నా లండన్ యాత్ర: డా|| కేతవరపు రాజ్యశ్రీ

-సి.బి.రావు 

డా. కేతవరపు రాజ్యశ్రీ , కవి, రచయిత్రి, వక్త, సామాజిక సేవిక, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. కవిత్వంలో అన్ని ప్రక్రియలలో కవితలు వెలువరించారు. “వ్యంజకాలు”  అనే ప్రక్రియలో 108 వ్యంజకాలు వ్రాసి “బొమ్మబొరుసు” అనే పుస్తకం వెలువరించారు. “ఊహల వసంతం” కవితా సంపుటిని నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2010 లో ఆవిష్కరించారు. రవీంద్రనాథ్ టాగూర్  స్ట్రే బర్డ్స్ ను “వెన్నెల పక్షులు” గా అనుసృజన గావించారు. నిత్యజీవనం లోని సంఘటనలతో ముడివేసి, ఎన్నో ఆధ్యాత్మిక ఆలోచనలను “నీలోకి నువ్వు”, “ఆధ్యాత్మికత వృద్ధులకేనా” వగైరా పుస్తకాలను, ఆధ్యాత్మిక గుళికలుగా, పాఠకులకు అందించారు. రాజ్యశ్రీ సాహిత్య విశ్లేషణను, నియోగి “వంద ప్రశ్నలు – వేల భావాలు” పుస్తకం గా ప్రచురించారు. భగవద్గీత లోని 108 శ్లోకాలను సరళ భాషలో అనువాదం చేసి, “గీతామృతం” గా వెలువరించారు. సాహిత్యం లో తన కృషికి థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే గౌరవ “ డాక్టరేట్ ”, ఇతర సంస్థల ద్వారా, ‘’సాహిత్య శ్రీ”, “భారత్ భాషా భూషణ్”, ”ప్రజ్ఞాశ్రీ”, మరియు “వేదాంత వక్త” బిరుదులు స్వీకరించారు. పలు సాంస్కృతిక సంస్థలు రాజ్యశ్రీను ఘనంగా సత్కరించాయి. సచివాలయం లో, 1991లో ”చేతన సచివాలయ సారస్వత వేదిక” అనే సాహితీ సంస్థ ఆవిర్భవించినది. రాజ్యశ్రీ చేతన సాహితీ కార్యకలాపాల్లో, క్రియాశీలకంగా వుండి, పెక్కు కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేష్ ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉప కార్యదర్శిగా 2011 లో, ఉద్యోగ బాధ్యతల నుండి, పదవీ విరమణ పొందారు.  

సెప్టెంబరు 27, 28, 2014 లో వంగూరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు యునైటెడ్ కింగ్‌డం తెలుగు అసోసియేషన్  వారు సంయుక్తంగా లండన్ లో నిర్వహించిన, నాల్గవ ప్రపంచ తెలుగుసాహితీ సదస్సుకు రాజ్యశ్రీ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు.  ఆ సదస్సులో పాల్గొనటానికి రాజ్యశ్రీ లండన్ వెళ్ళారు. ఈ సందర్భంగా వారి అనుభవాల సమాహారమే ఈ లండన్ యాత్ర పుస్తకం.

తొలిరోజు సమావేశ వేదికను శ్రీయుతులు  వంగూరి ఫౌండేషన్ స్థాఫక అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ముఖ్య అతిధి ఆం.ప్ర. ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి, ఆం.ప్ర.శాసనమండలి ఉపాధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, కేంద్ర సాహిత్య ఎకాడెమి  బహుమతి గ్రహీత ‘పద్మశ్రీ’ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, అక్కిరాజు సుందరరామకృష్ణ, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ మరియు రాజ్యశ్రీ అలంకరించిన, ఈ మహాసభకు, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ మొదలగు దేశాలనుండి సుమారు 150 మంది తెలుగు సాహిత్యాభిలాషులు హాజరయ్యారు. 

ముఖ్య అతిధిగా విచ్చేసిన  కె.ఇ.కృష్ణమూర్తి తమ ప్రసంగంలో, తెలుగు భాషను ప్రపంచ భాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందచేస్తామని ప్రకటించారు. వేదికపై వున్న పెద్దలు తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి వివరిస్తే, కొందరు తెలుగు పద్యాలను ఆలపిస్తూ సభను రక్తి కట్టించారు. ఫ్రెంచ్ దేశీయుడు డేనియల్ తెలుగులో దండకం చదివి ఆకట్టుకున్నారు. రాజ్యశ్రీ ప్రసంగిస్తూ తెలుగు భాషలోని భిన్న కవితారీతులను సదస్యుల దృష్టికి తెచ్చారు. అలాగే తెలుగు భాషలో 56 అక్షరాలు వుండి, అన్ని అక్షరాలు పలికే విధంగా వున్న ఏకైక భాష అనీ, కన్నడ లో ‘ ప ‘ అక్షరం, బెంగాలి లో ‘ వ ‘ , ఇలా కొన్ని అక్షరాలు లేవు, పలకలేరు. పరిపుష్తి కలిగిన భాష మన తెలుగు భాష అనీ, తెలుగువారిగా పుట్టడం, మన అదృష్టమనీ చెప్పారు. తెలుగు భాషలో, ప్రతిదానికీ ఒక మాట వుంది. ఇంగ్లీషులో ‘ ఆంటీ, అంకుల్ ‘ అని చాల చుట్టరికాలకు  ఒకటే పదం వుంది. కాని తెలుగులో అత్త, మామ, మేనత్త, మేనమామ, వియ్యంకులు, వియ్యపురాలు ఇలా అన్నింటికీ విశదంగా పదాలున్నాయి. అందుకే తెలుగును పరిపుష్టమైన భాష అనీ, మాట్లాడుతుంటే వినసొంపుగా వుంటుందనీ, “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ” అని కొనియాడబడుతోందని, ఈ భాషను కాపాడుకొని, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన వుందని చెప్తూ ప్రసంగం ముగించారు.

భోజన విరామం తరువాత, పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తనికెళ్ళ భరణి ‘ ప్యాసా ‘ , రాజ్యశ్రీ ‘ రెక్కల్లో గీతామృతం ‘ , సుద్దాల అశోక్ తేజ  కవితల ఆంగ్లానువాదం, వడ్డేపల్లి కృష్ణ గేయాల సి.డి., రేగుల నీరజ ‘ మై డాడ్ ‘ పుస్తకాలను అప్పటి ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆవిష్కరించారు. రెండవ రోజు అతిధుల కవితాగానంతో సభ ప్రారంభమయింది. తరువాత మధుజ్యోతి తన తండ్రి కొలకలూరి ఇనాక్ జీవిత చరిత్రను    ‘ నాన్న ‘ అని రాసిన పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విరామానంతరం, పాలపర్తి శ్యామలానందప్రసాద్ అచ్చ తెలుగు పదాలతో అష్టావధానం చేసారు.              

ఈ కార్యక్రమంలో 3వ రోజు సైట్ సీయింగ్. అందరికీ లండన్ నగర దర్శనం. సదస్సు నిర్వాహకులు కిల్లీ సత్యప్రసాద్  బ్రిటన్ పార్లమెంట్ చూపిస్తామని ప్రకటించడంతో, అందరూ వుత్సాహభరితులయ్యారు. అక్కడ పార్లమెంటేరియన్ లుంబా తో ముఖాముఖి. సిరివెన్నెల ఇంగ్లీష్ లో  ప్రసంగిస్తూ సి.పి.బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవను కొనియాడారు. లుంబా అతిధులను పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ కు తీసుకెళ్ళి చూపించారు. ఆ తరువాత రాజ్యశ్రీ  తమ బంధువైన శారద సహకారంతో లండన్ లో ప్రముఖ పర్యాటన స్థలాలైన బిగ్ బెన్, థేమ్స్ నది, వెస్ట్ మినిస్టర్ బే, పార్లమెంట్ స్క్వేర్, స్కాట్లాండ్ యార్డు, 10 డౌనింగ్ స్ట్రీట్, క్వీన్ హౌస్ ఆఫ్ గార్డ్స్, ట్రఫాల్గర్ స్క్వేర్, సైంట్ జేమ్స్ పార్క్, బకింగ్ హాం పాలస్ మొదలగు ఆకర్షణీయ ప్రదేశాలను నడుస్తూ చూసారు. మధ్యలో తేనీరు కై కొంత విశ్రాంతి తీసుకుని లండన్ బ్రిడ్జి, టవర్ బ్రిడ్జి చూసి పులకితులయ్యారు. ఆ తరువాత  ‘ లండన్ ఐ ‘ ఎక్కి లండన్ విహంగ వీక్షణ చేసారు. ఆ రాత్రికి శారద వాళ్ళింటికి మకాం మార్చి, విశ్రమించారు. మరుసటిరోజు డబల్ డెకర్ బస్ లో పయనిస్తూ, హైడ్ పార్క్, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, లండన్ యూనివర్సిటీ, మే ఫెయిర్, రిచ్మండ్ వగైరాలను వీక్షించారు. బంధు మిత్రుల కోసం కొన్ని సావనీర్లు కొని, చివరగా ఈ లండన్ సాహితీ సదస్సుకు ఆహ్వానించి, ప్రోత్సాహపరిచిన వంగూరి చిట్టెన్‌రాజుకు, లండన్ లో ఆతిధ్యమిచ్చిన కిల్లి సత్య ప్రసాద్, డా.కిల్లి పద్మ, సభ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ తమ లండన్ అనుభవాలు ముగిస్తారు రాజ్యశ్రీ. ఈ పుస్తకం కేవలం నాలుగు రోజుల లండన్ పర్యటన విశేషాలే కాబట్టి, తక్కువ పుటలతో వుండి, వేగంగా చదివింపచేస్తుంది.    

ప్రతుల కొరకు -e book only

http://kinige.com/book/Naa+London+Yatra

ధర రూ.60/-

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.