చిత్రం-9

-గణేశ్వరరావు 

కొరియన్ చిత్రకారిణి క్వాన్ క్యాంగ్ యప్ ఏకాంతాన్ని సున్నితంగా  తన చిత్రాలలో చూపిస్తుంది. ఈ చిత్రానికి పెట్టిన పేరు: ‘పట్టీలు ‘ . అలంకారిక కళ లో చిత్రించింది. ఈ బొమ్మను చూస్తున్నప్పుడు ఏ దేవతనో, అంతరిక్షవాసినో, కలలో కవ్వించే సఖినో చూస్తున్నట్టుంటుంది . బొమ్మలో శారీరక లోపాలు లేవు . మొహం ముత్యం లా తెల్లని తెలుపు రంగులో మెరిసిపోతూంది. ఎక్కడా మచ్చుకైనా ముఖంలో  ముడతలు లేవు. మెరుస్తూన్న శరీరాన్ని చూపించడం కేవలం తైల వర్ణ చిత్రంలోనే వీలవుతుంది. లేత నీలి రంగులో చిత్రించిన కళ్ళు మనల్నే చూస్తూ ఏ క్షణంలోనేనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయా అనిపిస్తుంది. వాటిలో అంతగా దైన్యం గూడుకట్టుకుని ఉంది. తలకు కట్టుకున్న గాజుగుడ్డ ఏదో తెలీని మానసిక బాధనీ, ఆమె బందీ అన్న భావనని తెలియజేస్తోంది. ఆ కట్టు బానిసత్వానికి ప్రతీక . బొమ్మలోని అణువణువూ ఆమె మానసిక ఆందోళనిని కనబరుస్తోంది. కేవలం కనీస అంశాలే బొమ్మలో చిత్రించబడ్డా, అవి అనేక భావాలని విస్తృతంగా తెలియచేస్తూ, రకరకాల అనుభూతులని కలుగజేస్తున్నాయి. మొత్తం చిత్రాన్ని నిశితంగా చూసినప్పుడు, ఆమె బలహీనత గోచరించదు మనకి . తలకు పట్టీ  ఉన్నప్పటికీ , చూపులు గుండె గాయాన్ని సూచిస్తున్నప్పటికీ, ఆమెలో అంతర్గతంగా దాగిన ఓర్మి, స్థిరత్వం, సహనశీలత ప్రతిఫలించేలా ఆమె బొమ్మ గీయబడింది. అది సౌందర్యానుభూతితో పాటు కరుణరసానుభూతిని కూడా కలిగిస్తుంది, భౌతిక, ఆధ్యాత్మిక, భావాత్మక రసానుభూతులకు కూడా తావిస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.