నా జీవన యానంలో- రెండవభాగం- 9

-కె.వరలక్ష్మి 

మేం ఆ ఇంట్లోకెళ్లిన కొత్తల్లో ఒకరోజు కుప్పయాచార్యులుగారి కొడుకు, సింగ్ అట ఆయనపేరు; వాళ్ల బంధువు ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. సింగ్ గారు మానాన్నకి క్లాస్ మేటట. మా నాన్న కాలం చేసారని తెలుసుకుని విచారించాడు. ‘‘రమణ జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడ్డాడమ్మా, మేమంతా హాయిగా ఆడుకొనేవేళల్లో తను సైకిల్ రిపేర్ షాపుల్లో పనిచేసేవాడు. ఊళ్లో కాలినడకన, పొరుగూళ్లకి ఎంతదూరమైనా సైకిల్ మీదా తిరిగేవాడు’’ అంటూ మానాన్న బాల్యం గురించి నాకు తెలీని విషయాలెన్నో చెప్పేడు. నేను తన బిడ్డల్లో ఒక బిడ్డను అన్నంత ఆప్యాయంగా మాట్లాడేవాడు ఎప్పుడొచ్చినా, వాళ్లకి ఈ ఇల్లుకాక తోటలు, పొలాలు ఉండేవి. బహుశా అయ్యరు హోటల్లో భోజనాలు చేసే వారనుకుంటాను, కాఫీ మాత్రం నేనిచ్చేదాన్ని. రాత్రుళ్లు వెనకవైపు గదిలో పడుకొనేవాళ్లు. సింగ్ గారు సాదాసీదాగా ఉండేవాడు కాని, వెంట వచ్చిన చుట్టం మాత్రం తెల్లగా, ఎత్తుగా, పెద్దపెద్ద మీసాల్తో ఉండేవాడు. పంచదార, ఉప్పులాంటివి అడగడానికొచ్చి చూపు తిప్పుకోకుండా ఏదోలాగ నన్నేచూస్తూఉండేవాడు. నాకు అతన్ని చూస్తే భయంగా ఉండేది. మోహన్ కి ఎప్పడూ పెందలాడే ఇంటికొచ్చే అలవాటు ఉండేదికాదు. వెర్రివాడైనా మా మూర్తి సందర్భాన్ని గ్రహించుకొని నావెంటవెంటే ఉండేవాడు. మా తోటమాలి తాత ఎలాగూ ఉండేవాడు కాబట్టి నేను ధైర్యాన్ని కొని తెచ్చుకునేదాన్ని, అవసరం లేకపోయినా మండువాలోకొచ్చి కూర్చుని మాట కలపబోయేవాడు, నేను గదిలోకెళ్లి తలుపులు గడియలు బిగించుకునేదాన్ని.

ఒక ఆదివారం రోజు పుంత వీధిలో ఉండే కంసాలాయన్ని ఆయన కుంపటి వగైరా సరంజామాల్తో తీసుకొచ్చేరు. వాళ్లుంటున్న వెనుక గది తలుపులు మూసుకుని ఏదో చేసేరు. అప్పట్నుంచీ రోజూ స్కూలు పిల్లలంతా వెళ్లిపోయాక లైట్లు వేసుకుని చేసుకునేవాళ్లు. చివరికి ఒకరోజు సింహతలాటాల్లాంటి డజను బంగారు కడియాలు, మిలమిలా మెరిసిపోయేవాటిని సింగ్ గారు ఎర్రరేపర్లో చుట్టితెచ్చి చూపించేరు. ఆ రెండోవ్యక్తి దుబాయ్ లో రెండేళ్లుండి, ఎడారిలో తాగిపడేసిన ఖాళీ సీసాలమ్ముకుని బంగారుబిస్కెట్లు కొని తెచ్చుకున్నాడట. వాటిని నగలుగా మార్చి హైదరాబాద్లో అమ్ముతారట. నాకా కథ నమ్మశక్యం కాలేదు. ఆ మాటే మోహన్ తో అంటే ‘‘నీకీ జగ్గంపేట తప్ప మరో ప్రపంచం ఏం తెలుసు? నేను కూడా ఓ రెండేళ్లు సెలవుపెట్టేసి దుబాయ్ వెళ్లిపోతాను’’ అన్నాడు. ఆ పని పూర్తికాగానే వాళ్లు వెళ్లిపోయేరు. మోహన్ కి అంత డబ్బు పిచ్చి ఎందుకు పట్టుకుందో నాకర్థమయ్యేది కాదు. ఈ విషయంలో మేమిద్దరం భిన్నధృవాలం. నాకూ డబ్బు కావాలి ఇబ్బంది లేకుండా జీవించడానికి, దాన్ని కష్టపడి సంపాదించాలి. దాన్ని పొదుపుగా వాడుకుని మిగిలినది జమచేసుకోవాలి. కాని, మోహన్ డబ్బును అడ్డంగా సంపాదించెయ్యాలి అనుకునేవాడనుకుంటాను. అందుకే ఎప్పుడూ పేకాట క్లబ్బులో తీరిక సమయాన్ని గడిపేవాడు. ఓసారి వాళ్ల పిన్నికొడుకు ద్వారా దొంగనోట్లు మార్చబోయి పాతికవేలు పొగొట్టుకున్నాడట. 1982 లో పాతిక వేలంటే? స్వతహాగా తెలివైనవాడే, కాని ఆ తెలివితేటల్ని సక్రమమార్గం లో వినియోగించేవాడుకాదు. చెప్పబోతే వినేవాడు కాదు. దాంతో అతన్తోబాటు నేను కూడా ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయేదాన్ని.

కొత్తవారింట్లో ఉన్నప్పుడు ఇంటిస్థలం కొన్నాను కదా, ఆమరుసటి నెల నుంచీ ఆంధ్రాబేంక్లో నెలకి 250 రూపాయలు దాచడం మొదలుపెట్టేను. అప్పట్లో ఆంధ్రాబేంక్లో ఓ స్కీము ఉండేది. నెలనెలా ఆర్.డి. లో వేసిన డబ్బు ఇల్లుకట్టుకోడానికి తీసుకున్నప్పుడు రెట్టింపు ఇచ్చేవారు. ఆ రెట్టింపు సొమ్మును అదే పద్ధతిలో నెలనెలా తీర్చేయవచ్చు. పదివేలయ్యేక తీసి పునాది కట్టించాలని నా ఉద్దేశం, పదివేలు పూర్తయ్యేక నా పీకమీద కత్తిపెట్టి చెక్కుమీద సంతకం పెట్టించి తీసేసుకున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలాగా నేను మళ్లీ దాచడం మొదలుపెట్టేను. దానికి సంబంధించిన పాస్ బుక్ అతనికి కన్పించకుండా దాచేసాను. అప్పట్లో నేను స్థలం కొన్నప్పుడు మా ఆడపడుచు రాణి ‘‘మాకు చెప్పలేదేం, మేమూ కొనుక్కునేవాళ్లం కదా’’ అంది. మళ్లీ స్థలాలు తీసినప్పుడుచెప్తే వాళ్లు రెండు స్థలాల ఒకే బిట్టు 700 చ.గజాలు కొనుక్కున్నారు. వాళ్లు ఇల్లు కట్టుకోడానికి సిద్ధమై జగ్గంపేట వచ్చేరు. అప్పటికి నేను దాచిన డబ్బులు ఐదువేలయ్యాయి. మరో ఐదువేలు ఆర్.డి. లోన్ తీసుకుని పదివేలూ వాళ్ల చేతిలో పెట్టి మా స్థలంలో కూడా పునాది కట్టించమని రిక్వెస్ట్ చేసాను. మోహన్కి కోపం వచ్చింది. ‘‘ఏం నేను కట్టించలేనా, ఆడబ్బేదో నాకు ఇవ్వొచ్చుకదా’’ అని. రాణీకీ కోపం వచ్చింది వాళ్లు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అవసరమైతే సర్దబడుతుందేమో అని నేనలా చేసాననుకుని.

పునాది తర్వాత ఓ నెల గేప్ ఇచ్చి మళ్లీ వచ్చి మూడు పోర్షన్ల పెంకుటిల్లు కట్టుకుని అద్దెలకిచ్చి వెళ్లిపోయారు. మా పునాది మాత్రం ఏడేళ్లకు పైగా ఉండిపోయింది.

మా అత్తగారు రాజమండ్రి లో రెండు పోర్షన్ల పెంకుటిల్లు కట్టడం ప్రారంభించేరట. దానికి కావాల్సిన కలప, పెంకుల్లాంటివన్నీ మోహన్ ఇక్కడనుంచి బళ్లమీద పంపేవాడు. అందుకని ‘‘మనకి వేరే ఇల్లెందుకు, రిటైర్మెంటు తర్వాత ఎలాగూ రాజమండ్రి వెళ్లపోవాల్సిన వాళ్లమే’’ అనేవాడు.

మా అమ్మా వాళ్లూ ఇచ్చిన నెక్లెస్ ఎప్పుడూ నా వొంటిమీద ఉండేది కాదు. తాకట్టులోనే ఉండేది. దాన్లో నీలం రాళ్లు ఉండడం వల్ల అలా జరుగుతోందని ఎవరో అన్నారు. అప్పటికి నాకు సెంటిమెంట్లు ఎక్కువే. ఆసారి తాకట్టునుంచి వచ్చేక కంసాలిని పిలిచిరాళ్లు తీయించేసి, కరిగించి  ఓ జత గాజులు చేయించుకున్నాను. అంత అందమైన నగను తనకు మాటమాత్రమైనా చెప్పకుండా అలా చేసినందుకు మా అమ్మ కళ్ల నీళ్లు పెట్టుకుంది. అలిగి చాన్నాళ్లు నాతో మాట్లాడ్డం మానేసింది. అంతలో మా అత్తగారు వస్తే ఎర్ర కాయితంలో చుట్టి ఉన్న గాజుల్ని ఆవిడకి చూపించేను సంతోషిస్తారని. వరలక్ష్మీపూజ దగ్గరకొస్తోంది. పూజ దగ్గరపెట్టి వేసుకోవాలని నా ఉద్దేశం. గాజుల్ని చూస్తూనే, తాకట్టుపెట్టి ఇంటికి గచ్చులు చేయించి, తర్వాత విడిపించి ఇస్తాను ఇమ్మన్నారావిడ. కథ మళ్లీ మొదటికొచ్చింది, నీలంరాళ్లు లేకపోయినా బంగారం నడిచెళ్లిపోయేలా ఉంది. నాకు తెలుసు, ఇస్తే ఇక ఆశ వదులుకోవాల్సిందే. ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పలేను. నసుగుతూ నట్టుతూ ‘‘పూజ తర్వాత ఇస్తానండి’’ అన్నాను. ఆవిడకి కోపం నషాళానికంటేసింది. వీధిలోకెళ్లి వాకిట్లోని మట్టిని దోసిళ్లతో ఎత్తిపోసి ‘‘సర్వనాశనం అయిపోతారే’’ అని తిట్టి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ మా అమ్మను బైటికి పిలిచి వాళ్లింటిమీదా దుమ్ము ఎత్తిపోస్తూ తిట్టివెళ్లిందట.

స్కూల్లో పాఠాలు చెప్పడం వేరు, సొంతంగా బాధ్యత వహించి స్కూల్ నడపడం వేరు. నేనైతే దాన్నొక దీక్షలాగా భావించేదాన్ని. స్కూల్లో అడుగుపెట్టగానే ఇంటివిషయాలన్నీ మనసులోంచి తీసేసేదాన్ని. స్కూలుకి సంబంధించిన పని ఒత్తిడి ఎంతైనా తట్టుకునేదాన్ని కాని, ఇంటిసమస్యలకి కృంగిపోయేదాన్ని అందుకే అలా అలవాటు చేసుకున్నాను.

ఆ రోజుల్లో వర్క్ స్ట్రెస్ తట్టుకోలేకో ఏమో విపరీతంగా తలనొప్పి వచ్చేది. రాజమండ్రి వెళ్లి కంటిపరీక్షలు చేయించుకుంటే కళ్లద్దాల అవసరమేం లేదన్నారు. సారిడన్ తప్ప ఇంకేదీ నా వొంటికి పడదని నాకప్పటికి తెలీదు. డాక్టరు దగ్గరకెళ్లే తీరిక లేక మెడికల్ షాపు వాళ్లనడిగి వాళ్లిచ్చిన టేబ్లెట్సల్లా వేసేసుకుంటే అల్సర్ ప్రోబ్లమ్ పట్టుకుంది. ఏం తిన్నా వామిట్ కావడం, లేదా అరగకపోవడం. అప్పుడప్పుడే కథా రచనలోకి అడుగు పెట్టేను కాబట్టి కాకినాడలో డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిగార్ని  కలిస్తే పరిచయం చేసుకున్నట్టూ ఉంటుంది అన్పించింది. మోహన్ కి చెప్తే ‘‘డబ్బులున్నాయా మరి?’’ అన్నాడు. నాకు అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. నీకోసం నేనున్నానుఅనేవాళ్లులేని లోటేమిటో అనుభూతిలోకొచ్చింది.

ఆ నెల టీచర్స్ జీతాలు ఒకరోజు ఆపుచేసి, పర్స్ లో 5 వేలు వేసుకుని మోహన్ ని తోడు తీసుకుని వెళ్లేను. మా మరదలికి అబ్బాయి పుట్టినప్పుడు నేను చూసినప్పటికీ, ఇప్పటికీ హాస్పిటల్ చాలా మారింది. పెద్ద బిల్దింగు, బోలెడుమంది స్టాఫ్, రకరకాల పరీక్షాయంత్రాలు, బైటగార్డెన్లో ఒడిలో పాపాయితో కూర్చున్న అమ్మబొమ్మ చూపు తిప్పుకోనీయకుండా. కారిడార్లో కుర్చీలనిండా బోలెడంత మంది వెయిట్ చేస్తూ. అక్కడే గోదావరి శర్మగారినీ, ఆయన భార్యనీ ఒడిలో చంటిబిడ్డతోచూసేను. ఆరోజు పత్రికలో వచ్చిన తన కవిత భార్యకు చూపిస్తూంటే ఆయనేనని గుర్తుపట్టేను. కాని ఏమని పరిచయం చేసుకోను? అలాగే డాక్టరుగారితోనూ. కన్సల్టేషన్ ఫీజు ఖర్చు రిసెప్షన్లో పేరు రాయించేక పర్స్ మోహన్ కిచ్చి డాక్టర్ కేజువల్ పరీక్షకి రమ్మంటే వెళ్లేను. తర్వాత కారిడార్లో కూర్చోండి, మీ నెంబరు వచ్చినప్పుడు పిలుస్తాం అన్నారు. అప్పటికింకా హాస్పిటల్స్ లో ముందుగా డబ్బులు కట్టించుకునే పద్ధతి రాలేదనుకుంటాను. నేను రాగానే ‘‘నీ నెంబరొచ్చే సరికి చాలా టైం పడుతుందట. నువ్వు కూర్చో, నేను బైటపనిచూసుకుని వస్తాను’’ అని కంగారుగా వెళ్లిపోయాడు మోహన్. నాకేదో డౌటొచ్చి చూస్తే పర్స్ లో 5 వేలకు బదులు రెండు వందలే ఉన్నాయి. నా గుండె గుభేలుమంది. గేటు బైటికి పరుగెత్తేను. ఆటోలో వెళ్లిపోయినట్టున్నాడు. కన్పించలేదు. డాక్టరు నాకేం అనారోగ్యమని చెప్తారో అనే టెన్షనొకపక్క, హాస్పిటల్ కి ఎంతౌతుందో అనే టెన్షనింకొక పక్క. ఆకలి, నీరసం. వెళ్లి రోడ్డవతలి షాపులో జూస్ తాగివచ్చేను. నానెంబరు పిలిచి, టెస్టులు చేసి, రిపోర్టులొచ్చి, డాక్టరు పిలిచి మందులు రాసిచ్చేసరికి సాయంకాలం 5 దాటింది. కౌంటర్లో 5 వందలు కట్టమన్నారు. అవికాక మందులు తీసుకోవాలి. కౌంటర్లో అమ్మాయితో మావారు రాగానే కట్టేస్తాను అని చెప్పి, ఆ అమ్మాయి అనుమానపు చూపుల్ని తప్పించుకోడానికి ఆ ఎదుట కుర్చీలోనే కూర్చుని ఉండిపోయాను. మోహన్ విషయం తెలుసుకాబట్టి నాగుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి. ఏడు గంటలకి స్థిమితంగా వచ్చేడు. ఎదురు పరుగెట్టి ‘‘డబ్బులేవి?’’ అన్నాను. ‘‘అవసరమొచ్చి ఖర్చుపెట్టేసాను. రెండొందలుంచేనుగా’’ అన్నాడు. నాకు మైండ్ బ్లాంకైపోయింది. విపరీతంగా తలనొప్పివచ్చేసింది.  ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను? చిల్లరడబ్బుల్తో జూస్ తాగేను కాబట్టి వందకాయితాలు రెండూ మిగిలేయి. నేను చెప్పేది వినకుండా రిసెప్షనమ్మాయి నన్ను డాక్టరు గారి దగ్గరకి పంపించింది. నేను వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ, రెండు వందలూ, నాచేతికున్న రెండు బంగారు గాజులూ తీసి టేబుల్ మీదపెట్టి ‘‘రేపుదయాన్నేవచ్చి మిగిలిన డబ్బులు కట్టి పట్టుకెళ్తాను మేడమ్’’ అన్నాను. ‘‘ఇదేమైనా తాకట్టు వ్యాపారమనుకుంటున్నారా? ఎందుకిలాంటి పనులు చేస్తారు?’’ అన్నారావిడ సీరియస్గా గాజులు నా ముందుకి నెట్టేస్తూ, సర్లే వెళ్లండి అన్నారు చికాగ్గా, నేను సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయేను. డబ్బులన్నీ పేకాటలో పోయాయట. ఇంటికొచ్చానేకాని ఆ రాత్రి మొత్తం కంటిమీదికి నిద్రరాలేదు. తెల్లవారుతూనే మూడువందలూ, మందుల డబ్బులూపట్టుకొని కాకినాడ బస్సెక్కేను.

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.