పునాది రాళ్లు-9

-డా|| గోగు శ్యామల 

కుదురుపాక రాజవ్వ కథ

కుదురుపాక ఊరు  వాడ ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు . ఇంకా తెల్లవారలేదు.  దొర పంపిన గుండాలు  మాదిగ వాడలోని రాజవ్వమల్లయ్య దంపతుల ఇంటివైపు వేగంగా వెళ్లి వారి గుడిసెలోకి దూసుపోయిండ్రు.   అరక కోసం తాళ్లను సర్దుతున్నమల్లయ్యను బైటకు గుంజిపడేసిండ్రు.  తలపై నడములపై మోకాళ్లపై లాఠీలతో గొడ్డలి కామాతో  ఎట్లా వడితే అట్ల రక్తాలు కారేటట్లు కొట్టి పడేసిండ్రు. అతని తాళ్ల తోనే  అతన్ని వాకిట్లో గుంజకు కట్టెసిండ్రు.  ఏడుస్తూ తండ్రి వద్దకు చేరిన ఇద్దరి పిల్లల్ని ఈడ్చిపడేసిండ్రు. తమ ఇంటికి పదడుగుల దూరంలో ఉన్న పోలీస్ కాంప్  దగ్గర కెళ్ళి రాజవ్వ తన పెనిమిటి మల్లయ్యను గుండాలు వచ్చి కొడుతున్నారు.’ మీకు దండం పెడతా వచ్చి నా పిల్లల తండ్రిని  కాపాడండి’ అని పోలీసులను వేడుకుంటుంది రాజవ్వ. భర్తను గుంజకు కట్టేసిన గుండాలె  పోలీసులను బతిమిలాడుతున్న ఆమెను బలవంతంగా ఈడ్చుక పోతూ ఆమెను ఎక్కడ పడితే అక్కడ రక్తం వచ్చేటట్లు కొట్టి పడేసిoర్రు.  భర్త పిల్లల ముందు  అమానవీయంగా ఆమెను సామూహిక అత్యాచారం చేసిండ్రు. ఇంతటితో ఆగని గుండాలు మిగితా మహిళాసంఘం నాయకులయిన బానవ్వ కనకవ్వల ఇల్లుల వైపు పరిగెత్తిoరు .  వారి గుడిసెల్లో దూరి వారిని చెరబట్ట చూశారు. కానీ అప్పటికే విషయం తెలుసుకున్న ఆ  ఇద్దరూ  గుండాల చెర బడకుండా తప్పించుకుపారిపోయిన్రు. ఆ ఇద్దరు దొరకక పోవడంతో గుండాలకు చిర్రెత్తిoది. ‘ఎక్కడ దాసిపెట్టిన్రురా వాటిని’ అని చుట్టు పక్కల పరిసర ప్రాంతంలో ఉన్నవారిని గుడిసెల్లోనుండి బయటికి లాగి క్రూరంగా కొట్టిoరు. వారి గుడిసెల్లోని సామానులను బయటికి విసిరేసిండ్రు.  చిందర వందర చేసి పగులగొట్టిండ్రు. ఈ దారుణాన్నoతా అక్కడే క్యాంపుగా ఉన్న పోలీసులు చూస్తున్నప్పటికిని  వారిని ఆపకుండా  చూస్తూ ఉండిపోయారు.  ఇదిలాకొనసాగుతుంటే,  పదేళ్ల బాలుడైన రాజవ్వ కొడుకు దుర్గామల్లయ్య తన తల్లి తండ్రి ఫై గుండాలు చేసిన అఘాయిత్యాన్ని చెప్పడానికి  పరిగెత్తుకుంటూ ముపై కిలోమీటర్ల దూరమున్నసిరిసిల్లా తాలూకా కేంద్రంలోని  పోలీస్ స్టేషనుకు పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసులకు తన తల్లి తండ్రికి జరిగిన అన్యాయాన్ని చెప్పి  ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయమని బతిమిలాడిండు.  ఇక్కడ జరిగిన మరో దారుణం ఏమంటే  ఆపిల్లోడు చెప్పిన  విషయం ఫై దయా సానుభూతి అనేది బొత్తిగా లేకుండా ‘మీ అమ్మని వాళ్ళు ఏమిచేసిండ్రు ఎట్లా చేసిండ్రురా ‘ అని అడిగి ఎగతాళి చేసిoడ్రు.  నీచాతి నీచమైన రీతిలో రాజవ్వ కుటుంబాన్ని దాడి చేసి అవమానించిన గుండాల వెనుక గడి వెల్మదొరరీకం మరియూ  వారికి సపోర్టుగా పోలీస్ యంత్రాంగం కలగలసి ఈ  ముగ్గురు మాదిగ మహిళా నాయకుల ముఖ్యoగా రాజవ్వ లైoగిక  అత్యాచారానికి కుటుంబంపై భౌతిక దాడికి తెగబడ్డారు. ఎందుకు ఇంతస్థాయిలో నీచానికి ఒడికట్టారనే ప్రశ్నకు రాజవ్వ కొడుకు  మాటలు సమాధానమిస్తాయని చెప్పవచ్చు.  దుర్గ మల్లయ్య మాటల్లో ” ఉద్యమం మొదలైన తరువాత మా అవ్వ రాజవ్వ రైతుకూలీ సంఘానికి మరియూ మహిళా సంఘానికి ప్రముఖ నాయకురాయింది. సిరిసిల్లా తాలూకాలోలీడర్ కావడానికి ఆమెలో ఉన్న ధైర్యం, అన్యాయాన్ని సహించలేనితనం  అనేవి ప్రధాన కారణం. మా ఊరి దొర వెంకటరామారావు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నల సంఘం పిలుపునిచ్చినప్పుడు  ఈమె  ధైరస్తురాలు కనుక మా ఊర్ల అందరిట్లా ముందుకు వడ్డది. పార్టీ నిర్వహించిన ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలన్నింటిలో దొర చేసిన అక్రమాలను దోపిడీని బట్టబయలు చేసుడైంది.  ముఖ్యంగా మా భూమి మాకు కావాలీ అనే డిమాండు మా ఊరితో పాటు చుట్టుపక్కల ఎన్నో ఊర్లు ఊరేగింపులు సభలు జరిపిండ్రు. ‘మా దగ్గర వెట్టి చేసే వెట్టి ప్రజలు ఊరేగింపులు సభలు చేస్తారా? ‘ అనే  కోపంతో 29 తేదీ అక్టోబర్  1978 నాడు  దొరలు   గుండాలను  పంపి దాడి  చేయిoచిండ్రు “. అని చెప్పుకొచ్చాడు.  రాజవ్వ మరియూ ఇంకా ఇద్దరు  మహిళా నాయకుల మీద లైoగిక దాడి చేయడం ద్వారా  దొరలూ  ఈ దళిత స్త్రీలు పరువు మరియాదలు పోయి, అవమానంతో కృంగిపోతూ, కుమిలిపోతూ ఇంటిలో దొర పొలంలో తల దించుకొని  చాకిరీ చేస్తూ ఉండిపోతారనుకున్నారు. అంతే కాక, అప్పటి వరకు వీరిని గౌరవించి, వీరి నాయకత్వంలో నడిచిన ప్రజలు వీరిని ఈసడించుకొని అనుసరించడం మానుకుంటారనుకున్నారు ఆధిపత్య కుల దొరలు.  ఆ రకంగా తమ కుల వర్గ పితృస్వామ్యాధిపత్యాన్ని, అధికారాన్ని నిలుపుకోవాలనుకున్నారు. కానీ  దొరల అహాం కారానికి, అసహానానికి, దోపిడీకి, క్రూరమైన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాజవ్వ మరియూ బానవ్వా కనకవ్వా దృడంగా నిలబడ్డారు. వీరిని అనుసరించి ప్రజలు తండోప తండాలుగా ఎప్పటి లాగే కాస్త అంతకంటే ఎక్కువే కదిలారు. నక్సలైట్ పార్టీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా నీరసన కార్యక్రమాలు  ప్రచారాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ముట్టడిలు, ధర్నాలు , చలో వంటి ఆందోళన కార్యక్రమాలు అనేకం జరిగాయి.  అది కుదురుపాక  గ్రామo లోని  వాడ  స్థాయి నుండి ఊరు తాలూకా జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని వరకు  రాజ్య హింస వ్యతిరేక ఆందోళనలు విస్తరించాయి. హైద్రాబాద్ ఢిల్లీలలో జరిగిన మహాసభల్లో రాజవ్వ దృడంగా నిలబడి అభివాదం చేసింది. వీటన్నింటిలో దృడంగా నిలబడటానికి నక్సలైట్  పార్టి ఈమెకు బలంగానే సపోర్ట్ చేసింది.  ఆ విధంగా రాజవ్వ పార్టీలో ముప్పయి ఆరు సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నది. ఆటుపోట్లతో కొనసాగుతున్నపార్టీ కార్యక్రమాల్లో భాగమౌతూ వచ్చింది. తనకు ఇష్టమున్నా లేకపోయినా  తన శరీరం తనకు సహకరించకపోయినా  ప్రత్యర్థుల వత్తిడితో వందల మీటర్ల కాలినడక ప్రయాణాలు,  వేల కిలోమీటర్ల బసు రైలు ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇరవై ఐదు  సంవత్సరాలుగా  క్రమం తప్పకుండా కోర్టుల చుట్టూ తిరిగింది. జైలు జీవితాన్నీ అనుభవించింది. ఈ క్రమంలో అనేక మార్పులు  అనుకోని అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి నేపత్యంలో రాజవ్వ మరియూ ఇతరులు పార్టీ రాజకీయాలు ఆచరణ యొక్క వైఫల్యాలను  తెలుసుకోగలిగారు. కానీ రాజవ్వ జీవితం చాలా వరకు గడిచిపోయింది. తన కనుల ముందు పుట్టి పెరిగి తన కొడుకుల వయసు వారు  తన ముందే పోలీస్ ఎంకౌంటర్లలో,ఇన్ఫార్మర్ల పేరుతో చంపేయబడ్డారనే కథలు ఏ చరిత్రలో లేవు. వాటిని రాజవ్వ మాత్రమే చెపుతుంది.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.