వారు వీరయితే 

-వాత్సల్యా రావు

“అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని  పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద యుద్ధం తప్పింది వాళ్ళింట్లో.

“ఏమిటో, నాకు వయసు మీద పడుతోందో, ఈ పిల్లలు రాక్షసులో అర్ధం కావట్లేదు, అస్సలు లేచి తెమలరు పొద్దున్నే…” నిన్న కిందనుండి  ఆటో వాడి అరుపులు, హారన్ గుర్తొచ్చి చంటాడికి గబగబా రెండు ఇడ్లీలు కుక్కి సాక్సులేసి,కూతురి బ్యాగ్ లో వాటర్ బాటిల్ సర్దుతూ మనసులో అనుకుంది నీలిమ.

వాళ్ళని పంపించి రణరంగం లా ఉన్న ఇంటిని సర్ది కాఫీ కలుపుకుని కూర్చుందో లేదో, “గిన్నెలు  బట్టలూ అన్నీ ఒక్కసారే వెయ్యండమ్మా “అన్న పనిమనిషి రమణ అరుపువిని ఉక్రోషం వచ్చింది. కానీ అది కానీ మానెస్తే అన్న ఊహే భయంకరం అనిపించి ఉబికి వస్తున్న  కోపాన్ని మనసులో ఓ పక్కకి తోసేసి దానికి అంట్లూ బట్టలూ వేసి వచ్చి కూర్చుంది.

ఇంతలో శ్రీవారు లేచిన అలికిడి. తాగుతున్న కాఫీ కప్పు పక్కన పెట్టేసి ఇద్దరికీ టిఫిను బాక్సులు సర్ది,టేబుల్ మీద భర్త కి టిఫిన్ సర్ది టైము చూస్తే ఎనిమిదింపావు. “అయ్య బాబోయ్, పొద్దున్నే చేద్దామనుకున్న రిపోర్ట్ ఇంకా చెయ్యలేదు, పదింటికి మీటింగ్” అని గుర్తొచ్చి, త్వరగా వెళ్ళి చేద్దామనుకుని ఓ పది నిమిషాల్లో తయారయ్యి బాక్సు తీసుకుని బయట పడింది.బస్సెక్కాకా గుర్తొచ్చింది సగం తాగిన కాఫీ తప్ప అసలేమీ తినలేదని.

పని ఒత్తిడితో లంచ్ వరకూ ఏమీ తినలేకపోయింది.ఒంట్లో బాగా లేదనే సాకుతో ఐదింటికే బయటపడి బస్సులో కూర్చున్న నీలిమ మనసు పరి పరి విధాల ఆలోచిస్తోంది. పిల్లలు చెప్పిన మాట వింటారు, భర్తేమీ రాక్షసుడు కాదు.

“అయినా తనెందుకు ఇలా అలసిపోతోంది,అసలు ఎందుకు ఈ మధ్య మాటి మాటికీ కోపం వస్తోంది?”, ఆలోచిస్తోంటే జవాబు రాని ప్రశ్నలెన్నో.

ఇంటికెళ్ళేసరికి,హాయిగా సోఫాలో కూర్చుని పిల్లలతో టీవీ చూస్తున్న ఆనందుని  చూడగానే మరలా నీలిమ మనసు కోపం తో రగిలిపోయింది.

“కాస్త త్వరగా వచ్చినప్పుడైనా వాళ్ళ హోంవర్కులు చూడచ్చు కదా, అలా టీవీ చూసే బదులు” విసుగ్గా అని లోపలకి వెళ్ళింది.

స్నానం చేసి వచ్చేసరికి పిల్లలిద్దరూ బిక్కమొహాలేసుకుని తమ హోంవర్కులతో కూర్చున్నారు .వాళ్ళతో హోంవర్క్ చేయించి రాత్రి భోజనాలయ్యి,వంటిల్లు సర్దుకునేసరికి పదిన్నరయ్యింది.

నిద్రాదేవి రా రమ్మని పిలుస్తోంటే అలా వెళ్ళి మంచం మీద వాలిపోయింది.  ఏదో మాట్లాడదామని వచ్చి నిల్చున్న ఆనంద్‌కేసి చూసి “ఏమిటి” అంది విసుగు,నిద్ర కలగలిసిన స్వరంతో.  

“అది కాదు నీలూ, నీకు కోపం వస్తుందేమో కాని ఈ మధ్య నీకు విసుగు ఎక్కువవుతోంది,ఆఫీసులో కూడా అంత బిజీ గా ఉన్నట్లు లేవు, అయినా ఎందుకు అలా మమ్మల్ని విసుక్కుంటున్నావో తెలియట్లేదు.ఇంటి పని చెయ్యడానికి పనమ్మాయుంది,నేనూ పిల్లలూ ఎప్పుడో తప్పపెద్ద గా ఏమీ డిమాండ్ చెయ్యము. సైకాలజిస్ట్ ని కలవకూడదూ ఓసారి” అన్నాడు.

“రేపు మాట్లాడతాను ఆనంద్” అంటూ రెండు నిమిషాల్లో నిద్ర లోకి జారుకున్న నీలిమ మీద కోపం వచ్చినా ఏమీ చెయ్యలేక ఓ సినిమా చూసి అర్ధరాత్రెప్పుడో పడుకున్నాడు ఆనంద్.

మరునాడు నిద్ర లేచిన దగ్గరనుండీ నీలిమ మనసులో ఆనంద్ అన్న మాటలే మెదుల్తున్నాయి. “నిజంగానే తనకి కోపం ఎక్కువవుతోందా?పోనీ ఓ సారి సైకాలజిస్టుని కలితే ఎలా ఉంటుందో” అనుకుంది..అసలు తను ఎందుకు ఇలా అయిపోయిందో తనకే అర్ధం కావట్లేదు.

ఇదే విషయాన్ని కొలీగ్ శిరీషతో పంచుకుంది ఆరోజు ఆఫీసులో.

“ఇది మామూలే నీలిమా, అన్నీ మనమే అయ్యి చెయ్యడం వల్ల వచ్చే ఇబ్బందులివన్నీ.కారణాలేమయితేనేమి ఈరోజుల్లో అమ్మని కూడా ఎక్కువరోజులు సాయం అడగలేము. ఇంక అత్తగార్ల సంగతి సరేసరి.  

 మనల్ని కాలు క్రింద పెట్టనీయకుండా మహారాణుల్లాగ చూసుకోక్కర్లేదు కానీ అవసరమయినప్పుడు “నేనున్నాను” అన్న భరోసా మన భర్తలు ఇవ్వగలిగితే చాలు.కానీ అలా ఆశ పడటం అత్యాశే.   వాళ్ళేమో ఏదో వాళ్ళకే పని ఒత్తిడి అన్నట్లు మాట్లాడతారు.సగం మంది భర్తలకి భార్యలంటే కట్టాల్ల్సిన ఈ.ఎం.ఐ.లకి తోడు నిలిచే ఒక యంత్రం అంతే. 

మనకేమో పని ఒత్తిడికి తోడు, ఇంటిని చక్కదిద్దుకోవాలి,పిల్లలకి పరీక్షల్లో మార్కులు తక్కువొస్తే “కాస్త ఇంటి దగ్గర కూడా చదివించండి” అని టీచర్లంటారు,”కాస్త పిల్లల సంగతి చూడవోయ్” అని తేలికగా భర్తలనెస్తారు.మనం ఒక తల్లిగా,భార్యగా, ఉద్యోగినిగా,కూతురిగా,కోడలిగా పోషించాల్సిన పాత్రలన్నింటినీ కలిపెయ్యడంవల్ల పుట్టిన ఘర్షణ ఇది.

దీని నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం”భర్తలు కూడా ఇంటి పనుల్లో భాగస్వాములవ్వడమే”..కానీ మనలాంటి చాలా మంది ఆడవాళ్ళకి అత్యాశేనే” అని నవ్వేసింది.

కొలీగ్ మాటలు సబబుగానే తోచాయి నీలిమకి.తనకి ఇంట్లో పనమ్మాయుంది.ఆ మధ్య ఆ అమ్మాయి మానెస్తానంటే జీతం పెంచి మరీ ఆ అమ్మాయినే ఉంచి, ఇంకో పనమ్మాయిని వెతికే బాధ తప్పించాడు ఆనంద్.పనమ్మాయిని పెట్టాడు కాబట్టి తన బాధ్యత అయిపోయింది అనుకుంటాడు ఆనంద్.సాయంత్రం వచ్చాకా పిల్లల హోంవర్కులలో కానీ, ఇల్లు సర్దడంలో కానీ అస్సలు వేలు కూడా పెట్టడు.

తను ఎన్ని సార్లు ఆనందుకి  అర్ధమయ్యేటట్లు చెప్పాలని చూసిందో.”ఆ అమ్మాయి బట్టలుతికి గిన్నెలు తోమి వెళ్తే ఇంట్లో పని అయిపోయినట్లు కాదు ఆనంద్, అవి లోపల పెట్టుకోవడం, ఆరిన బట్టలు మడతలు పెట్టడం,,పిలల్ల చదువులూ, మరునాడు వారి స్కూలుకి తయారు చెయ్యడం ఇవన్నీ పనులే” అని చెప్పీ చెప్పీ విసిగిపోయింది.

ఈరోజు మాత్రం ఆనందుకి అర్ధమయ్యేటట్లు చెప్పి తను సాయం చెయ్యడం ఎంత అవసరమో విడమరచి చెప్పాలనుకుంది.  

ఆరోజు పిల్లల్ని త్వరగా పడుకోబెట్టి టీవీ చూస్తున్న ఆనంద్ దగ్గరకొచ్చింది నీలిమ. 

“నిద్ర రావ ట్లేదా ఈరోజు?పడుకో, నాకు టైం పడుతుంది” అన్నాడు ల్యాప్‌టాపులో పనిచేసుకుంటూ వంచిన తల ఎత్తకుండా

“అది కాదు ఆనంద్,ఇంట్లో ,ఆఫీసులో పని ఎక్కువయ్యి నాకు విసుగెక్కువవుతోందేమో అనిపిస్తోంది” అంది అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని మొహం లోకి చూసి అంచనా వేస్తూ.

ఒక్కసారిగా నవ్వేసాడు ఆనంద్.”చూడు నీలూ, నీకు ఇంట్లో పని కి పనమ్మాయుంది, నీ ఆఫీసు పనంటావా నేను చేస్తే బాగోదోయ్, ఒక వేళ భర్తలని భార్యల సేవలో తరించండి అని అవకాశమిచ్చినా అప్సరసలా ఉండే నిన్ను చూస్తూ చెయ్యలేను బాబూ” అంటూ కన్ను గీటాడు.

నీలిమకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. 

“అది కాదు ఆనంద్, నేనొక్కదానినే ఇల్లు, పిల్లల్ని చూసుకోవడం చాలా అలసట గా ఉంటొంది, కాస్త సాయం చెయ్యకూడదూ” అంది స్వరం పెంచి.

ఆశ్చర్యం గా చూసాడు ఆనంద్ ఆమె వంక .

“అసలు నువ్వేదో తెగ కష్టపడిపోతున్నావని నీ ఫీలింగ్. అయినా అలవాటు లేని పనులు నన్ను చేయమంటే నేను చెయ్యలేనోయ్,పిల్లల  చదువులూ అవీ మొదటి నుండీ నువ్వే చూస్తావు కదా,పైగా ఆ విషయంలో నువ్వే బెస్ట్,నన్ను ఇందులోకి లాగకు.ఇంక ఇల్లు సర్దడం అవీ అంటావా, అస్సలు నాకు అలవాటు లేదు. అయినా ఇల్లు, పిల్లల బాధ్యతల్లో మగవాళ్ళం వీక్ డీయర్,ఆ బాధ్యత సమర్ధవంతంగా మీరే నిర్వహించగలరు.రోల్స్ రివర్స్ అయితే ఉపద్రవాలేనోయ్” అన్నాడు తేలికగా.

నీలిమకి మెల్లిగా అసహనం కలగసాగింది. అయినా ఉబికి వస్తున్న ఆవేశాన్ని అణచుకుని వీలయినంత సౌమ్యంగా మాట్లాడింది.

“అది కాదు ఆనంద్.ఇల్లు, పిల్లల బాధ్యత కేవలం స్త్రీలదే అన్న ఆలోచనే పొరపాటు.అలా అని అవన్నీ నీ మీదే రుద్దాలనుకోవట్లేదు.ఇంటి బాధ్యతల్లో కాస్త పాలుపంచుకోమంటున్నానంతే.

నాకూ ఈ మధ్య ఆఫీసులో పని భారం పెరుగుతోంది.ఒకప్పటిలాగ ఆరోగ్యం కూడా సహకరించట్లేదు.ఆఫీసు,ఇంటి బాధ్యతలని ఇదివరకటి లాగ సమర్ధవంతంగా నిర్వహించలేక ఒకోసారి అనవసరంగా మన పిల్లల్నో, నిన్నో విసుక్కుంటున్నాను.ఏదో అప్పుడప్పుడు వంటింట్లోకొచ్చి ఒక కూర చెయ్యడం కాదు, నాకు రోజూ నీ సహాయం కావాలి” అని కాస్త సౌమ్యంగా చెప్పినా కటువుగానే చెప్పింది.

  ఆనందులో సహజమైన మగవాడి అహంకారం ఒక్కసారిగా పెళ్ళుబికింది.  

“నువ్వొక్కదానివే ఇవన్నీ చేస్త న్నట్లు తెగ ఇదైపోతావెందుకు,కావాలంటే ఓ వారం రోజులు నీ పనులు నేను చేసి చూపిస్తాను. అసలు ఎంత ఈజీ గా హ్యాండిల్ చెయ్యచ్చో నీకు అర్ధం కావట్లేదు” అన్నాడు కాస్త వ్యంగ్యం కలిపి.

“సరే అయితే, ఈరోజు శుక్రవారం, రేపటి నుండీ మనిద్దరి రోల్స్ మారుతున్నాయి ఒక్క ఉద్యోగాల్లో తప్ప. మరలా వచ్చే శుక్రవారం రాత్రి పదిటికి నేను చార్జ్ తీసుకుంటాను” అని చెప్పి వెళ్ళి పడుకుంది నీలిమ.

ఒక్కసారి ఏమి జరిగిందో అర్ధం కాలేదు ఆనంద్ కి.”ఆ, ఏముంది, రేపు వీకెండ్ కదా,లేటు గా లేస్తారు పిల్లలు, ఇడ్లీ పిండి ఉండే ఉంటుంది చట్నీ చేసి పెట్టెస్తే సరీ. లంచ్ సంగతి ఆలోచించచ్చులే..” అనుకుని ఈల వేసుకుంటూ హాల్లోకి నడిచాడు టీవీ పెట్టుకుందామని.

*****

చెవుల్లో భారీ విస్ఫోటనం లాంటి శబ్దం.. భూ కంపం కానీ వచ్చిందా అనుకుంటూ ఆనంద్ ఒక్క ఉదుటున లేచాడు. తను లేచి నిలబడ్డాడు అంటే  భూకంపం కాదు, “అయినా ఈ శబ్దం ఆగదేంటి?” అనుకుంటూ అటూ ఇటూ చూసాడు. శబ్దం ఎక్కడ నుండి వస్తోందో అర్ధం అయ్యింది.

తమ వీధి తలుపుని ఎవరో దబ దబా బాదుతున్నారు. టైము చూస్తే ఉదయం ఏడయ్యింది. శనివారం పొద్దున్నే వచ్చేదెవరబ్బా అని కళ్ళు నులుముకుంటూ తలుపుతీసాడు. పనమ్మాయి రమణ ,ఆనంద్ వాలకాన్ని చూసి ఒక్క అడుగు వెనక్కేసింది. 

“అమ్మ పడుకుంది, బయట గిన్నెలున్నాయి, బట్టలు కూడా అక్కడే ఉన్నాయి” అని చెప్పి వెళ్ళి మరలా సోఫాలో పడుకున్నాడు.

“కుక్కరేది సార్, స్టవ్ మీద ఉంటుంది,కాస్త చూసి ఖాళీ చేసి వెయ్యండి,అలాగే బట్టల సర్ఫ్ కూడా ఇవ్వండి” అని అరిచిన రమణ గొంతుకి అదిరిపడి లేచి కూర్చున్నాడు ఆనంద్.

టీవీ చూసి ఎప్పుడో తెల్లవారుఝామున పడుకుని ఇంత పొద్దున్నే లేచేసరికి చిరాగ్గ  ఉంది.

“నీలిమా, పనమ్మాయికి ఏదో కావాలిట చూడు అని అరిచాడు” నిన్నటి ఒప్పందం మరిచిపోయి.వెంటనే గుర్తొచ్చి నాలిక్కరచుకుని లోపలకి వెళ్ళి “ఇదిగో సర్ఫు, మేడం కుక్కర్ కడగక్కర్లేదంది,నీ పనయ్యాకా నన్ను లేపు ” అని చెప్పి వచ్చి సోఫాలో పడుకున్నాడు.

అలా పడుకుని అరగంటయ్యిందో లేదో “నాన్నా ఆకలేస్తోంది అంటూ  పిల్లలిద్దరూ నిద్ర మొహాలతో వచ్చి నిల్చున్నారు.

“అబ్బా..పడుకోనీయరు కదా’ అని విసుక్కోబోయి వాళ్ళ ముద్దు మొహాలు చూసి చటుక్కున   లేచి కిచెన్లోకి వెళ్ళాడు.

గబగబా ఇడ్లీ స్టాండు తీసి ఇడ్లీలు వేసి చట్ణీ చేసి అన్నీ టేబుల్ మీద సర్దేసమయానికి స్నానం చేసి వచ్చి నీలిమ కూడా పిల్లలతో పాటు వచ్చి కూర్చుంది.

“అలా కూర్చునే బదులు కాస్త సాయం చెయ్యచ్చుగా” అనుకున్నాడు కసిగా.

కానీ ప్రతీ శనివారం తనేమి చేస్తాడో గుర్తొచ్చి “అయ్య బాబోయ్ నాలాగ ఒక్క పనిలోనూ సాయం చెయ్యకపోతే” అనుకుని ఆ ఊహే భయంకరంగా అనిపించి మళ్ళీ తనకు తానే “నా నీలూ అలా చెయ్యదు, ఏదో నేను చేస్తాను అంటే ఒప్పుకుంది కానీ సాయంత్రానికల్లా వంటింట్లోకి వచ్చెయ్యదూ” అనుకున్నాడు.

కానీ తన ఆశ దురాశే అని అర్ధమవ్వడానికి ఎంతో సేపు పట్టలేదు.నీలిమ హాయిగా టిఫిన్ చేసి ప్లేటు సింకులో పడేసి కంప్యూటర్ ముందు సెటిలయిపోయింది. 

మధ్యాహ్న భోజన ఏర్ఫాట్లలో ఆనంద్ హడావిడి పడుతోంటే “ఆనంద్, ఒకసారి ఇలా రాగలవా, మా అన్నయ్య తను కొనుక్కున ఇల్లు చూపిస్తున్నాడు” అంటూ అమెరికాలో ఉన్న తన అన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడుతున్న నీలిమ కేక వినపడి చేస్తున్న పని ఆపి మొహాన నవ్వు పులుముకుని బావమరిదితో మాట్లాడాడు.  

 

“నువ్వు గ్రేట్ బావ, అక్క నడుము నెప్పికి డాక్టరు ఒక వారంపాటు మంచం దిగద్దన్నాడని ఈ వారం రోజులూ అన్నీ నువ్వే చేసి పెడతా అన్నావుట కదా.మా అక్కకి చేస్తే చేసావు కానీ ఈ మాట మీ చెల్లాయి, అదే మా ఆవిడ స్రవంతితో అనకు, నాకు నీ అంత ఓపిక లేదు” అంటూ కన్ను గీటాడు నీలిమ అన్నయ్య కిషోర్.

 

“ఓసి రాక్షసీ, ఇలా ముందరి కాళ్ళకి బంధం వేస్తావా” అని నీలిమని మనసులోనే తిట్టుకుని,పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడి పనుందని వంటింట్లోకి పరిగెత్తాడు ఆనంద్.  

పనమ్మాయి వచ్చినప్పుడు ఒక్క నిమిషం లేచి కుక్కర్ తీసి తోమడానికి బద్ధకించడం ఎంత పొరపాటో వంట చేస్తుంటే తెలిసొచ్చింది ఆనంద్‌కి.ఆ కుక్కర్ తోమేసరికి తాతలు దిగొచ్చారు.ఒక కూర,పప్పు వండి టేబుల్ మీద సర్దేసరికి ఒళ్ళు హూనం అయిపోయింది.లేచిన దగ్గరనుండీ ఒక్క పావుగంట కూడా కూర్చోలేదేమో, పిల్లలు అన్నాలు తినడం అవ్వగానే అలా వెళ్ళి మంచం మీద వాలిపోయాడు.

“నాన్నా, ఆకలేస్తొంది, స్నాక్స్ ఏమి చేస్తున్నావు” అంటూ పిల్లలిద్దరూ వచ్చి నిద్ర లేపేసరికి ఆనంద్ కోపం నషాళానికంటింది. “ఇప్పుడేగా అన్నాలు తిన్నారు” అని అరవబోయి తమాయించుకుని బ్రెడ్ టోస్ట్ చేస్తోంటే  పిల్లలొచ్చి “నాన్న, ప్లీజ్ బ్రెడ్ వద్దు, అమ్మ ప్రతీ శనివారం మనకి ఏదో ఒక స్నాక్ చేస్తుంది కదా, అలా నువ్వూ చెయ్యి” అని బ్రతిమాలితే వాళ్ళని కాదనలేక యూ ట్యూబు చూసి బజ్జీలు చేసి పెట్టాడు. 

ఆనంద్ అవస్థ చూసి నీలిమ కళ్ళల్లో చిన్న జాలి రేఖ కదలాడినా తమాయించుకుని పుస్తకంలో మునిగిపోయింది.  

రాత్రి కూడా ఏదో కూర చేసి పిల్లలకీ, నీలిమకీ పెట్టి వంటిల్లు సర్దుకుని ఎలా వచ్చి పడ్డాడో తెలీకుండానే మంచం మీద పడి నిద్రపోయాడు.ఆదివారం మళ్ళీ దాదాపు ఇదే పరిస్థితి.వంట హడావిడికి తోడు పిల్లల చదువులు అదనం.

“నేను ఇంత బిజీగా ఉంటే, పిల్లల చదువులైనా కాస్త పట్టించుకోకుండా ఏమి చేస్తున్నావు నీలూ” అన్నాడు కాస్త గట్టిగానే. 

“ఆనంద్,నేను ఆఫీసు పని చేసుకుంటున్నా, రేపు ఆఫీసులో హడావిడి పడక్కర్లేదని”  అన్న నీలిమ సమాధానం విని ఆమె వైపు కొరకొరా చూసి ఆ కోపాన్ని చంటి వాడి చెంపల మీద రెండు వేళ్ళచ్చులుగా దింపాడు.కాసేపటికి ఆనంద్‌కి అర్ధమయ్యింది తనెంత పొరపాటు చేసాడో.   

“పిల్లాడిని అలా కొట్టేబదులు వాడి సంగతి చూసి వంట తరువాత చెయ్యచ్చుగా”అని  భోజనాల దగ్గర నీలిమ అనగానే “సాయం చెయ్యకపోగా, బోడి సలహాలొకటి” అనుకుంటూ అన్నం తినడం సగంలో ఆపి లేచి కంచాన్ని సింకులో కోపంగా గిరాటేసాడు ఆనంద్. 

రెండ్రోజులు పూర్తవ్వలేదు అప్పుడే అలసిపోయారా శ్రీవారు?ఇంకెంత, కేవలం ఐదు రోజులంతే,సరే కానీ అలా కుప్పగా ఉన్న బట్టలూ అవీ తరువాత సర్దుకోవచ్చు, కాసేపు నువ్వు కూడా నడుం వాల్చు, నేనూ కాసేపు పడుకుంటాను” అని చెప్పిన నీలిమని చూస్తే పీక నొక్కెయ్యాలనంత కోపం వచ్చినా, ఆనంద్ నిస్సహాయంగా ఉండిపోయాడు.

“నిజంగానే నీలూ వారాంతాల్లో ఇంత అలసిపోతుందా” అన్న అనుమానం వచ్చినా తనలో దాగి ఉన్న పురుషాహంకారం ఆ ఆలోచనని ఇంక సాగనివ్వలేదు. “నాకు అలవాటు లేక కానీ, రేపటి నుండీ తనకి చూపించాలి అసలు ఇంటినీ ఆఫీసునీ ఎంత తేలికగా సమన్వయం చేసుకోవచ్చో” అనుకున్నాడు. 

సాయంత్రమయ్యేసరికి బయటకి వెళ్దామని నీలిమా, పిల్లలూ ఒకటే గొడవ.,నేను డ్రైవ్ చేస్తా ఆనంద్,నువ్వు అలా వచ్చి కార్లో కూర్చో అని నీలిమ కూడా అనడంతో,మరలా రేపటినుండీ ఉరుకులూ పరుగులేగా కాసేపు విశ్రాంతి తీసుకుందామని మనసులో ఉన్నా కానీ   వారి ఒత్తిడికి తలొగ్గి అయిష్టంగానే బయలుదేరాడు. కాసేపు అలా బయట తిరిగి,ట్రాఫిక్ పద్మ వ్యూహం లోంచి ఇంటికి వచ్చి, భోజనం చేసేసరికి రాత్రి పదయ్యింది.

“పిల్లలూ రేపటికి కావాల్సినవి సర్దుకోండి” అని చెప్పి నీలిమ వెళ్ళి పడుకుంది. దానర్ధం “వాళ్ళకి కావాల్సిన యూనీఫాం, సాక్సులు తయారుగా పెట్టి వాళ్ళ బ్యాగులో అన్నీ ఉన్నాయా లేదా చూడమని”  అని ఆనంద్‌కి మరునాడు ఉదయం అర్ధమయ్యింది. 

“ఈ రెండ్రోజుల్లో శారీరక శ్రమకే ఒళ్ళు హూనమయ్యింది, ఇంక రేపటినుండీ ఆఫీసు పని కూడా తోడయితే..”అన్న ఊహకే భయమేసింది ఆనంద్‌కి. వంటిల్లు సర్దుకుని, కుప్పలుగా పడున్న బట్టలు మడత పెట్టి, ఇస్త్రీకి ఇవ్వాల్సినవి సంచీలో పెట్టేసరికి పదకొండయ్యింది.ఆ రాత్రి “నిద్ర సుఖమెరగదు” అన్న సామెత మొదటిసారి అనుభవంలోకొచ్చింది ఆనంద్‌కి.  

*****

సోమవారం పొద్దున్నే ఐదున్నరకి అతి కష్టం మీద నిద్ర లేచి కాఫీ కలుపుకుని కూర్చున్నాడో లేదో “ఆనంద్, పిల్లలని లేపి తయారు చెయ్యి” అని చెప్పి ముసుగు తన్ని పడుకుంది నీలిమ. 

పిల్లలిద్దరినీ నిద్ర లేపి, ఒకళ్ళ తరువాత ఒకళ్ళని తయారు చేస్తూ మధ్యలో వంట చేస్తూ,”ఫలానా పుస్తకం కనపడట్లేదు, మా టీచర్ కోప్పడుతుంది” అని ఏడుస్తున్న కూతురిని సముదాయించి, “నాన్న, ఈరోజు వైట్ సాక్స్” అని అరిచిన కొడుకుకి కావాల్సిన సాక్స్ అందించి వాళ్ళని ఆటో ఎక్కించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది పాపం ఆనంద్‌కి.ఇంతలో ముద్ద మందారంలా ఫ్రెష్‌గా తయారయ్యి వచ్చిన నీలిమని చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు. 

టేబుల్ మీద ఉన్న టిఫిన్ తిని, తన బాక్స్ తీసుకుని నీలిమ ఆఫీసుకెళ్ళిపోయింది. టైము ఎనిమిదన్నర అవ్వడంతో ఇందాకా సగం తాగిన కాఫీని కనీసం వేడి చేసుకోకుండా గుటుక్కుమనిపించి బాక్సు సర్దుకుని తను కూడా బయటపడ్డాడు.సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి వంట చేస్తూ,పిల్లల హోంవర్కులు చూసి, వాళ్ళకి అర్జెంటుగా ఏదో కావాలంటే బయటకెళ్ళి  తెచ్చిచ్చి వాళ్ళని పడుకోబెట్టేసరికి పదయ్యింది. అలసి సొలసి నిద్రపోతున్న ఆనంద్ కేసి నీలిమ కాసేపు జాలిగా చూసి,అంతలోనే సర్దుకుని అటు తిరిగి పడుకుంది.  

మంగళా, బుధవారాలు దాదాపు ఇలాగే గడిచాయి.గురువారానికల్లా ఆనంద్ పూర్తిగా అలసిపోయాడు. 

శుక్రవారం పొద్దున్నే త్వరగా వెళ్ళాలని హడావిడి పడుతున్న నీలిమనే చూస్తుండిపోయాడు ఆనంద్.అసలే అందంగా ఉండే నీలిమ గత నాలుగైదు రోజులుగా ఇంట్లో దొరికిన తెరపితో మరింత అందంగా తయారయ్యింది.”కొన్నేళ్ళయ్యింది నీలిమని ఇంత అందంగా చూసి” అన్న విషయం గుర్తొచ్చిఆనంద్ మనసు బాధగా మూలిగింది. 

ఒంట్లో బాగాలేదని చెప్పి శలవు పెట్టి ఆరోజంతా ఇంట్లోనే ఉన్నాడు.ఆనంద్ మనసు పరి విధాల ఆలోచిస్తోంది.తను తప్పు చేస్తున్నాడు అని మనసు చెప్తోంది కానీ దానిని ఎలా సరి దిద్దుకోవాలో తెలియట్లేదు.

పిల్లల, ఇంటి బాధ్యత తల్లులకి అనివార్యమే కానీ అది కేవలం నీలిమ బాధ్యతే అన్నట్లుగా వదిలేసి తనెంత తప్పు చేస్తున్నాడో మెల్లగా అవగతమవుతోంది.పొద్దున్నే తను లేవడు, వీకెండ్సేమో లేచి కంప్యూటర్ ముందు సెటిల్ అయిపోయికజిన్స్‌తోనో, అన్నా వదినలతోనో   వీడియో కాల్స్ చేసి పిచ్చా పాటీ వేసుకుంటాడు.మధ్య మధ్యలో తను పిలిచినప్పుడు రావట్లేదని నీలిమ మీద ఎన్ని సార్లు విసుక్కున్నాడొ.”నేను పనిలో ఉన్నప్పుడు వీడియో చాట్ చెయ్యమని పిలవకు” అని నీలిమ ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు.అది వాళ్ళ మధ్య ఒక్కోసారి తీవ్ర విభేదాలకి కారణమయ్యేది కూడా.     

వారమంతా ఆఫీసూ, ఇంటి బాధ్యతలతో మునిగి, భర్త, పిల్లలకి కావాల్సినవి అమర్చి, వారాంతం సాయంత్రాలు నేను ఇంట్లోనే ఉంటాను అని నీలిమ ఎప్పుడన్న అంటే తనని పట్టుబట్టి ఎలా బయటకి లాక్కెళ్తాడో , ఈ విషయంలో కూడా గొడవలూ అవీ గుర్తొచ్చి ఆనంద్ మనసు భారమయ్యింది .    

ఇంతలో ఫోను మొగడంతో ఆనంద్ ఈ లోకంలోకొచ్చాడు.చిన్ననాటి స్నేహితుడు, సైకాలజిస్టూ అయిన పవన్ చేసాడు. ఆనంద్ గొంతులో మునుపటి ఉత్సాహం లేదని పవన్ కనిపెట్టి “మధ్యాహ్నం లంచ్‌కి కలుద్దాం” అని చెప్పి ఆనందుని ఒప్పించాడు.   

స్నేహితుడి దగ్గర దాచడమెందుకని గత వారంలో తమ మధ్య జరిగిన ఒప్పందం అదీ పవన్‌కి పూసగుచ్చినట్లు చెప్పాడు ఆనంద్.అంతా విని పవన్ ఆనంద్‌కేసి చూస్తూ 

“నూటికి తొంభై తొమ్మిది మంది భర్తల లాగే ఉన్నావు ఆనంద్ నువ్వు కూడా.నేను మందు తాగొచ్చి కొట్టట్లేదు లేదా పేకాట లాంటి వ్యసనాలు లేవు కాబట్టి “నేను మంచి భర్త” అన్న భ్రమలోంచి బయటపడు ముందు నువ్వు.భార్యలు కూడా మనుష్యులే, వాళ్ళకి విశ్రాంతి కావాలి, పైగా వాళ్ళకి నెల నెలా జరిగే శారీరక మార్పుల వల్ల వాళ్ళల్లో భావోద్వేగాలు ఒక్కోసారి అధికంగా ఉంటాయి.

మా అక్కకో, అమ్మకో ఇలా లేదు కాబట్టి స్త్రీలందరూ నెలసరి సమయాల్లో ఒకేలాగ ఉంటారు అనుకోవడం చాలా పొరపాటు.ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఆ సమయంలో వాళ్ళ మీద ఒక్కోరకమైన ప్రభావం ఉంటుంది.ఒక్కసారి భార్య నీ మీద అరిచిందే అనుకో, ఏమవుతుంది?అసలు నువ్వెప్పుడూ తన మీద అకారణంగా అరవలేదా లేక ఎప్పుడూ నీ భార్య అలా ధుమ ధుమ లాడుతూ ఉంటుందా? నాకు తెలిసైనంతవరకయితే నీలిమ అలాంటిది కాదు. 

భర్త లందరూ ఒక్కసారి భార్యల వైపు నుండి కూడా ఆలోచిస్తే సగం సమస్యలుండవు.భార్య, భర్తల మధ్యే కాదు, ఏ సమస్యకైనా మనం అవతలి వారి కోణం కూడా ఒక్క నిమిషం ఆలోచించగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్లే. 

నీకూ పని ఒత్తిడి ఉంటుంది కాదనను, దాని నుండి ఉపశమనానికి ఏమి చేస్తావు?”అని అడిగాడు పవన్.

“స్నేహితులతో సినిమాకెళ్తాను లేదా వాళ్ళతో ఏ బ్యాడ్మింటనో, క్రికెట్టో ఆడతాను లేదా ఏ ట్రెక్కింగుకో వెళ్తాను” సమాధానమిచ్చా డు ఆనంద్.

“మరి నీలిమ సంగతేమిటి? తను కూడా మనిషే. తనకీ ఒత్తిళ్ళుంటాయి.ఉద్యోగం చేసే స్త్రీలకే కాదు ఆనంద్, చెయ్యని వాళ్ళకి కూడా ఈ ఒత్తిడి సహజం.అది ఇంటి పనుల వల్ల కావచ్చు, లేదా పిల్లల చదువులది కావచ్చు.కానీ వాళ్ళకి ఉపశమనం సంగతి భర్తలగా మనం ఆలోచిస్తామా?”

“అసలు నువ్వూ, నీలిమా కలిసి హాయిగా బయటకెళ్ళి లేదా మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజు లయ్యింది?” మళ్ళీ ప్రశ్నించాడు పవన్.

“ఎక్కడరా,ఎక్కడకి వెళ్దామన్నా అలసిపోయాను అంటోంది  ఈ మధ్య” బాధగా సమాధానం చెప్పాడు ఆనంద్.

“అసలు తను ఎందుకు అలసిపోతోందో ఆలోచించావా?లేదా తను అలసిపోతోందని ఎప్పుడైనా తను రోజూ చేసే పనిని ఓ రెండ్రోజులు నువ్వు చేసావా? నీలిమకి కాస్త రోజూ పనిలో ఓ చెయ్యి వేసి చూడు, తనకీ తీరిక చిక్కుతుంది,అలసిపోదు కాబట్టి నీతో బయటకి రావడానికి తనకి అఅభ్యంతరం  ఉంటుంది అనుకోను.స్నేహితులని కలవడం తప్పు కాదు ఆనంద్.కానీ ఒక భర్త, తండ్రిగా ప్రమోషన్ వచ్చాకా కుటుంబ సభ్యులతోనే గడపడంలో ఉన్న ఆనందం చెప్తే అర్ధమయ్యేది కాదు. అది ఎవరికి వారు అనుభవించి తీరాలి.అలా అని స్నేహితులని పూర్తిగా దూరం పెట్టక్కర్లేదు. ఒక తండ్రిగా, భర్తగా నీ బాధ్యత కేవలం డబ్బు సంపాదనతో అయిపోదు అని తెలుసుకోమంటున్నా అంతే”.

“ఎప్పుడైనా తన వైపు నుండి ఆలోచించావా? అప్పుడప్పుడు మనం భార్యల పాత్ర పోషిస్తే తప్పు లేదు ఆనంద్.నాకు తెలుసున్నంత వరకూ చాలా మంది భార్యలు ఒంట్లో బాగాలేకపోతే చిన్న ఓదార్పు లేదా అలసిపోయినప్పుడు పనిలో కాస్త కల్పించుకోవడం కోరుకుంటారంతే.అలా అని భార్యలందరినీ ఒకే గాటన కడుతున్నా అనుకోకు.భర్తలని వేపుకు తినే భార్యల గురించి సరదాగా ఇంకో రోజు చెప్పుకుని మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుందాం.నీకు నేను చెప్పేది అర్ధం అయ్యిందనుకుంటాను, నీలిమకి కూడా కౌన్సిలింగ్ కావాలంటే తనతో కూడా ఒక్కసారి మాట్లాడతాను” అని ముగించాడు పవన్. 

ఆనంద్‌కి తన కర్తవ్యం బోధపడింది.తేలికపడ్డ మనసుతో ఇల్లు చేరాడు.

సాయంత్రం నీలిమ ఆఫీసునుండొచ్చి “ఇంకొన్ని గంటలే ఆనంద్, మన రోల్స్ మారిపోతాయి, మరి దాని కన్నా ముందే నాకు వడ్డించెస్తే రేపటినుండీ నేను రంగం లోకి దిగుతాను” అన్న నీలిమని చూస్తూ హఠాత్తుగా దగ్గరకి తీసుకుని “నీలూ” అన్నాడు ఎంతో ఆర్ద్రంగా.

ఈ హఠాత్పరిణామానికి నీలిమ నివ్వెరపోయి ఆనంద్ కేసి చూసింది ఆశ్చర్యంగా.”ఏమయ్యింది ఆనంద్” అని అడుగుతున్న నీలిమని మరింత గాఢంగా హత్తుకుని నుదుటి మీద చుంబించాడు.

*****

 
Please follow and like us:

One thought on “వారు వీరయితే !(క‌థ‌)”

Leave a Reply

Your email address will not be published.