పునాది రాళ్ళు- 3 

డా|| గోగు శ్యామల 

 అధ్యాయం:    గ్రామీణ వ్యవస్థ  – కుల రాజకీయాలు – వర్గ పోరాటాల్లో రాజవ్వ భూపోరాటం

ఈ అధ్యాయం లో చోటు చేసుకున్న అంశాలు…  1. ఉత్తర తేలంగాణ గ్రామీణ వ్యవస్థలో రాజవ్వ  ఇతరులకు భూమి కావాలని, తన భూమి కోసం పోరాడిన క్రమంలో  కుల పితృ భూ వలస స్వామ్య అధిపత్యాలు కలగలిసిన పాలన విధానాలు నిర్వహించిన పాత్ర.     2. రాజవ్వ భూమి పట్టా కావాలని, ఆ భూమిలో సాగుచేసి పండించుకున్న పంట తమకే దక్కాలని, వాడా, ఊరు, తాలూకా జిల్లా రాష్ట్రంలోగౌరవంగా బతికే అవకాశం, పరిస్థితులుండాలనే  అంశాలు కూడా ఈ పోరాటంలో మిళితమై ఉన్నాయి. 3. పైన పేర్కొన్న బహుముఖ రూపాల అధికారాలతో అణిచివేతలకు పాల్పడిన ఫలితంగా ప్రజలపై నిరంతరం సాగె అత్యాచారాలు, హత్యలు, లైంగిక అత్యాచారాలు, చిత్రవదలు, హింస, వెట్టిచాకిరి మూలంగా ఉత్పత్తి శక్తులను  శాస్వితంగా బాధితీకరించి బానిసీకరించే వైనం ముఖ్యంగా మాల మాదిగలను, మరీముఖ్యంగా దళిత స్త్రీలను గొస వెట్టిన తీరును సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది . 3. ఈ అధ్యాయంలో పేర్కొన్న ముఖ్యాంశం ఏమం టే 1970 నుండి 1980 వరకై న దశాబ్ధ కాలం నడిచిన పోరాట చరిత్రకు పరిమితం కావడాన్ని గమనించాలి.   ఈ క్రమంలోనే మార్కిస్టు లెనినిస్టు పార్టి ఉత్తర తేలంగాణలో ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో పనిచేయడం మొదలైన తరువాత, అణిచివేతలకు ఆదిపత్యాలకు నడుమ నడిచిన ప్రశ్నలు సంఘాల నిర్మాణాలు తిరుగుబాటు రూపాలను ఇందులో చూడొచ్చు. 4. రాజకీయాలను పోరాటాలను, ఎంఎల్ పార్టీ తో సహా, పార్టీలను రాజవ్వ (నాయకురాలుగా మరియూ బాధితురాలిగా)  దృక్కోణం నుండి దళిత దృక్కోణం (కుల నిర్ములన ) దళిత స్త్రీవాద దృక్కోణం నుండి విశ్లేషించడం మరో ముఖ్యాంశం..    

 కుదురుపాక రాజవ్వ కథ…  రాజవ్వ ఇంటి పేరు చిట్యాలోళ్లు. చిన్న రాజవ్వ అని కూడా అంటారు. దేశంలో  చాలా మంది దళితులకూ ఇంకా చదువు లేని పేదలకు తెలియనట్లే రాజవ్వకు తన పుట్టిన తేదీ  తెలియదు. (రాయబడని గ్యాపకాలే మల్లి మల్లి మౌఖికంగా వాడబడుతాయి. అవి ఫలానా పండుగకు ముందనో, అమవాస తరువాతనో ) కానీ ఆమె చనిపోయిన తేదీ తెలంగాణ చరిత్రలో నమోదైంది. ఇక పోతే, దేశంలో చాల మంది  ఆడవాళ్ళకు పెళ్లి తరువాత ఇంటి పేరు మారిపోతుంది. రాజవ్వకు కుదురుపాక పోరాటాల తరువాత ఆమె ఇంటిపేరు కుదురుపాక రాజవ్వగా మారింది. ఈమె నెరపిన పోరాటంలో కుదురుపాక గ్రామం చుట్టూ ఉన్ననాటి తాలూకా, జిల్లా వ్యవస్థల్లో వివిధ ముఖ్యంశాలు తెరపైకి రావడం పరిశీలించవచ్చు.  అవి, వ్యవస్తీకృతమైన కుల పితృ భూస్వామ్యాలు వివిధ సందర్భాలలో వాటి అవసరాలకు దగ్గట్లు, ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అధికార అహంకార ధోరణులను ప్రదర్శించిన తీరు మనకు తెలిసిపోతుంది. 

ఇందులో ముఖ్యంగా  చెప్పుకోవాల్సిందేమంటే,  ఆధునిక భారత చరిత్రలోని కుల వర్గ పితృస్వామ్య అధిపత్యాలను  ప్రశ్నిస్తూ వచ్చిన వివిధ పోరాటాలకు 1970-80 దశాబ్దం సాక్షంగా నిలిచింది.  ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులను ఎవరూ మర్చిపోలేరు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఉత్తర  తెలంగాణలోని జిల్లాలు , గ్రామాలు కుల వర్గ దౌర్జన్యాలు, హింస హక్కుల నిరాకరణ సహాజికరించబడి రాజ్యమేలుతున్న రోజులు లేకపోలేదు. ఈ రకమైన పరిస్థితినే  వినుకొండ తిరుమలి తన రచనలో ”కుల వ్యవస్థ నిర్మాణం – ఆధిపత్య అసమానతలు హింస అణిచివేతలను కొనసాగిస్తున్న చోట అట్టడుగు ప్రజాశ్రేణుల నుండి పోరాటాలు బ్రద్దలవడం అనివార్యం” అంటారు.  అదేవిధంగా ఉమచెక్రవర్థి తన రచనలో ”1970 తరువాత కులభావజాలానికి వ్యతిరేకంగా ఆధునిక దళిత పోరాటాలు శక్తి వంతంగా వచ్చాయిని చెప్పడానికి దళిత్ పాంథర్ మూమెంట్ మంచి ఉదాహరణగా నిలుస్తుంది” అని ఊటంకిస్తుంది.  

 ఈ నేపత్యం లోనే   భూమికోసం, గౌరవం కోసం అనేక గ్రామాల ప్రజలు ఉద్యమించారు. వీటిలో ఒకటైన  పోరాటమే కుదురుపాక గ్రామంలో నడిచిన వివిధ రకాల, వివిధ రూపాల పోరాటాలను ప్రత్యేకంగా  చూడాలి. గ్రామమంతా ఉమ్మడిగా ఉద్యమించినా ప్రతి ఒక్కరి అవసరాలు వారు చేసిన ఉమ్మడిపోరాటంలో కలిసి ఉన్నాయనే చెప్పాలి. అవే,  భూమి పట్టా కోసం, భూమి సాగు చేయడం కోసం, పండిన పంట ఫై హక్కు కోసం రాజవ్వ పోరాడింది. రాజవ్వతో పాటు అనేక మంది. పోరాటం చేయడానికి  నాటి తీవ్రమైన కుల అణిచివేత, వెట్టి దోపిడీ, స్త్రీల ఫై లైoగిక అ త్యాచారాలు, హత్యలు నిత్యా కృత్యాలైనాయి. ఈ పరిస్థితుల్లో మార్క్స్ లెనినిస్టు పార్టీ గ్రామాలకు విస్తరించడంలో భాగంగా మిగితా జిల్లాలతో పాటు కరీంనగర్, వేములవాడ సిరిసిల్లా మండలాలలో  భూస్వాముల దోపిడీ వెట్టి విధానాన్ని, ప్రజలు పండించిన పంట ప్రజలకే చెందాలనే పోరాటాలకు ఎం ఎల్ పార్టి పిలుపునిచ్చింది. ఏ ఆసరా లేని అణగారిన ప్రజలకు ఎం ఎల్ పార్టి వెన్నుదన్నుగా నిలిచింద నే చెప్పాలి. ఈ పోరాటాల్లో వేలాది మంది మహిళలు , యువకులు , పిల్లలతో సహా పోరాటాల్లో పాల్గొన్నవారిలో రాజవ్వ కుటుంబం ఒకటి. క్రమంగా చురుకుగా పాల్గొంటూ ధైర్యంగా నాయకత్వం వహించింది. ఆమె సాహసంగా నిలిచిన తీరుఫై నమ్మకం ఉంచి  ఆమెకు పార్టీ నాయకత్వ స్థానాన్ని కల్పించింది. మహిళలు కూలీలు రైతులు యువకులు ఆమె నాయకత్వంలో ముందుకు సాగారు. 

***** 

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.