కనక నారాయణీయం -8

పుట్టపర్తి నాగపద్మిని

         

  శిరోమణిలో పుట్టపర్తి వారి స్నేహితుడు కలచవీడు శ్రీనివాసాచార్యుల బంధువులకు తాడిపత్రిలో దేశబంధు ప్రెస్ ఉన్నదనుకున్నాం కదా!! పుట్టపర్తి స్నేహితుడైన శ్రీనివాసాచార్యులకు, తన స్నేహితుని ‘పెనుగొండ లక్ష్మి’ ని తమ ముద్రణాలయంలో ప్రచురించవలెనని కోర్కె పుట్టింది. దానికి ధనం కావాలి కదా!! ఎలా మరి??

  సహ విద్యార్థుల ప్రోద్బలంతొనే పెనుగొండ లక్ష్మి లోని కొన్ని పద్యాలు , అప్పట్లో సాహితీ లోకంలో అత్యంత ఆదరణకు నోచుకుంటూ, తలమానికంగా వెలుగొందుతున్న భారతి మాస పత్రిక 1933 సంచికలోనూ వెలుగులోకి వచ్చాయి. ఇదే క్రమంలో  పుట్టపర్తి వారి సహ విద్యార్థులందరూ తలా కొంచెం వేసుకుని, కొంత డబ్బు సేకరించుకున్నారు. శ్రీనివాసాచార్యులు ఉండనే ఉన్నాడు కదా!! ముద్రణకేమీ బాధ ఉండదనే వాళ్ళ ధైర్యం. విద్యార్థులందరూ ఎంత కూడ బెట్టినా, ఒక గ్రంధ ముద్రణకయ్యేంత డబ్బు కూర్చటం సాధ్యమా అప్పట్లో?? ఐనా అడుగు ముందుకే వేశారందరూ!! మొత్తానికి దేశబంధు ప్రెస్స్ వారు కూడ కాస్త ఉదారంగానే వ్యవహరించటం వల్ల, పుట్టపర్తి వారు తమ పన్నెండవ ఏట వ్రాసిన ప్రప్రథమ కావ్యం ‘పెనుగొండ లక్ష్మి’ వారి పంధొమ్మిదవ ఏట, సాహితీ ప్రియుల హస్తాలను అలంకరించింది.

   తిరుపతి ప్రాచ్య పాఠశాలలో పుట్టపర్తి ప్రతిష్ట అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది .

   ఆ సమయంలోనే అలమేలు మంగాపురంలో విడిది చేసి ఉన్న ఉత్తరాది మధ్వ మఠ స్వామి శ్రీశ్రీశ్రీ సత్య ధ్యాన తీర్థులవారి సమక్షంలో వారి గురించి పుట్టపర్తి ఆశుకవితలను చదవటం, షట్శాస్త్ర పండితులూ, జ్ఞాన వయోవృద్ధులైన ఆ స్వామి వారిని మెప్పించటం కూడా జరిగింది. అంతే కాదు,అదే సమయంలో తిరుపతి కి విచ్చేసిన  కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ముందు కూడా పుట్టపర్తి, సంస్కృతంలో  ఆశుకవితా పఠనానంతరం వారి ఆశీస్సులతో కూడిన భవిష్య వాణిలో ముందు ముందు పుట్టపర్తి అవరోహించే కీర్తి శిఖరాల ప్రస్తావన కూడా వచ్చిందట!!

  విద్యార్థిగా అక్కడున్న్నప్పుడే అష్టావధానాలు కూడా తెగ చేసేవారట పుట్టపర్తి!! కుప్పుస్వామి వారు, కపిస్థలం వారు, డీ.డీ.తాతాచార్యులవారు వంటి దిగ్దంతులే వారికి పృఛ్ఛకులుగా వ్యవహరించేవారు కూడా!!!

  వ్యాకరణ, అలంకారాది   శాస్త్రాధ్యయనం ప్రాచ్య కళాశాలలో జరుగుతున్నప్పుడే,వీటితో పాటూ ప్రాకృత సాహిత్య పఠనం కూడా ఊపందుకుందక్కడ!! తాను చదువుకున్న ప్రాకృత సాహిత్యం గురించి చక్కటి వ్యాసాలు వ్రాసి, అప్పట్లో ‘భారతి.’ పత్రికకు పంపేవారట !! అవన్నీ వెంట వెంటనే ప్రచురితమయ్యే విధానం చూసి, అక్కడి విద్యార్థుల లోనూ పుట్టపర్తి వారి పట్ల ఉండే ఆరాధన అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.

     ప్రాచ్య కళాశాలలో ఉద్దండ పండితుల పర్యవేక్షణలో శిరోమణి చదువుతో పాటూ, పండిత సభా ప్రవేశాలూ, అష్టావధాన విజయ యాత్రలతో పాటూ, ‘పెనుగొండ లక్ష్మి’   కావ్య ముద్రణ, తరువాత కూడా భారతి పత్రికలో వ్యాస ప్రచురణ, తోటి విద్యార్థుల సమూహాల్లో  వారిపట్ల  విపరీతమైన ఆరాధన పెరిగిపోయింది.           

        కుమారుడు ప్రయోజకుడౌతున్నాడని పుట్టపర్తి వారి   అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యుల వారు   సంతోషపడ్డారట!!   ప్రాచ్య కళాశాలలో చదివేటప్పుడే తన కుమారుడికి వివాహం చేయాలని    వారు సంకల్పించారు.  స్వతహాగా ఇష్టం   లేకున్నా, తండ్రి   కోరికకు   అడ్డు చెప్పలేక    పెళ్ళిపీట లపైకెక్కారు –              నారాయణాచార్యులవారు!!   23  ఫిబ్రవరి,   1934న  వారి వివాహమైంది.  కానీ, ముహూర్తబలం కలిసిరాలేదో  ఏమో కానీ, 26 ఫిబ్రవరి ఉన్నట్టుండి అనారోగ్యంతో అత్తగారు,  విష జ్వరంతో అర్ధాంగి 27 ఫిబ్రవరినాడు,  తనువు చాలించారు.  ఇది చాలదన్నట్టు, నెల రోజులకు,   మరో ఇద్దరు దగ్గరి బంధువులూ  కాలం చేశారు. నారాయణాచార్యులవారి మనసు విరిగిపోయింది. అసలే ఇష్టం లేకుండా పెళ్ళీపీటలెక్కారు. ఇంతలో, యీ పరిణామం!! అంతర్మథనం మొదలైంది!!

  తిరిగి తిరుపతికి చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనల తేనె తుట్టె ముసురుకుంది.  తన జాతకంలో ఏదైనా లోపముందా?? ఇంతమంది యీ విధంగా మరణించటమేమిటి?? వేదన..విపరీతమైన బాధ!! తానింక ఎలా జీవితం కొనసాగించటం?? తానూ చనిపోవాలి. అంతే!! ఆవేశం ఆలోచించనివ్వలేదు. ఆగే ప్రసక్తే లేదు. పచ్చ గన్నేరు విత్తనాలు నూరుకుని తాగేశారట పుట్టపర్తి!! సమయానికి మిత్రులు తెలుసుకుని వెంటనే వైద్యం ఇప్పించారు. పెనుగొండకూ వార్త వెళ్ళింది. ఆపద తప్పింది కానీ  అప్పటికే బీడీలు తాగే అలవాటూ ఉండటం వల్ల, మళ్ళీ మమూలు స్థితి రావటానికి చాలా కాలమే పట్టింది. అనంతపురం, కొత్తపేటలో వారి బంధువులింట ఉంచి, మందులిప్పిస్తున్నారు. 

        మందుల ప్రభావం ఒంటికి పడుతుండటం వల్ల, బంధు మిత్రులు ధైర్య వచనాల వల్ల,   పుట్టపర్తిలో  మళ్ళీ కాస్త ఆశావహ దృష్టి ఏర్పడింది. మళ్ళీ రచనా వ్యాసంగం వైపు దృష్టి మరలింది.   

     అప్పుడప్పుడే తొలి యవ్వనపు హోరులో బుల్బుల్ పిట్టల కలకలలు, సాఖీల మాధుర్యం, గుల్నార్ పువ్వులు, హఫీజ్ గీతాలు, పుట్టపర్తిని తమవైపుకు లాక్కుపోయాయి. (దాని పీఠికలో వారే అన్నట్టు) ఉమర్ ఖ్యయ్యాము ఆనాళ్ళలో వారి ఆరాధ్య దైవం. ఇంకేముంది, తన బ్రతుకంతా సాఖీలతో, ద్రాక్షా గుళుఛ్ఛములతో, ఒయాసిస్సులతో సాగిపోతుందిలే అన్న పరవ శత!!

    స్నేహితుణ్ణి పలుకరిద్దామని కలచవీడు శ్రీనివాసాచార్యులు అక్కడికి వెళ్ళినప్పుడు, వారి ఇంటిలో చెట్ల మధ్య కూర్చుని బీడీ తాగుతూ కనిపించారట, పుట్టపర్తి!! స్నేహితుడికి ఆశ్చర్యం!! ఇదేమిటి మళ్ళీ బీడీ కాలుస్తున్నావని కాస్త కోపంగానేఅన్నారట  ఆయన!!  పుట్టపర్తి స్నేహితుని మాటలు పట్టించుకోకుండా, పద్యపఠనం మొదలు పెట్టారు – అప్పుడే మొదలుపెట్టిన తన కావ్యం ‘షాజీ ‘ నుంచి!! 

      ‘నవ్యతరమైన యొక్క గాన స్రవంతి

    కొకడు తలయూచు, మరియొకడోసరించు,

    వీణెదే దోసమా? లెక వినెడివారి

    తప్పిదమ? కాదు భావ భేదములె సుమ్ము..’

  తనలోని నవ్య భావాలకు మిశ్రమ స్పందనలొస్తే, అవి కేవలం భావ భేదములుగా మాత్రమే తాను గుర్తిస్తానని, కానీ,వారితో వాదించననంటూనే, కావ్య రచనకు ఉపక్రమించారు పందొమ్మిదేళ్ళ పుట్టపర్తి.

      చరిత్ర అంతర్యవనికగా సాగే యీ రచనలోని ప్రతి పద్యమూ (పుట్టపర్తి మాటల్లోనే) ఆణిముత్యమే!!

    ప్రకృతికో,  మాయకో, కాక భావనా ప్ర

    పంచ సౌదామినికొ, తప:ప్రభకొ, శూన్య

    మునకొ, యానంద రూపమై మోదమొసగు,

    సాత్విక వ్యక్తికీ నమస్కార శతము!!

…………

   పొగరు హృదయంబు విడనాడి పోవబోవ

   ప్రేమయును శాంతమ్ము మది బెరుగునట్లు,   

   ముదురుటెండలు గళితమై బోవ పోవ

   మెల్ల నీడలు భువినాక్రమించుచుండె!!

        కలచవీడు శ్రీనివాసాచార్యులు మరో రసానంద లోకంలోకి వెళ్ళిపోయారు. మధ్య మధ్య దగ్గు బాధ పెడుతున్నా, చడవటం మాత్రం ఆపనేలేదు పుట్టపర్తి.

  కానీ మిత్రుడి దగ్గు అతన్ని కలవరపెట్టింది.  ‘ఇంత దగ్గుతూనే ఉన్నావు!! మళ్ళి  కావ్యం వ్రాయాలంటావు!! కొన్ని రోజులు రచన ఆపి, పూర్తిగా కోలుకున్న తరువాత, వ్రాయవచ్చును కదా??’ అన్నాడు జాలిగా!!

  ‘దగ్గు ఉన్నంత మాత్రాన ఆలోచనలు ఆగవు కదా!! దేని దారి దానిదే!! కావ్యం వ్రాయటం ఆపే ప్రసక్తే లేదు..’ అన్నారు మొండిగా పుట్టపర్తి!!

  రోజులు ఆగవు కదా!! కొన్ని రోజులకు పుట్టపర్తి ఆరోగ్యంగా, తిరిగి తిరుపతికి చేరుకున్నారు.  స్నేహితులందరికీ పండగే పండగ!!పుట్టపర్తి గొంతులో మత్తుగా ఆ పద్యాలు వింటున్న స్నేహితులకు పొద్దు తెలిసేదే కాదంటే, అతిశయోక్తి ఏముంటుంది??

  ఇటువంటి రస బంధురమైన షాజీ పద్యాలను వింటూ బుల్బుల్ పిట్టలు, గుల్నార్ పువ్వుల తోటలలో విహరిస్తున్న సహ విద్యార్థులందరూ, మళ్ళీ పూనుకుని, యీ కావ్యాన్ని కూడా తాడిపత్రి దేశబంధు ముద్రణశాల ద్వారా ముద్రించి గానీ తృప్తి చెందలేదు. ఈ కావ్యంలో శ్రీ కలచవీడు శ్రీనివాసాచార్యులు కవి పరిచయం చేయగా, సువిఖ్యాత సాహితీ వేత్త డా. చిలుకూరి నారాయణ రావు గారు, తొలిపలుకు వ్రాశారు.

   షాజీ కవి, జహంగీరు చక్రవర్తి, అతని ముద్దుల రాణి వన్నెల విసనకర్ర నూర్జహాను మధ్య జరిగే కథను, అనుభవజ్ఞుడైన పరిణత కవి వలె పదునెనిమిదేళ్ళ పుట్టపర్తి రచించిన తీరు పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారతి మాసపత్రిక 1939 మే నెల సంచికలో శ్రీమాన్ కపిస్థలం శ్రీరంగాచారి గారు, సుదీర్ఘ సమీక్షావ్యాసం వ్రాశారు కూడా!!        

   ఆశ్చర్యంగా 1940 సంవత్సరంలో ఆనాటి ఇంటర్మీడియెట్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా కూడా గుర్తింపబడటం, పుట్టపర్తి ప్రతిభకు పట్టంకట్టినట్టైంది.

   ఇదిలా ఉండగా, యీ లోపలే, పుట్టపర్తి అయ్యగారు శ్రీనివాసాచార్యులవారికి కుమారుడి పెళ్ళి విఫలమవటం, ఆ తరువాత అనారోగ్యం చాలా బాధించాయి. త్వరగా పెళ్ళి చేసి, ఇంటివాణ్ణిచేసి, తన కుమారుడి జాతకంలో యే లోపమూ లేదని లోకానికి చూపించాలన్న ఆరాటం ఎక్కువైంది.

  మళ్ళీ పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంబంధాలు సరైనవి రావటం లేదు. కొంతవరకూ, కుమారుడి మొదటి కల్యాణం వార్త బంధువర్గంలో పాకిపోవటం  కారణమని తెలిసింది.  ఈలోగా, కడప జిల్లా ప్రొద్దుటూరిలో స్థిరపడిన శ్రీ  ధన్నవాడ కిడాంబి దేశికాచార్యుల పుత్రిక,  శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యుల పౌత్రి ఐన వివాహోచిత కన్య కుంకుమ సౌభాగ్యవతి కనకవల్లికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. పండితోత్తములైన శ్రీనివాసాచార్యులవారికి శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారి  కీర్తి ప్రతిష్టలు ఇదివరకే పరిచయం.

  కాశీ పండితులు వారు!! గజారోహణ గౌరవాన్నందుకున్నవారు. ‘తర్క విషయ క్రోడ పత్రం,’ ‘ధాతుకారికా:’ ‘అలంకరానుగమ:’ ‘బహువిద్యాయౌగ పద్య సాధనం’సుబంత శబ్దానుక్రమణికా’  వంటి శాస్త్ర విషయక గ్రంధాలతో పాటూ, ‘శ్రీనివాస పాదుకార్పణ నాటక ప్రబంధం’ ‘మణి విద్రుమ హారం ‘మాణిక్య నగర ప్రేక్షణీకం’ ‘శ్రవణానంద నామక ప్రేక్షణీయం’ వంటి రూపక గ్రంధలనూ వారు వెలయించి ఉన్నారు. పైగా కీ.శే.సవై రాజా శ్రీ రామ భూపాల రావు, శ్రీమద్రాణీ సవాయి భాగ్యలక్షుమ్మ గారల అమరచింతాత్మకూరు సంస్థానం లో పండితోత్తములుగా సమ్మానమందుకున్నవారు కూడా!!

      ఓ అడుగు ముందుకేశారు శ్రీనివాసాచార్యుల వారు. పెళ్ళిపెద్దలు మాటలకోసం కూర్చున్నారు.  వధువుకు పదునాలుగేళ్ళు. వరుడు ఇరవైయొక్క ఏళ్ళవాడు. ఇచ్చిపుచ్చుకునే ప్రసక్తి ఏమీ లేదు. జాతకాల ప్రస్తావన వచ్చింది. శ్రీనివాసాచార్యులవారన్నారు.’జాతకాల మాట అటుంచితే, వాల్మీకి రామాయణం కంటే ప్రమాణం మరెక్కడుంది కనుక?? రామాయణ ప్రశ్న వేతాము. అందులో ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము.’

  వధువు వైపువాళ్ళు ఆలోచనలో పడ్డారు.

  ఇంతకీ ఏమిటీ రామాయణ ప్రశ్న?? (సశేషం)

****

ఫోటో:-

కాశీ పండితులు, విద్వత్కవిమణీత్యాది బిరుదాలంకృతులు, పుట్టపర్తి నారాయణాచార్యులవారి సతీమణి సౌ. కనకవల్లి గారి పితామహులు, శ్రీ మాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్య (1934నాటి ఛాయాచిత్రం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.