నారిసారించిన నవల 

-కాత్యాయనీ విద్మహే 

  8

స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన వాటితో స్త్రీల జీవితం గొప్ప కదలికకు, సంఘర్షణకూ కూడా లోనైన కాలం యాభయ్యవదశకం. ఈ దశకంలో స్త్రీల నవల దానికి అనుగుణంగానే నూతన వికాసాన్ని పొందింది. ఈ దశకంలో నవలారచన ప్రారంభించిన వాళ్లు మాలతీ చందూర్, లత, శ్రీదేవి, వట్టికొండవిశాలాక్షి, రంగ నాయకమ్మ,  విఎస్ రమాదేవి మొదలైనవాళ్లు. శ్రీదేవి, వట్టికొండ విశాలాక్షి తప్ప మిగిలినవాళ్లు గుర్తింపు దశకమైన అరవైలలోనూ, అంతర్జాతీయ మహిళా సంవత్సర ప్రకటనకు దారితీసిన డెబ్భైయ్యవ దశకంలోనూ అంతర్జాతీయ మహిళా దశాబ్దిలోనూ (1975- 1985) నవలా రచనను కొనసాగించారు. వారివారి నవలా జీవిత పరిణామ ప్రత్యేకతలను, ప్రభావాలను విడివిడిగా అంచనా వేయటం ప్రయోజనకరంగా ఉంటుంది. 

1

 మహిళలను పాఠకులుగా గుర్తించి వాళ్ళ జ్ఞానచైతన్యల పెంపుకు అటు పత్రికలను ప్రారంభించి ఇటు , నవలలు వంటి వచన సాహిత్య ప్రక్రియల స్వరూపస్వభావాలను నిర్దేశిస్తూ వచ్చిన వీరేశలింగం పంతులు ఆదర్శం 1950 లలో పత్రికల విస్తరణతో  వాటిలో ధారావాహికంగా స్త్రీల నవలలను ప్రచురించే అవకాశాలు కలిసిరావడంతో పూర్తయిందని అనిపిస్తుంది. పత్రికలకు, స్త్రీల రచనలకు పాఠకులుగా స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగిన కాలం ఇది. మాలతీ చందూర్ కు ఆ రకంగా మహిళా పాఠకులు ఎక్కువ. 1952 నాటికే ప్రమదావనం శీర్షికతో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించబడే మాలతీ చందూర్ కాలమ్ కోసం  మహిళా పాఠక అభిమానులు ఎందరో. ఆరోజుల్లో మారుమూల పల్లెటూర్లలో మహిళలు కూడా ఆ పత్రికను పోస్టులో తెప్పించుకొనేవాళ్ళు అంటే మాలతీ చందూర్ వంటి మహిళా రచయితలు మహిళాపాఠకులను ఎంతగా సృష్టించుకొన్నారో అర్ధం అవుతుంది. అనేక విదేశభాషా నవలలను తెలుగువారికి పరిచయం చేస్తూ వ్రాసిన కథనాలు పాతకెరటాలు అనే శీర్షిక కింద ప్రచురించబడ్డాయి.  

మాలతీచందూర్ 1928 డిసెంబర్ 26న నూజివీడులో పుట్టింది. తల్లి జ్ఞానమాంబ. తండ్రి వెంకటాచలం. చదువు నూజివీడులోనూ, ఏలూరులోనూ సాగింది. పూర్తిచేసింది హైస్కూల్ చదువే అయినా విస్తృతంగా దేశవిదేశ సాహిత్యం చదివింది. 1947 లో మేనమామ ఎన్ . ఆర్.  చందూర్ ని పెళ్లిచేసుకొని మద్రాస్ లో స్థిరపడింది. అనేక కథలు, 27 నవలలు వ్రాసింది. ఆమె వ్రాసిన హృదయనేత్రి నవలకు 1990 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి, 1992 లో కేంద్రసాహిత్య అకాడెమీ బహుమతి వచ్చాయి. భారతీయ భాషాసాహిత్య పరిషద్ అవార్డు , రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు, తెలుగువిశ్వవిద్యాలయం అవార్డు ,లోక నాయక్ ఫౌండేషన్ అవార్డు వంటివి ఎన్నో ఆమె సాహిత్యకృషికి గుర్తింపులు. శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. 

మాలతీ చందూర్ తొలి నవలలు రేణుకాదేవి ఆత్మకథ, చంపకం చదపురుగులు నవలలు రెండూ 1955 సెప్టెంబర్ లో(.దేశికవితా మండలి,విజయవాడ) అచ్చు అయ్యాయి. చంపకం చదపురుగులు నవల లోపలి మొదటి పేజీ లో మాలతీ చందూర్ ఇతర రచనలు రేణుకాదేవి ఆత్మకథ నవలతోపాటు క్షణికం అనే నవల, ‘పాప’ కథల సంపుటి  పేర్కొనబడ్డాయి. రేణుకాదేవి ఆత్మకథ నవల ‘గుండుసూది’ నుండి పునర్ముద్రితం అని ఉంది. గుండుసూది అనే పేరుతో పత్రిక ఏమైనా ఉండేదేమో తెలియదు. నార్ల వెంకటేశ్వరరావు గారి జాబితా( తెలుగుపత్రికలు 2004) లో మాత్రం లేదు. ఏమైనా పునర్ముద్రితం అన్న ఆ మాట ఆధారంగా చంపకం – చదపురుగులు నవల కన్నా అది ముందుది అనుకొంటానికి అవకాశం ఉంది. క్షణికం లభించలేదు. కనుక ఇప్పటికి మాలతీ చందూర్ తొలినవల రేణుకాదేవి ఆత్మకథ, మలి నవల చంపకం – చదపురుగులు అని నిర్ధారించుకోవచ్చు. 

భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికే  మద్రాస్ ప్రెసిడెన్సీ తెలుగువాళ్ళ సాంస్కృతిక కేంద్రం. 20వ శతాబ్ది తొలి పాదంలో మద్రాసు నుండి    ఆంధ్రపత్రిక, భారతి వంటి తెలుగు పత్రికలు మొదలవటమే కాదు, సర్క్యులేషన్ విరివిగా ఉండేది. పత్రికా రంగం మడమలు తొక్కుకుంటూ తెలుగు  సినిమారంగం కూడా బలపడుతూ వచ్చింది. 1940 నాటికి ఆంధ్రప్రభ పత్రిక కూడా రావటం మొదలైంది.ఆ తరువాత జ్యోతి, చందమామ .. ఇలా విస్తరించింది.    సినిమా పరిశ్రమకు అనుబంధంగా సినిమా వార్తల పత్రికలూ మొదలయ్యాయి. ఆంధ్రప్రాంతపు మధ్యతరగతి చదువుకున్న యువకులకు , కాస్త సాహిత్య కళాభిరుచి ఉన్నవాళ్లకు ఎదో ఒక పనిని కల్పించగల వనరు అయింది మద్రాసు.1950 నాటికి  కొడవటిగంటి కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు వంటి వాళ్ళు పత్రికారంగంలో ,శ్రీశ్రీ, ఆత్రేయ వంటి వాళ్ళు సినిమారంగంలో అవకాశాలు వెతుక్కొంటూ మద్రాసు కు వచ్చేసారు. ఇదంతా చెప్పటం ఎందుకంటే మాలతీ చందూర్ తొలి నవలలు రెండూ ఈ రెండురంగాల జీవితానుభవాలే ఇతివృత్తంగా కలవి కనుక. అదే సమయంలో ఇవి ఆయా రంగాలలో పని చేస్తున్న మహిళల జీవితానుభవాల కథనాలు కావటం మరొక విశేషం. 

విశాఖపట్టణం దగ్గర భీమ్లీ లో రామారావు నర్సింగ్ హోమ్ లో సమావేశమైన ఆరుగురు మిత్రుల మధ్య సంభాషణగా ప్రారంభం అవుతుంది రేణుకాదేవి ఆత్మకథ. సంఘ ఉద్ధరణ కోసం దానధర్మాలు చేయటం గురించి వచ్చిన  చర్చ లో భాగంగా పెద్దపెద్ద ఆస్తులను సంఘావజ్రాలకు దానధర్మాలు చేసేవాళ్ళు జీవితానుభవాలను బట్టి, తమ ఆత్మతృప్తికే చేస్తారు తప్ప మనుషులు సుఖపడతారని ఇయ్యరని చెప్పి రామారావు అలా ఇచ్చిన స్త్రీ కథ అంటూ రేణుకాదేవి కథను చెప్తాడు. సినిమా నటి రేణుకాదేవి గుండె జబ్బు కారణంగా రామారావు నర్సింగ్ హోంలో వచ్చి ఉండటం, అక్కడి ప్రశాంత సహజ ప్రకృతికి ఆనందిస్తూ తనపట్ల శ్రద్ధను, స్నేహాన్ని చూపిస్తున్న రామారావుకు తనగతాన్ని చెప్పటం ఇందులో కథ. రామారావు కథనంగా ప్రారంభం అయి రేణుకాదేవి ఆత్మకథా కథనంగా సాగిన ఈ నవల. తండ్రి మరణించి తల్లితో , అన్నతో  తమ్ముడితో పాటు అప్పుల్లో , పేదరికంలో మిగిలిన పన్నెండేళ్ల రేణుక బాలనటిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేయటం వరస విజయాలతో హీరోయిన్ స్థాయికి ఎదగటం కుటుంబ ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడినా తనమీదా, తన సంపాదనమీదా తల్లి అన్నల పెత్తనం సహించరానిది కావటం, ఆ ఒంటరితనంలో సినిమా కవి మాటలకు ఆకర్షితురాలు కావటం, చివరికి అతనినే పెళ్లాడాటం, తన మీద, తన సంపాదన మీద అధికారం అతని హస్తగతం కావటం, అటు తన తల్లి అన్నదమ్ములు,అక్కాబావలు, ఇటు భర్త అక్క, అక్క కూతురు అల్లుడు అందరూ ఏకమై తనను హృదయం ఉన్న ఒక మనిషిగా కాక డబ్బు సంపాదించే సాధనంగా చూస్తూ మానసిక హింసకు గురిచేయడం ద్వారా తనను అదుపులో పెట్టచూడటం – ఈ పరిస్థితుల ఒత్తిడిలో గుండెజబ్బు రావటం ఈ నవలలో ప్రధానమైన కథాసూత్రం. తనకు బాధాకరమైన దాంపత్య సంబంధాలనుండి, కుటుంబసంబంధాల నుండి విడిపోయి స్వతంత్రం గా బతకటానికి పెనుగులాడిన రేణుకాదేవికి అందుకు అవకాశం చాలా తక్కువ అని ‘నువ్వు స్త్రీవి. ఇది పురుషులోకం’అని లాయర్ చెప్పిన  ఒక వివక్షాపూరిత సామాజిక న్యాయం తెలియచెప్పింది. బతికి ఉన్నన్నాళ్లూ తన సొమ్ము తింటూ తనను ను మానసికంగా పీడిస్తూ హింసిస్తూ ఉన్న భర్తకు తన ఆస్తి చెందకూడదన్న కసి కొద్దీ అంతా సేవాసదనానికి రాసేసి మరణించింది రేణుక. స్త్రీలు ఇంటి పరిధిని దాటి ఆర్జనా పరులు అవుతున్నా అది అదనపు పెత్తనానికి, హింసకు ఆమెను గురిచేస్తున్న ఒక సామాజిక విషాదవాస్తవాన్ని ఈ నవల చిత్రించింది. 

చంపకం – చదపురుగులు నవల లో చంపకం తండ్రి చనిపోయిన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబలో మగపిల్లవాడు తరువాతి ముగ్గురు ఆడపిల్లల్లో రెండవది. సత్యం లా చదువుకు మద్రాస్ లో చేరాక తండ్రి మరణించటం, ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తల్లి ముగ్గురు ఆడపిల్లలతో మద్రాస్ చేరటంతో నవలలో కథ అంతా మద్రాస్ లోనే నడుస్తుంది. మగవాడు, కుటుంబ పోషకుడు అని తల్లి చూపే అధిక ప్రేమ సత్యంలో పెంచిన అధికార దురహంకారాలు, స్కూల్ ఫైనల్ తో ఆగిపోయిన చంపకం చదువు, ఆమె కు ఉన్న వ్రాసే తెలివిని సంపాదనామార్గం గా మలచిన అన్న చాకచక్యం దగ్గర అసలు కథ మొదలవుతుంది. పదహారు ఏళ్లకు ఒక పత్రికలో ఉద్యోగానికి చేరిన చంపకం ముప్ఫయ్ ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొనటం వరకు పద్నాలుగు పదిహేనేళ్ల కాలం మీద నడుస్తుంది ఈ కథ. చంపకం కళా హృదయాన్ని, మనోవికాసాన్ని, అందమైన శరీరాన్ని గురించిన అస్తిత్వ చైతన్యాన్ని అన్నిటినీ కుటుంబ బాధ్యత, త్యాగం వంటి తమ మాటలతో, స్వార్ధపూరిత చర్యలతో నాశనం చేస్తూ విద్యార్థి పత్రిక నుండి మరో రెండు మూడు పత్రికలలో పనిచేస్తూ కథలు, నవలలు వ్రాస్తూ సంపాదించేదంతా అక్క జబ్బుకు, అన్న సంసారానికి , చెల్లెలి కాపురానికి వెచ్చిస్తూ జీవించటంలోని ఒంటరి విషాదం, తాను కోల్పోయిన సంసారం, అవకాశాలు వేధిస్తుండగా ఆమె ఆత్మహత్య చేసుకొన్నది.

 పరిమిత ఆర్ధికవనరులు కలిగిన కుటుంబాలు, ఏ ఒకరో సంపాదిస్తుంటే వాళ్ళ మీద  ఒరిగిపోయి జీవించే పరాన్నభుక్కులు నగర సమాజాలకు పట్టిన చదపురుగులు. అవి చెక్కను లోలోపలినుండి తొలచుకొంటూ ఎలా డొల్ల చేసి పెడతాయో చంపకం జీవితాన్ని ఆమె కుటుంబం అట్లా డొల్ల చేసి పెట్టింది. తాను కన్న నలుగురి సంతానంలో మిగిలిన ముగ్గురి కోసం తాపత్రయపడుతూ  వాళ్ళ అవసరాలను తీర్చే యంత్రంగా తప్ప సంపాదనా పరురాలైన కూతురిని శరీరం, హృదయం ఉన్న మనిషిగా తలచనైనా తలచని తల్లి స్వార్ధం అనుభవంలో తెలుస్తున్నదే అయినా- తనలోని ఒక సృజనాత్మక శక్తిని గుర్తెరిగిన బయటి మనిషి ఎవరో పదిహేనేళ్ళు గడిచిపోయినా తనను గుర్తుంచుకొని నాలుగు మంచిమాటలు వ్రాసి తన ఆనందానికి ఉపయోగపడతాయేమోనని సంవత్సరానికి మూడువేల రాబడి వచ్చే షేర్లు తన పేరున పెట్టి పంపినప్పుడు- అది మరీ మరీ ఆమె హృదయాన్ని గాయపరచింది. దాని ఫలితమే ఈ ఆత్మహత్య.

ఆడపిల్లలు ఆర్ధికంగా తమకాళ్ళమీద తాము నిలబడే కొత్త అవకాశాలు వస్తున్నాయి సరే. రెండవ ప్రపంచయుద్ధకాలం – ఆర్ధిక సంక్షోభాలు, పెరుగుతున్న ధనాశ, సులభంగా వచ్చిపడాలన్న ఆకాంక్ష ప్రబలుతున్న కాలంలో ఆ అవకాశాలు ఆడపిల్లల జీవితాలలో ఏ మేరకు అభివృద్ధిని తెస్తాయి? ఏ మేరకు స్వతంత్రులుగా మిగులుస్తాయి అన్న ప్రశ్నలను గురించి ఆలోచించమంటుంది ఈ నవల. 

1959 జులై, ఆగస్టు నెలలో రేడియోలో  ధారావాహికంగా వచ్చినఏడుగురు రచయితల గొలుసు నవల సప్తపది.(1963).   కనుపర్తి వరలక్ష్మమ్మ, శ్రీదేవి,,దుర్గాకుమారి, ఇల్లిందిల సరస్వతీ దేవి, కె. రామలక్ష్మి, పి. సరళాదేవి తో పాటు ఇందులో ఒకభాగం మాలతీ చందూర్ వ్రాసింది.  చదువుకొన్న కమల ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగజీవితం, వచ్చే జీతం మీద తనకేమీ అధికారం లేక తల్లీ తండ్రీ తీసుకొనే నిర్ణయాల ముందు నిర్విణ్ణురాలవుతూ,ఘర్షణకు లోనవుతూ  ఆమె పడిన హింస, అవమానాలు, తుదకు తనజీవితాన్ని తనచేతుల్లోకి తీసుకొని నడిపించుకొనే దిటవు సంపాదించుకొని స్వతంత్రురాలు కావటం ఈ నవల ఇతివృత్తం. ఇందులో సంఘర్షణలో కమల జీవితం ఎలా ఉందో  చూపే భాగం మాలతీ చందూర్ వ్రాసింది. ఇంతవరకు మాలతీ చందూర్ నవలా జీవితంలో మొదటి దశ. 

2

మాలతీ చందూర్ నవలలు అనేకముద్రణలు పొందటం వల్ల, ప్రచురణ కర్తలు తమ ప్రచురణకు సంబంధించిన వివరాలనే ఇస్తున్నందువల్ల నవలలు వేటితరువాత ఏవి వచ్చాయో చెప్పటం కష్టం.ఏమైనా లభిస్తున్న సమాచారం ఆధారంగా  ఊహమీద నిర్ధారించుకోవలసినదే. 1972 జనవరి లో లావణ్య అనే నవల ఎమెస్కో పాకెట్ బుక్ గా వచ్చింది. అది 1968 ఆగస్టు ప్రచురణకు పునర్ముద్రణ అని లోపలి టైటిల్ పేజీలో పేర్కొనబడింది. మాలతీ చందూర్ నవలలు 1955 తరువాత మళ్ళీ పదమూడేళ్లకు ‘లావణ్య’ తో మొదలైనట్లు.ఎమెస్కో ప్రచురణలవారికి  లోపలి మొదటి పేజీలో రచయిత పరిచయం వేసే సంప్రదాయం ఉంది. లావణ్య నవలలోనూ అదేవిధంగా మాలతీ చందూర్ పరిచయం ఉంది.1972 నాటి ఈ పరిచయంలో సర్వతోముఖమైన ఆమె మేధా సంపత్తికి కీర్తిపతాక అంటూ ప్రమదావనం శీర్షిక, పాప మొదలైన పదహారు కథా కలాప సంకలనాలు ప్రస్తావించ బడ్డాయి తప్ప నవలలు ఏవీ పేర్కొనబడలేదు. ఇదే ప్రచురణ సంస్థ అక్టోబర్ 1976 లో ప్రచురించిన కృష్ణవేణి నవల పరిచయంలో  లావణ్య నవలతో పాటు మేఘాలమేలిముసుగు, ఏదిగమ్యం? ఏదిమార్గం , బ్రతకనేర్చిన జాణ, ఆలోచించు నవలలు ఇదివరలోనే ఎమెస్కో పాకెట్ బుక్స్ గా వచ్చినట్లు ఉంది. దీనిని బట్టి ఈ నవలలు 1972 – 1976 మధ్యకాలంలో వచ్చినట్లు భావించవచ్చు. 1977 సెప్టెంబర్ లో ఎమెస్కో మాలతీ చందూర్ మరొక నవల ‘ఎన్ని మెట్లెక్కినా …’ ను ప్రచురించింది. అందులో పైన పేర్కొన్నబడ్డ నవలలకు అదనంగా జయ-లక్ష్మి, సద్యోగం, రాగారక్తిమ అనే మూడు నవలలు ఉన్నాయి. అంటే ఇవి 1976- 77 మధ్య ఏడాదికాలంలో వచ్చాయన్నమాట. 1979 జనవరిలో నవయుగ బుక్ సెంటర్ వారు ప్రచురించిన రేణుకాదేవి ఆత్మకథ పునర్ముద్రణ లో వెనక కవరుపేజీ లోపలి వైపు ఒక పేజీలో పేర్కొనబడిన వారి ప్రచురణల జాబితాలో రెక్కలు – చుక్కలు అనే నవల పేరు ఉంది. 1983 డిసెంబర్ లో  క్వాలిటీ పబ్లిషర్స్ వారు ఆమె వ్రాసిన మనసులో మనసు అనే నవల ద్వితీయ ముద్రణను ప్రచురిస్తూ అందులో 1979 ఆగస్టు ప్రధమ ముద్రణ కాలంగా పేర్కొన్నారు. 

ఈ సమాచారాన్ని అంతా ఒక క్రమపద్ధతిలో పరిశీలిస్తే మాలతీ చందూర్ నవలలో రెండవ దశ లావణ్య తో మొదలై 70వ దశకంలోకి విస్తరించిందన్నది స్పష్టం. మేఘాలమేలిముసుగు, ఏదిగమ్యం? ఏదిమార్గం , బ్రతకనేర్చిన జాణ, ఆలోచించు-  మొత్తంనాలుగు నవలలు 1976 నాటికి వచ్చేసాయి. కృష్ణవేణి, జయ-లక్ష్మి, సద్యోగం, రాగరక్తిమ -నాలుగు 1976 లో వచ్చాయి. ఎన్ని మెట్లెక్కినా ..1977లో వచ్చింది. 1979 నాటికి రెక్కలు-చుక్కలు, ఓ మనిషి కథ, ఏమిటీజీవితాలు? అన్న మూడు నవలలు వస్తే  1979 లో మనసులో మనసు అనే మరొక నవల వచ్చింది.అంటే 70 వదశకపు నవలలు మొత్తం పదమూడు.  

వీటిలో లావణ్య పెద్దయింటి అమ్మాయి పెంకెతనానికి పేదింటి అబ్బాయి బాధ్యతకు, సంయమనానికి సంబంధించిన ఘర్షణగా సాగే నవల. మేఘాలమేలిముసుగు(1984 శ్రీశైలాజా ప్రచురణ)  అనుకోని సంఘటనతో ఒక పెద్దింటి అబ్బాయికి, పేదింటి పడచుకు మధ్య కనబడని ఘర్షణగా ప్రారంభమై ఇద్దరిమధ్యా ప్రేమబంధం దృఢపడి పెళ్లిగా పరిణామం చెందటం ఇతివృత్తంగాగల నవల.  1955 హిందూ వివాహచట్టానికి ముందు తరువాత స్త్రీల జీవితం ఈ నవలేతివృత్తంలో ప్రధాన భాగం. లో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ హిందూవివాహచట్టం రావటానికి ముందు స్త్రీల జీవితానికి కథానాయకుడు అరుణగిరి తల్లిని  ఆ హిందూ వివాహచట్టం వచ్చిన తరువాత స్త్రీల జీవితానికి అరుణగిరి ప్రేమించిన విశాలను ప్రతినిధులుగా నిలిపి ఈ కథను నడిపింది మాలతీ చందూర్. సంపదతో పాటు సాంఘిక గౌరవం పుష్కలంగా ఉండి సంపదకు వారసుడైన మగపిల్లవాడు ఒక్కడు లేడనే చింతలో ఉన్న ఉమాపతి -ఏడుగురు ఆడపిల్లల తండ్రి , యాభైఏళ్ల పైబడ్డవాడు- పదహారేళ్ళ సావిత్రిని రెండవ పెళ్లి చేసుకొనటం హిందూ వివాహచట్టం రాకపూర్వపు ఘటన. మగపిల్లల కోసం మళ్ళీ పెళ్లిళ్లు, ఆ పెళ్లిళ్ల వల్ల అటు మొదటి భార్య, ఇటు రెండవ భార్య ఏకకాలంలో బద్ధశత్రువులవలె ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకొంటూ వెళ్లగక్కే నిస్సహాయ ఆక్రోశం ,ఒకరినొకరు నమ్మలేని దుఃస్థితి సావిత్రి, జయమ్మ ( ఉమాపతి మొదటి భార్య ) ల సంబంధంలో చూపించింది ఈ నవల. 22 ఏళ్లకల్లా వితంతువై ఇటు పసిపిల్లవాడిని, అటు ఆస్తిని సంరక్షించుకొనే పెద్ద బాధ్యత నెత్తినపడిన సావిత్రి కత్తిమీద సాములాంటి జీవితం  కూడా ఈ నవల కథనంలో భాగం అయింది. బహుభార్యాత్వ వ్యవస్థ, మగపిల్లల వంశవారసత్వం, ఆస్తి వారసత్వం ఎంత వివక్షాపూరిత హింసాత్మక సంప్రదాయాలో సావిత్రి గత జీవిత కథానం స్పష్టం చేస్తుంది. 

విశాల పుట్టి,పెరిగిన కుటుంబ ఆర్ధికస్థితి హైస్కూల్ చదువు పూర్తిచేయటానికి కూడా అవకాశమిచ్చేది కాదు. పెళ్లిచేసి బరువుదించుకోవాలన్న తల్లి తాపత్రయానికి తలవొగ్గి పెళ్లిచేసుకొన్నది. పెళ్లిచేసుకొన్నవాడు పిచ్చివాడని తెలిసి కాపురానికి పొననని వుండిపోయిన విశాల అరుణగిరి సహాయంవల్ల తనకు ఇష్టంలేని ఆ పెళ్లి నుండి చట్టపరంగా విముక్తిని పొందగలగటానికి . విడాకులను చట్టబద్ధం చేసిన హిందూవివాహ చట్టమే కారణం అయింది.చట్టపరమైన అనుకూలతలు ఎన్ని వచ్చినా సామాజిక సంస్కారం, వ్యక్తి సంసిద్దత లేకపోతే వాటికి సార్ధకత ఉండదు. స్త్రీలు కాస్త చదువు, కొంత ఆర్ధిక స్వతంత్రత, ఆత్మగౌరవ వ్యక్తిత్వం సంతరించుకొంటున్న తొలిదశలో వాళ్ళు  ఆ మార్పులలో కొన్నిటిని స్వీకరిస్తూ కొన్నిటిపట్ల పూర్వభయాలు, సందేహాలు వదుల్చుకోలేక సందిగ్ధానికి లోనవుతున్నతరానికి ప్రతినిధిగా విశాల పాత్ర చిత్రించబడింది ఈ నవలలో. అరుణగిరి పట్ల ప్రేమ ఉన్నా ఒకసారి పెళ్లి అయి విడాకులు తీసుకొన్న స్త్రీగా తనకు అతనిని పెళ్లాడే హక్కు లేదనుకొనటంలో కనిపిస్తుంది. అరుణగిరి కుటుంబమర్యాదకు భంగం కలిగించటం, తల్లిని నొప్పించటం ధర్మం కాదని అంటుంది. ఆ తల్లి తనంతట తాను కొడుకు కోసం పాతభావాలను, అనుమానాలను వదులుకొని విశాలను కోడలిగా ఆహ్వానించటం ఈ నవలకు ముగింపు. 

ఏదిగమ్యం? ఏది మార్గం? నవల 1972 నాటిది( వినోదిని, నవలామాలతీయం 2006,పుట 138). ప్రేమించి పెళ్ళాడిన  క్రిస్టియన్, హిందూ బ్రాహ్మణ కులానికి చెందిన మేరీ విశ్వనాథం జీవిత పరిణామాలు ఈ నవలకు వస్తువు. హిందూబ్రాహ్మణ యువకుడిని పెళ్లాడిందని అమ్మాయి కుటుంబీకులు, క్రిస్టియన్ యువతిని పెళ్లాడాడని అబ్బాయి కుటుంబీకులు వాళ్ళను  పరాయి వాళ్ళుగా చూస్తున్నప్పుడు కలిగే మానసిక సంఘర్షణలు, తిరిగి ఆ కుటుంబాలలో మరీ ముఖ్యంగా మగవాడి కుటుంబలో చోటు సంపాదించుకొనటానికి పడే తాపత్రయాలు, నెత్తికెత్తుకొనే బాధ్యతలు ఇవన్నీ ఈ నవల ఇతివృత్తంలో భాగం అయ్యాయి. బ్రాహ్మణాధిక్యత క్రిస్టియన్ కోడలి సంపాదన, వైద్య సేవలు పనికివచ్చినట్లు ఆమె మతం పనికిరాకపోవటం సహపంక్తి భోజనాలకు సిద్ధపడకపోవటం వంటి సూక్ష్మ అంశాల చిత్రణ కూడా ఈ నవలలో ఉంది. విశ్వనాధానికి ఉన్న భర్త అన్న అధికార హోదా ఉద్యోగ వ్యవహారాలలో తన నిర్ణయాధికారాన్ని నిరోధించటం, తండ్రికి అన్ని అధికారాలు సంక్రమింప చేసిన పితృస్వామ్య కుటుంబం  పిల్లలపై తన హక్కును నిరాకరించటం ఇవన్నీ కలిగించిన ఆందోళనకు ఆత్మహత్య పరిష్కారం అనుకోటంలో మేరీ జీవిత విషాదం ఉంది. అది చివరకు విశ్వనాథం మరణం వరకు దారితీసి పిల్లలను అనాధలుగా మిగల్చటం దగ్గర ముగుస్తుంది. 

1983 లో వచ్చిన మధురస్మృతులు నవల వస్తువు కూడా దాదాపు ఇటువంటిదే. అందులో విషయం  కులాంతర వివాహం. డాక్టర్ చదువుతున్నఅన్య కులపు నాగమణికి కాలు ఫ్రాక్చర్ అయి ఆసుపత్రిలో చేరిన ఎమ్ఏ చదువుతున్న బ్రాహ్మణయువకుడు సుందర్ రాజన్ కు మధ్య కలిగిన ఆకర్షణ పెళ్లి వరకు దారితీయటం, పెళ్లినాడే తండ్రి తనను చచ్చినవాడికింద జమకట్టి అపరకర్మలు చేయటం పట్ల కలిగిన బాధవల్లనో, ఉద్యోగం రాక  నాగమణి సంపాదన మీద బతుకు తున్నాను అన్న నిస్పృహవల్లనో అతను అతికొద్దికాలంలోనే మరణించటం, అతని జ్ఞాపకాలలో ఆమె వైద్యవృత్తి కొనసాగిస్తుండటం ఇందులో కథ. మతాంతర కులాంతర వివాహాలకు ఆధునిక సమాజంలో ఏర్పడుతున్న అవకాశాలను చూస్తూ అంతరాల వ్యవస్థలో యువతీ యువకులు ఎదుర్కొంటున్న సంక్షోభాలకు పరిష్కారం ఏమిటో ఆలోచనకు, అవగాహనకు  ఇంకా అందని కాలంలో ఇటువంటి విషాదాంత నవలలే వస్తాయి. 

బ్రతకనేర్చిన జాణ, ఆలోచించు నవలలు  స్త్రీల లైంగిత పట్ల, స్త్రీపురుష సంబంధాల పట్ల  సమాజంలో ఘనీభవించిన భావాలను, అభిప్రాయాలను ప్రముఖంగా ముందుకు తెచ్చి చర్చించాయి. మగవాడు పెళ్లికి బయట స్త్రీలతో  సంబంధాలు పెట్టుకొనటం, ఆడది పెళ్లి లేకుండా పురుషుడితో సంబంధాలు పెట్టుకొనటం రెండింటికీ వేర్వేరుగా విలువలను నిర్దేశించే సమాజ వైఖరిని ప్రదర్శించే నవల ‘బ్రతకనేర్చిన జాణ’. ఒక స్త్రీ ముఖంగా ఉత్తమపురుష కథనంలో సాగే నవల ఇది. కథ అంతా ఆమె హైస్కూల్ క్లాస్ మెట్ సుభద్ర, లెక్కల టీచర్ రోజీ, గోపాలరావు అంకుల్ ను చుట్టుకొని నడుస్తుంది.ఆ సంబంధాల స్వభావ పరిణామాలు అంచలంచెలుగా పాఠకులకు అందివచ్చేది ఆమె కథనం వల్లనే. తనకంటే చిన్నవాళ్లు, ఒంటరివాళ్ళు, నిస్సహాయులు, ప్రేమకోసం అలమటిస్తున్నవాళ్ళు అయిన రోజీ టీచర్ తోను,  ఆ తరువాత సుభద్ర తోనూ సంబంధాలు పెట్టుకొన్న గోపాలరావు అంకుల్ పట్ల ఉత్తమపురుషులో కథచెప్పేస్త్రీకి ఎటువంటి ఆరోపణలు, అభ్యంతరాలు లేవు. అతనితోటి సంభాషణవల్ల రోజీ గురించి అయినా, సుభద్ర గురించి అయినా ఏర్పడిన పాక్షిక అభిప్రాయాలతోనే ఆమె వాళ్ళ పట్ల తీర్పరి కావటం చూస్తాం. రోజీ టీచర్ టిబి తో మరణించటంతో పెళ్లి లేకుండా గోపాలరావు తో ఆమె చేసిన స్నేహం, ఏర్పరచుకొన్న సంబంధం చర్చకు రాకుండాపోయాయి. కానీ ఒక బీదకుటుంబంలో బాలవితంతువుగా దుర్భరమైన జీవితం నుండి విముక్తికి, టీచర్ ఇంట్లో పని, గోపాలరావు అంకుల్ ఆశ్రయం- వంటి అవకాశాలను అన్నిటినీ వాడుకొంటూ వదిలేస్తూ  ఎమ్మెస్సీ చదివి, ఒక ఉద్యోగస్తుడిని పెళ్లాడి తనకంటూ ఒక సంసారాన్ని, భద్ర జీవితాన్ని ఏర్పరచుకొన్నసుభద్ర ‘బ్రతకనేర్చిన జాణ’ అన్న ఒక అవమానపూర్వకమైన ధ్వని గల సర్వనామధారిణి కావలసి వచ్చింది. స్త్రీల పవిత్రతను కాపాడటం లక్ష్యం గా పెట్టుకున్నాడని అన్నగారి పురుషాధికార స్వభావాన్ని గుర్తించగల కథకురాలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవటం ఈ నవలలోని వైచిత్రి. అది రచయిత్రి ఆలోచనావైఖరి కూడానా అంటే ఆవునేమో అనిపిస్తుంది.

జీవితాన్ని ఎదుర్కొనటానికి ఎలాంటి ఆలోచనావిధానాన్ని అలవరచుకోవాలో చెప్పే తాత్విక రచనగా కనిపించే  ‘ఆలోచించు’ నవల కూడా వివాహానికి అవతల మగవాడు స్త్రీలతో ఏర్పరచుకొనే సంబంధాలను చూసీ చూడనట్లుగానో, అసలే తెలియనట్లుగానో నటించే ఒక సామాజిక నైతిక వాస్తవికతను  ప్రముఖంగా ముందుకు తెచ్చి చూపింది. ఈ నటన బయటివాళ్లకు బాధ కాదు, కానీ ఇంట్లో భార్యకు అది పెద్ద హింస. మాధవరావు భార్య శ్యామల అయినా మూర్తి భార్య లలిత అయినా అటువంటి హింసను ఎదుర్కొన్నవారే. అయితే భర్తకు పరాయి స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని తెలిసినప్పుడు  స్త్రీలు ఆ వేదనను తట్టుకోనటం ఎట్లా? కర్మ అని సరిపెట్టుకొనటమూ కాదు. కోపం వచ్చి ధిక్కరించి వెళ్ళటమూ కాదు. ఎదుటివాళ్ళ కోణంనుండి అంటే భర్త కోణం నుండి, భర్తతోటి సంబంధంలోకి వచ్చిన స్త్రీ కోణం నుండి ఆ సమస్యను అర్ధం చేసుకొని వాళ్ళను క్షమించగలగటం, వ్యక్తిగా తన వికాసానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కొనటం.- అన్నది ఈ నవల ఇచ్చేల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న రాకమానదు. 

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.