కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

– కె.శ్రీదేవి

ఓల్గా కథలు

1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే ఒకానొక సంధర్భం నుండి  స్త్రీస్వేచ్ఛ, స్త్రీల లైంగికత, లైంగిక, పితృస్వామిక రాజకీయాలు, స్త్రీవిముక్తి ఉద్యమ నిర్మాణ దిశగా అర్దశతాబ్ద కాలంగా నిర్విరామంగా, నిరంతరంగా వేస్తున్న అడుగుల వెనుక మొట్టమొదట ముందడుగువేసి స్త్రీ సంవేదకులకు ఒక తాత్విక అడుగుజాడను ఏర్పరచిన మార్గదర్శకురాలు ఓల్గా.

ఓల్గా కంటే ముందు స్త్రీల సమస్యల గురించి రచించిన రచయిత్రులు లేరా అనే ప్రశ్న వేసుకుంటే, మనకు భండారు అచ్చమాంబ మొదలుకొని రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి లాంటి సీరియస్ రచయత్రుల రంగప్రవేశం ఆమె కంటే శక్తివంతంగానే జరిగింది. ఆనాడు అమలులో ఉన్న స్త్రీల స్థితిగతులు సరిగాలేవని, దయనీయమైన స్త్రీల స్థితి మారాలన్న ఆకాంక్ష వాళ్ళ రచనల్లో సాధ్రంగానే ఆవిష్కృతమైంది. అలాగే నేలవిడిచి సాముచేసిన రచయిత్రుల రచనల్లో కూడా దుర్భ్హర జీవితాన్ని గడుపుతున్న స్త్రీల స్థితిపట్ల ఆవేదన వుంది. లోతుగా పరిశీలించినట్లయితే, దారుణ వాస్తవికతను ఎదుర్కొనలేక స్త్రీలు  జండర్ తో సంబధం లేకుండా ఒకానొక అవాస్తవికతలోకి పారిపోవటం అసాదారణాంశమేమి కాదు. ఒకరకంగా వాస్తవికతను పరోక్షంగా అంగీకరించడం కూడా. అంతే కాదు దాన్నిమార్చలేమనే నిస్పృహ, నిస్సహాయతలలోంచి తమకు సంబంధంలేని వేరు వేరు మార్గాలలోకి ప్రయాణించటం. ఈ నేపథ్యంలో 1980 వరకు వచ్చిన రచయిత్రులు ఏదో ఒక స్థాయిలో కథ, నవల మొదలైన కాల్పనిక సాహిత్య రూపాలను హస్తగతం చేసుకోగలిగారు. 1990ల తరువాత రాడికల్ భావాలతో కథా సాహిత్య రంగ ప్రవేశం చేసిన రచయిత్రులు సునాయాసంగా కథారచనకు శ్రీకారం చుట్టారు. 

ఈ నేపథ్యంలో తెలుగు సమాజంలోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన స్త్రీవాద  భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు వంద కథలకు పైగా ఓల్గా రచించారు. స్త్రీవాదం స్త్రీల చేతుల్లో ఒక గొప్ప సాధనంగా  మారడానికి కావలసిన తాత్విక సంపత్తిని తెలుగు సాహిత్యానికి ఆమె అందించగలిగారు. సాహిత్య, తాత్విక రంగాలలో ఒక వ్యక్తి చేసిన కృషిని అంచనా వేసేందుకు ఆ కృషి వలన సమాజంలో ఎటువంటి చలనం సమాజంలో , కనీసం భావజాల రంగంలోనైనా ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవటం అవసరం. అలాగే ఉద్యమంలో వున్న వ్యక్తి చేసిన కృషి వలన ఆఉద్యమం వేగవంతమవ్వటంలో ఆ వ్యక్తి కాన్ట్రిబ్యూషన్ ని కూడా పరిగణణలోకి తీసుకోవాల్సివుంటుంది. ఓల్గా కథలను ఈ పై రెండు అంశాల వెలుగులో విశ్లేషించినపుడు పంతొమ్మిదివందలా ఎనభై తరువాత ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే తొంభైల నుంచీ సాహిత్య చలనానికి నిస్సందేహంగా ఆమె దోహదం చేశారు. ఒక రచయితగా, ఒక తత్వవేత్తగా ఆమె చేసిన కృషి ఫలితంగా స్త్రీవాద భావజాలం బలపడింది. తెలుగులో ఆమె స్త్రీవాదాన్ని ఒక తాత్వికశక్తిగా నిలపగలిగారు. స్తీవాదిగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తెలుగు సమాజంలో ఒక ప్రబలమైన శక్తిగా ఎదగడానికి ఓల్గా చేసిన కృషి అసాధారణం. సమాజంలో అమలవుతున్న జండర్ విభజన శారీరక, మానసిక, చారిత్రక, సాంస్కృతిక కారణాలతో సహా ఎత్తి చూపించడంలో కూడా ఓల్గా ప్రధాన భుమిక నిర్వహించారు. స్త్రీలు కేవలం స్త్రీ విద్య, పౌరహక్కుల లాంటి అంశాల సాధనతో సరిపుచ్చుకోకుండా లింగ వివక్ష గురించి అందరూ తీవ్రంగా ఆలోచించేట్లు చేయటంలో కూడా ఓల్గా ప్రముఖ పాత్ర వహించారు. 

తెలుగు సమాజంలో స్త్రీ వాదం ఉదారవాదం నుంచి సోషలిస్ట్ స్త్రీవాదం, రాడికల్ స్త్రీవాదం దాకా పయనించటానికి  ఆమె దొహదం చేశారు. స్త్రీలు అన్నీ రంగాలనుంచీ దూరం చేయబడుతున్న తీరును ఆమె పసిగట్టి విశ్లేషించారు. ముఖ్యంగా స్త్రీల అణచివేత వెనుక వున్న రాజకీయాలను  బహిర్గతం చేశారు. ఆ రాజకీయాలకు పురుష స్వామ్యానికి వున్న సంబంఢాన్ని కూడా శక్తివంతంగా విశ్లేషించారు.

“ఏం చేయాలి?” కథలో శాంత వ్యక్తిగతంగా తన ఉనికి కోసం ఇంటా, బయటా యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఘనవిజయం కూడా సాధించింది. అయినా ఆమె జీవితంలో అసంతృప్తి, ఒంటరితనం ఆమెను బాధిస్తాయి. పెళ్ళి చేసుకోకపోవడమే దీనికి కారణమేమో, పిల్లలు, పెళ్ళి ఇవి సంతృప్తినిచ్చేవేమో అని భార్యగా, అమ్మగా గడిపిన శోభ జేవితం చూసి ఇద్దరూ తమ జీవితాలు  అలా ఎందుకు నడుస్తున్నాయో కారణాల కోసం అన్వేషిస్తారు. ఇద్దరి లోనూ ఇకపై ఏం చేయాలి? ఏం చేసి పరిపూర్ణ జీవితం గడపాలి? ఏం చేస్తే తమ జీవితాలకు సార్థకత లభిస్తుందని అలమటిస్తూ,పరిష్కారం కోసం ఆర్తిగా ఎదురు చుస్తూంటారు. ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఊరేగింపుగా వెళుతున్న వారితో కలసి వెళ్ళి ఆ సభలో పాల్గొంటారు. ఆ సభకు వెళ్ళిన శాంత ,శోభలకు తామేం చేయాలో భోధపడుతుంది.

 పెళ్ళి వల్ల ఆడపిల్ల జీవితంలో పెరిగే వత్తిడి, హింసల కారణంగా “పెళ్ళి” కథలోని రజనిలాంటి అమ్మాయిలు ఈ రోజు పెళ్ళిని వ్యాపారంగానో, ఉద్యోగంగానో చూస్తే తప్ప తమకు న్యాయం జరగదనే అవగాహనకు వస్తారు. రజని అన్నట్టు ఏ ఉద్యోగం లేకుండా పెళ్ళితో తన జీవితం గడచి పోతుందనుకుంటే, అలాంటి జీవితంలో ఎన్ని అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందో, అందుకే లాభం గడించే వ్యాపారస్తునిలాగా పెళ్ళి వ్యవహారం నడిపితే ఆడవాళ్ళ ప్రాణానికి సుఖంగా వుంటుందంటుంది.

“ఆడవాళ్ళు పెళ్ళంటే అది ఉద్యోగం కాదనీ , వాపారం కాదనీ ప్రేమతో ముడీపడిందని ఏదేదో సెంటిమెంట్లతో ఆలోచిస్తారు. గోతిలో పడతారు. నేను పెళ్ళినలా అర్థం చేసుకోను.ఒక ఉద్యోగస్థురాలుగా నా హక్కుల కోసం దెబ్బలాడతాను. పెళ్ళిని ప్రేమ కోసమో, భద్రత కోసమో కాకుండా ఒక వృత్తిలా, బిజినెస్ లా స్వీకరించదలచుకున్నా” నంటుంది రజని.

 వైవాహిక వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కనుగుణంగా రూపొందించబడిందో గుర్తించి వాటిని ఓల్గా ’పెళ్ళి’ కథలో పరోక్షంగా చావు దెబ్బ తీశారు. ఆడవాళ్ళను ’ప్రేమ’, ’అన్యోన్య దాంపత్యం’, ’మాతృత్వం’ వంటి పేర్లతో మాయచేసి కట్టుబానిసలుగా పడివుండే భావజాలాన్ని కల్గించిన పితృస్వామ్య వ్యవస్థ అసలు స్వరూపాన్ని ఇందులో బహిర్గతం చేశారు. వాళ్ళంతట వాళ్ళే ఈ విషయాన్ని ఏ మాత్రం పొల్లుపోకుండా ఆచరించేంత శక్తివంతమైన యంత్రాంగాన్ని పురుషసామ్యభావజాలం కల్పించింది. ఆమె పతివ్రత ననిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడైనా భర్త అవసరాలకు. అభిరుచులకు అనుగుణంగా మారడంలో తనను తాను మలచుకొని ఎంత క్షోభ అనుభవిస్తుందో ఆ భావాలను కల్పించి ఆచరించమనే వారికి ఎలా అర్థమవుతుంది? వాళ్ళు కూడా అలా ప్రవర్తించవలసి వచ్చినప్పుడు తప్ప, ఆ ఆవేదన అవగతం కాదని పెళ్ళి పట్ల తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

’పెళ్ళి’ కథ పైకి మామూలుగా సాగిపోతుంది. కానీ ఇందులో ’వివాహం’ పైన సీరియస్ చర్చ ఇమిడి వుంది. ఆడవాళ్ళ జీవితాలకు ఏ పెళ్ళి వలనయితే భద్రత కలుగుతుందనుకొని పెళ్ళి చేస్తారో ఆపెళ్ళిలోని అభద్రతా భావాన్ని, క్షణం క్షణం సమస్యల వలయంలో తన్నుకుచచ్చేతనాన్ని ’భద్రత’ కథానిక బట్టబయలు చేస్తుంది. ఆడవాళ్ళకు తాము భద్రత కల్పిస్తున్నామనే భ్రమతో మగవాళ్ళు ధీమాగా ప్రవర్తింస్తుంటారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ అండ లేనిదే బ్రతకడం కష్టం. అతను లేని జీవితం శూన్యంఅని, బ్రతుక్కు నిండుదనం మగవాడే అని అనుకుంటుంటారు. వాస్తవానికి మగవాళ్ళు భద్రత కలిగించే మాట అటుంచి ఆడవాళ్ళ జీవితంలో ఏర్పడే అభద్రతా భావం అంతా మగవాళ్ళ వల్లే వస్తుంది. ఈ వాస్తవాన్ని సుజాత, ధనలక్ష్మి పాత్రల ద్వారా రచయిత్రి నిరూపించగలిగారు.

ఇచ్చాపూర్వక వ్యాపకాలతో, సామాజిక ఉత్పత్తి బాధ్యతలతో హాయిగా, ఆనందంగా గడపాల్సిన జీవితం “వివాహంతో” అస్తవ్యస్తమవుతుంది. అయితే వివాహితకు స్వేచ్చ వుండదా? అంటే వుంటుంది. భర్త మంజూరు చేసినంత లేదా నిర్దేశింనంత వరకు వుంటుంది.ఇంకా చెప్పాలంటే, తాడుతో  గుంజకు కట్టేసిన ఆవు ఎంతవరకు తిరగగలదో అంత స్వేచ్చ వుంటుంది. అంతే తప్ప స్త్రీ తనకు అవసరమైనంత వరకు వుండే అవకాశం మాత్రం ఉండదు. ఆమె అలవాట్లు, ప్రవర్తన, అభిరుచుల పైన పురుషుడి నియంత్రణ వుంటుంది.

“ఒక రాజకీయ కథ”లో మధుసూదన్ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు.అతని భార్య వాళ్ళ దాంపత్యం జీవితం గురించి అందమైన కలలు కంటుంది. పెళ్ళి రోజే అతనితో అన్యోన్యంగా వుండాలని తీసుకున్న నిర్ణయాన్ని తనకు కష్టంగా వున్నా అమలు చేస్తుంది. ఉద్యోగ నిర్వహణలో మధుసూదన్ చేతివేళ్ళు తెగి పోయాయి. అతనికొచ్చిన కష్టాన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళ ఓదార్పు, అండా భార్య సేవలూ అతని అంగవైకల్యాన్ని మరిపిస్తాయి.అతని భార్యకు ఆబార్షన్ అయి గర్భసంచి తీసేస్తారు. దాంతో ఆమెకు విడాకులిచ్చి మరో పెళ్ళి చేసుకోవాలను కుంటాడతడు. ఈ క్రమంలో ఆమెలో కలిగిన సంఘర్షణ , ఆలోచనలను ఓల్గా ఈకథలో ప్రతిభావంతంగా,హేతుబద్ధంగా చిత్రించారు.

చైతన్యమవుతున్న కొత్త సాహిత్య వర్గాల ఆకాంక్షలను, ఐడియాలను ప్రత్యమ్నాయ జీవన శైలుల్ని వాటి సాధ్యాసాధ్యాలను అధునిక స్త్రీ చైతన్యానికి ప్రతీకలుగా ’ప్రయోగం’, ’తోడు’, ’పెళ్ళి’, ’భద్రత’, ’గోడలు’, ’కేసు’, ’శత్రువులెవరు?’ మొదలగు కథలు సాక్ష్యంగా నిలుస్తాయి.

“గోడలు” కథానికలో రేవతి, చంద్రిక అత్తాకోడళ్లు. చంద్రిక రవిని పెళ్ళాడకముందే అత్తగారితో వుండకూడదని నిర్ణయించుకుంటుంది.కారణం అత్తలు కోడళ్ళను ఎలా హింసిస్తారో వినివుండడం వల్ల., అత్త  కోడలుకు దగ్గర కావాలని ఎంత ప్రయత్నించినా చంద్రిక ఆమెను దూరంగానే వుంచుతుంది. పసిపిల్లాడితో, ఉద్యోగంతో ఎంత అవస్థపడుతున్నా అత్తగారి సాయం కోరదు.

పితృస్వామ్య సమాజంలో ఆడవాళ్ళు అత్తలు, వదినలు, కోడళ్ళు, ఆడబిడ్డలు, తోటి కోడళ్ళుగా మూసలలో చూడబడుతున్నారు. తామంతా స్త్రీలమన్న స్పృహ వాళ్ళలో కలుగకుండా విభజించింది. వాళ్ళు వ్యక్తులుగా, తోటి స్త్రీలుగా తమని తాము చూసుకోరు. పెళ్ళికాక ముందే అత్తంటే ఇలా వుంటుంది. ఇలా మాట్లాడుతుంది. ఇలా చూస్తుంది. ఇలా హింస పెడుతుతుంది అనే అభిప్రాయాలు వీరి మనసులలో నాటుకుపోయి వుంటాయి. వాటిని వదిలించుకుని తాము ప్రధానంగా స్త్రీలమనీ, మనుషులమనీ, ఆ తర్వాత ఏర్పడే బాంధవ్యాలే అత్త, ఆడబిడ్డల సంబంధాలని గ్రహించరు. గ్రహించే వాతావరణం మన సమాజంలో లేదు. అలా ఆడవాళ్ళందరిని మూసలుగా విడతీసి పాలించడమే “పురుష రాజకీయం”

తాత్విక, రాజకీయ రంగాలలో స్త్రీలు లేవనెత్తిన అనేక ప్రశ్నలను ఓల్గా తన “భిన్న సందర్భాలు” కథాసంపుటిలో నిర్దిష్ట జీవన సందర్భాలలోంచి చర్చించే  ప్రయత్నం చేశారు. శ్రమ విభజన, లైంగికతను నిర్వచించడంలో ఉండే రాజకీయ, అంశాలను ఓల్గా తన కథల్లో విశ్లేషించారు. పునరుత్పత్తిలో ప్రధానపాత్ర వహిస్తున్నది స్త్రీలే అయినప్పటికి అందులో స్త్రీలకు ఎటువంటి స్వేచ్చలేదు. ఈ స్వేచ్చారాహిత్య స్థితిని ప్రశించటమే కాక, స్త్రీలు పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చబడుతున్న వైనాన్ని కూడా ఆమె చిత్రించారు. భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీకి ఎటువంటి స్వతంత్రం లేదు. ఆమె లైంగిక అవసరాలతో కూడా ఎటువంటి పనిలేదు. స్త్రీల చేత అన్ని రంగాలలో పురుషులకు ఊడిగం చేయించటమే దాని లక్ష్యం.

 “మొదటి చావు” కథ మైనర్ బాలికలపై జరిగే అత్యాచారం వలన వాళ్ళు పడే హింసను చెప్పిన కథ. అమ్మాయిలు అత్యాచారానికి గురవడమే కాకుండా దాని పర్యవసానంగా ఎదురయ్యే ’అబార్షన్’ల రూపంలో, స్త్రీల జీవితాల్లో వున్న హింసను అనుభవించేక్రమంలో స్త్రీలు పలుమార్లు చావుకు దగ్గరగా జీవిస్తున్నారన్న నగ్నసత్యాన్ని ఈ కథలో ఓల్గా ఆవిష్కరించారు. దళిత పేద వర్గాల స్త్రీలు పేదరికంతో పాటు పురుషాహంకారమనే అదనపు హింసకు గురవుతున్న వైనాన్ని ఈ కథలో తెలిపారు.

’సమాగమం’ కథలో మూడు కీలకాంశాలను శూర్పనఖ కథ ద్వారా స్పష్టంచేసే ప్రయత్నం జరిగింది. ఒకటి పురుషుడు స్త్రీని ఒక వస్తువుగా(object) వాడుకునే విధానం, చూసే పద్ధతి రెండు అందాన్ని గురించి అమలులోవున్న పురుష కేంద్రక దృష్టిని నిరాకరించే భిన్న సాంస్కృతిక సన్నివేశాల నుంచి వచ్చిన ఇద్దరు స్త్రీల (శూర్పనఖ,సీత) జీవితాల్లో వున్న సారుప్యతను(similarity) బహిర్గతం చేయటం.

’సమాగమం’ కథ కంటే మరింత Philosophical heightsకి వెళ్ళి రాసిన కథ ’మృణ్మయనాదం’.ఈ కథలో అహల్య పాత్రను ఓల్గా పునఃసృష్టించిందన్నా ఆశ్చర్యం లేదు. పితృస్వామ్యానికి సమాజంలో నైతికత ఎప్పుడు పురుష కేంద్రకంగానే వుంటుంది. Law of the father   అన్నిరంగాల్నిఆవ రించి   వుంటుంది. సామాజిక నీతి నుంచి లైంగిక విషయాల వరకు అన్ని పురుషుడికి అనుగుణంగా స్త్రీకి వ్యతిరేకంగా అమలులో వుంటాయి.  ఈ ద్వంద్వత్వాన్ని దాని వెనుకవున్న రాజనీతిని బహిర్గతం చేసిన కథ “మృణ్మయనాదం”.

చరిత్ర క్రమంలో స్త్రీలు కోల్పోతున్న space నుrepresent చేస్తున్న పాత్రలు అలాగే ఆర్యధర్మంలో ముద్దుగా పెరిగిన సీతను educate చేయడానికి రేణుక, ఊర్మిళ, శూర్పనఖ అందరూ ఆమెను ఎదిగించడానికి భవిష్యత్తులో రాముడి చేత పరిత్యజించబోయే భావిచిత్రాన్ని  రేణుకాదేవిలాంటి మేధావి ఊహకు కూడా అందేవుంటుందన్న ఊహతో నిర్మించిన పాత్రే అయినా తరతరాలుగా స్త్రీలు పడుతున్నఅవమానాలను ఈ పాత్రలు చాలా నిర్ధిష్టమైన ప్రతిపాదనలతో తమ అనుభవాలను యువతకు అందించే ప్రయత్నం ఓల్గా ,” సైకత కుంభం , సమాగమం, విముక్త , మృణ్మయనాధం,” నాలుగు కథల్లో వ్యక్తం చేయడం జరిగింది. ఈ నాలుగు కథలు స్త్రీలు కోల్పోయిన సామాజిక చట్రంలోని లోపాలను ఎత్తి చూపడమే కాక ఆయాపాత్రలకు పునర్నిర్మించడం ద్వారా స్త్రీలోకానికి హేతుపూర్వకమైన స్త్రీవాద దృష్టికోణాన్ని అందించే ప్రయత్నం విజయవంతంగా చేయగలిగారు 

           ఈ కుండ చేయడానికి ఎంతో ఏకాగ్రత కావాలి, నా ఏకాగ్రత తెలియని వాళ్ళంతా నా పాతివ్రత్యంతో ఇసుక కుండ తయారు  చేస్తున్నాననుకున్నారు. నా పాతివ్రత్యానికేమీ లోపం లేదు కనుక అనుకోనిమ్మని వూరుకున్నాను ఏకాగ్రత ఎప్పుడైనా భిన్నం కావచ్చు .కారణం ఏదైనా కావచ్చు, నా విషయంలో ఒక పురుషుడు కారణమయ్యాడు, ఆ పురుషున్ని చూసినంత మాత్రానే నా పాతివ్రత్యం భంగపడిందని నాభర్త ఆగ్రహించారు. మహాజ్ఞాని జమదగ్ని మహర్షి తపస్సు ద్వారా జ్ఞానం సంపాదించిన భార్య పాతివ్రత్యంపై పట్టువదలని (పే.52 విముక్త సంకలనం ; ఓల్గా -సైకతకుంభం సాహితీ ప్రస్థానం ,జనవరి 2010) అని అంటుంది.సీతతో రేణుకాదేవి .ఈమె పాతివ్రత్యానికి కుండకు ఒక విధంగా రూపంలో, సారంలో గల సారూప్యతను చెప్పే ప్రయత్నం చేసింది. తాను ఎంతో ఏకాగ్రతతో సాధించిన విద్యకు పాతివ్రత్యం కారణమని పితృస్వామ్య సామాజిక స్వభావానికి ప్రాతినిత్యం వహిస్తున్నవారనుకుంటే అది తనలోని ఏకాగ్రతకు ,పట్టుదలకు, నైపుణ్యానికి గల నిదర్శనం గా రేణుకాదేవి భావిస్తుంది. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థ దృష్టికోణంలో లేని లోపాన్ని పరశురాముడు –రాముడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యధర్మం నిర్ధేశిస్తున్న పాతివ్రత్యాన్ని సీతతో జరిపిన సంభాషణలో చర్చకు పెడుతుంది. సైకత కుంభం అంటే ఇసుకతో చేసిన కుండతో పాతివ్రత్యాన్ని పోల్చడం ద్వారా వైవాహికవ్యవస్థను పటిష్టం చేయడానికి  నిర్ధేశింపబడిన నియంత్రణ పాతివ్రత్యం రూపంలో కొనసాగుతున్న ఆర్యధర్మం ఎంత సులభంగా చేజారితే బద్దలయ్యే సైకత కుంభం అని చెప్పడం ఓల్గా స్త్రీవాద దృక్పధం అటు రేణుకాదేవి ఇటు ఊర్మిళ ఇద్దరూ ఆర్యధర్మం వైవాహిక వ్యవస్థలోని డొల్లతనాన్ని బద్దలు చేయడానికి ఓల్గా ఎన్నుకున్న పౌరాణిక పాత్రలు.

       ’సమాగమం’ కథలో శూర్పనఖ పాత్రద్వారా రాక్షస స్త్రీగా ఆమె ప్రేమను చూసిన అపహాస్యాన్ని ద్రావిడ స్త్రీలు పొందిన అవమానాలను ,వాటిని శూర్పనఖ లాంటి హృదయ  సౌంధర్యరాశి అయిన ఆమె పాత్రను పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. విముక్త కథలో వనవాసం నుండి తిరిగొచ్చిన సీతతో ఊర్మిళ తనకు ఇతరులతో గల సాంబంధాలను ఇలా విశ్లేషించుకుంటుంది. ప్రతి ఒక్క సంబంధాన్ని మన తండ్రి, నీవు లక్ష్మణుడు ,రాముడు ,కౌసల్య తన అనుభవసారంలోంచి అన్ని సంబంధాలను పునర్నిర్వచించుకోగలిగింది.అంతే కాదు న్యాయాన్ని ప్రశ్నించగల విజ్ఞతను సంపాదించుకుంటుంది.అదే విజ్ఞత. 

మరోకథ “వెలుగులో చీకటి!” ఎప్పుడయితే డబ్బు మానవ సంబంధాలను నిర్ణయించటం జరుగుతుందో అదే సందర్భంలో సుఖం, అభివృద్ది, వెలుగు చీకటి మంచి చెడ్డల్లాంటి విషయాలకు, విలువలకు వున్న అర్థాలుకూడా మారిపోతాయి. అంతకు ముందు ఆదర్శాలుగా గుర్తించబడిన విలువలు కూడా ప్రశ్నార్థకమవుతాయి. ఈ మారిన విలువల సందర్భంలో ఎవరు ఎటువైపుంటారనేది చెప్పటం కష్టం.

’పట్టపగటి చీకటి’ అనే కథ ఓల్గా మామూలుగా రాసే కథలకు భిన్నమైన కథ. ఈ కథ ప్రారంభం చాలా ప్రతీకాత్మంగా మొదలై పాఠకుణ్ణి ముందుకు లాక్కుపోతుంది. కథ లో తరువాత రాయబోయే విషయాలను చాలా గాఢంగా కథ ప్రారంభంలో సంకేతించడం ఇందులో కనిపిస్తుంది.

ఓల్గా రాసిన poetic గా వుండే మరో కథ “జైలుగది ఆత్మకథ” జైలుని metaphorగా తీసుకొని వర్తమాన వ్యవస్థను, అందులో నిరంతరం అమలయ్యే హింసను ఈ కథ చాలా శక్తివంతంగా చిత్రిస్తుంది. లిటరల్ గా చూసినపుడు ఈ కథ మామూలుగా జైళ్ళలో అక్రమంగా నిర్దారించబడి చిత్రహింసలకు గురిచేయబడే, అప్పుడ్డప్పుడు హత్య చేయబడే వ్యక్తుల గురించి ఒక elegy లాగా అన్పిస్తుంది. 

లైంగిక వ్యాపారం అనేది ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలింది. ఇందులో సమిధలవుతున్న వాళ్ళలో చిన్న చిన్న పిల్లలుండటం అత్యంత విషాదభరితమైన అంశం. రోజూ మనం చూసే వార్తా పత్రికలలో అసంఖ్యాకంగా ఈ లైంగిక హింస దారుణాలకు సంబధించిన వార్తలను చదువుతున్నాం. ఒక స్త్రీ వాదిగా ఓల్గా అటువంటి సంఘటనలకు స్పందించి ’అయోని’కి  కథారూపమివ్వటం జరిగింది.ఈ కథ లోని పాత్రను రెండు విరుద్ద అనుభవాల నుంచి ఆ అనుభవాలను ఉత్తమపురుషలోనే కథను నడపటం జరిగింది.

ఆ పాప agonyని ఓల్గా శక్తివంతంగా ఆవిష్కరించగలిగారు. అంత చిన్నపాప పురుషాంగాన్ని విషం పూసిన కత్తిగా, ’ఖడ్గమృగపు కొమ్ము’గామారి విజృంభించటంలో ఉన్న హింసను అనుభవించిన పాపవేదనను ఓల్గా శక్తివంతంగా ప్రతిబిం బించటమేకాక, అటువంటి అసాధరణ అనుభవానికి గురైన వ్యక్తులు తీసుకునే నిర్ణయంలో ఉండే అసాధారణత్వాన్ని కూడా అంతే శక్తివంతంగా ఆవిష్కరించారు. తనను యోనిగా తప్ప మరే రకంగా గుర్తించని సమాజాన్ని నిరాకరించి, ఆ గుర్తింపును రద్దుచేసుకొని ’అయోని’గా మారాలనే పాప ఆకాంక్ష వెనుక ఉన్న వేదన, అమలయిన హింస  పాఠకుల్ని కదిలిస్తాయి.

సమాజంలో ప్రజాస్వామిక విలువలు ఏర్పడటానికి చేయాల్సిన కృషికి అంకురార్పణ చేసిన రచయితలుగా చలం, కుటుంబరావులను గుర్తించారు. తెలుగు సమాజంలో స్త్రీ సమానత్వాన్ని గురించి మట్లాడిన చలం, కొ.కు లాంటి రచయి తల రచనలలోని స్త్రీవాద వైఖరిని సహృదయ పాఠకురాలిగా, విమర్శకురాలిగా చాలా సంక్లిష్టంగా అనిపించేవారి రచనలను కూడా ఆమె విశ్లేషించారు. ముఖ్యంగా కొడవటిగంటి కుటుంబ రావు రచనలలో, ఉదాహరణకు ’ప్రేమ-పెళ్ళి’, ’రాయబారం’, లేచిపోయిన మనిషి’ మొదలైన కథలల్లో వున్న రాడికల్ ప్రతి పాదనలను ఓల్గా తాత్వికంగా విశ్లేషించి సమర్థించారు.  తన భావజాలంతో సమాన ప్రాతినిధ్యం వహించేకథలను విశ్లేషించడం ద్వారా ఒక సపోర్ట్ సిస్టమ్ ను డెవలప్ చేసుకోవడం ఒక ఎత్తుగడ అయితే తనకంటే ముందుగా ప్రేమ-పెళ్ళి గురించి వాళ్ళు చేసిన రాడికల్ ప్రతిపాదనల కొనసాగింపుగానూ, వారసత్వాన్ని డిఫైన్ చేసుకొనే అస్సర్టివ్ నెస్ కూడా అమెరచనల్లో వ్యక్తమయ్యే ఉత్తమ సహృదయతత్వం.     

*****

Please follow and like us:

3 thoughts on “కథాకాహళి- ఓల్గా కథలు”

  1. ఓల్గా మీరు చెప్పినట్టు ఒక ఆవేశపూరితమైన వేగంతో మొదట్లో స్త్రీవాద రచనలు చేశారు. నిజమే. రంగనాయకమ్మగారి నుంచి పితృసామ్యవ్యవస్థపట్ల ఒక వైముఖ్యాన్ని పురుషద్వేషి అనిపించేంత తీవ్రవాదంతో మొదలైన స్త్రీవాద సాహిత్యం ఓల్గా విజ్ఞతతో ఒక ప్రజాస్వామిక దృక్పధాన్ని స్త్రీ – పురుష సంబంధాలమధ్య ఉండవలసిన అవసరంవైపు దృష్టిని మల్లించి ఒక మలుపునిచ్చి ఒక సమ్యయమానాన్ని ఒక హేతువాదాన్ని తన తాత్విక దృక్పథానికి ఇవ్వగలిగారు. అయితే సభ్య సమాజంలో రాజకీయ పరిభాషలో వాడే సమానత్వం కాకుండా సమభావాన్ని జీర్ణించుకుని సామరస్యంతో సహజీవనం చెయ్యగలిగిన స్త్రీ -పురుషులు పరస్పర వైరుధ్య శక్తిలుగా కాక ఒకరినొకరు పూరించుకోగల kathalani, samarasya వాతావరణాన్ని వూహించుకోగలిగిన ప్రపంచాన్ని సాహిత్యంలో సృష్టించగలిగితే బాగుటుంది. అది వోల్గాయే చెయ్యగలదు. తన సుదీర్ఘ సాహిత్యప్రయాణంలో ఇలాంటి పరిణత సంపాదించుకున్న రచయిత్రి ఆమె ఒక్కరే. ఇది విమర్శ కాదు. ఒక సవాలుగా, సద్విమర్శగా ఆమె మీరు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను .

    1. శ్యామలగారు మీ అభిప్రాయం, అభ్యర్థన సమంజసమైనవె. ఒళ్గా గారికి మీ అభిప్రాయాన్ని తెలుపగలను.
      మీ స్పందన చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.