నా జీవన యానంలో- రెండవభాగం- 11

-కె.వరలక్ష్మి 

అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమిషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక మంచి రేడియో కొనుక్కోవాల్సిందే అనుకున్నాను.

అలాంటి కొత్త వస్తువులేం కొనుక్కోవాలన్నా అప్పట్లో అటు కాకినాడగాని, ఇటు రాజమండ్రిగాని వెళ్లాల్సిందే. ఒక్క పుస్తకాలు తప్ప మరేవీ సొంతంగా కొనే అలవాటు లేదప్పటికి.

మోహన్ తో చెప్పేను, బడ్జెట్ ఎంత? అన్నాడు.

రెండు వందల నుంచి ఐదువందల వరకూ అన్నాను.

‘‘అయినా ఇంకొంచెం డబ్బులు పెడితే టు ఇన్ వన్ లూ, త్రి ఇన్ వన్ లూ వచ్చేస్తూంటే ఇంకా రేడియో అంటావేంటి? ఉండు, మా స్కూల్లో తెలుగు మాస్టారు అరవింద్ ఆ మధ్య త్రీ ఇన్ వన్ కొనుక్కున్నాడు. తనకి డబ్బులు అవసరమట. దాన్ని అమ్మేస్తానంటున్నాడు, కనుక్కుంటాను’’ అన్నాడు.

ఆ సాయంకాలమే ఆరవింద్ గారు సెట్టు పుచ్చుకుని వచ్చాడు మోహన్తో కలిసి.

నేషనల్ పేనాసోనిక్ సెట్టు అది. బేచిలర్ కావడం వల్ల నీట్ గా ఉంచుకున్నాడు. రేడియో, కేసెట్ ప్లేయర్, రికార్డింగ్ అన్నీ ఆన్ చేసి చూపించేడు. ఖరీదు మూడువేల ఐదొందలు అన్నాడు.

నా గుండె గుభేల్ మంది. అమ్మో, అంత డబ్బెక్కడుంది? బేరమాడితే ఏమనుకుంటాడో?

“తగ్గించడట” అన్నాడు మోహన్. షాపుకెళ్లి కొనేటంత తీరిక లేదు.

మర్నాడు బేంకుకెళ్లి వస్తువులు తాకట్టుపెట్టి దాన్ని కొన్నాను. దానికో ప్రైస్ కార్డు, గేరంటీ కార్డు ఉంటాయని తెలీదు. తెలిసేక అడిగితే “అతనిచ్చేడు కాని ఎక్కడో పోయాయి” అన్నాడు మోహన్.

వెంటనే అమ్మి పెట్టినందుకు మోహన్ కి 500 లంచం ఇచ్చేడట అరవింద్, కళ్లల్లో నీళ్లు తిరిగినా అప్పుడిక ఏం చెయ్యగలను?

ఉదయం కర్ణాటక సంగీతం, లలిత సంగీతాలతో, రాత్రి వివిధభారతి, రేడియో సిలోన్లలో హిందీపాటల్తో అదే నా లోకమైపోయింది.

స్కూల్ వర్క్ తో రోజంతా పడిన అలసట ఎగిరిపోయేది.  ఆ సెట్టు పనిచెయ్యడం లేదు కానీ ఇప్పటికీ నా దగ్గరుంది, బోలెడన్ని కేసెట్లతో బాటు షో పీస్ లాగా, దాన్ని చూస్తే ఆ నాటి సంఘటనలు గుర్తుకొస్తుంటాయి. 

క్లాస్ రూమ్స్ కోసమని మండువాలో నాలుగు సీలింగ్ ఫేన్స్ బిగించి ఉండేవి. రాత్రుళ్లు బెంచీలు ఎత్తేసి నవారు మంచాలు, మడత మంచాలు వేసుకుని ఫేన్స్ కింద పడుకునేవాళ్లం.

సెలవు రోజులొస్తే మోహన్ ముందురోజు సాయంకాలమే రాజమండ్రి వెళ్లిపోయేవాడు. తెల్లవారుతుంటే ఆయా వచ్చి తుడిచి వీధి తలుపు దగ్గరకి చేరేసి వెళ్లిపోయేది. స్థిమితంగా ఆలస్యంగా లేద్దాములే అని నేనూ  పిల్లలూ పడుకొని ఉండేవాళ్లం.

ఎదురింట్లో ఉండే కోమటి దర్జాగా లోపలికి వచ్చేసి, నా టేబుల్ దగ్గరున్న కుర్చీని బర్రుమని జరుపుకొని, టేబుల్ మీది పేపర్ తీసుకుని చదువుతున్నట్లు కూర్చునేవాడు. మెలకువొచ్చి చూస్తే పేపర్లోంచి దొంగచూపులు చూస్తూ ఉండేవాడు. లేవడానికి ఇబ్బందిగా ఉండేది. అప్పటికి నైటీలు లేవుకానీ కట్టుకున్న చీర చెదిరిపోయిందేమో అనే వంక, దుప్పటిని మరింత కప్పుకొని ఇబ్బంది పడాల్సి వచ్చేది, తప్పని సరిగా ఇంట్లో మోహన్ లేని రోజులు చూసుకుని అలా చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటినుంచీ తెలిసినవాళ్లు కావడం వల్ల నాకేమో ఎవరితో ఏం మాట్లాడడానికీ మోహమాటం. మోహన్తో చెప్తే ఏదో ఒక వంక పెట్టుకుని కలబడిపోతాడేమో అని భయం. అక్కడికీ మర్యాదగా చెప్పిచూసేను ‘కావాలంటే పేపరు మీ ఇంటికి పట్టుకెళ్లి చదివేక ఇవ్వండి’ అని. ఉఁహు వినలేదు. ఇంక మోహన్ కి చెప్పక తప్పలేదు.

మోహన్ వీధి అరుగుమీద నిలబడి  ఆ కోమటిని పిలిచి ‘’ఏంటి, వొళ్లెలా ఉంది?’’ అన్నాడు కోపంగా చూస్తూ. అంతే,  రోజు నుంచీ అతను మా ఇంటివైపు చూస్తే ఒట్టు.

మేము ఆ ఇంట్లో ఉన్న 1980 నాటికే ఆ ఇల్లు వందేళ్లనాటిదట. అప్పటి కట్టుబడి పద్ధతో ఏమో ఏ గదికీ ఒక అల్మరా లాంటిది లేదు. మండువాలో మాత్రం నాలుగు మూలల్లో గోడలకి L షేపులో అరుగులుండేవి. ఇప్పటి మన సోఫోల్లాగా విశ్రాంతిగా కూర్చోడానికి ఉపయోగపడేవి. ఆ అరుగుల మీద ఓ పక్క బ్లేక్ బోర్డుపెట్టి మరోపక్క టీచర్స్ కూర్చుని పాఠాలు చెప్పేవాళ్లం.

మధ్యాహ్నం భోజనాల టైంలో మా కొత్త త్రీ ఇన్ వన్ లో పాటల కేసెట్స్ గాని, రేడియో కార్యక్రమాలు గానీ పెట్టి  ఆ అరుగుమీద ఉంచేదాన్ని, అలా ఒక రోజు మేం భోజనాలు చేస్తూండగా టక్ మని స్విచ్చినొక్కినట్టై కార్యక్రమం ఆగిపోయింది.

ఏమైందా అని వచ్చి చూద్దునుకదా,  ఈ మధ్యనే పిచ్చి పట్టిందని చెప్పుకొంటున్న వెనుక వీధిలో టైలరు త్రీ ఇన్ వన్ పక్కన బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. దాన్ని నిశితంగా పరిశీలిస్తూన్నాడు. నన్ను చూసి ఓ నవ్వు విసిరేసి మళ్లీ సీరియస్ గా తన పనిలో మునిగిపోయేడు.

అది భోజనాల వేళ అని స్ఫురించి నేను వెంటనే కంచంలో అన్నం, పప్పు, కూర వేసి పట్టుకెళ్లి అతని పక్కన పెట్టి, ఇవతలి చేతితో దాన్ని తీసేసుకుని గదిలో పెట్టేసాను. ఆవురావురుమని తినేసి ఇంకా పెట్టమన్నట్టు చూసేడు. ఎంత ఆకలితో ఉన్నాడో పాపం అని మళ్లీ పెడితే తిని స్థిమితంగా కూర్చున్నాడు. క్లాసులు ప్రారంభమయ్యే టైం, మా టీచర్స్ ఎలాగో బతిమలాడి బైటికి పంపించేరు.

ఇక అంతే, రోజూ ఆ టైంకి వచ్చి ఆ అరుగుమీద కూర్చోవడం మొదలుపెట్టేడు. ఒక ఆదివారం నాడు తలుపులు మూసి ఉంటే బైటినుంచి దబదబా బాది, గడియ తియ్యగానే లోపలికొచ్చేసాడు.

మరో ఆదివారం మేం బైటికెక్కడికో వెళ్లి పోద్దుపోయి వస్తే మా వెనకే లోపలికి వచ్చేసాడు. అన్నం పెట్టడం ప్రోబ్లం కాదు కానీ అతన్ని బైటికి పంపించడం కష్టంగా ఉండేది. నాకు భయం పట్టుకుంది. అప్పుడు కూడా మోహన్ కే మొరపెట్టుకున్నాను.

ఏం చెప్పేడో, ఎలా చెప్పేడో తెలీదు కాని అతను మా ఇంటివేపు రావడం మానేసేడు.

మా అమ్మతో చెప్తే ‘’ఇంటికి మొగ దక్షత ఎంత అవసరమో చూసేవా’’ అంది అల్లుణ్ని మెచ్చుకుంటూ.

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.