సింహబలుడికి మధ్య స్పర్ధతో ప్రారంభమై అనేక ఘటనలతో ఉత్కంఠ తో  సాగిన నవలేతివృత్తం ప్రతిమలుపు లోనూ శూరసేనుడి పాత్ర కీలకమైనది.వీరపాలుడు సింహబలుడిని హత్య చేశాడన్న దుష్టకేతుడి ఆరోపణపై విచారణలో చనిపోయాడనుకున్న సింహబలుడు కొనఊపిరితో ఉన్నది కనిపెట్టి తగిన వైద్యంచేయించి అతని వాఙ్మూలం తో – అన్నగారిని అతని సంపదమీద ఆశతో చంపింది దుష్టకేతుడే అని  నిరూపించి వీరబలుడుని నిర్దోషిగా స్థాపించటం, మరణిస్తూ సింహపాలుడు వీరపాలుడికి రాసిచ్చిన ఆస్తుల అపహరణకు దుష్టకేతుడు పన్నిన కుట్రలను భగ్నంచేయటం, కుముద్వతిని రహస్యంగా పెళ్లిచేసుకొని కొన్నాళ్ళు కాపురం చేసి మోజు తీరాక వదిలించుకొనటానికి శంభాజీ వేసిన ఎత్తుగడలను చిత్తుచేసి కుముద్వతిని భార్యగా స్వీకరించేట్లు చేయటం వంటి అన్నికార్యకలాపాలలోనూ   శూరసేనుడి బుద్ధిబలం బాహుబలమే నిర్ణయాత్మక పాత్ర వహించాయి. అటువంటప్పుడు మరి ఈ నవలకు కుముద్వతి అని పేరు ఎందుకు పెట్టినట్లు ? కుముద్వతి ఒకప్పుడు మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాణంలో శివాజీ కి అండగా నిలిచిన అష్టమంత్రి కూటమిలో ఒకడైన మోరోజి పంత్ కూతురు కావటం వల్లనా? మహారాష్ట్ర మహారాజైన శంభాజీ కి భార్య కావటం వల్లనా? 

శంభాజీ వలె చారిత్రక వ్యక్తి మోరోజి పంత్.కానీ అతను ఈ నవలలో పాత్రకాదు. అతని తమ్ముళ్లుగా చెప్పుకొన్న మఠాధిపతి యోగి రామచంద్ర బావాజీ, రసపుత్రవీరుడు శూరసేనుడు మాత్రం ఈ నవలలో ఉన్నారు. ఈ శూరసేనుడే రాజా ప్రతాపసింహుడని నవల చివరిలో తెలుస్తుంది. వాళ్ళిద్దరి సంభాషణ వల్లనే మోరోజిపంత్ వృత్తాంతం మనకు తెలుస్తుంది. శివాజీ తదనంతరం రాజ్యవారసుల నిర్ధారణలో వచ్చిన సంఘర్షణల పర్యవసానం శంభాజీ ని మోరోజిని శత్రువులుగా మారటం. అష్ట మంత్రి మండలిలో మోరోజి,   అన్నాజీ శంభాజీకి సవతి సోదరుడైన రాజారాంకు రాజ్యాధికారం కట్ట పెట్టాలని అనుకొన్న వర్గంలో ప్రముఖులు. వాళ్ళలా అనుకొనటం శివాజీ కోరిక మీదనే జరిగిందా ? పదేళ్ల రాజారామ్ తరఫున అతని తల్లిని రీజెంట్ గా నియమించి అసలు అధికారం తాము చలాయించాలన్న స్వార్ధం వల్ల జరిగిందా? పేష్వాలుగా ప్రాభవంలో ఉన్న తామే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోనాలన్న కుట్రలో భాగంగా జరిగిందా? అంటే చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 ఏమైనా  శివాజీ మరణానంతరం రాజారామ్ ను సింహాసనం మీద కూర్చబెట్టాలన్న నిర్ణయం మాత్రం సత్యం. ఆ సంగతి తెలుసుకొని పన్హాలా కోటనుండి శంభాజీ సైన్యంతో రాయఘడ్ మీదకు దండెత్తివచ్చి సవతితల్లిని , సోదరుడిని , కుట్రదారులను బంధించి తాను సింహాసనం అధిష్టించి అందరి ఆస్తులు వశపరుచుకొని, శిక్షలు విధించి ప్రతీకారం తీర్చుకొన్నాడు. అన్నాజీ ని ఏనుగులతో తొక్కించి చంపినట్లు చెబుతారు.  చారిత్రక వాస్తవమెంతో తెలియదు గానీ ,మోరోజి మొఘలుల సహాయంతో శంభాజీ ని జయించాలన్న కోరికతో ఢిల్లీ కి వెళ్లినట్లు, ఆ అవకాశమైతే దొరకలేదు కానీ అతను అక్కడ ఒక స్త్రీని పెళ్ళాడి ఒక కొడుకును,ఒక కూతురిని పొందినట్లు, ఆమె మరణించినట్లు ,ఆ తరువాత ఆయన శంభాజీని క్షమాభిక్ష కోరి తన పూర్వ సంపదను వశపరచుకొనటానికి చేసిన ప్రయత్నాలు విఫలమై ఆత్మహత్య చేసికొన్నట్లు రామచంద్ర బావాజీ , శూరసేనుల సంభాషణ ద్వారా చెప్పించింది కమలావతీదేవి. శంభాజీ ప్రతీకార పరిణామాలలో భాగంగానే అతని సోదరులు  రామచంద్ర బావాజీ, శూరసేనుడు చెరొక దిక్కై అవకాశాలు కలసివచ్చి ఒకరు మఠాధిపతిగా, మరొకరు రాజ్యాధిపతిగా ఎదిగినట్లు అర్థంచేసుకోవచ్చు. 

శివాజీ పాలన లో యుద్ధతంత్ర నిర్వాహకుడిగా ,కోటలనిర్మాణ నిర్వహణ దక్షుడుగా ఎనిమిదిమంది తో కూడిన ప్రధాన మంత్రిమండలి లో ఒకడుగా ప్రసిద్ధుడైన మోరోజి పంత్ ను ,కుట్రదారుడుగా నగరం వదిలి వెళ్లిపోవలసివచ్చిన మోరోజి పంత్ కొడుకు అయిన వీరపాలుడిని శంభాజీకి ప్రధాన సైనికాధికారిగా, కూతురు అయిన కుముద్వతిని శంభాజీ కి మాహారాణిగా చేసి ఆయన వారసత్వాన్ని కొంకణ రాజ్యంలో పునః ప్రతిష్టించటం లక్ష్యంగా నవలేతివృత్తం నిర్మించబడింది. కర్త శూరసేనుడే అయినా ఫలానుభవం వీరపాలుడిది, కుముద్వతిది కనుక వాళ్ళే నవలెతివృత్తంలో కీలకవ్యక్తులు అయినారు. వీరపాలుడి శౌర్యం తనను పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన భానోజీ మానప్రాణాల రక్షణ లో పదునెక్కుతూ శంభాజీకి సైనికాధికారిగా నియమితుడయ్యె పర్యంతం దిశానిర్దేశం చేస్తూ వచ్చినవి  శూరసేనుడి చొరవ. వ్యూహం. అన్నగారి కొడుకు ఉన్నతి ఆ రకంగా అతని లక్ష్యం అయింది. భానోజీ కూతురు స్వయంప్రభ వీరపాలుడు పరస్పర అనురాగంతో పెరిగి చివరకు పెళ్లిచేసుకొని మగబిడ్డను పొందటం వరకు వీరపాలుడి జీవితం అభ్యుదయ పరంపరాభివృద్ధిగా కొనసాగింది. కానీ ఈ నవల పేరు వీరపాలుని విజయం అని కాకుండా ‘కుముద్వతి’ ఎందుకు అయినట్లు ?   

 సాహసం, స్వయంనిర్ణయం జీవలక్షణం  కావటం వల్ల కుముద్వతి ఈ నవలకు నాయిక అయింది. స్వయంప్రభకు సన్నిహిత మిత్రురాలే కాక ఆమెకు అండగా అన్ని సందర్భాలలోనూ నిలబడిన వ్యక్తి. స్వయంప్రభకు అన్న వీరపాలకుడికి మధ్య అనురాగం ఆమెకు తెలిసిన విషయమే. వాళ్లకు ఆమె నైతిక మద్దతు కూడా. గుర్రపు స్వారీ వంటి వీరవిద్యలలోనే కాదు చిత్రకళలోనూ నైపుణ్యం ఉన్న మగువ. ఆపద సమయాలలో మూర్ఛ పోయే స్వయంప్రభను సేదతీర్చి ధైర్యం చెప్పగల ధీర. కష్టసమయంలో జారిపోవటం, దుఃఖపడటం కాక పరిస్థితులను అదుపుచేయగల ధీమంతురాలు. భానోజీని దుష్టకేతుడి సైన్యం దాడి చేసి ఎత్తుకుపోయినప్పుడు వీరపాలుడు మొదలైనవాళ్లు అతనిని తిరిగి తిచ్చే ప్రయత్నాలలో ఉండగా శంభాజీ మహారాజుకు విషయంతెలియచేసి అతనిని విడిపించే మార్గం గురించి ఆలోచించి, చొరవ చేసి అతని దగ్గరకు వెళ్లటంలో ఆ బుద్ధి విలక్షణతే కనబడుతుంది. 

మొదటిసారి శంభాజీని చూచినప్పుడే అతని పట్ల అనురాగం ఉదయించిన కుముద్వతి అయినా అతనికి తనకు మధ్య ఉన్న అంతరాన్ని గురించిన వాస్తవం తెలిసి కూడా ఆమె ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. భానోజీ విషయం చెప్పటానికి వెళ్ళినప్పుడు పెళ్ళాడమని అతను కోరటం ఆమెకు ఆనందాన్నే కలిగించింది. కారణాంతరాలవల్ల రహస్య వివాహం చేసుకొనాలని అతడు అన్నప్పుడు తన అభిప్రాయాలను చెప్పటానికి ఆమె ఏ మాత్రం జంకలేదు. ‘మహీపాలుర హృదయములు పాషాణసదృశములు.భూపతుల మనసులు క్షణక్షణ చంచలములు’ అని చెప్పి మీరు కోరే రహస్య వివాహం వల్ల దుష్యంతుడి కారణంగా శకుంతలకు పట్టిన గతే తనకు పడితే ఏమిచె య్యగలను అని ప్రశినించటమే కాదు, ఇది కలియుగం కదా! ఆకాశవాణి పలుకజాలదుకదా అని వాస్తవిక దృష్టితో మాట్లాడుతుంది. ఇన్ని తెలిసి కూడా రహస్య వివాహానికి తత్కాలం లో ఒప్పుకొంటూనే అతిత్వరలో దానిని బహిరంగపరచాలని చెప్పటంలో ఒక తెగింపును చూస్తాం. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆమె తెగింపును చూడాలి. తాను కోరిన పురుషుడిని పొందటం తో పాటు భానోజీ ఎక్కడున్నాడో తెలుసుకొని విముక్తిచేయటానికి అతనితోడ్పాటును ఆశించటం ఇందులో ఉంది. ఆ లక్ష్య సాధించబడింది కూడా.  అంతే కాదు , తొలి సమాగమవేళ ఆమె కోరిన కోరిక రాజవంశానికి ద్రోహంచేసిన తమ వంశాన్ని క్షమించమని. ఆ రకంగా అన్నకు తనకు నగర పునః ప్రవేశానికి వాతావరణాన్ని సానుకూలం చేసుకొన్నది. 

రహస్య వివాహం తరువాత శంభాజీ తో మూడు రోజులు గడిపి మళ్ళీ భానోజీ ఇల్లు చేరిన కుముద్వతి విరహంతో అతనికి ఉత్తరం వ్రాయాలనిపించి భానోజి పడకగదికి పక్కన ఉండే ఆయుధాగారంలో దానిని నిర్వహించే గోవిందసింహుడి వ్రాత కోతలకోసం కాగితాలు కలం అన్నీ అక్కడే ఉంటాయి కనుక అక్కడికి వెళ్ళింది. అక్కడ రాతిపలకల మీద నిలబెట్టబడ్డ నిలువెత్తు కవచాలలో కనుల కదలిక కనబడి ఎవరో ఆ గదిలోకి జొరబడి దాక్కుని ఉన్న విషయం గ్రహించి ముందు కాస్త భయపడినా ఎవరు వాళ్ళు ఎందుకువచ్చారు అని ఆలోచించటం మొదలుపెట్టి భానోజీ కి శత్రువు అయిన దుష్టకేతుడి పన్నాగమే అది అని, స్వయంప్రభ ను ఎత్తుకువెళ్ళటానికి వచ్చి ఉంటారని ఊహించి సకాలంలో అందరినీ హెచ్చరించి ప్రమాదం తప్పించిన వ్యూహాశాలి ఆమె. ఆ సమయంలో ఆమె ధైర్యాన్ని కూడదీసుకొనటానికి “మహారాజ్ఞ సామ్రాజ్య లక్ష్మినగు నేను,శంభాజీ నరేంద్రుని రాణినగునేను” బేలవలె భయపడటం ఏమిటి? అనుకొనటం గమనించవచ్చు. ధైర్యంగా ముందుకు అడుగువేయటానికి ఏ అవకాశాన్ని అయినా ఆమె ఎలా ఉపయోగించు కొంటుందో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. 

శంభాజీ పట్ల ప్రేమలో కుముద్వతికి ఉన్న నిజాయితీ ఆమె పట్ల అతనికి లేదు.  ఆమె పట్ల అతనికి ఆకర్షణ, వ్యామోహమే కానీ దానిని శాశ్వత సంబంధంగా మార్చుకొనాలని లేదు. భార్యామరణాంతరం స్త్రీ లోలుడై అతను మళ్ళీ పెళ్లి సంగతే తలపెట్టలేదని కథాక్రమంలో మనకు తెలుస్తుంది. కుముద్వతి పెళ్లి అంటే గాని తన చెంత చేరదని తెలిసి అతనా రహస్య వివాహ ప్రతిపాదన చేసాడు. పెళ్లి అయి ఆమె తనకు అందుబాటులోకి వచ్చాక ఆమెను ‘అధికార గర్వోన్మత్త’ అనుకుంటాడు. ఇష్టపడ్డాను కదా అని కోరరాని  కోరికలు కోరుతున్నదని అనుకుంటాడు. తగినశాస్తి చేస్తానని కూడా లోలోపల శపథం చేసాడు. అందుకే ఆమెను తమవివాహ రహస్యం బయటపెట్టకుండా చేయటానికి మాయచేసి తన రాజప్రాసాదానికి తెప్పించుకొన్న తరువాత కానీ ఆమెకు అతని ఆంతర్యం అర్ధం కాలేదు. అయినా ఏడుస్తూ కూర్చోక అక్కడ నుండి బయటపడటానికి ప్రయత్నించి విజయం సాధించింది. శూరసేనుడిని చేరి అసలువిషయం చెప్పినతరువాత శంభాజీ తాను ఆమెను పెళ్ళాడనని అంగీకరించటానికి అవసరమైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టే నాటకమంతా నడిపినవాడు శూరసేనుడే. ఒకప్పుడు తన తండ్రిని,తనను బందీలుగా తెచ్చి తిండీ నీళ్లు ఇయ్యక తండ్రి మరణానికి కారకుడై ,ఆ తరువాత తనను  కోరి వివాహమాడి, అక్కర తీర్చుకొని నిర్లక్ష్యం చేసిన దుష్టకేతుడిపై లావణ్యక చేసిన ఫిర్యాదు విచారణ సందర్భాన్ని కుముద్వతిని వదిలించుకొనాలని చూస్తున్న శంభాజీ తన తప్పు తాను ఒప్పుకొనేట్లు చేయటానికి వీలుగా ఉపయోగించిన తీరు ఒక్క సారిగా అతనిముందు కుముద్వతిని ప్రవేశపెట్టిన తీరు సీతను రాముడు తెలుసుకొనటానికి వీలుగా ఉత్తరరామచరిత్రలో భవభూతి ఆడించిన అంతర్నాటకాన్ని గుర్తుచేస్తుంది.  

 ఏమైనా  స్వీయ ప్రయత్నంతో తనజీవితాన్ని తానే నిర్మించుకున్న వివేకవంతమైన మహిళ ను కేంద్రంలోకి తీసుకువచ్చి చూపటం పులవర్తి కమలావతీ దేవి ఆశించిన ప్రయోజనం అని నవల పేరును బట్టి అర్ధం చేసుకోవచ్చు. 

 విజయభాస్కర విజయము (1929) అనే సాంఘిక నవలను కూడా ఆమె వ్రాసింది. భర్త ఎంత నిర్లక్ష్యం చూపినా, అన్య స్త్రీ పట్ల మొహంతో ఎన్ని ఇక్కట్లు పెట్టినా ఓర్చుకొని  బతకటం లోనే స్త్రీల జీవిత సాఫల్యాన్నినిరూపించే ఇతివృత్తంతో నడిచిన ఈ నవలలో అలా జీవించటంలోనే స్త్రీలు సబలులు కాగలుగుతారన్నభావం,అలా జీవించటమే మానాభిమానాలతో బ్రతకటమన్నభావం  అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇవే కాక ‘విక్టోరియా క్రాస్’, పుళింద కన్య అనే నవలికలు కూడా పులవర్తి కమలావతీదేవి వ్రాసింది.అలాగే నిరూపక నవలలు రచనకు అంటే అపరాధపరిశోధక నవల రచనకు కూడా పులవర్తి కమలావతీ దేవి  చొరవచూపటం విశేషం.ఆమె వ్రాసిన నిరూపక నవలలో ‘మీర్ జుంలా (1929) ఒకటి.

అంతకు రెండేళ్లకు పూర్వమే 1926-27 లలో  సీరము సుభద్రాయాంబ ఒక ఫ్రెంచ్ నవలను అనుసరించి ‘జాగిలము’ అనే  అపరాధ పరిశోధక నవల వ్రాసింది. సరస్వతీ గ్రంథమండలి వారిచే ముద్రించ బడిన ఈ నవల ఉన్నత తరగతుల విద్యార్థులకు పాఠ్య గ్రంధం. కావ్యాలు, ఖండకావ్యాలు,నాటకాలు,శతకాలు మొదలైన ప్రక్రియలలో కృషి చేసిన ఈమె   14-3-1947 న మరణించింది.  

*****

(ఇంకా ఉంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.