చిత్రం-4

లోయిస్ గ్రీన్ ఫీల్డ్

-గణేశ్వరరావు 

ఈ అద్భుతమైన ఛాయా చిత్రాన్ని తీసిన  లోయిస్ గ్రీన్ ఫీల్డ్ నాట్య ఛాయాచిత్రకారిణిగా  సుప్రసిద్ధురాలు.

ఆమె ఫొటోల్లో వస్తువు: కదలికలు, ఇతివృత్తo : సమయం.

సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలు గా చేయడంలో   ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమలను తన కెమెరా ఫిల్మ్ లో బంధించి గలదు, ఆ కళాకారుల సృజనాత్మకతకు దీటైన సృజనాత్మకతను తన ఫోటోగ్రఫీలో  కనబరచగలదు.

‘ప్రతిబింబించు క్షణాలు ‘ అంటూ తాను తీసిన ప్రయోగాత్మక ఫోటోలను అగ్రస్థానానికి తీసుకొని వెళ్ళింది, అలా రూపొందించిన వాటిలో వినూత్న ప్రయోగంలా ఎన్నో అద్దాలను వాడింది. ఆ అద్దాలు మన ఆకర్షణీయంగా కనబడటమే కాకుండా, నేపథ్యంగా అవి మనల్ని సమ్మోహన పరుస్తాయి. ఆమె ఎంపికచేసిన మోడల్స్ అటూ ఇటూ కదులుతున్నప్పుడు, వాళ్ళ శరీరాలు వాటి ప్రతిబింబాలు కలిసి పోతూ, ఏది ఎక్కడ మొదలైందో ఏది ఎక్కడ ముగుస్తుందో తెలియనీయవు. అది ఆమె ఫోటోలకు ఒక అధివాస్తవికతను కల్పిస్తుంది.

‘నేను దేన్నీ ఉన్నదున్నట్లు చూపించాలని అనుకోను, నాది కవితాత్మకమైన దృశ్య భాష, నేను తీసే ఫోటోలు ఏ తర్కానికి లొంగవు. నా స్టుడియోలో నాట్యకత్తెల కదలికలను ఆశుకవిత్వంతో నేను తీసిన ఫోటోలలో చెబుతుంటాను. ముందుగా ఏమీ అనుకోను, ఒక ప్రణాళిక  వేసుకొని పని ప్రారంభించను. నేను తీసే ఫోటో ఎలా వుంటుందో ముందుగా నాకు తెలిస్తే, దాని గొప్పతనం ఏముంది? అలాటి దాన్ని నేను తీయడం ఎందుకు? అది నా ఊహకు అందనిదై ఉండాలి, ఆ క్షణంలోని మాయాజాలాన్ని ఒడిసిపట్టాలి. నాట్యభంగిమలోని శరీరాకృతులనీ, కదలికాలనీ చూపించే డాన్స్ ఫొటోగ్రఫీ ప్రక్రియను కాలాతీతం చేయాలన్నది నా లక్ష్యం, గురుత్వాకర్షణ శక్తి ని నా ఫొటోల్లోని రూపాలు త్రోసిపుచ్చుతాయి, అవి అనేక కోణాలను కనబరుస్తాయి, అవి నా అధీనంలో వుండవు. అవో స్వాప్నిక లోకాన్ని సృష్టిస్తాయి, నా ఫోటోలలో కాలం ఆగిపోతుంది, వస్తువు శిలా రూపం దాల్చుతుంది, అలా బంధించే క్షణాలను మనం మన మనోనేత్రంతో చూడాలి,’ అని అంటుందామె .

ఆమె తీసేవి ఫొటోలే అయినా వీడియో లక్షణాలు ఉంటాయి, ఒక ఫోటో ఏక్షన్/కదలికను ఆపి బంధిస్తుంది, పది సెకండ్లు కనిపించి ఆగిపోతుంది. నీటిలోని చేప పిల్లను పట్టుకొని, మళ్ళీ దాన్ని ఆ నీటిలోనే జారవిడిచినట్లు ఉంటుంది, వీడియో అలా కాదు, ఆమె చిత్రాలలో వీడియోల్లా కదులుతూన్న కాలాన్ని చూడగలం. ఒక పాత్రికేయ ఫోటోగ్రాఫర్ తీసే ఫోటోలు ఏదో ఒక ప్రత్యేకమైన కథ చెప్పాలి, అదే డాన్స్ ఫోటోగ్రాఫర్ అయిన లూయిస్ అయితే అది కనువిందు చేయాలి. ఈ ఫొటోకు ఆమె పెట్టిన పేరు ‘moving still ‘, ఇందులో రిబ్బన్ ఒక శిల్పంలా ఉండిపోతే, నాట్యకత్తె ఆ రిబ్బన్ లోనుంచి పరుగెత్తుతూ ఉన్నట్టు మనం అనుభూతి చెందుతాం. ఈ ఫొటోలోని మాయామర్మం అదే! 

నిజమే! ఇలాటి ఫోటోలు నిస్సందేహంగా వైవిధ్యభరితంగా కనిపిస్తాయి, ఒక స్ప్లిట్ సెకండ్ వీటిలో శాశ్వతం పొందుతుంది , అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది, ఊహకు అతీతమైన దాన్ని అందిస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.