సిలికాన్ లోయ సాక్షిగా 

-బత్తుల వీవీ అప్పారావు

 

                           సుప్రసిద్ధ రచయిత్రి డా|| కె. గీత గారు 130 పేజీల్లో రాసిన 18 కథలున్న “సిలికాన్ లోయ సాక్షిగా” పై సమీక్ష రాయడం నాకు సాహసమే.  పాఠకలోకానికి తెలిసిందే తెలుగులో నా మిర్చీలు, ఇంగ్లీషులో చిల్లీలు ఎన్ని అక్షరాలు ఉంటాయో.  అంతకు మించి నేను ఏదైనా రాయడం చాలా కష్టం.

                            మంచి చదువరులకి ఒకటి, రెండు సిట్టింగుల్లో ఈ కథలు చదివేయడం సాధ్యమే. పేద బ్రతుకుల పట్ల దయ, కనీస సానుభూతి ఉన్నవారిని ఎవరినైనా పట్టు వదలక చదివిస్తుంది ఈ కథల పుస్తకం. దీని ధర (ఆ)కాకరకాయల కన్న చౌక. కానీ చదువుతూండగానే అభాగ్యుల పాత్రలు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతాయి. మన మనసుల్లో ఆకారం రూపొందించుకుంటాయి. అమెరికా పర్యటనకు వెళ్ళిన నేను నా కళ్ళకు కనిపించని పేదల బతుకులపై శోధన ప్రారంభించాను. “సిలికాన్ లోయ సాక్షిగా” చదివాక నా శోధనలో తేలిన సంగతులకు ఈ కథలు అద్దం పట్టాయి. నవల్లో, కవితల్లో రచయిత్రి చూపించే భావుకతకు పూర్తి భిన్నంగా విషయ ప్రధానంగా ఉన్నాయి ఈ కథలు. నేను బాగా మెచ్చిన అంశం ఇది. అరసికుడను కదా! ఇవి కథలు కావు, వ్యథలు. బెంగాలీ యువకుని జీవితం ఎంత “కరుణ” రసాత్మకమో కరుణ పాత్ర ద్వారా అర్థమౌతుంది. పొరుగున ఉన్న జార్జికి ఏమైందో తెలుసుకోవడానికి సుప్రియ చేసిన ధైర్యం ఈ సమాజంలో మరెవ్వరూ చేయలేరు.

                                  ఈ వ్యవస్థ బజారుది.  వస్తువుల్ని తయారుచేసే కార్మికుల్ని దోచుకోవడం, ఆ వస్తువుల్ని అమ్మి అదే కార్మికుల్ని వినియోగదారులుగా కూడా ఎడా పెడా దోచుకోవడం ఈ వ్యవస్థ వికృత లక్షణం.  ఏ ఇద్దరి మధ్యా సయోధ్య లేకుండా విడదీసి తనను తాను కాపాడు కోవడమే దీని ప్రయత్నం.  రచయిత్రి మహిళావాదిగా ముద్ర పడ్డా జార్జి కథ కదిలించని మహిళలుంటారా? పేదలకిచ్చే ఫ్రీ ఫుడ్డు వల్ల ట్యాక్స్  రిబేట్ ద్వారా లాభ పడేది  బడా మాల్స్ వాళ్ళే. సుప్రియ లాంటి వాళ్ళు సొంతంగా  కార్లల్లో తీసుకెళ్లి ఎంత చేయగలరు? అమెరికాలో స్థిరపడిన అభాగ్యుల భాగ్యమెంతో  ధైర్యంగా తూకం వేసింది  రచయిత్రి. ఈమె “అన్ బ్రాండెడ్ కమ్యూనిస్ట్”. మంచి కమ్యూనిస్టు అయినా పార్టీ సభ్యత్వం పొందనవసరం లేదు కదా! దీనుల కథల్ని తెలుగులో రాసి 15 కోట్ల తెలుగు వాళ్ళచే చదివించే, ఆడియో ద్వారా భవిష్యత్తులో వినిపించబోయే రచయిత్రి ప్రయత్నం ఉద్యమ సమానమైంది. వ్యధలు భాషలకు అతీతం. ఉత్తమ కథ ఏదో ఒక భాషలో పుట్టినా వందల కొద్దీ భాషల్లో అనువాద మౌతుంది. కథల ద్వారా పేదల కష్టాలకు మూలమేంటో విడమర్చి చైతన్యవంతుల్ని చేయడానికి లోతున్న “లోయ” కథల్లాంటివి రచయితల నుంచి విరివిగా రావడం ఎంత అవసరం!

                             తొలి కథ స్పానిష్షూ-ఉష్షూ లోనే ప్రియ మనసేంటో అర్థమైపోతుంది. “మా చుట్టుపక్కల నల్లజాతీయులు ఒక శాతం కంటే తక్కువే…వారిపట్ల వివక్ష ఇప్పుడు ఎవరూ కనపరచరు. కాబట్టి అమెరికాలో ఇప్పుడు వివక్ష లేదనుకున్నాను. కాని రోజులు గడిచే కొద్దీ నాకు యిక్కడ “వర్గ” వివక్ష బాగా కనిపించడం మొదలైంది’’. ‘‘అమెరికాలో మధ్యతరగతి, ధనికవర్గంగా భావించబడే కాకేషియన్లు మొ. వాళ్ళు వీళ్ళని కలుపుకోరు’’.  ‘‘వర్గవివక్ష అనడంలోనే రచయిత్రి ఆలోచనా విధానం సుస్పష్టం. వివక్షకు మూలం రంగుకాదు, పేదరికం అంటూ అతి స్పష్టంగా కుండబద్దలు కొడుతుంది రచయిత్రి, అమెరికా వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే (అమెరికా వచ్చిన ఎర్లీబర్డ్ కాకపోయినా).

                          తొలికథ ముగింపు మకుటాయ మానం: “మర్నాడు వరలక్ష్మీ వ్రతం తాంబూలానికి నన్ను, మరో యిద్దరు, ముగ్గురు తెలుగు మహిళల్ని పిలిచింది వైష్ణవి. తాంబూలంగా ఒకో అరటిపండు చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించింది. మా పక్కింటి వాళ్ళు స్పానిష్…. అంటూ వాళ్ళకి ఏదో చెప్తోంది. ఇక అక్కడ ఉండలేక యింట్లో పనుందని వచ్చేసాను.‘‘బైటికి రాగానే అటుగా వస్తూ అలీసియా ఎదురుపడింది. ఆ పండు తన చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించేను’’. (ప్రియ తెలుగింటి ‘‘వాకిలి’’ కదా) ‘‘అదేమిటో తనకి అర్థంకాకపోయినా నవ్వుతూ నన్ను కౌగిలించుకొంది’’. అలీసియా ఒక పెద్ద తరహా పేదపాత్ర. ఆమె ప్రియకి జీవితకాలం ‘‘పెద్ద’’స్నేహితురాలు. అలీసియా రూపం చదువరుల కళ్ళకు కడుతుంది. పేదలు చేస్తే గీస్తే చిన్న నేరాలు. పెద్దల దోపిడి ముందు అవి ఏ పాటి?

                          రెండో కథ: మన యిండియన్స్ మన యిండియన్స్ పైనే వల వేసే వైనం ‘‘వర్క్ ఫ్రం హోం’’లో చదవచ్చు. అందుకే మనవాళ్ళంటే మనవాళ్లే భయపడతారు యిక్కడ. వలవెయ్యడం యిక్కడ మానవ నైజంకాదు, యిండియన్ల నైజం అని స్పష్టం చేస్తుంది రచయిత్రి. ఈ చైన్ స్కీం 1970ల్లోనే యిండియాలో ప్రచురం.   బ్యాంకుల్లో ఉన్న లొసుగుల్ని అవకాశం తీసుకొని పాపం పైచదువుల కోసం వచ్చే విద్యార్ధుల్ని ఎలా బలిచేస్తారో. ‘‘ఇక్కడివాళ్లు ఎంత బాగా పలకరిస్తారో.  యిండియన్స్ కొత్తవాళ్లని చూసి యిక్కడ వాళ్లలా పరిచయ హాసం చెయ్యరెందుకో’’అన్న వాక్యాల్లో రచయిత్రికి అలవాటైన కంపేర్ & కాంట్రాస్ట్ (compare & contrast) పద్దతి కనిపిస్తుంది. (తాగిన మత్తు దిగకపోతే hang-over అంటారు కదా – నాకు స్వానుభవం లేదు – విమానంలో దూర ప్రయాణంచేసి దిగినాక కొన్నాళ్లు మత్తువదలకపోతే కొత్త ప్రయోగంగా “విహంగ్ ఓవర్” అనవచ్చుకదా!)

                           మూడో కథ: అమెరికా వ్యవస్థలోని ఎగుడు దిగుళ్ళకు అద్దం పట్టే కథ “డిపెండెంట్ అమెరికా”. భర్త వీసామీద వచ్చిన మహిళ ఎన్ని అర్హతలున్నా “kitchenaire” (నామాటల్లో)గా మిగిలిపోయే దుస్థితి. రిసెషన్, ఇంకా పదేపదే గవర్నమెంటు షట్ డౌన్ ల కాటునపడే అమెరికాలోని భర్తలకే ఉద్యోగం గ్యారంటీ లేని దౌర్భాగ్యం ఈ కథలో వ్యక్తమౌతుంది.

                            నాల్గో కథ: కాలేజీ చదువులు ఎంతభారమో తెలియజేస్తుంది ‘‘కాలేజీ కథ’’. పౌరసత్వం ఉన్నవాళ్లకు 12వ తరగతివరకే ఉచిత చదువులు.  వాళ్ళకీ కాలేజీ చదువులు అందని ద్రాక్షపళ్లే. “దేశాల దేశం”లో (నామాటల్లో) మన యిండియన్లకు యిందువల్లనే అవకాశాలు? స్థానికులకు ఉన్నత చదువులు ఎప్పడికి అందేనో?

                            ఐదో కథ: సినిమా టిక్కెట్టు కాదు ‘‘పోలీసుటిక్కెట్టు’’ అన్నట్టు చెప్పే కథ డ్రైవింగూ-లైసెన్సూ. యిక్కడ నేరం జరిగిన క్షణాల్లోనే పోలీసులు ప్రత్యక్షమౌతారు. ఫైన్ భారీగా ఉంటుంది. ఫైన్ మొత్తాన్నివెబ్ సైట్ లో చూసుకోవచ్చు. అంతే కాదు ఇంటికి పోస్టులో కూడ శ్రీముఖం వస్తుంది. మనలాంటి విజిటర్లకు కనిపించేవి రోడ్లూ, కార్లే యిక్కడ. కార్లో ప్రయాణిస్తున్నంత సేపు మనుషులు కనిపించరు. టూరిస్టు ఎట్రాక్షన్లకు వెళితేతప్ప.

                             ఆరో కథ: అలీసియా మళ్లీ ప్రత్యక్షమౌతుంది ‘‘ఫుడ్డూ-వేస్టుఫుడ్డూ’’ కథలో. ఈ పేదరాలితో రచయితకు మా మంచి స్నేహం.  సంక్షేమపథకాల్లో యిండియాలో జరిగే ఘోరాలు ఇక్కడ కమ్యూనిటీ హాళ్ళల్లో యిచ్చే ఫుడ్ విషయంలోనూ జరుగుతున్నాయి. (యిండియాలో ఇంటి యజమానికి రేషన్ కార్డు ఉంటుంది, అద్దెదారునికి ఉండదు కదా!) అక్కడా ఇక్కడా పేదలకు గొప్ప సహాయం చేస్తున్నట్టు నటించడమే జరుగుతున్నది అని “గంట కొట్టి” చెప్తుంది రచయిత్రి. “స్కూళ్లల్లో తగ్గింపురేటుకో, ఉచితంగానో పెట్టే తిండి తినలేక ఉదయం నుంచి అర్ధాకలితో ఉంటారు పిల్లలు” అన్న అలీసియా మాటలు కర్కోటకుల గుండెల్నీ కరిగిస్తాయి. ‘‘నా బంగారు నువ్వు, నాకోసమే అమెరికాకు వచ్చావు’’ అని ప్రియను తడికళ్లతో చూసిన ఆమె మన కళ్లల్లోనూ తడిని తెప్పిస్తుంది. రోడ్లు, కార్లు అనేట్టు ఉండే అమెరికాలో పేదల కోసం ప్రజారవాణా అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడం ఎంత అమానుషం?

                             ఏడో కథ: ఆరుపేజీల చిన్న కథ ‘‘హోంలెస్’’ నిలువ నీడలేని ఒక బెంగాలీ మూలాలున్న విద్యావంతుడైన “బెనర్జీ” అనే  యువకుని కథ.  రిసెషన్ వల్ల చిన్నా, చితకా  ఉద్యోగం కూడా దొరకని వ్యధ. హోంలెస్ షెల్టర్ కోసం అతని విన్నపం యింకా క్యూలోనే ఉందట. అమెరికాలోని అభాగ్యుల్ని ఎవరూ ఆదరించరు, చట్టాలకు భయపడి.  కమ్యూనిటీ సెంటర్లలో ఫుడ్ దొరికినా, చలిపులినుండి తలదాచుకొనే అవకాశం ఉండదు. యింతటి “ఏక ధృవ ప్రపంచం”లోని ‘కరుణ’రసపూరితమైన వ్యధ యిది. డబ్బురుచి మరిగిన వ్యవస్థను నిలదీసి కళ్ళముందుంచుతుంది రచయిత్రి. కరుణ పాత్రలో రచయిత్రి కనిపిస్తుంది.

                             ఎనిమిదో కథ: హోంలెస్ కన్నా చిన్నకథ ‘‘ఇల్ హెల్తూ-యిన్స్యూరెన్సూ’’.  బెంగాలీ “బెనర్జీ”లాంటి మరో అభాగ్యుని పాత్ర జార్జి.  ‘‘అయినా ఇక్కడున్న సగం జనాభాలాగే నేనూ’’ అన్న అతని మాటలు అమెరికాలో దైన్యం ఎంత శాతం ఉందో తూకం వేసినట్టు తెలుపుతాయి. ‘‘ఈ దేశంలో ప్రైవసీలు, పకడ్బందీ సెక్యూరిటీలు, నిబంధనలు మనుషులకు భద్రతని కల్పిస్తున్నాయా?  దూరం చేస్తున్నాయా?’’ అని ఆవేదన చెందుతుంది రచయిత్రి. ‘‘ఈ దేశంలో యిన్స్యూరెన్స్ లేకపోతే హాస్పటల్స్ వడ్డించే వేలకొద్దీ (డాలర్ల) బిల్లు యిక్కడి సామాన్యులు ఎవరూ చెల్లించలేరు. ప్రభుత్వం యిచ్చే అరకొర వైద్య సదుపాయానికి అర్హులు కాని జార్జి లాంటి జీవులెందరో. ఇందాకే ఆన్ లైన్ లో చూసాను. యిలాంటి వాళ్ళు యాభై మిలియన్లు (5 కోట్లు) వరకూ ఉన్నారట యిక్కడ. యిదీ యీ బడా(యి)దేశం గురించిన సత్యం!

                              తొమ్మిదో కథ: ఐదు పేజీలున్న అతిచిన్న కథ ‘‘సింగిల్ మామ్’’ (ఒంటరి తల్లి).   మెరాల్డా చుట్టూ తిరిగిన మరో వ్యథ యిది. రిసెషన్ వల్ల ఉన్న ఉద్యోగం హూష్ కాకి కావడంతో చిన్నా చితకా పనులు చేసుకుంటూ అర్ధరాత్రి మాత్రమే ఒక గది అద్దెకు తీసుకుంటుంది మెరాల్దా. (యిలా రాత్రివేళ మాత్రమే అద్దెకు ఉండే పద్ధతి గతంలో నేనెప్పుడూ వినలేదు) ఆమె మాటలు వినండి. ‘‘ఇక్కడ నాలాంటి యువతులు సగానికి పైగా ఉన్నారు. ఇలాంటి సమస్యలు యిక్కడ సర్వసాధారణం. కొంచెం పర్సనల్ బాధ ఉందనుకో, కాని సమాజానికి ఇది అసలు  సమస్యేకాదు’’ యీ సమాజంలో ఎంతో కొంత న్యాయం జరుగుతున్నది సగంమందికి మాత్రమే. మిగిలిన సగభాగం యీ నికృష్ట వ్యవస్థలోని నిర్భాగ్యులే.

                                10, 11 కథలు: ‘‘ఓపెన్ హౌస్’’ అనే “ఓన్ హౌస్” కథ రెండు ఎపిక్–సోడ్ లు. మన కథానాయకి సుప్రియాదేవి సొంత యిల్లు కొనుక్కోవడంతో విజేత అవుతుంది. పెద్దగా పట్టింపులు లేకుండా భర్తతో గృహప్రవేశం చేస్తుంది. భారాన్ని ఆలోచించి డీలా పడే భర్తల మీద సొంత ఇల్లు కావాలనే పట్టుదల ఉన్న భార్యల విసుర్లు ఉంటాయి. యిది వ్యథ కాదు, విజయం సాధించిన యిల్లు+ఆలి కథ. సంభాషణల్లో కొంటెతనం, అనురాగం మిళితమై గిలిగింతలు పెడతాయి.    

                                 12, 13 కథలు: “ల్యాప్ ట్యాప్ కథ”  అంటూ రెండు పర్వాలుగా రాసిన కథ యిది. మన కావ్యయిత్రి సుప్రియాదేవి చివరికి అభయగా సాక్షాత్కరిస్తుంది. ఒక బాయ్ కారుని రాంగ్ పార్కింగులో పెట్టించి 5 డాలర్లు వసూలు చెయ్యడమే కాకుండా, కారులో పెట్టిన విలువైన ల్యాప్ ట్యాప్ ని కారు అద్దం బద్దలుకొట్టి, కొట్టేసిన కథ యిది. బ్యాంకరు, సెల్లరు, యిన్స్యూరెన్స్ కంపెనీ,  పోలీసులు పట్టించుకోకపోయినా ఒక మామూలు మెకానిక్ యిచ్చిన సలహాతో కొత్త ల్యాప్ టాప్ ని సాధించిన సాధకి మన కథానాయిక. యింతటి మహాదేశంలో ఒక బాలుడు సైతం ఎలా మోసగించగలడో, బాధ్యతగలవాళ్ళు ఎలా తప్పించుకోగలరో చివరికి ఒకమంచి మనిషి సాయంతో కథ ఎలా “శుభాంతం” అయ్యిందో కథయిత్రి కథనం చేసిన వైనం చూస్తాం యీకథలో…

                                 14వ కథ: ‘‘లివ్ ఏ వైఫ్’’లో నాటి సోవియట్ రష్యా, నేటి అమెరికా, ఇజ్రాయిల్ దేశాల గురించి చర్చనడుస్తుంది. ఏ దేశంలో, సమాజంలో నైనా సమస్యలున్నా ఉత్సాహంగా బతకాలి అని కథ ముగుస్తుంది. కాని ఉద్యమాలతోనే పరిష్కారాలు అని తనకు తెలిసినా ఎందుకో చెప్పదు రచయిత్రి. లివ్ ఎ లైఫ్ అంటే రాజీ పడుతూ  సర్దుకు పోవడం కాదూ?

                                 15వ కథ: అమెరికాలోనే కాదు యిండియాలోనూ చైల్డ్ కేర్ ఎంత కష్టంగా మారిందో తన అమెరికా అనుభవాన్ని తెలియచేస్తుంది కథానాయిక ప్రియ “చైల్డ్ కేర్” లో.  అమెరికా సంస్కృతికి భయపడి యిండియాకి వెనుతిరుగుతున్న వాళ్లెందరో మనకి తెలిసిందే కదా!

                                 16వ కథ: అమెరికాలో “రిపేరాయణం” గురించి రాసిన కథ ‘‘రిపేర్ యిన్ అమెరికా’’ (“రిపేర్ అమెరికా” అంటే అర్ధం మారుతుంది, జాగ్రత్త!) చిన్న చిన్న రిపేర్లు వచ్చిన వాటినీ పారేసి కొత్తవి కొనుక్కోవడం మేలు అమెరికాలో. ఎందుకంటే కొత్తమోడల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. కాని ఒక యిల్లాలు గడుసుగా తక్కువలోనే రిపేరు చేయించుకోవడం చూస్తాం ఈ కథలో. కాని కారు రిపేరు స్వయంగా నేర్చుకుందామన్న ఆమె కోరిక నెరవేరదు.

                                 17వ కథ: ఒక చైనా వృద్ధురాలి వ్యథ ‘‘ఫీనిక్స్’’.  ఆమె మాటలు చదవండి ‘‘కొడుకు నాలో భాగమే,  కాని వాడు నావాడు కాదని నిరంతరం యింట్లో గుర్తుచేస్తుంది వాడి భార్య. యిక పిల్లలంటావా,  యిక్కడి పద్ధతిలో పెరిగినవాళ్ళు, కాబట్టి అనుబంధాలుండవు. వాళ్ళంతా యంత్రాలతో పనిచేస్తూ యంత్రాలుగా మారిపోయారు. మధ్యలో నీలాంటి ఓయాసిస్సు దొరకడం నా అదృష్టం. యిది కథ సమ్మరీ.  e-ప్రపంచంలో అమెరికా సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ సవాళ్ళేంటో స్పష్టం చేస్తుంది లీ అనే యీ వృద్ధ పాత్ర. అన్ని కథల్లోనూ యిలాగే సస్పెన్స్ కాని గొప్ప ముగింపులుంటాయి.

                                   18వ పర్వం: ఆప్యాయతా అనురాగాలకి హైలైట్ “అమీగాస్” అనే కథ. అలీసియా అనే ఒక పేద మహిళతో ప్రియకి గాఢమైన అనుబంధం. తననూ వాళ్ళతో చేర్చుకోమంటుంది జీనా అనే హౌస్ క్లీనర్ పాత్ర. రచయిత్రికి పేదలపట్ల ఉన్న అభిమానంతో సుసంపన్నదేశం అన్నఅమెరికాలో సామాన్యుల జీవనమేంటో,  యిది జాతి వివక్ష కాదు, “వర్గ” వివక్ష అంటూ తొలి కథనుంచి చివరి కథ వరకూ బరిలోనే ఉంటూ సాహసంతో చెబుతుంది రచయిత్రి.

ఇది కథల, వ్యధల  సమాహారం.

వెరసి 18  ఎపిక్-సోడ్ ల ఆధునిక మినీ కథాకావ్యం.

*****

bathulaVVapparao.com

9885008937

Please follow and like us:

2 thoughts on “సిలికాన్ లోయ సాక్షిగా(సమీక్ష)”

  1. Appa Rao garu congratulations.
    Chalakalam tharuvatha meeru vrasina samiksha chadavatam aanandagavundi. Alage Geetha gariki kuda Subhakankhalu.
    Konduri Kasivisveswara Rao

Leave a Reply

Your email address will not be published.