నడుస్తున్న భారతం (కవిత)

– వేముగంటి మురళి

ముఖానికి మాస్క్
దుఃఖానికి లేదు
ఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్ని
మెలిపెడుతున్నది ఒంట్లో
 
నగరాల నరాల్లో 
విచ్చలవిడిగా మండుతున్న భయం
పూరిగుడిసెలో
చల్లారిన  కట్టెల పొయ్యి
అవయవాలు ముడుచుకొని ఉండడమే
పెద్ద శ్రమ 
 
కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదు
కాలాన్ని వెనకకు తిప్పలేదు
ప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది
 
తిరిగే కాలు మూలకు,
ఒర్రే నోరుకు రామాయణ తాళం
గదంతా ఆధ్యాత్మిక ధూపదీప యాగం
కంట్లో నిండుతున్న విశ్వాసాల పొగలు
ఎర్రబారిపోయింది పిచ్చి మనసు
 
రోడ్డుమీద ఒక పక్కకు పక్షుల రాకడ
మరోదిక్కు వలసొచ్చిన మనుషులు పోకడ
 
పిట్టలు ఎగరగలవు
కరువు అమాంతం నెత్తిమీద వాలుతుంది
భుజం మీద చినిగిన బోళ్ల సంచి
రొండికి పాలకు ఏడుస్తున్న పసిపిల్లగాడు
ఇది నడుస్తున్న భారతం

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.